Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తోడు తోడుగా

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘తోడు తోడుగా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఇన్నాళ్లూ మనకెవరికి కాస్త ఒళ్ళు బాగుండకపోయినా రాజ బాపయ్యబావ దగ్గరకు మందుల కోసం పరుగెత్తే వాళ్ళం. ఏ అర్ధరాత్రి ఎవరు వెళ్లి పిలిచినా సైకిల్ వేసుకుని వచ్చి చూసి మందులిచ్చి పోయేవాడు. తన వల్ల కాకపోతే పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోమని వెంటనే టౌనుకు పంపేవాడు. ఇప్పుడు ఆయనతో సహా మనమందరం కూడా పెద్దవాళ్లమైపోయాము. కాలక్షేపానికి ఇదివరకటి లాగా ఏ గుడిమంటపం దగ్గరకో, బోసు బొమ్మ దగ్గరకో నలుగురం చేరి కాసేపు కూర్చునే ప్రాప్తం లేకుండా పోయింది. ఈ కరోనా మాయదారి రాక్షసి లాగా వచ్చి అంతటా చుట్టుముట్టేసింది. గాలిలో నుంచి కూడా వచ్చుద్దేమోనన్న భయంతో జనాలు తలుపులు తీసి ఎవరైనా దగ్గరగా కనపడితే గభాల్న తలుపులు మూసుకుని వెళ్లిపోతున్నారు” అంటూ శివరామయ్య తన పెరట్లో తిరుగుతున్నాడు.

“ఎందుకట్టా కాలుగాలిన పిల్లి లాగా తిరుగుతావు? నాకు ఇవ్వాళ పొద్దుటి నుంచి తల ఒకటే విసుర్తా వున్నది. రక్త పోటు ఏమన్నా వచ్చిందో ఏమిటో? తోమిపెట్టిన గిన్నెల్ని కాస్త లోపలికి తెచ్చి పెట్టు. ఎన్నడూ లేనిది నీకు పనులు చెప్తున్నాను. ఊళ్లో వున్నకొడుకూ, కోడలు కూడా ఈ కరోనా భయంతో మన లోపలి కడుగు పెట్టకపోతుంటిరి. రాజ బాపయ్య బాబాయికి చూపించుకుంటే నా తల విసురుకు ఠక్కున పరీక్ష చేసి కారణం చెప్పేవాడు. పాపం ఆయన ఒంటిగా ఎట్లుంటున్నాడో ఏంటో? వంట పని, ఆవూ దూడల పెంపకం ఇలా అన్నీ చూసుకోవాలి.”

“ఆయనకేమే? మా రాజు లాగావుంటాడు. నిన్న పొద్దున కూడా నేను మన పంపు దగ్గ రున్నప్పుడు నైవేద్యం తీసుకుని గుడికెడుతూ కనపడ్డాడు.”

“కరోనా కారణంతో మిగతా అర్చకులు ఎవరూ గుడికేసి వస్తూ వుండివుండరు. శివయ్యను పస్తు పెట్టటం ఇష్టం లేక బాబాయే రోజూ నైవేద్యం పెడుతూ వుండివుంటాడు. ఆయన ఎంత తెలివిగలవాడు! ఇటు అర్చకత్వాన్ని వదలలేదు. అటు వైద్యాన్ని బాగా నమ్ముకున్నాడు. వైద్యం చేస్తూ ఊళ్లో అందరినీ వరుసలు పెట్టి మరీ పిలిచేవాడు. తనూ అలాగే పిలిపించుకునేవాడు. అప్పట్లో వైద్యం చేయించుకోవటం కోసం అందరం పంట ఇంటికి రాగానే తలో ఇన్నని వడ్లు వాళ్ళింటికి పంపేవాళ్ళం. ఆ ఏడు మనం ఒడ్లు పంపటం ఆలస్యమైంది. నువ్వు పురి కట్టించి వడ్లు దాంట్లో పోసేటప్పుడు మన పిల్లాడిని చూడటానికి బాబాయి వచ్చాడు. నా పురి లోకి వడ్లెప్పుడు పంపుతారు బావగారు అని తెలివిగా గుర్తు చేసి వెళ్ళాడు.”

