Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తిల్య గోవిందరాజులు

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘తిల్య గోవిందరాజులు’. రచన బి. కళాగోపాల్.]

“కుముదా! పెరట్లో పూలు తెంపడం అయ్యిందా? ఎంతసేపని అక్కడే తచ్చాడతావు? నిన్ను పెరట్లోకి పంపడం నాదే బుద్ధి తక్కువ. తొందరగా కోవెలకు మాలలు సిద్ధం చేయాలి. పైగా ఈరోజు శ్రీరంగనాథునికి పుష్పయాగం నివేదన ఉంది. తొందరగా వచ్చేయ్” అంటున్న ఆనందవల్లి మాటలకు ఉలిక్కిపడింది కుముదవల్లి. సన్నజాజులను కోస్తూ.. గుబురుమావిళ్ళలో ఒద్దికగా ఉన్న గువ్వలను చూస్తూ చటుక్కున పరుగులు పెడ్తున్న ఉడుత పిల్లల బేలతనానికి నవ్వుకుంటూ, ఎర్రెర్రని గులాబీలు, పసుపువర్ణ చామంతులు చుట్టూ రొదపెడ్తున్న భ్రమరాలను తప్పించుకుంటూ తోట అందాన్ని ఆస్వాదిoచడమంటే కుముదకు మహ బాగా ఇష్టమైన వ్యాపకం. ఉదారంగు ఆకాశం.. కుముద మనసును ఎప్పుడూ వివశత్వానికి గురిచేస్తూనే ఉంది. తలపైకెత్తి వెండిమబ్బుల్లో రకరకాల ఆకారాలను వెతుక్కుంటూ, బారులు తీరిన కొంగలగుంపును చూడటమంటే ఆమెకెంతో సరదా. అమ్మమ్మ మాటలకు ఈ లోకంలో కొచ్చింది కుముద. తన ఆనందానికి భంగం కల్గించిన ఆనందవల్లి మాటలకు కాస్త చికాకుపడుతూ.. గుత్తులుగా తెంపిన గులాబీలను, చామంతులను తులసీదళాలను సున్నితంగా బుట్టలో పోసి గబగబా పరుగులాంటి నడకతో వసారాలో చేరింది. చాపపై పూలు పోసి, మాలలల్లుతూ “ఏమిటి? అమ్మమ్మా! నేనెప్పుడూ పెరట్లోకి వెళ్ళినా ఏదో తరుముతున్నట్లు గబగబా వచ్చేయమంటావు. పోనీ, నీ మడివంట అవ్వొద్దూ? ఆనక భట్టుమూర్తిగారు వస్తారు. తొందరగా తెమలాలి అంటావు. నేనేం మర్చిపోలేదులే. ఈరోజు నా నృత్యం దశావతారం అభినయించాలి. అందుకు సిద్ధమే. ఇదిగో ఈ కదంబ మాలలల్లి, తులసీదళాలతో నా స్వామిని అర్చించాలి. ఆయన సమూహాన రూపం ముందు, నేను వివశ్త్వానికి గురికాకుండా, అడుగు తడబడకుండా లయాత్మకంగా ఆడి, పాడి, నా స్వామిని పూజించాలి. ఆయనే నా అంతరంగిక సఖుడు. కష్టమైనా, సుఖమైనా, నిద్దట్లోను, మెలకువలోనూ ఆయనదే లోకం నాకు. అత్యంత సుందరమైన కలువరేకుల కళ్ళనుండి జాలువారే ప్రేమామృతాన్ని తనివితీరా ఆస్వాదించొద్దూ..! నా స్వామి నాకై..” ధారగా సాగిపోతున్న అనిర్వచనీయమైన ఆళ్వారుభక్తిని మదిలో పొదవుకొన్న కుముదవల్లి మాటలకు దీర్ఘాలోచనలో పడింది ఆనందవల్లి. కుముద చిన్ననాట జరిగిన సంగతులు తన మనసులో కదలాడాయామెకు.

