[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా క్రిస్టిన్ హన్నా రచించిన ‘ది ఉమెన్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
క్రిస్టిన్ హన్నా రచించిన ‘ది ఉమెన్’ నవల, స్త్రీల సహిష్ణుతని చాటుతుంది. వియత్నాం యుద్ధంలో వారి అవ్యక్త త్యాగాలకు శక్తివంతమైన అన్వేషణ ఈ నవల. సంపన్న కుటుంబానికి చెందిన యువతి ఫ్రాన్సెస్ ‘ఫ్రాంకీ’ మెక్‍గ్రాత్, సైనికుడిగా వియత్నాం వెళ్ళిన అన్నని అనుసరిస్తూ, తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అక్కడ నర్స్‌గా చేరుతుంది. ఈ నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేస్తుంది, సంఘంలోని సుకుమార యువతి నుంచి నిపుణురాలైన ట్రామా నర్స్‌గా – ఫ్రాంకీ ప్రయాణం – యుద్ధపు కఠినమైన వాస్తవాలు, వాటి పర్యవసానాల గుండా సాగుతుంది.
క్రిస్టిన్ హన్నా
ఈ నవల యుద్ధ కాలమంతా సాగిన ఫ్రాంకీ ప్రయాణాన్ని స్పష్టంగా వివరిస్తుంది, రణరంగంలో ఆమె ఊహించలేని సవాళ్లను ఎదుర్కొంటుంది, వాటిలో మోర్టార్ దాడులు, నాపామ్ గాయాల భయంకరమైన పరిణామాలు వంటి ఉన్నాయి. క్రిస్టిన్ హన్నా ఈ రచన – వియత్నాంలో పనిచేస్తున్న మహిళల మధ్య ఏర్పడిన స్నేహం, బంధాలకు జీవం పోస్తుంది, వారి ధైర్యం, ఆత్మబలిదానాలను ప్రపంచానికి చాటుతుంది. యుద్ధ దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటాయి, వాటి వర్ణన నిజాయితీగా ఉంటుంది. ఫ్రాంకీ, ఆమె తోటి నర్సులు ఎదుర్కొన్న గందరగోళాన్ని, అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని నవల స్పష్టంగా చిత్రీకరిస్తుంది. ప్రమాదాలు ఉన్నప్పటికీ, ఫ్రాంకీ తన బాధ్యతలలోని ఉద్దేశాన్నీ, సమానత్వాన్ని గ్రహిస్తుంది, ఇది ఆమె స్వదేశంలో ఎదుర్కొన్న సామాజిక అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత, ఫ్రాంకీ మరో రకమైన పోరాటాన్ని ఎదుర్కొంటుంది. ఆమెను సర్వీస్ నుండి తొలగిస్తారు. తన చర్యలను ఆడమనిషి చేసే పనులు కావని ఛీత్కరించే సామాజిక నిబంధనలను ఆమె ఎదుర్కోవలసి వస్తుంది. వియత్నాంలో మహిళలు అందించిన తోడ్పాటును గుర్తించడానికి నిరాకరించిన సమాజంలో – తిరిగి కలిసిపోవడానికి ఫ్రాంకీ చేసిన పోరాటాన్ని ఈ నవల హృద్యంగా చిత్రించింది. ఆమె ప్రయత్నాలకు – మౌనం, తిరస్కరణ ఎదురవుతాయి, తాను ఒంటరినైపోయినట్లు, మానసికంగా చెదిరిపోయినట్లు ఆమె భావిస్తుంది. ఈ అల్లకల్లోల కాలంలో ఆమె స్నేహితులు బార్బ్, ఎథెల్ అందించిన మద్దతు ఆమెకు జీవనాధారంగా మారుతుంది.
నవలలోని ప్రేమ బంధాలు, ముఖ్యంగా నేవీ పైలట్ అయిన రై తో ఫ్రాంకీ ప్రేమ, ఆమె కథకు సంక్లిష్టమైన పొరను జోడిస్తుంది. ఈ సంబంధాలు భావోద్వేగపరంగా తీవ్రమైనవైనప్పటికీ, అవి మోసం, భగ్నప్రేమ, మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక ఒత్తిళ్ల వంటి గంభీరమైన ఇతివృత్తాలను అన్వేషించడానికి దోహదం చేస్తాయి. అప్పటికే పెళ్ళై, సంతానం ఉన్న రై బంధంలో ఫ్రాంకీ చిక్కుకోవడం ఆమెను నిరాశ లోకి, వ్యసన మార్గంలోకి నడుపుతుంది. ఈ కథనం – ద్రోహం, సంఘం తీర్పును ఎదుర్కొనేటప్పుడు మహిళల దుర్బలత్వాన్ని, సహిష్ణుతను ప్రస్ఫుటం చేస్తుంది.