“అంతేనా? అలా వైద్యం చేసి కదూ? తన పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. పెళ్లిళ్లు చేశాడు. పిల్లల పెళ్లిళ్లు కుదరగానే వచ్చి మన అందరికీ చెప్పేవాడు. మీ చల్లటి చేత్తో తృణమో, పణమో ఇచ్చి పెళ్లి బాగా జరిపించడని నేర్పుగా చెప్పేవాడు. పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరుపుకునే వాడు.”

“మన ఇంటి కంటే తను మంచి డాబా కట్టుకున్నాడు. దానికి ఇసుక తోలేవాళ్లు తోలారు. ఇటుక తీయించే వాళ్లు ఇటుక ఇస్తే, ఇద్దరు ముగ్గురు కలిసి సిమెంటు కొనిచ్చారు. ఊళ్లో పనిచేసే మేస్త్రీ కాబట్టి చౌకగా డాబా కట్టటం పూర్తి చేశాడు. రాజ బాపయ్య బాబాయి అందరికీ శ్రద్ధగా వైద్యం చేసేవాడు కాబట్టి ఎవరికీ బాధ కానీ, భారమని కానీ అనిపించలేదు. దేముడి మాన్యం కాకుండా, సొంతంగా పొలము కూడా కొనుక్కున్నాడు.” అని రాజ బాపయ్య గురించి మాట్లాడుకుంటూ ఆ ముసలి జంట పెరట్లో నుండి లోపలికి వెళ్లారు.

***

ఏప్రిల్ నెల మొదటి వారం కాబట్టి ఎండ ఉదయానికే చురుక్కు మంటుంది. కరోనా భయంతో లాక్‌డౌన్ పెట్టిన తొలిరోజులు. లాక్‌డౌన్ సడలించిన సమయాల్లో జనం మాస్కులు పెట్టుకుని భయం భయంగా దిక్కులు చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసే పరిస్థితి. ఆరోజు ఉదయం 8:30 అయ్యింది. మొహం మీద ఎండ వేడి పడుతుంటే రాజ బాపయ్య బలవంతంగా రెప్పలు తెరిచి చుట్టూ చూశాడు. తను గుడి ఆవరణలో పడి వున్నాడు. ఈరోజు కొడుకూ, కోడలూ వస్తున్నామని ఫోన్ చేయటంతో తను బాగా ఉదయాన్నే గుడికి రావటం గుర్తొచ్చింది. హడావుడిగా పొలిగట్టె చేతబట్టి గుడి చుట్టూ శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు. అయ్యో! పిల్లలు వచ్చేసే వుంటారు. అనుకుంటూ పైకి లేవబోయాడు కానీ శరీరం సహకరించలేదు. అలాగే మళ్లీ కళ్ళు మగతగా వాలిపోయాయి.

“నాన్నా! నాన్నా! లేవండి.” అని పెదబాబు తట్టి లేపుతూ వున్నాఊ.. ఊ.. అంటున్నాడే గానీ పైకి లేవ లేకపోయాడు. పెదబాబు గుడి బయటికి వచ్చి కనిపించిన ఒకరిద్దరిని తోడు రమ్మని పిలిచినా వాళ్లు భయంతో రాకుండా వెళ్ళిపోయారు. ఒకతను మాత్రం ఆంబులెన్స్‌కు ఫోన్ చేయండి అని చెప్పి మరీ వెళ్ళాడు. పెదబాబు ఇంటికి వెళ్లి కారులో తన భార్య నెక్కించుకుని గుడికి వచ్చాడు. భార్యాభర్తలు సాయం పట్టి తండ్రిని కారులో పడుకోబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. కోడలు అల్మారా వెతికి సొంఠిపొడీ, తేనె తెచ్చి కలిపి రెండుసార్లుగా తినిపించారు. కాసిని మంచినీళ్లు తాగించారు. ఒక అరగంటకు రాజ బాపయ్య గారు నీరసంగానే కళ్ళు తెరిచి లేచి కూర్చున్నారు.