***

అరహం అనే కుగ్రామంలో గోవిందరాజస్వామిని ఆశ్రయించుకొని మిగిలిన ఒకేఒక్క దేవదాసీ కుటుంబం వారిది. ఆనందవల్లి ఏకైక కూతురు, చక్కని చుక్క అమృతవల్లి. ఆమె ఆటపాటలకు, గుడి ఉత్సవాల సందర్భంగా చేసే నాట్యానికి విశేష ఆదరణ ఉండేది. కుముదవల్లి జన్మించిన తదుపరి బాలింతజబ్బు చేసి నెలల పసికందును తన చేతిలో పెట్టి “అమ్మా! అరహం నుండి దూరంగా వెళ్ళిపోండి. ఇక్కడి శైవులు దేవాలయాలను ధ్వంసం చేస్తూ, మనబోటి వైష్ణవ ఆరాధకులను బతకనివ్వరు. చిన్నారి కుముదను శ్రీరంగానికి తీసికెళ్ళి, అక్కడి గుడి విశేషాలను తెలియజేస్తూ.. కృష్ణమధురభక్తిలో ఓలలాడనివ్వు. నీదే భారం..!” అంటూ కన్నుమూసింది అమృత. శ్రీరంగంలో తనకు తెల్సిన నాట్యాచార్యుడు భట్టుమూర్తి సహాయంతో అక్కడ ఆశ్రయాన్ని పొందటానికి మేనా సిద్ధపరుచుకొని కుముదను పొత్తిళ్ళలో కడుభద్రంగా దాచుకొని రహస్యంగా చేరింది ఆనందవల్లి. కాలచక్రం గిర్రున తిరిగింది. వచ్చీరాని పదాలతో, ముద్దుముద్దు మాటలతో కుముదకు ఐదేండ్లు నిండాయి. ఆరోజు కుముద పుట్టినరోజు. ప్రొద్దున్నే తలంటిపోసి, కళ్ళకు కాటుక దిద్ది, ఆండాళ్ళ బొట్టుపెట్టి, బుగ్గన దిష్టిచుక్క, జడకుప్పెలతో అచ్చంగా గోదాదేవిని తలపిoపజేస్తున్న ఆ ముఖ వచ్చస్సుకు తన్మయపడింది ఆనందవల్లి.

“ఇంకా ఎంతసేపు అమ్మమ్మా! నాకు శ్రీరంగం పెద్దగుడికి పరిచయం చేస్తానన్నావుగా. వెళ్దాం నాడూ. అక్కడి ఘుమఘుమలాడే చక్కెరపొంగళి భలే రుచిగా ఉంటుందన్నావు. ప్రసాదాల వేళ కంటే ముందే ఉండాలిగా. పద” అంటూ తొందరపెట్టింది కుముద. ఏడు ప్రాకారాల రాజగోపురాన్ని దాటుకొని రంగరాజు పెద్దగుడిలోకి గజ్జెలు ఘల్లున అడుగిడింది కుముద. అక్కడి వైభవాన్ని, వైకుంఠానికి తీసుకెళ్ళే విధంగా ఉన్న అతిపెద్ద గరుడాళ్వాల్ విగ్రహాన్ని అచ్చెరువొందుతూ చూస్తూ, రంగనాయకి అమ్మవారి మంటపాన్ని దాటుకొని, ఏనుగుల శాలలను గమనిస్తూ, యతిరాజుల సన్నిధిని చూపించింది ఆనందవల్లి. భక్తితో యతీంద్రులకు ప్రణమిల్లి, అచ్చటి ఆళ్వార్ల శోభను తిలకిస్తూ, స్వామివారి గర్భగుడికి ఏతెంచింది కుముద. శేషసాయిపై పవళించిన రంగశాయిని చూడగానే ఏదో దివ్యానుభూతికి లోనైంది కుముద మనస్సు. అరమోడ్పు కన్నులతో.. స్వామి నయనద్వయాన్ని కనగానే ఆమెలో ఒక పులకరింత. తాను గోదాదేవిలా.. స్వామి కొరకై పుట్టినదాననని, ఇహ! అతడే తన ఇహమూ, పరమూ అని రూఢీపర్చుకుంది. తానూ తెచ్చిన తులసిమాలలు, బుట్టలోని పళ్ళను ఆలయ అర్చకులకు ఇచ్చి, ఆశీస్సులు పొంది, గుడి వెనుకకు వచ్చారిద్దరు. పెరియపిరాట్ సన్నిధి చూసుకొని, అమ్మమ్మ మరిన్ని విశేషాలను ఆసక్తిగా వివరిస్తుంటే, కళ్ళు పెద్దవి చేసుకొని మరీ వినసాగింది చిన్నారి కుముద.

