Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తిరువణ్ణామలై, షోలింగర్ యాత్ర

[ఇటీవల తిరువణ్ణామలై, షోలింగర్ దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

నేను, నా శ్రీమతి హిరణ్మయి, అమె అన్నయ్య, మా బావగారు గురుదత్త ప్రసాద్ గారు ఆయన భార్య, మా అక్కయ్య శ్రీమతి వనజమ్మ గార్లతో కలిసి తిరువణ్ణామలై యాత్ర చేద్దామని సంకల్పించాము. విచారిస్తే, కాచిగూడ నుండి డైరెక్ట్‌గా స్పెషల్ ట్రెయిన్ ఉందని, అది వారానికి ఒకసారి మాత్రమే ఉంటుందని తెలిసింది. అది నాగర్‌కోయిల్ వరకు వెళుతుందట. ఈ ట్రయిన్ లేకపోతే, వెంకటాద్రిలో చిత్తూరుకు వెళ్లి, అక్కడ నుంచి వేలూరు మీదుగా కారు బుక్ చేసుకుని వెళదామను కున్నాము.

మా బావగారు చాలా కాలం నుంచి రమణభక్తులు, ఆధ్యాత్మికవేత్త. ఆయనా, ఆయన శ్రీమతి చాలాసార్లు రమణాశ్రమానికి వెళ్లారు. గిరిప్రదక్షిణాలు ఎన్నో చేశారు. జ్యోతి దర్శనాలు చేసుకున్నారు. వారికి తిరువణ్ణామలై అంతా కొట్టిన పిండి! కాబట్టి, వారి ఆధ్యర్యం లోనే మా యాత్ర సాగింది.

రా. 7.45 గంటలకు మా రైలు బయలు దేరింది. రాత్రి తినడానికి గుంటపొంగణాలు తీసుకువెళ్లాము. ఆ రైల్లోని ప్రయాణీకుల్లో సింహభాగం తిరువణ్ణామలై యాత్రికులే. రైలు గుంటారు, తెనాలి, ఒంగోలు, రేణిగుంట, కాట్పాడి మీదుగా, 3 గంటలు ఆలస్యంగా చేరింది. మేం దిగేసరికి మర్నాడు మధ్యాహ్నం రెండయ్యింది. ఒంగోలులు బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ వడ తిన్నాము. కాట్పాడిలో చిత్రాన్నం (నిమ్మకాయ పులిహోర), పెరుగన్నం తిన్నాము. మా బావగారికి తెలిసినవారిదే తిరువణ్ణామలైలో.

ఒక ప్లాట్ ఉంది. వారితో మాట్లాడి, ఆయన పదిరోజులు ముందుగానే, దాన్ని మాట్లాడి పెట్టి ఉన్నారు. కాబట్టి మాకు చక్కని బస అమరింది. తిరువణ్ణామలై రైల్వే స్టేషను చాలా చిన్నది. బండి 2 నిమిషాలు మాత్రమే ఆగింది. దాదాపు రైలంతా అక్కడ ఖాళీ అయింది

అక్కడి నుంచి ఊరు దాదాపు 4 కిలోమీటర్లు ఉంది. రెండు ఆటోలు మాట్లాడుకుని, మా ప్లాట్ చేరుకున్నాం. రమణాశ్రమం ఎదుట, వినాయకుని గుడి ప్రక్కన సందు లోంచి వెళ్లాము. ఆ ప్రాంతాన్ని వి.ఐ.పి. గెస్ట్ హౌస్ అంటారట. ప్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది. ఎ.సి., ప్రిజ్, గీజరు, ఒకవేళ వంట చేసుకోవాలనుకుంటే గ్యాస్ స్టవ్, పాత్రలు కూడ ఉన్నాయి. కిచెన్‍లో డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది.