“అయ్యో! అమ్మా, మాధవీ! మీరు వచ్చే సమయానికి నాకు ఇలా అయింది. వంటింట్లో ఆవు పాలున్నాయి. ముందు వాటిని కాచుకుని చెర కాసిని తాగండి. ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చెయ్యి తల్లీ. మడి గట్టుకుని అన్నం, పప్పు వండు. పెదబాబూ! ఇవాళ నువ్వే శివయ్యకు నైవేద్యం పెట్టి రా. మిగతా ఉ పాలయాలలో బెల్లం ముక్కల నైనా నైవేద్యంగా పెట్టి రా.”

“మీరు కూడా పాలు తాగండి మామయ్య గారూ!”అంటూ కోడలు తెచ్చిన పాలను తాగి, వెంటనే వాంతి చేసేసుకున్నాడు.

‘మామగారికి కరోనా రాలేదు కదా? లాక్‌డౌన్ పెట్టేయడం వలన భర్తకు ఆఫీసుకు వెళ్లే పని లేదని పల్లెటూర్లో ప్రశాంతంగా ఉండొచ్చని ఇక్కడికి వస్తే ఇలా అయిందేమిటి?’ అని మాధవి తెగ కళవళ పడింది. ఆ పూటకి ఎలాగో శివయ్యకు నైవేద్యం పెట్టి తామూ, అదే తిన్నారు.

సావిట్లో ఆవు దూడలు గింగరాలు తిరుగుతూ అరవసాగాయి. పెదబాబుకి ఇలాంటి పనులు ఈమధ్య అలవాటు లేకుండా పోయాయి. మాధవి కసలు ఈ పశువుల సంగతి, పాడి సంగతులు తెలియవు. ఈ సమయంలో వాటి పనులు చూడటానికి ఏ మనిషీ సాయంగా రాడు.

“పెదబాబూ! చావిట్లో అరుగు మీద పశువులకు పెట్టే దాణా వుంచిన గోతాంవున్నది. దాంట్లో నుంచి ఒక గిన్నెడు తీసి బకెట్లో వేసి నీళ్లు పోయి. అది నానుతుంది. దాన్ని బాగా కలిపి ఆవు ముందర పెట్టు. ఇంట్లో మాగిన అరటి పళ్ళు, తోటకూరా వున్నాయి. వాటిని కూడా ఆవు ముందర పెట్టు. దానికి ఆకలేసి అరుస్తున్నది పిచ్చి తల్లి. తల్లి అరవటం చూచి దూడ కూడా అరుస్తుంది.” అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాడు.

బలవంతంగా తాగిన మజ్జిగ రసం కూడా ఇమడలేదు. మాధవికి ఇంకా కంగారు ఎక్కువైంది. కొంచెం సేపు ఆగి పలుచని మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగాడు. వాంతులు తగ్గటానికి ‘స్టెమ్ టిల్’, కళ్ళు తిరగకుండా ‘బెటాహిస్ట్’ టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాడు. సాయంకాలానికి కాస్త తెప్పరిల్లాడు.

అటు గుడి పనీ, ఇటు ఇంట్లో వంట పనితో పాటు, ఆవు దూడల పోషణ, కాస్త మొక్కల పని అన్నీ కలిసి ఈ 75 ఏళ్ల వయసులో ఒంటరిగా చేసుకునేసరికి నాన్న శరీరం తట్టుకోలేకపోయిందనుకున్నాడు పెదబాబు.