“ఇదిగో కుముదా! ఇక్కడినుండే ఆండాళ్ దేవి స్వామివారిని చూసేదట” అంటూ వైకుంఠద్వారానికి ఎదురుగా ఉన్న వసారాలో ఆ తల్లి చేతివేళ్ళ ముద్రలను చూపించింది. ఎనిమిదిచోట్ల సాష్టాంగ ప్రణామాలు అర్పించాలి అంటూ, ఆయా చోట్ల నమస్కారాలు పెట్టించి, ఉత్తర కావేరి పూలమాలలా ఏ విధంగా ప్రవహిస్తుందో తెలుపుతూ.. దారిపొడవునా రంగరాజు ముచ్చట్లే! తన చిన్ని బుర్రలో తట్టిన సందేహాలను అమ్మమ్మ వినసొంపుగా ఒక కథగా వర్ణిస్తూ, గోదాదేవి రంగనాయకులలో ఎలా ఐక్యమయ్యిందో తెల్సుకొన్నాక.. తనలోనూ అదే పట్టుదల, మంకు తనను తాను గోదలా ఊహించుకోవటం, తానుండే పట్టణాన్ని తిరువాయిప్పాడు (శ్రేష్టమైన గోకులంలా) భావించి, కీర్తనలతో, తన నాట్యంతో స్వామిని కొలుస్తూ, వయస్సుతోబాటే భక్తి రంగాశాయిపై అనురక్తీ ముదురుతూ వచ్చాయి కుముదకు.

