Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగులు మార్చే మూడు కొండల వరుస త్రీ సిస్టర్స్..

[ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్లూమౌంటెన్స్ పర్వత ప్రాంతంలోని ‘త్రీ సిస్టర్స్’ సందర్శించి, ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

త్రీ సిస్టర్స్ అనే రాతి నిర్మాణాలు బ్లూమౌంటెన్స్ పర్వతాలలోని ఒక అందమైన పర్యాటక ప్రదేశం. ఆస్ట్రేలియా దేశంలోని ప్రధాన నగరమైన సిడ్నీకి రెండు గంటల దూరంలో బ్లూ మౌంటెన్స్ ఉన్నాయి. ఆకర్షణీయమైన పర్వత పట్టణాలు, పురాతన ఆదివాసీ శిలా కళలు, క్రోగి కొండల చెట్టు తిరిగే నడక మార్గాలు – ఇవన్నీ బ్లూ మౌంటెన్సు యొక్క మనోహర దృశ్యాలు. ఆదివాసీల పురాణం ప్రకారం రాళ్ళుగా మారిన ముగ్గురు అక్కచెల్లెళ్ల పేర్లు ఈ కొండలకు పెట్టారు.  ఇవి అసాధారణ రాతి నిర్మాణాలు. రోజంతా సూర్యకాంతి పడుతున్న చోటంతా బంగారు రంగుతో మెరుస్తూ మిగతా భాగమంతా నీలం రంగులో కనిపిస్తూ చూపరులను ఆకర్షిస్తాయి. రకరకాల సీజన్లలో ‘త్రీ సిస్టర్స్’ రకరకాల రంగుల్లో అద్భుతంగా కనిపిస్తుంటాయి.

దుమ్ము కణాలు నీటి ఆవిరితో కలిసి నీలి రంగులో ఉండే స్వల్ప తరంగదైర్య కాంతి కిరణాలను వెదజల్లడం వలన వీటిని బ్లూ మౌంటెన్స్ అంటారు. బ్లూ మౌంటెన్స్ అనబడే నీలి పర్వతాలు యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటాయి. ఎక్కడా కొండ కనిపించకుండా దట్టంగా పెరిగి ఉంటాయి. నీలి పర్వతాలు పొదలతో, ఇసుక రాయితో నిండి ఉంటుంది. ఈ అందమైన నీలి పర్వతాలపై పర్యాటకుల్ని ఆకర్షించడానికి ఎన్నో కేబుల్ కార్లు, రైలు మార్గాలు, దుకాణాలు ఉన్నాయి. సిడ్నీ చూడడానికి వెళ్ళిన వారు తప్పకుండా నీలి పర్వతాల్ని సందర్శించాలి.

మేము సిడ్నీ పర్యటన అనుకోగానే మొదటగా అందరూ చెప్పినదేమంటే బ్లూ మౌంటెన్స్‌ని తప్పక చూడమని. మేము ఒక రోజంతా ఈ పర్యటన కోసమే కేటాయించుకున్నాం. మేము సిడ్నీలో దిగగానే నోవాటెల్ హోటల్‌కి వెళ్ళాము. హోటల్ చాలా అందంగా ఉన్నది. మేము ఒక రోజంతా సిటీ టూర్ పెట్టుకున్నాం. ఒక రోజు సిడ్నీ ఒపేరా హౌస్‌ను, ఫెర్రీలో తిరగడానికీ కేటాయించుకున్నాం. మూడవరోజు బ్లూ మౌంటెన్స్‌కు వెళ్ళాం. మేము ఆస్ట్రేలియా వెళ్లిన దగ్గర నుంచీ వర్షాలే మమ్మల్ని స్వాగతిస్తున్నాయి. బహుశా నేను బంగాళాఖాత సముద్ర తీరంలో పుట్టిన దాన్నని తెలిసేమో! పసిఫిక్ సముద్ర గాలులు వాన చినుకులతో స్వాగతం పలికాయి.

చల్లని శీత గాలులు, చిరుజల్లులు, మబ్బులేసిన ఆకాశం –  వాతావరణం ఆహ్లాదంగా ఉన్నది. మా బస్సులో అన్ని రకాల దేశస్థులు వారి వేషాధారణలతో చూడ ముచ్చటగా ఉన్నారు. నా పక్కన ఆఫ్రికా దేశస్థురాలు వాళ్ళ ఐదారేళ్ల పిల్లను కూర్చోబెట్టింది. ఆ పాప నెత్తినిండా జడలున్నాయి. వాటికి రంగు రంగుల క్లిప్పులున్నాయి. తల్లి వెనక సీట్లో కూర్చున్నది. ఆ పాపతో ఫోటో తీసుకుందామా అనుకున్నాను. కానీ న్యూజిలాండులో ఒక పార్కుకు వెళ్ళినప్పుడు స్కూలు యాత్ర బస్సు వచ్చింది. మొత్తం పిల్లలంతా దిగి గుంపులుగా నిలబడ్డారు. చక్కని యూనిఫామ్‌తో నిలబడిన ఆ ముద్దు పిల్లలను చూసి ఫోటో తీసుకోవాలని అనుకున్నాం. ఆ స్కూలు టీచర్ పర్మిషన్ తీసుకుందామని అడిగితే “పిల్లలతో ఫోటోలకు మేము ఒప్పుకోం” అని చెప్పాడు. విదేశాలలో పిల్లలను ఎక్కడా ఎక్స్‌పోజ్ కానివ్వరనే విషయం గుర్తొచ్చింది. పిల్లల కిడ్నాపింగ్‌లు, అత్యాచారాలు నిరోధిండానికే కొత్త వారితో ఫోటోలు నిషిద్ధమని చెప్పినప్పుడు వారి జాగ్రత్తలకు హేట్సాఫ్ చెప్పాలనిపించింది.

వంపులు తిరిగిన రోడ్లు, పచ్చని లోయలు కోట గోడలుగా కట్టినట్లుగా కొండల వరసలు, ఆకాశంలో ఎగురుతూ పేర్లు తెలియని పక్షులు, అక్కడక్కడా కొండల మీద నుంచి దూకే జలపాతాలు ఎంత మనోహరమైన దృశ్యాలో. వాటిని చూస్తూ మనసంతా ఆనంద డోలికల్లో ఊగుతుంటే ఒక కొండ దగ్గర ఫోటోలు దిగమని బస్సు ఆపారు. ఆ కొండను ఎక్కాక బాగా చదునైన ప్రదేశం ఉన్నది. శాసనాలు ముద్రించిన శిలల్లాంటి నిర్మాణాల వద్ద ఫోటోలు తీసుకున్నాం. కొండ కోనలు ముందుకు వచ్చి, దాని కింది భాగం గూడుగా ఏర్పడినట్లు ఉన్నది. అక్కడ సేద తీరడానికి బెంచీలు వేశారు. కొండమీద వ్యూ పాయింట్లు ఉన్నాయి. చూద్దామంటే ఏవో కొన్ని చెట్లు మాత్రం మసక మసకగా కనిపిస్తున్నాయి తప్ప లోయ మాత్రం కనిపించట్లేదు. మరోవైపు చెట్ల అందాలు చూసేటందుకు నడకదారి ఉన్నది. అప్పటికి వర్షం పెద్దదైంది. అయినా ఆ వర్షంలో తడుస్తూ వానలో పరవశిస్తున్న చెట్ల అందాలను ఆస్వాదించేందుకు నడిచాం.

దారిలో హాట్ రెడ్ చిల్లీస్ అనే హోటల్ వద్ద తినేందుకు ఆపారు. అక్కడ శాండ్‍విచ్‌లు తప్ప ఏమి దొరకలేదు. అదే తిని ఆ హోటల్ ముందున్న పువ్వులను ఫోటోలు తీసుకొని తిరిగి బస్సెక్కాం. దారి పొడుగునా కొండల వరసలపై ముసుగు వేసినట్లుగా మంచు తెరలు మధ్యలో జారే జలపాతాలు కొండల పాపిడి బిళ్ళల్లా కనిపిస్తున్నారు. ఈ నీళ్లకు ఎప్పుడూ దూకటాలు నాట్యం చేయ్యటాలు సయ్యాటలాడటేలేనా! ఎప్పుడూ కొండల మీద నుంచి కిందికి దూకుతూ ఉరకలతో ఉత్సాహంతో నీళ్లు చలాకీగా ఉంటాయి. బహుశా ఇవి ఎప్పుడు బాల్యా వ్యవస్థ లోనే ఉంటాయి కాబోలు! తుళ్ళుతూ నవ్వుతూ దూకే పోటీలు పెట్టుకుంటూ నీళ్లు బిజీగా ఉన్నాయి. కొండలేమో నెత్తిమీద మంచు టోపీలు పెట్టుకొని ముఖం కన్పించకుండా తెరలు కప్పుకుని, వళ్లంతా ఆకుపచ్చ పొదల చీర కట్టుకుని కదలక మెదలక నిలబడుతున్నాయి. తుంటరి మబ్బులేమో పరుగులు తీస్తూ విమానాలకు అడ్డం వస్తూ, అలసిపోయినప్పుడల్లా కొండలపై ఆగి ఆయాసం తీర్చుకుంటూ ఆటలు ఆడుతున్నాయి.

బ్లూ మౌంటెన్స్ కు చేరగానే అందరూ చిన్నపిల్లల్లా మారిపోయారు. స్కై వే ద్వారా కొండలపైకి చేరుకున్నాం. అక్కడ ఎంత విశాలమైన మైదానం ఉందంటే ఎన్నో దుకాణాలు, హోటళ్ళు బోలెడు ఎంజాయ్‌మెంట్ సైట్లు ఉన్నాయి. పెద్ద బస్సంత కేబుల్ కార్లలో దాదాపు 30, 40 మంది ఒకేసారి ఎక్కుతున్నారు. కింద లోయలు కనిపిస్తూ భయం గొల్పుతున్నాయి. ఈ కేబుల్ కారు దిగాక ఆ కొండల్లో ఉండే వృక్షజాతుల్ని చూడడానికి నడక మార్గం వేశారు. నడక మార్గం అంతా చెక్కతో చేయబడి అక్కడక్కడ వ్యూ పాయింట్లతో ఉన్నది.