మామూలుగా అయితే రాజ బాపయ్యకు సాయంగా ఎవరో ఒకరు మాస్కులు పెట్టుకుని, చేతులకు శానిటైజర్ పూసుకుని మరీ వచ్చేవాళ్ళు. కానీ పెదబాబు మాధవి దూరానవున్న పొరుగూరి నుంచి వస్తూ, ఏ వైరస్ లను మోసుకొచ్చారు అని భయపడి ఎవరూ ఇటు తొంగి చూడటానికి కూడా సాహసం చేయలేదు. మర్నాటికి మాధవికి జలుబు కారుతూ, ఒళ్ళు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చింది. రాజ బాపయ్యగారే లేచి తన దగ్గరున్న పారాసిట్ మాల్ టాబ్లెట్ ఇచ్చారు. వాళ్లు కూడా వస్తూ కొన్ని మందులు తెచ్చుకున్నారు. పెదబాబు ఎందుకైనా మంచిదని మాధవిని తీసుకెళ్లి రాపిడ్ ఏంటి జన్ టెస్ట్ చేయించితే కరోనాపాజిటివ్ అని తేలింది. మిగిలిన  ఇద్దరి కోసం కూడా కిట్లు కొనుక్కొచ్చి రాజ బాపయ్య ఇంట్లోనే పరీక్ష చేసి చూశాడు. వాళ్ళిద్దరికీ కూడా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది.

“అనవసరంగా ఇక్కడికి వచ్చి కరోనా పాలయ్యాం. ఇదేం ఖర్మ? వెంటనే అందరం హాస్పిటల్లో చేరదాము” అని మాధవి గందరగోళ పెట్టింది.

“పెదబాబూ! మీరిద్దరూ వెళ్లి ఆసుపత్రిలో చేరండి. కోవిడ్ రాకుండా ఇప్పటికే మనం వ్యాక్సిన్ కూడా వేయించుకుని వున్నాం. ఇప్పుడు మనం పాజిటివ్ అయ్యాం కానీ కరోనా లక్షణాలు అంత ప్రమాదకరంగా మాత్రం లేదు. నా శివయ్యే నాకు డాక్టరు. పైగా నాక్కూడా కాస్తోకూస్తో వైద్యం తెలుసు. నాకిప్పుడు 75 ఏళ్లు దాటుతున్నాయి. నిండు జీవితాన్ని అనుభవించాను. మీ అమ్మ కూడా దాటిపోయి పదేళ్లయింది. నేను లేచి తిరగగలిగినన్నాళ్లు నా శివయ్యను, ఆవునూ పస్తులు వుంచలేను. మందులతో పాటు రెండు మూడు రకాల కషాయాలు కూడా తాగుతాను. నన్ను గురించి మీరెవరూ భయపడనక్కర్లేదు. ఫోన్లో మాట్లాడుతూనే వుంటాను.”అని చెప్పి వాళ్ళను పంపించాడు.

వాళ్లు ఆంబులెన్స్ ఎక్కి వెళ్తుంటే ఆ సైరన్ శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు గాభరాపడ్డారు.

నీరసం, ఆయాసం, వీటికి తోడు జ్వరం ఉన్నా కూడా రాజ బాపయ్య లెక్కచేయకుండా మంచం మీద నుండి లేచి తను ఒక్కడు గుడికి వెళ్లి పసుపు నీళ్లు మాత్రం చల్లి శివయ్య ముందర దీపం పెట్టి రెండు మూడు రోజులపాటు ఒట్టి బెల్లం మాత్రం నైవేద్యంగా పెట్టి చెంపలు వేసుకుని వచ్చాడు. ఆవును అలాగే కట్టు గొయ్యకే వుంచి దాని ముందర ఎండు గడ్డి, కుడితి మాత్రం పెట్టగలుగుతున్నాడు. తనకు కావలసిన పాలను మాత్రం కొద్దిగా తీసుకుని మిగతావన్నీ దూడకై వదిలేయసాగాడు.

ఆవు పాలు కాచుకునే ఓపిక లేక పచ్చివే తాగేసాడు. సొంఠీ, సోంపూ, మిరియాలు, ధనియాలపొడినీ కలిపి నీళ్లలో వేసి తాగేసేవాడు.