***

“అమ్మమ్మా! ఈరోజు నేను స్వామివారికి విరిసిన పారిజాతంలా కన్పడాలి. ధవళ వర్ణపు కాంతులతో శోభిల్లే పట్టుచీరను సింగారించుకొని, మొగిలిరేకుల జడను అలంకరించుకొని నాట్యం చేస్తాను. నా స్వామి సమ్మోహనరూపంలో నేను.. తాదాత్మ్యం చెందాలి” అలా.. ఐతే నూరు గంగాళాల చెక్కెరపొంగళిని నివేదిస్తానని మొక్కుకుంటానమ్మమ్మా!” అంది కుముద. చిన్ననాటి చెక్కెరపొంగళి రుచులు మదిలో రసాలూరగా.. ఏదో ఆలోచనలో తలమునకలై ఉన్న ఆనందవల్లి, కుముద మాటలకు స్మృతిపథంలోకి వచ్చింది. ఇంతలో భట్టుమూర్తి మీనాను సిద్ధపరుచుకొని వచ్చాడు. ఇంకా సమయమున్నందున అక్కడే ఉన్న పడక్కుర్చీలో ఆసీనులయ్యారు భట్టుగారు. ఆయనది డెబ్బై ఐదేళ్ళ దారుడ్యదేహం. మేడలో రుద్రాక్షలు, నుదుటన విభూతిరేకలు, ముడిచిన శిఖ, పట్టుపంచె, ఉత్తరీయం, సింహమూతి ఉన్న బంగారు తాపడం చేసిన పొన్నుకర్రతో తేజస్సు ఉట్టిపడే గాoభీర్యరూపం. చల్లని మజిగ రాగి లోటాలో అందించింది ఆనందిని. “భట్టుగారు చూడబోతే నా.. మనవరాలు ‘పిచ్చిముదిరింది, రోకలి తలకు చుట్టూ’ అనేట్టుగా ఉంది. ఒక తిండీతిప్పలు లేవు. మేమా వారంగనలం. ఏ రాజుగారైనా మాకింత ఆశ్రయం ఇస్తే అదే మహాద్భాగ్యంగా భావించేవారం. దీనికెంత చెప్పినా అర్థంగాదు. రాజుగారి దివాణంలో చేయటానికి కొన్ని కీర్తనలూ అవీ నేర్చుకోవే.. అంటే వినదుగా. ఒట్టి మంకుపిల్ల! ఇదెన్నడు బాగుపడుతుందో! ఆ రంగశాయిపై పిచ్చిముదిరి బాగా హఠం నేర్చింది. ఈరోజైనా రాజుగారు దీని నాట్యం చూసి మాకేవైనా జాగీర్లు ఇస్తే బాగుండును. కుముదకేం తక్కువ? ఒక సామంత రాణిలా ఏలుబడిని నడపొచ్చు” ఆ మాటలంటున్నప్పుడు ఆమె కళ్ళలో మెరుపు “అవును! ఆనందీ! నీకా వయస్సుడిగిపోతోంది. నాటినుండి వస్తున్నా ఆస్తులు మంచుకొందల్లా కరిగిపోతున్నాయి. ఎవరి ముందూ దేహీ! అన్నవారు కాదు. చూద్దాం! ఈరోజు ఉత్సవాల్లో బహుశా రాజుగారు చక్రస్నానంలో పాల్గొంటారేమో!” అన్నాడు భట్టు సాలోచనగా. ఇంతలో కుముద సర్వాలంకార భూషితయై వెలిగిపోతూ అందెలరవళితో అరుదెంచినది. కుముద నిరుపమాన సౌందర్యానికి సమ్మోహితులు కానివారుంటారా?.. చారడేసి కళ్ళతో, నుదుటన దిద్దిన ఆండాళ్ళ తిలకంతో వెలిగిపోతూ, వైష్ణవ వర్చస్సు తేజోమయంగా కన్పించింది ఆ పిల్లలో భట్టుమూర్తికి. మీనాను సమీపించి ఎక్కికూర్చుంది. ఉత్సవాల సందర్భంగా, వసంత ఆగమనానికి నిర్వచనంలా గుడి ఆవరణ అంతా రంగురంగుల పూలతో, మామిడాకులు, దీపాలతో అలంకరించారు. రంగవల్లులు తీర్చిదిద్దారు. నాట్యమండపాన్ని చేరుకున్న కుముద మనసా వాచా రంగనాథస్వామిని మదిలో నిలుపుకొని, అలనాడు పాటలు పాడుతూ ఆముక్తమాల్యద ఎలా పూలమాలలు మేడలో ధరించి తోటలో తిరుగుతూ.. కృష్ణభక్తిలో లీనమయిందో, తానూ అలాగే నట్టువాంగానికి తదనుగుణంగా ఆడుతూ, పాడుతూ స్వామి సేవలో నిమీలితమైంది. అక్కడ ముఖానికి సగం నల్లగుడ్డ కట్టుకున్న వ్యక్తి తచ్చాడుతూ, ఆమె నాట్యాన్ని గమనించి, నిశ్శబ్దంగా జనం నుండి తప్పుకుంటూ వేగంగా బయటకు వెళ్లిపోయినాడు. అతడు చెన్నపురి రాజైన శితికంటుని వేగు-వక్రగుప్తుడు.