తిరువణ్ణామలై చుట్టూ పచ్చని కొండలు కనువిందు చేస్తున్నాయి. చలి హైదరాబాదు అంత తీవ్రంగా లేదు. వేడి వేడి నీళ్లతో స్నానాలు చేసి ఐదున్నరకు అరుచణాలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్లాము. ఆ రోజు భోగి. సంక్రాంతి సెలవులు. వీకెండ్. అన్నీ కలిసొచ్చాయి. నేల ఈనినట్లు జనం. అరుణాచలేశుని ఆలయ గోపురం సమున్నతంగా దర్శనమిచ్చింది. గుడి చాలా పెద్దది. అన్ని వైపుల నుంచి క్యూ లైన్లు ఉన్నాయి. లోపలికి వెళ్లింతర్వాత 50/- రూపాయల టికెట్ తీసుకోవాలట. ఉచిత దర్శనం కూడ ఉంది.

క్యూ అతి నెమ్మదిగా కదలసాగింది. దాదాపు నాలుగున్నర గంటలు పట్టింది మాకు అన్నామలై స్వామిని దర్శించుకోవడానికి. అక్కడ భక్తులను క్రమబద్ధీకరించే వ్యవస్థ అసలు లేదు. కొన్నిసార్లు రెండు క్యూలు కలిసే చోట తోపులాట కూడా జరిగింది. ‘సెక్యూరీటి’ సిబ్బంది ఎక్కడా కనబడలేదు. భక్తలలోని స్వీయ క్రమశిక్షణే వారిని ముందుకు నడిపించింది. చివరికి జ్యోతి స్వరూపుడైన పరమాత్మను, పరమేశ్వరుని దర్శించుకున్నాము. గర్భాలయంలో విద్యుత్ దీపాలు లేవు, శివలింగం చుట్టూ నూనె దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ‘హరహర మహదేవ! శంభో! శంకర!’ అని నినదించాము. ఏదో మహాశక్తి అక్కడ ఉంది. లక్షలాదిమంది అన్ని గంటలపాటు నిలబడి వేచి చూశారంటే మాటలా? మామూలుగా అయితే అరగంట కూడా నిలబడలేని నేను ఏకధాటిగా 4½ గంటలు నిలబడ్డాను! అదంతా శివుడిచ్చిన బలమే.

స్వామిని, దివ్యతేజోమూర్తిని దర్శించి, పరవశుడినయ్యాను. ఒళ్లంతా పులకరింతలు! కనుల వెంట ఆనందబాష్పాలు. స్వామిని ఇలా ప్రార్థించాను.

“మహాదేవ! మహాదేవ! మహాదేవ! దయానిధే!
భవానేవ! భవానేవ! భవానేవ! గతిర్మమ!
శివ, శివేతి శివేతి, శివేతివా, హరహరేతి హరేతి హరేతివా
భఖమనః! శివమేవ నిరంతరమ్!
భజమనః శివమేవ నిరంతరమ్!”

ఆలయ ప్రాకారం వెంట నిష్క్రమణ మార్గం ఉంది. అమ్మవారిని కూడా దర్శించుకుని, ఒక మంటపం వద్ద విశ్రాంతిగా కూర్చున్నాము. మా బావగారు ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని గురించి మాకు ఇలా చెప్పసాగారు .

“తిరువణ్ణామలై, బ్రిటిష్ రికార్డులలో ‘టినోమలి’గా నమోదై ఉంది. ఈ నగరం ఒక గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రం. జిల్లా కేంద్రం. అన్నామలై (అరుణాచల) ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. కార్తీక దీపోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. విదేశీ పర్యాటకులు ఇక్కడకి ఎక్కువగా వస్తారు. వారంతా రమణ మహర్షుల వారి ఆధ్యాత్మ బోధనల చేత ఆకర్షితులైన వారే.