కూతుళ్లూ, కొడుకులూ ఫోన్లు చేస్తున్నారు. ఎవర్ని కూడా ఇక్కడికి రావద్దని చెప్పేసాడు. పెదబాబుని, మాధవిని కూడా తగ్గగానే తమ ఇంటికే వెళ్లిపొమ్మని చెప్పాడు. తనకి పర్వాలేదని వాళ్ళందరికీ తనే ధైర్యం చెప్పాడు. ఇప్పుడు రాజ బాపయ్యకు నిస్సత్తువతో పాటు, మూత్ర సమస్య కూడా వచ్చి పడింది. లోగడ తను వైద్యం నేర్చుకున్న కొత్తలో తనతో పాటు పెద్ద ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేసిన మిత్రునికి ఫోన్ చేసి తన సంగతి చెప్పాడు. అతను పరిస్థితిని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలతో వచ్చి మూత్రం పోవటానికి రబ్బర్ గొట్టము, సంచి అమర్చి వెళ్ళాడు. తాను ఇన్ని ఇబ్బందుల మధ్య ఉండి కూడా ఊరిలో వారిని ఫోన్లు చేసి పరామర్శించి తగిన జాగ్రత్తలు ఇస్తూనే ఉన్నాడు. మధ్య మధ్య బంధుమిత్రుల్ని కూడా పలకరించి ధైర్యం చెప్తున్నాడు.

ఈమధ్య తరచూ భార్య కలలో కనపడి ఇక నా దగ్గరకు వచ్చేయకూడదూ అన్నట్లుగా భావిస్తున్నాడు. ఊరిలోని వారు ఫలానా ఇబ్బందికి ఏ టాబ్లెట్ వేసుకోవాలి? ఎంత పవర్ వాడాలి? అని అడగటం లాంటివి చేస్తూనే వున్నారు.

“ఇదిగో నా అవసరం జనాలకు ఇలా వుందిసుమా!” అని భార్యకు నచ్చ చెప్తున్నట్లుగా తన మనసును సమాధాన పరుచుకుంటున్నాడు రాజ బాపయ్య.

కరోనా ఉధృతి కాస్త తగ్గి జనజీవన స్రవంతిలో మరలా చైతన్యం రాసాగిందికాని రాజ బాపయ్య కాళ్లకు తిమ్మిర్లు, నొప్పులు, వాపులు తీవ్రంగా వచ్చాయి. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా వచ్చి తగ్గినా, దాని ప్రభావంతో ఈయన నాడీవ్యవస్థ కొంత దెబ్బతిన్నది. దీనిని’జి.బి.సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధికి వైద్యం చేయాలంటే ఖర్చు చాలా అవుతుంది. వీరి శరీర స్థితి చికిత్సకు తట్టుకుంటుందో లేదో చూడాలన్నారు. వైద్యం మొదలయింది.

ఆయన పరిస్థితి గడ్డుగా వుందని, లేదు చనిపోయాడని రకరకాల కబుర్లు ఊరికి వచ్చేవి. ఒక నెల గడిచింది.

ఒకరోజు రాజభాపయ్య నెమ్మదిగా నడుచుకుంటూ ఊరి గుడిలో ప్రత్యక్షమయ్యాడు. అభిషేకం జరుపుకునే శివయ్యను చూస్తూ అక్కడున్న స్తంభాన్ని ఆసరాగా చేసుకుని తన్మయత్వంగా నిలబడ్డాడు. అందరూ గుమిగూడి పరామర్శించారు.

“మొదటి నుండి మన ఊరు నాకు ఎంతో అండగా వున్నది. ఇప్పుడు మాత్రం వుండదా? అలాగే నేను కూడా ఓపికున్నంతవరకు మీకందరకూ వైద్య సలహాలు ఇస్తూనేవుంటాను. శివయ్య పిలుపు కోసం ఎదురు చూస్తూ ఇక్కడే నా పయనం కొనసాగిస్తూనే వుంటాను.” అన్నాడు మూత్ర సంచిని మరింత లోపలికి నెట్టుకుంటూ.

Exit mobile version