***

అంతరంగిక మందిరంలో రహస్య సమాలోచనలో తలమునకలుగా ఉన్న శితికంఠుని కలవటానికి, వక్రగుప్తుడు బయట వేచియున్నాడు. అనుజ్ఞ ఐన పిమ్మట “ఆర్యా! మన రాజ్యానికి సామంతరాజైన, యాదవరాయల వారాంగన కుముదవల్లి నాట్యం పరమాద్భుతం. కాని అక్కడ అంతా వైష్ణవత్వం పరిఢవిల్లుతోంది. ఎక్కడ చూచినా ఊర్ధ్వపుండ్రాలే దర్శనమిస్తున్నాయి. రంగరాజు కీర్తనలు, ఆళ్వారుల ప్రబంధ గానామృతంతో, ద్రావిడ పాశురాలతో వైష్ణవప్రభ దేదీప్యమానంగా వెలిగిపోతోంది ప్రభో! పైపుచ్చు ఆ లలనామణి నాట్యం చూసి ముగ్దులై, వివశాత్వంతో యువత అంతా తిరునామధారణతో భక్తికీర్తనలతో, అది భూలోక వైకుంఠoగా భాసిల్లుతోంది అక్కడి..” అంటూ ఇంకేదో చెప్పబోతున్న వక్రగుప్తుని మాటలకు అడ్డుకట్టవేస్తూ, హుంకరించాడు శితికంఠుడు. “రేపు రాత్రివరకు కుముద ఆటలిక చెల్లు, యాదవరాయలు కప్పం చెల్లించలేనందున, మనం అతడి రాజ్యంపై దండెత్తి, ఆ నామాలను నామరూపం లేకుండా చేద్దాం. భూలోక వైకుంఠమన్న పేరును నేలమట్టం చేస్తూ, విగ్రహాలను ధ్వంసం చేస్తూ హరుని మరుభూమిని ప్రతిష్ఠించి, లింగార్చనతో పునీతులవుదాం. అది ఆ నీలకంఠునిపై అనగా ఈ శితికంఠుని ఆజ్ఞ” అన్నాడు.

***

భట్టుమూర్తి మేనా దిగి కంగారుగా వాకిట్లోంచి, పెద్ద పెద్ద అంగలతో పెరటివైపు వెళ్ళాడు. పెరట్లో కృష్ణుని విగ్రహానికి తులసిమాలలు సమర్పిస్తున్న కుముద ఆశ్చర్యపోతూ “ఏమిటి భట్టుగారు మొన్నేగా రంగనాథుని వసంతోత్సవాలు ముగిశాయి. పిమ్మట ఆడి (ఆషాఢ) అంటూ తొంభై రోజులు ఎలాంటి కోలాహలం ఉండదు. నీవు హాయిగా స్వామిని పూజించుకోవచ్చు అన్నారు. ఇలా.. మీ రాక!” సందేహాస్పదంగా అడిగింది కుముద. “ఘోరవిపత్తు జరుగబోతోంది వల్లీ! ఇన్నేళ్ళూ నేనేది జరుగకూడదని భావిస్తూ వచ్చానో, ఇక అది జరుగబోతోంది అమ్మా! నేనూ శివభక్తుడ్నే. కాని ఆ హరిహరులకు భేదం లేదని నమ్మేవాడ్ని. కనుకనే గుట్టుగా నా నమ్మికను కాపాడుకుంటూ ఉత్సవాలవేళ నిన్ను ఆరాధనకు పంపుతూ, గుడి బయటే నేనుండేవాణ్ణి. ఈ విషయాలను తెల్సుకున్న శితికంఠుడు, ఇక్కడి వైష్ణవదీప్తిని అడ్డుకోవాలని వైష్ణవమూకపై దాడి చేసేందుకు పన్నాగం పన్నాడు. ఇది మన రాజ్యచారుల ద్వారా యాదవరాయలకు తెల్సింది. ఇక మీరు, ఆనందీ.. ఈరోజు రాత్రే చిదంబరం చేరుకోండి. అక్కడ నాకు దగ్గరి వాళ్ళున్నారు. చిదంబరం శైవక్షేత్రమని భావింపక అక్కడే ఉన్న గోవిందరాజస్వామి సన్నిధిలో జీవించండి. అంతా భగవదిచ్ఛ. భోళాశంకరుడే మీకు అండ. ఇంక సెలవు” అంటూ భట్టుమూర్తి కుముదను, ఆనందవల్లిని మేనా ఎక్కించి రహస్యమార్గంగా, ఆటవీ ప్రదేశంనుండి చిదంబరానికి చేర్చమని విశ్వసనీయమైన వేగులను నియమించాడు.