హిందూ పురాణాల ప్రకారం, శివుని భార్య పార్వతీదేవి కైలాస పర్వతం మీద, వారి నివాసంలోని పూలతోటలో, ఒకసారి స్వామివారి కనులు. తన పూలరేకల లాంటి సుతిమెత్తని చేతులతో మూసిందట. సకల జగద్రక్షకుడైన పరమాత్మ, ఒక్క క్షణం కనులు మూస్తే, ఇంకేమైనా ఉందా? ఈ విశ్వంలోని కాంతి అంతా క్షీణించి, భూమి కొన్ని సంవత్సరాల పాటు చీకటిగా మారిందట. దీనిని నివారించడానికి పార్వతి ఇతర శివభక్తులతో కలిసి తపము చేయగా, పరమేశ్వరుడు అన్నామలై కొండ మీద పెద్ద అగ్నిస్తంభంలా వెలుగుతూ దర్శనమిచ్చి, ప్రపంచాన్ని మరలా వెలుగుతో నింపాడట.

ఈ అన్నామలై, అంటే, ఎరుపుకొండ, అన్నామలైయార్ దేవాలయం వెనుక భాగాన ఉంది. ఈ గిరి పరమ పవిత్రమైనది. తమిళంలో ‘అరుణం’ (సంస్కృతంలో కూడా) అంటే ఎరుపు లేదా అగ్ని అని అర్థం. దీని మొదటి ప్రస్తావన, ఏడవ శతాబ్దపు అప్పర్, తిరుజ్ఞాన సంబందర్‍లు చేసిన తమిళ శైవ క్రాననికల్ రచన, ‘తేవరం’లో ఉంది.

ఆలయంలోని చోళ శాసనాల ననుసరించి, తిరువణ్ణామలై 9వ శతాబ్దానికి చెందినదని తెలుస్తూ ఉంది. మరికొన్ని శాసనాలు పల్లవుల పాలనను కూడా సూచిస్తాయి. అప్పటి వారి రాజధాని కాంచీపురం. ‘పెరియపురాణం’ రచయితలు, సెక్కి జార్, అప్పర్ సంబంధార్‌లు ఇరువురు అన్నామలైయార్‌ను పూజించారు. చోళ రాజులు సా.శ. 850 నుండి సా.శ. 1280 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.” అంటూ ఆపారు.

“ఈ ఆలయం గురించి చెప్పు, బావాశ్రీ!” అనడిగాను ఆయనను.

ఆయన కొనసాగించారు.

“తిరువణ్ణామలై ఆలయ సముదాయం ఇంచుమించు పది హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భారతదేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఇది ఒకటి. నాలుగు గోపురాలున్నాయి. అందులో తూర్పు గోపురం ఎత్తు 217 అడుగులు, 11 అంతస్తులు. క్యూ లైన్‌కు ఆనుకునే వేయిస్తంభాల మందిరం ఉంది. అందులోనే రమణమహర్షి తపస్సు చేసిన గుహ ఉంది.

అన్నామలైయార్ అలయం పంచభూతాత్మక మందిరాలలో ఒకటి. శివుడు ఇచట అగ్నిస్వరూపుడుగా ఉద్భవించాడు. దీనిని ‘మణిపూరగ స్థలం’ కూడా అంటారు. తమిళ మాసం ‘కార్తికై’లో కార్తీక దీపోత్సవం జరుగుతుంది. అప్పుడు అన్నామలై కొండల పైభాగంలో, మూడు టన్నుల నెయ్యి కూడిన జ్యోతితో భారీ దీపం వెలిగిస్తారు. ఈ సందర్భంలో పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తారు. ప్రతి పార్ణమికి లక్షలాది మంది భక్తులు పాదరక్షలు ధరించకుండా గిరి పరిక్రమ చేస్తారు. ప్రదక్షిణ మార్గం 14 కి.మీ. దూరం కలిగి ఉంటుంది. దీనిని ‘గిరివాలం’ అని సూచిస్తారు. ఈ ప్రదక్షిణం సర్వపాపహరం, పునర్జన్మ చక్రం నుండి విముక్తి కలిగిస్తుంది.

