[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
తిమ్మన కవితా వైభవం
పెద్దన వరూధినీ ప్రవరులు, తిమ్మన సత్యభామా నారదులు, తెనాలి వారి నిగమ శర్మ, సూరన్న కుచిముఖి, సుగాత్రీ శాలీనులు, చేమకూర వారి సుభద్రార్జునులు, ఇంకా ఇలాంటివెన్నో పాత్రలు ఇప్పటికీ తెలుగు రసికులకు ఉత్సాహాన్నీ, ఉత్కంఠనూ, ఆనందాన్నీ కల్గిస్తూనే ఉన్నాయి. సామాజంలో ఎక్కడో, ఏ మూలనో, ఈ పాత్రలు పొడకట్టుతూనే ఉంటాయి.
ఈ కోవకు చెందిన ప్రబంధమే, సంస్కృతంలో ‘హరివంశము’ లో 68 – 76 అధ్యాయములలోని కథను ఆధారంగా చేసుకుని, నంది తిమ్మన రచించిన ‘పారిజాతాపహరణం’.
తిమ్మన రచించిన ‘పారిజాతాపహరణం’ నిజంగానే పారిజాతం లాగానే ఎప్పటికీ వాడిపోక సువాసనలను గుబాళిస్తూనే ఉన్నది. తిమ్మన సత్యభామ స్వాభిమాన సీమ. ఈ ప్రబంధంలోని కొన్ని పద్యాలకు డా. బి. వి. కుటుంబరాయ శర్మగారు రసాత్మకంగా చేసిన వ్యాఖ్యానమే ఈ చిన్ని పుస్తకం. డా. కుటుంబరాయ శర్మ గారు తెలుగులో, సంస్కృతంలో, ఇంగ్లీషులో మంచి అభినివేశం ఉన్న పండితులు. తెలుగు నవల వ్యుత్పత్తి వికాసాలను గురించి వీరు చేసిన పరిశోధనా వ్యాసంగం పండితుల మన్ననలను పొందింది.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://archive.org/details/timmana-kavitha-vaibhavam-yb-gln/page/3/mode/2up
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.