***

నిజానికి కుముదకు శ్రీరంగపురిని వదిలి వెళ్ళటం సుతరామూ ఇష్టంలేదు. కానీ ఆనందవల్లి తన ప్రాణాలపై ఒట్టు వేయించుకొని మరీ కుముదను బయల్దేరదీసింది. పైపెచ్చు గోవిందరాజస్వామి అచ్చంగా అనంతశయనం మూర్తిగా రంగనాథునన్ని తలపింపచేసే సమ్మోహనరూపమని ఎంచిన పిమ్మట అన్యమనస్కమై “పోనిద్దూ.. కొన్నాళ్ళు తలదాచుకొని, మళ్ళీ నాస్వామి సేవలో నా జీవితాన్ని కైంకర్యం చేస్తానని” అనుకోని అమ్మమ్మ మాటపై విశ్వాసముంచి గడపదాటింది కుముద. పెరట్లోని కృష్ణ విగ్రహాన్ని అమ్మమ్మకు తెలియకుండా బట్టలమూటలో భద్రంగా సర్దుకొని, ఇరవయ్యి ఏళ్ళు పుట్టి పెరిగిన శ్రీరంగాన్ని.. పుట్టిల్లు వదలివెళ్తున్న పడతిలాగా కనీరు నింపుతూ మేనా ఎక్కింది కుముద. రాత్రిపూట దుర్భేద్యమైన ఆటవీ ప్రాంతంనుండి ప్రయాణం, హోరున వర్షం, ఈదురుగాలులకు వేగుల దివిటీలు ఆరిపోయాయి. దూరంగా పులి గాండ్రింపులు. కుముద మనసు చిగురుటాకులా వణికిపోయింది. “శ్రీరంగనాథా నన్ను క్షమించు. నక్షత్ర కాంతిలో నీవే వెలుగుదారి ఇక, మమ్మల్ని పట్టణ ప్రవేశం చేయించు ప్రభూ!” అని మనసులో నివేదించుకొని రొప్పుతున్న ఆనందవల్లి చేయి పుచ్చుకొని, తెలతెలవారుతుండగానే చిదంబరాన్ని చేరుకున్నారు. అక్కడ భట్టుమూర్తి ఇచ్చిన చిరునామా ప్రకారంగా విశ్వనాథమూర్తిల్లు వెతుక్కుంటూ వెళ్ళారు. అతడు వారిని సాదరంగా ఆహ్వానించి, తమ ఇంటికి దూరంగా ఉన్న రెండు గదుల పెంకుటిల్లు. అందులో వారికి ఆశ్రమిచ్చే విధంగా ఏర్పాట్లు చేశాడు. “అమ్మా! ఇది పాండ్యదేశం. ఇక్కడ వైష్ణవ కీర్తనలు, భక్తిపాశురాలు చదవటం నిషిద్ధం. జాగ్రత్త సుమీ! ఇచ్చట ఉన్న ఒకే ఒక వైష్ణవాలయం గోవిందరాజ సన్నిధికి రేపు వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తాను. మీరు ఇక్కడ తలదాచుకున్నంతకాలం భుక్తికి లోటు లేకుండా చేసే బాధ్యతా నాది. కానీ, నేను మాత్రం ఇక్కడినుండే పర్యవేక్షిస్తాను. ఇంటికి మాత్రం రాను. ఇది గోప్యం సుమా!” అన్నారు హెచ్చరికగా. ఇరువురూ అర్థమైoదన్నట్లుగా తలాడించారు, బుద్ధిగా! ఆ రాత్రి నిద్రరాని కుముద అటు ఇటూ దొర్లుతూ, బట్టల మూటలోని కృష్ణ విగ్రహాన్ని తీసి, నూతి గట్టుపక్కన ఉన్న రాతిపై తూర్పుకభిముఖంగా ప్రతిష్ఠించింది. చల్లని వెన్నెలలో కృష్ణయ్య పదాలు పాడుకుంటూ నల్లనివాడు కలువరేకులవంటి కన్నులవాడు రంగాశాయిని మదినిండా ఆరాధించి తన్మయత్వంతో వివశయై అక్కడే, కృష్ణపాదాల చెంత నిద్దరోయింది హాయిగా! తెలతెలవారింది. ఘంటానాదాలకు బదులుగా శంఖారావాలతో మెలకువ వచ్చింది కుముదకు. “అయ్యో! అమ్మమ్మ లేవలేదూ? ఇంక, ఎంత పొద్దెక్కిపోయిందో, నేను పెరట్లోకి వెళ్తే కేకలేసే అమ్మమ్మ, ఇంకా నన్ను చూళ్ళేదా?” అనుకుంటూ తాము నిద్రించిన పడమటి గదిలోకి ప్రవేశించింది. అమ్మమ్మ.. నిద్రలో ప్రశాంతంగా ఉంది. వజ్రపు ముక్కుపుడకపై తొలి సూర్యకిరణం మంచుముత్యంలా మెరిసిపోసాగింది. “అయ్యో! అమ్మమ్మా! ఇంకా మొద్దునిద్రా..!” అంటూ చేయి పుచ్చుకుంది. మంచుగడ్డలా శరీరం ఘనీభవించింది. కుముదలో ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇన్నేళ్ళు తనను కంటిపాపలా పెంచి పెద్దచేసిన అమ్మమ్మ యిక లేదు. నేనెవరి నీడలో తలదాచుకోను, నా చల్లని నీడ నన్ను వదిలివెళ్ళింది అంటూ కుమిలిపోయింది. ఆ దుఃఖం నుండి తేరుకునేందుకు కుముడకు కొన్నేళ్ళు పట్టింది. ఆపై ఆమెలో ఒక తెంపరితనం వచ్చిచేరింది. ఏదయితే అడయ్యింది అనుకోని గోదాకీర్తనం, పాశురాలను నిత్యం గానం చేసూ గోవిందరాజస్వామిలోనే రంగనాథుణ్ణి నిల్పుకొని తన ఆటపాటలతో మెనూ మార్చేది. ఈ విషయం పాండ్యదేశపు ప్రభువైన అనంగచోళునికి చేరింది. ఆయన మహోదగ్రుడై వెంటనే సైనికుల్ని పంపి కుముదను కారాగారంలో బంధించాడు. ఆమె కళ్ళు పీకించాడు. అయినా వేరువని కుముద అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణాగతి అంటూ రంగనాథునిపై ప్రాణాలు నిల్పి జీవశ్చవంలా మారింది. ఇదే ఆమె ఆనాడు నెలకొల్పిన కృష్ణవిగ్రహం.. ఇదే నేటి అరహపిరాట్టి అని పిలువబడుతున్న కుముదవల్లీ నిలయం..! ఆ గోవిందరాజులే నేడు తిరుపతిలో పూజలందుకొనే తిల్య గోవిందరాజస్వామి వారు. అలనాడు దేవదాసి యైన తిల్య పూజలందుకొన్నది వారే! అలనాడు సభా మండపాన తిల్య సమ్మోహన నాట్యం చేసిందీ అదే సభా మండపాన ..!’’