గిరిప్రదక్షిణ మార్గంలో ‘అష్టలింగాలు’ గల ఆలయాలు దర్శనమిస్తాయి. అవి, ఇంద్ర లింగం, అగ్నిలింగం, యమ లింగం, నిరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, మరియు ఈశాన్య లింగం.

గుడి ఆవరణలో ఉన్న నందీశ్వరుడు చాలా పెద్ద విగ్రహం. ఒక మంటపంలో ఉంటుంది. దీనిని ‘పెద్దనంది’ అంటారు. ప్రధానాలయంలో గర్భగుడికి ముందు ఇంకొక నంది విగ్రహం ఉంటుంది. దానిని ‘చిన్న నంది’ అంటారు.” వివరించారు బావగారు.

అందరం బయటికి వచ్చాము. ఆటోలో రమణాశ్రమం దగ్గర దిగి, అక్కడున్న మొబైల్ క్యాంటీన్‍లో మసాలాదోసెలు తిని, పక్కనే నిమ్మకాయ సోడాలు తాగాము. రూము చేరి విశ్రమించాము.

***

మరునాడు ఉదయం నేను, నా శ్రీమతి హిరణ్మయి, ఆటోలో గిరిప్రదక్షిణ చేస్తూ, అష్టలింగాలను దర్శించాము. బెంగుళూరు నుంచి, మా తోడల్లుడు సుధాకర్ గారు, మా వదినె భువనేశ్వరి గారు కూడా వచ్చారు, వారి కొడుకు భరణి, కోడలు శ్రీముఖి లతో. వాళ్లంతా మర్నాడు కాలినడకన గిరిప్రదక్షిణ చేస్తారు.

మధ్యాహ్నం రమణాశ్రమాన్ని దర్శించాము. ప్రశాంతంగా ఉంది. ధ్యానమందిరంలో భక్తులు ధ్యాననిమగ్నులై ఉన్నారు. మా బావగారు మాకు ఆశ్రమ ప్రాశస్త్యం గురించి ఇలా చెప్పారు:

“1922 నుంచి 1950 వరకు ఆధానిక తత్త్వవేత్తను అయిన రమణమహర్షులవారు ఇక్కడ నివసించారు. 1950లో వారు పరమపదమును పొందినపుడు వేలాది భక్తులు ఆయన పార్థివ శరీరాన్ని దర్శించారు. అచట ఒక కోవెల నిర్మించారు. 1922 మే 19న వారి తల్లి అలగమ్మాల్ మరణించిన తర్వాత రమణులు ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అది మొదట్లో చిన్నగృహం. ఆయనతో బాటు చివరి దాకా, శేషాద్రి స్వామి ఉన్నారు. ఆయన ఆశ్రమం కూడా ఉంది.

రమణులు 1896లో, పదహరాళ్ల పిల్లవాడిగా, తన ఉనికికి మూలాన్ని అన్వేషించారు. తద్వారా మరణాన్ని సవాలు చేశారు. తర్వాత ఆయన సిద్ధి పొంది, ఆత్మవిచారణ యొక్కప్రత్యక్ష సాధన మార్గాన్ని వెల్లడించారు.” చెప్పారు మా బావగారు.

ఆశ్రమంలోనే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాం. అన్నం, బెండకాయలతో సాంబారు, కొబ్బరిపచ్చడి, మజ్జిగ! సింపుల్‌గా, రుచిగా ఉంది.

నేను రెండు రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లవలసి ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTR) అన్న జాతీయ సంస్థ. మానవ వనరుల మంత్రిత్వశాఖ (MHRD) ఆధ్వర్యంలో పని చేస్తుంది. వారు నన్ను క్వశ్చన్ పేపర్ సెట్టింగ్‌కు పిలిచారు. అది ఐదు రోజుల డ్యూటీ. కాబట్టి నేను మా వారందరికంటే ముందుగా బయలుదేరవలసి వచ్చింది.