ఇక్కడా వర్షమే. చెక్క రోడ్లపై నడుస్తూ అక్కడున్న చెట్లను గమనిస్తున్నాము. పెద్ద పెద్ద మానుల్ని చుట్టుకుని ఆకుపచ్చని బెడ్ వలే చేసిన నాచులాంటి ఆల్గే, ఫంగై, మాస్ లను చూస్తూ బాటనిలో చదువుకున్న పాఠాలను గుర్తు తెచ్చుకున్నాను. పుష్పించని ఏకకణ మొక్కలు ఆల్గేలను, గడ్డిని, చిన్న పొదలను చూస్తే ఎక్కడా నేల కనబడడం లేదు. రాలిన ఆకులు, పుల్లలు, పుడకలు, ఎండిన పూలు నేలను కప్పేస్తున్నాయి. అక్కడక్కడ వ్యూ పాయింట్ల దగ్గర ‘లైరి బర్డ్స్’ కల కూజికాలు వినమని బోర్డులు పెట్టారు. సన్నగా మాను ఉండి పైకి వెళ్లే కొలదీ ఆకులు విప్పారి ఆకాశం కూడా కనబడకుండా చేస్తున్నాయి. నేలను నింగినీ ఈ చెట్లు ఆక్రమించేస్తున్నాయి. ‘డోరిపోరా సుస్సాఫ్రాస్’, ‘ఆక్ మెనా స్మితి’ అనే రెండు చెట్లు కలిసి ఒక దానికికొకటి పెరగడం చూశాం. ‘ఆక్ మెనా స్మితి’ అనే శాస్త్రీయ నామం కలిగిన చెట్లను ‘లిల్లీ పిల్లీ’ అంటారు.

‘నెడార్ వాటిల్స్’ అనే చెట్లు నిటారుగా చాలా పొడవుగా పెరుగుతున్నాయి. ఇవి ముప్పై సంవత్సరాలు పెరుగుతాయి. ఫెర్న్‌లు, రోప్ వే బకెట్స్ వంటి చెట్లున్నాయి. మరొక చెట్టును చూశాను, ఈ చెట్టు బెరడు రిబ్బన్ల వలె పొడుగ్గా వంపులు తిరిగి ఊడిపోతుంది. రిబ్బన్ గమ్ అనే ఈ చెట్టు యూకలిప్టస్ జాతికి చెందింది.

ఈ కొండమీద నుంచి రైల్లో కిందికి ప్రయాణం చేయడం అద్భుతంగా అనిపించింది. నిట్టనిలువుగా కొండ మధ్యలో రంధ్రం చేసి దానిలో రైలు ప్రయాణించడం చాలా మనోహరంగా ఉన్నది. రైల్లో కొండ దిగాక అక్కడ ‘త్రీ సిస్టర్స్’ కనిపించాయి. ఇవి కుటుంబా పట్టణానికి దగ్గరగా ఉన్నాయి. జామిసన్ వ్యాలీకి ఉత్తరాన ఉన్న అత్యద్భుత నిర్మాణాలివి. బ్లూ మౌంటెన్స్ లోని అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశాలు. బ్లేడుతో చేక్కినట్లుగా సూటిగా నిలబడ్డాయి. కాలాలు మారినప్పుడల్లా, సూర్యకాంతి పడిన విధంగా ఆ ‘త్రీ సిస్టర్స్’ తమ రంగులను మార్చుకుంటూ ఉంటాయి. లైల్ బర్డ్ కూతల్లాగా ఈ రాతి నిర్మాణాల శబ్దం వినిపిస్తుంది. రష్యన్ రచయిత ‘త్రీ సిస్టర్స్’ అనే పేరుతో ఒక నాటకం రాశాడు. ముగ్గురు ఆదివాసీ యువతుల ప్రేమ గాథ వల్ల ఈ పర్వతాలకు ‘త్రీ సిస్టర్స్’ అని నామకరణం చేశారు. జామిసన్ లోయలో ఉన్న ఈ పర్వతాల పేర్లు మేహ్ని, విమ్లా, గున్నెడూ. హేమ్నీ 922 మీటర్ల ఎత్తుండగా, విమ్లా 918 మీటర్ల ఎత్తులో ఉన్నది. గున్నెడూ 906 మీటర్ల ఎత్తున్నది. ముగ్గురు యువతులు నేపియన్ జాతికి చెందిన ముగ్గురు సోదరులతో జరిపిన ప్రేమ – పెద్ద గిరిజన యుద్ధానికి దారి తీసింది. వారి పేరుతో ఈ పర్వతాలు ‘త్రీ సిస్టర్స్’గా పేరు పొందాయి.

Exit mobile version