అంటూ రాఘవాచారిగారు తన మనుమలైన శ్రేష్ఠ, ధనుష్ లకు అరహపిరాట్టి కథ విన్పించాడు. “నిజమా! తాతయ్యా! ఆనాడు శైవులు, వైష్ణవుల నడుమ అంత శతృత్వం ఉండేదా?” అంటూ విస్మయాన్ని ప్రకటించారు. “అవున్రా, భక్తి ఉద్యమం ఊపందుకున్న శతాబ్దాలలో వైష్ణవమూక, గొప్పదా? శైవమూక గొప్పదా? అన్న చర్చలు, వాదోపవాదాలు, అందులో విజయం వరించిన వారికి ప్రభువులు, మాన్యాలు, జాగీర్లు, భూములను ఇచ్చేవారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, మతపెద్దలు వీటిని ప్రజాసేవకు తమ తమ జీర్ణోద్ధరణకు, దేవాలయాలు నెలకొల్పేందుకు ఉపయోగించేవారు. మతమంటేనే సత్యమార్గం, విశ్వమానవ సౌభాగ్యానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక. కానీ అప్పట్లో మతాల వైషమ్యాలు, మతోన్మాదం పెచ్చుమీరి క్రూసేడులను పేరిట మతయుద్ధాలు జరిగి ప్రపంచశాంతి భగ్నమైంది. మానవుడు తన వినాశనాన్ని తానె కొనితెచ్చుకొన్నాడు. నేటి ఆధునిక యుగంలోనూ, ఈ విపరీత పోకడలను చూస్తున్నాం. నిజానికి మంచి చెప్పేదే మతం. అహింస, సత్యమార్గం, పరోపకారం, నీతినియమాలు, సామాజిక ఆచార వ్యవహారాలను నిలబెడుతూ మనిషి మహాపురుషుడయ్యేందుకే ప్రవక్తలు మతాన్ని బోధించారు. దాన్ని అందుకొని ముందుకు సాగిననాడే పరమత సహనంతో విశ్వమానవ ప్రేమ వర్ధిల్లుతుందని, దానికి నమ్మకమే పెట్టుబడి అని ఆ సమాజం తలవాలి. ఏమంటార్రా? తాతయ్యేమిటి హిస్టరీక్లాసు తీసుకుంటున్నాడు? అని వేళాకోళమైతే ఆడటంలేదు కదా” అంటూ దళసరి కళ్ళద్దాలను సవరించుకుంటూ మనవలను పొదువుకున్నాడు మురిపెంగా రాఘవయ్య, రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్.

“అలా.. ఏం లేదులే తాతయ్యా! మీరు ప్రతి యేడూ మమ్మల్ని ఏదో ఒక చారిత్రిక ప్రదేశానికి, హిస్టారికల్ టూర్ కానీ తీసికెళ్తారు కదా! మాకు తెలియని ఎన్నో విషయాలను వివరిస్తారు. పాపం! మా స్నేహితులు అబ్దుల్, డేవిడ్ లను ఎవరూ తీసికెళ్లరట! ఈసారి మన టూర్ ఎక్కడైతే అక్కడికి వారిని రమ్మంటాం” అన్నారు మనమలిద్దరూ అభిమానంగా.. తాతయ్యను చూస్తూ.

“అవును మరి! చారిత్రిక ప్రదేశాలు, చారిత్రాక సత్యాలు అంటే కోటలు, బురుజులు, శాసనాలు, శిథిలవనాలు కాదు! దాని వెనుక నిలబడిన గొప్ప సత్యాన్వేషకులు, కళాపోషకులు వారి దాతృత్వ ఉదారబుద్ధి.. విశ్వమానవ కల్యాణానికై వారు పడిన తపన” నేటి తరానికి అందించాలన్న తన అభిలాష ఇలా బీజదశ దాల్చినందుకు ఆయనకెంతో సంతోషం కల్గింది.

శివార్చనకై ఎవరో సాధువు శంఖాన్ని పూరించాడు బిగ్గరగా. మరోవైపు నుండి ‘భావయామి గోపాలబాలం..!’ అంటూ అతి మధురంగా యం.యస్. సుబ్బులక్ష్మి కీర్తన వీనులవిందుగా గాలిలో తేలివస్తూంది!!

Exit mobile version