భోజనం తర్వాత నేను తిరువణ్ణామలై బస్ స్టాండ్ చేరుకున్నాను. తమిళనాడు ఆర్.టి.సి వారి నాన్-స్టాప్ బస్‍లో వేలూరుకు వెళ్లి, అక్కడి నుంచి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి వారి నాన్-స్టాప్ బస్సులో చిత్తూరు చేరుకున్నాను. మొత్తం 2½ గంటలు ప్రయాణం . నేను చిత్తూరు చేరేసరికి సాయంత్రం ఆరయ్యింది. నేను మర్నాడు సాయంత్రం చిత్తూరు నుంచి వెంకటాద్రిలో కాచిగూడ చేరాలి. మర్నాడు తెల్లవారు జామున NTR వారు నాకు ఢిల్లీకి ఫ్లయిట్ బుక్ చేసి ఉన్నారు.

చిత్తూరు రైల్వేస్టేషన్ ఎదురుగా ‘లక్ష్మీ రెసిడెన్సీ’లో ఒక నాన్ ఎ.సి రూమ్ తీసుకున్నాను. ప్రక్కనే ‘విష్ణుభవన్ ‘లో సింగిల్ వడ, రవ్వ దోసతో నా డిన్నర్ సుసంపన్నమైంది. మర్నాడంతా ఖాళీయే. చిత్తూరుకు దగ్గరగా, 30 కి.మీ. దూరంలో, ‘షోలింగర్’ అన్న ప్రసిద్ధ నారసింహ క్షేత్రం ఉంది. నేను వ్రాసిన ‘లక్ష్మీనృసింహ మాహత్మ్యము’ అన్న పద్యకావ్యం పూర్తయింది. ఆ క్రమంలో వీలున్నన్ని నృసింహక్షేత్రాలను దర్శిస్తున్నాను.

‘షోలింగర్ ‘ కొండ చాలా ఎత్తు. పైన గుహలో యోగానంద నరసింహుడు స్వయంభూగా వెలిశాడు. కొండ పైకి చేరడానికి 1500 పైగా మెట్లు! ఎప్పుడో 25 సంవత్సరాల క్రిందట ఎల్.టి.సి అవైల్ చేసుకొని వచ్చాము షోలింగర్‌కు, సకుటుంబంగా. అప్పుడు నలభైల్లో ఉన్నాం కాబట్టి మెట్లు సులభంగా ఎక్కగలిగాం. ఇప్పుడు అలా కుదరదే! కాని మా తోడల్లుడు సుధాకర్ గారు, ఇప్పుడు ‘రోప్ వే’ వేశారని, ఇబ్బంది లేదని, తిరువణ్నామలై లోనే చెప్పారు.

మర్నాడు ఉదయాన్నే బయలుదేరి, చిత్తూరు ప్రయివేట్ బస్టాండ్ చేరుకోన్నాను. ప్రయివేట్ బస్సులో షోలింగర్ చేరసరికి ఎనిమిదయింది. ఆటోలో రోవ్ వే బోర్డింగ్ పాయింట్ చేరాను. పెద్ద క్యూ కాంప్లెక్స్ ఉంది-

వందలాది మంది క్యూలో ఎదురుచూస్తున్నారు.

మొత్తం నాలుగు కేబుల్ కార్లున్నాయి. ఒక్కొక్క దాంట్లో నలుగురు పడతారు. గ్రిల్స్ ఉన్నాయి రక్షణగా. క్యూలలో ఒక్కోసారి పదహారు మందిని వదులుతున్నారు. నా వంతు వచ్చేసరికి గంట పైగా పట్టింది కేబుల్ కార్ ఛార్జ్‌లు రాను పోను వందరూపాయలు. నాలుగూ ఒకేసారి బయలుదేరాయి.

