[శ్రీ లెనిన్ వేముల గారి ‘తొలి కోడి కూత’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
“రవి కాననిచో కవి కాంచునే కదా!” అని నానుడి. సూర్యుడు తన కాంతితో తాను ముందు చూచి అ బింబాన్ని ప్రసరించి ప్రతిఫలిస్తేనే తప్ప మనం ఏ వస్తువునైనా చూడలేము. ఎంత కనిపిస్తుందో అంతే చూస్తాము, అంతవరకే ఆ ఇమేజ్ యొక్క పరిమాణం అని భ్రమిస్తాము. కవియైనవాడు అలా కాదు, ఆ వస్తువు భౌతిక పరిధులను దాటి దాని ఆత్మను కూడా శోధించగలడు, చలనం లేని వస్తువులో గమనాన్ని సైతం సూక్ష్మ దృష్టితో దర్శించగలడు. ఆ గమనాన్ని స్లో మోషన్‌లో పెట్టి చూపగలడు, రమ్యంగా ఆవిష్కరించి పాఠకుడి చేత ‘ఆహా!’ అనిపించగలడు.
శ్రీశ్రీ అన్నట్లు మెరుపులో, మేఘంలో, పురుగులో, పుష్పంలో సౌంధర్యాన్ని ఆరాధించే వాడు కవి, అంతే కాదు! అరటి తొక్కలలో, బల్లపు చెక్కలలో కూడా!, చివరకు చెత్త కుండీలో సైతం లోతులను వెదకే వాడు కవి. మొన్నీ మధ్య ఆధునిక కవి చెప్పాడులే కాదేదీ కవితకనర్హం అని మనం అనుకోవచ్చు. కానీ ‘కాదేదీ కవితకనర్హం’ స్ఫూర్తి మాత్రం ప్రాచీన కాలం నుండీ ఉన్నది. ఎన్నుకున్న కవితా వస్తువుపై ఉజ్వలంగా భావాలు పోయిన మార్గదర్శక కవిశిఖామణులు ప్రాచీన కాలంలోనే ఉన్నారు. సామాజిక కోణం నుండి, వర్గ చైతన్య దృష్టితో వస్తువుపై కవిత్వమల్లడం ద్వారా ఆధునిక కవి కవితా ప్రయోజనం సాధిస్తే, ఏ వస్తువునైనా ఎన్నుకొని క్లిష్టమైన ఛందో రీతులలో లోతైన భావాలు పోయి, అలంకారాల జిలుగులను ఆపాదించి, కావ్యరస ప్రస్థానం సాగించి, శిల్ప సౌంధర్యాన్ని సాధించాడు ప్రాచీన కవి. దేని గొప్ప దానిదే. ఏ కాలంలోని సామాజిక విలువలు ఆ కాలానివే.
ఉదాహరణకు తొలికోడి కూయడాన్ని చూద్దాం. రోజూ ఉదయాన్నే మనం వినేదే, కోడి కూయడం చాలా మామూలు విషయమే, కానీ దాన్ని దర్శించిన విధానం లోనే కవి ప్రతిభ దాగి ఉంది. ఆ కూత వెనుక దాగి ఉన్న కోడి శరీర విన్యాసం ఏ క్రమలో ఉందో పరిశీలించడంలో ఉంది కవి సూక్ష్మ దృష్టి. ఆ కవి యెవరో కాదు తొట్ట తొలితరం మహా కవులలో ఒకడైన పాల్కురికి సోమనాథుడు. ఆయన రాసిన బసవ పురాణంలోని ఈ జాను తెనుగు పద్యం:
తొలికోడి కను విచ్చి, నిలిచి మై వెంచి,
జల జల ఱెక్కలు సడలించి, నీల్గి
గ్రక్కున కాలార్చి, కంఠంబు విచ్చి
ముక్కున నీకెలు చక్కొల్పి, కడుపు
నిక్కించి, మెడ సాచి, నిక్కి, మిన్సూచి,
కొక్కొరో కుఱ్ఱని కూయక మున్న
ప్రతి పదార్థం:
కనువిచ్చి = కళ్ళు విప్పి; మై = దేహము; వెంచి = విప్పి; కాలార్చి = కాళ్ళు సాచి (కాళ్ళు ఉపశమిమింప చేసి) ; ముక్కున నీకెలు = ముక్కుతో ఈకెలు; మిన్సూచి = పైకి చూచి;
తాత్పర్యం:
తొకి కోడి కళ్ళు విప్పి, లేచి నిలబడి. ఒళ్ళు నిటారుగా పెద్దది చేసి, జలజల మని ఱెక్కలు సరిచేసుకొని, నిక్కి నీలిగి, గబుక్కున కాలు సాగతీసి, గొంతు విప్పి, ముక్కుతో ఈకెలు సరిగా దిద్దుకుంది. పొట్ట నిక్కించి మెడ సాచి, నిక్కబడి తలపైకెత్తి చూసి కొక్కొరో కూయని కూసింది.
కోడి కూత దాని సహజ ధర్మమే. కానీ దానితో అది లోకాన్ని నిద్ర లేపుతుంది. మనల్ని రోజు వారీ కార్యక్రమానికి సిద్ధం చేస్తుంది. సరిగ్గా మనం కూడా అంటే మనుషులు కూడా, ఆ విషయానికొస్తే ఏ జంతువైనా నిద్ర లేవగానే వొళ్ళు సాగతీసి కొన్ని తమ జాతికి సహజమైన విషయాలను చేస్తుంది. ఆ సారూప్యతను గమనించిన కవి, కోడి శరీర విన్యాస క్రమాన్ని నిశితంగా గమనించాడు. కోడి యొక్క కదలికలను ఒక వరుస క్రమంలో పెట్టి చాలా ఆర్గనైజ్డ్‌గా వర్ణించాడు ఛందస్సులో. ఒక చిత్రం గీసి మన కళ్ళ ముందు పెట్టాడు. మన జీవితంలో మనం పట్టించుకోని ఒక విషయాన్ని కవి గమనించి సన్నివేశాన్ని అందంగా ఆవిష్కరించాడు. ఇది వీక్షణం. ఇది దర్శనం, ఇది కవిత్వం. ఈ కవిత ‘కోడి కూత’కు సంబధించినది కావచ్చు కానీ తెలుగు సాహిత్యంలోనే సహజ మనోహరమైన తొలి కోడి కూత సోమనాథుడిదే.
శివ కవులలో శ్రేష్ఠుడు గానూ, స్వతంత్ర కావ్య నిర్మాణంలో ఆద్యుడు గానూ చెప్పదగ్గ కవి పాల్కురికి సోమన. ఆయన సువిశాల సారస్వతం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. తెలుగులో దేశీ చందస్సును విస్తృత పరచి ద్విపద ఛందస్సులో వాఙ్మయ గంగను అవతరింప జేసిన శివకవి భగీరథుడు సోమన. బహుముఖీనమైన అతని ప్రజ్ఞ అజరామరం. అతని కృతులు తెలుగు సాహిత్య ప్రపంచాన స్మరణీయం.
లెనిన్ వేముల
డల్లాస్ నగరం, +13017040167