వాటిని నడిపే జయింట్ వీల్ పైన ‘కటకట’ శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంది. కేవలం ఒక ఇనుప తాడుకు కొక్కెంతో వేలాడదీశారు వాటిని. కొండ చాలా స్టీప్‌గా ఉంది. మెల్లగా పైకి ఎక్కుతున్నాయి; కొంచెం అటూ ఇటూ ఊగుతూ! క్రిందకు చూస్తే అగాధమైన లోయ! షోలింగర్ పట్టణం లోని ఇళ్లు బొమ్మరిళ్లలా ఉన్నాయి. నాకు భయమేసింది. ఈ ఇనుప తాడు ఒకవేళ తెగిపోతే? నాది అర్థం లేని భయం! వేలాది మంది రోజూ సురక్షితంగానే వాటిల్లో తిరుగుతున్నారు కదా!

రోప్ వే ప్రయాణం 7 నిమిషాలు మాత్రమే! అటువైపు దిగాను. అక్కడి నుంచి స్వామి వారి గుహకు వందకు పైన మెట్లున్నాయి! మొత్తానికి నరసింహుడు నన్ను మెట్లు ఎక్కిస్తున్నాడనుకున్నా. తలుపు పక్కనే లిప్ట్ కనపడింది! అమ్మయ్య! అనుకున్నా. లిఫ్ట్ పైకి చేరింది. అక్కడనుంచి దేవాలయం క్యూ కాంప్లెక్స్‌కు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ‘అద్భుతం’ అనుకున్నాను.

కోతులు, కొండముచ్చులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కొబ్బరి చిప్పలు ఇస్తే తీసుకోవడం లేదు.. కోపంగా చూస్తూ, చిప్పను పక్కన పెట్టి వెళ్ళిపోతున్నాయి! కొబ్బరి తినీతినీ విసుగు వచ్చిందేమో ఆంజనేయస్వాములకు! అదే అరటిపండో, పులిహోర, పెరుగన్నం పొట్లమో అయితే ఆనందంగా తీసుకుంటున్నాయి.

క్యూ మెలికలు తిరుగుతూ కొండ అంచులో సాగి, గర్భాలయం చేరడానికి దాదాపు అర కి.మీ. దూరం ఉంది. చాలా పురాతన ఆలయం. రాతి స్తంభాల మంటపాలు శిధిలావస్థలో ఉన్నాయి. ముందుగా అమృతవల్లి తాయారును దర్శించుకున్న తర్వాతే స్వామివారి దర్శనం! అమ్మవారిని దర్శించుకున్నాను. స్వామివారు వెలసిన గుహ కూడా ఎత్తులో ఉంది. పది పన్నెండు మెట్లు ఎక్కాలి.

స్వామి యోగ ముద్రలో, కూర్చున్న భంగిమలో, రెండు చేతులు తొడల మీద పెట్టుకొని ఉన్నాడు. పెద్ద సెమ్మెలలో దీపాలు వెలిగించారు. ఆ వెలుగులో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు. నా హృదయం స్వామిని చూసి పరవశించింది, నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఆయన నన్ను నడిపిస్తున్నాడు. వ్యవసాయం చేసుకుంటున్న నేను, ప్రయివేటుగా ఎమ్మే వరకూ చదివి, గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, ఇంటర్ బోర్డులో డిప్యూటీ సెక్రెటరీగా, రీడర్‍గా ఎదిగాను. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, గాయకుడిగా, కాలమిస్టుగా, ప్రవచనకర్తగా పేరు తెచ్చుకున్నాను. ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. ఇదంతా నా ప్రతిభే అనుకుంటే అంత కంటే అజ్ఞానం లేదు. నా ప్రతి విజయం వెనుక నరసింహుడున్నాడు. ‘నాహం కర్తా, హరిః కర్తా’ అని అన్నమాచార్యుల వారన్నట్లు, ‘ది ఎన్టైర్ క్రెడిట్ గోస్ టు మై లార్డ్, లక్ష్మీనరసింహా!’.

 

స్వామిని చూస్తుంటే నాకు దుఃఖం వచ్చింది. కండ్ల వెంట ధారాపాతంగా నీరు! తండ్రీ! కరుణించు! అని ప్రార్ధించాను. క్రిందికి వచ్చి, ఒక అరుగు మీద కూర్చున్నాను. నేను వ్రాసిన కావ్యంలోని పద్యాన్ని చదువుకొన్నాను.

మ.:

కనియన్ మౌనివరుండు మాధవు, బృహత్కారుణ్య వారాశు, దా
ఘనమౌ భక్తి ప్రపత్తులన్ సకలమౌ కైవల్యసంధాయి, నా
దిననాథోజ్వల తేజు, సింహముఖునిన్, దేదీప్యమానప్రభా
వినతాసూన వహున్, స్వయంభువు, మహవేదాంత సారున్, హరిన్
(శ్రీలక్ష్మీనృసింహ మాహాత్మ్యము, ప్రథమాశ్వాసము)

అక్కడ ఒక అర్చకస్వామి, పెద్ద రాగిపాత్రల్లో చక్కెరపొంగలి, దధ్యోదనం పెట్టుకోని, చిన్న విస్తరాకు దొన్నెల్లో, భక్తులకు ఇస్తున్నాడు. అక్కడికి కోతులు రాకుండా గ్రిల్స్ వేశారు! చక్కెరపొంగలి ఎంత వేడిగా ఉందంటే జాగ్రత్తగా ఊదుకుంటూ తినకపోతే నోరు కాలుతుంది. నరసింహుని ప్రసాదం అద్భుతం.

‘షోలింగర్’ అసలు పేరు ‘షోళింగప్పురం’. ఇది తమిళనాడు లోని రాణీపేట్ జిల్లాలో ఉంది. చిత్తూరు – తిరుత్తణి మార్గంలో ఉంది. వైష్ణవ 108 దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. దీనిని ప్రాచీన కాలంలో ‘తిరుక్కడిగై’ అన్నారు. విశ్వామిత్రుడు ఈ కొండపై నృసింహుని సేవించాడని ఐతిహ్వం. ‘కడిగై’ అంటే ‘45’ నిమిషాలు! ఇక్కడ పుష్కరిణిని ‘తక్కన్’ అంటారు.

ఇక్కడ రెండు పర్వతాలున్నాయి. ఒక దాంట్లో యోగ నారసింహుడు, రెండో దాంట్లో ఆంజనేయుడు కొలువుతీరి ఉంటారు.

ఆంగ్లేయులకూ, మైసూరు నవాబు టిప్పు సుల్తాన్‌, హైదర్ ఆలీకి, ఇక్కడ 1781లో యుధ్ధం జరిగింది.

‘చోళసింగపురం’ – షోలింగర్‌గా మారిందంటారు. కరికాల చోళుని పాలనలో దీన్ని ‘కడిగైకొట్టం’ అనేవారు. కొండపై గుహ సముద్రమట్టానికి 750 మీటర్ల ఎత్తున ఉంది.

మళ్లీ కేబుల్ కార్ డ్రాపింగ్ పాయింట్‌కు వచ్చాను. తిరుగు ప్రయాణంలో అంత జనం లేరు. అరగంట అంతే! ఆటోలో బస్టాండ్‌కు వచ్చి, ప్రయివేట్ బస్‌లో చిత్తూరు చేరుకున్నాను. ‘విష్ణుభవన్’లో భోజనం చేశాను. తమిళనాడులోనూ సరిహద్దు జిల్లాల్లోనూ, హోటళ్లలో సాంబారు కాక ‘కారం పులుసు’ ఫేమస్. వెల్లుల్లితో, కొంచెం స్పైసీగా, ఘాటుగా, బాగుంటుంది. ఆవ పెట్టిన అరటికాయ ముద్దకూర చాలా బాగుంది.

సాయంత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చిత్తూరు నుండి బయలుదేరి మర్నాడుదయం కాచిగూడ చేరాను.

‘అరుణాచల శివ! జయ నరసింహ ప్రభు!’

Exit mobile version