‘ది ఉమెన్’ అనేది కేవలం ఒక చారిత్రక కల్పిత నవల కాదు; ఇది గుర్తింపు, సహిష్ణుత కోసం జరిగే అన్వేషణ, ఇంకా వ్యక్తులు మరియు సమాజంపై – సంఘర్షణ యొక్క శాశ్వత ప్రభావాన్ని కనుగొనే శక్తివంతమైన ప్రయత్నంగా చెప్పవచ్చు. హన్నా మహిళా సాధికారత, స్నేహం, మాజీ సైనికులు ఎదుర్కొనే మానసిక సవాళ్ల ఇతివృత్తాలను నైపుణ్యంగా మేళవించారు. వియత్నాంలో సేవలందించిన మహిళల కథలు తరచుగా విస్మరించబడుతున్నాయని, వారి త్యాగాలను గౌరవించడం చాలా ముఖ్యం అని ఈ నవల మనకు గుర్తు చేస్తుంది. ఈ ఇతివృత్తాలను పరిశీలించడం ద్వారా, హన్నా పాఠకుల్ని కదిలించే, ఆలోచింపజేసే కథనాన్ని అందించారు.
ఈ పుస్తకం మనుగడ, ప్రేమ స్వభావం, యుద్ధం పరిణామాలు, గుర్తింపు, సామాజిక అంచనాలు, సహిష్టుతలను అన్వేషిస్తుంది. ఆశ్రయం పొందిన అమ్మాయి నుండి యుద్ధభూమి నర్సుగా ఫ్రాంకీ ప్రయాణం యుద్ధం యొక్క క్రూరమైన వాస్తవాలను, పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (PTSD) యొక్క మానసిక మచ్చలను; గుర్తింపు కోసం మాజీ మహిళా సైనికుల పోరాటాలను ప్రస్ఫుటం చేస్తుంది. రై పట్ల ఆమెకున్న అమితమైన ప్రేమ – వివేకాన్ని మసకబార్చే ప్రేమ శక్తిని నొక్కి చెబుతుంది. వేదన, సహిష్టుతల ద్వారా ఆమె సాధించిన పరివర్తన – తన గుర్తింపును తిరిగి పొందేలా చేయడంలో యుద్ధం సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతికూలతను అధిగమించడంలో వ్యక్తిగత సామర్థ్యం, మద్దతుల ప్రాముఖ్యతను ఈ నవల నొక్కి చెబుతుంది.
మొత్తం మీద, ‘ది ఉమెన్’ అనేది వియత్నాం యుద్ధ సమయంలో మహిళల అనుభవాల సారాన్ని వెల్లడించే ఆకర్షణీయమైన, భావోద్వేగభరితమైన నవల. కొన్ని చోట్ల, ముఖ్యంగా శృంగార ఉప కథాంశాలలో కథాంశం పట్టు తప్పినట్లు అనిపించవచ్చు. అయితే మహిళల త్యాగాలను గౌరవించడం గురించి చెప్పిన నవల ప్రధాన సందేశం తిరస్కరించలేనిది, అత్యంత శక్తివంతమైనది.
హన్నా కథనరీతి లోతైనది, ఆకట్టుకునేలా ఉండి, హిస్టారికల్ ఫిక్షన్ అంటే ఆసక్తి ఉన్న పాఠకులకు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకంగా చేస్తుంది. ఈ నవల ఆశాజనకంగా ముగుస్తుంది, ఫ్రాంకీ మాజీ మహిళా సైనికులకు ఆశ్రయం కల్పించి, ఓదార్పునిస్తుంది. ఇది చికిత్స, విముక్తి వైపు ఆమె ప్రయాణాన్ని సూచిస్తుంది. బరువైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, ‘ది ఉమెన్’ అనేది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే మహిళల శక్తికీ, సహిష్ణుతకు నిదర్శనం.
కొసమెరుపు: ఈ పుస్తకాన్ని బిల్ గేట్స్ తన 2024 వేసవి పఠన జాబితాలో గట్టిగా సిఫార్సు చేశారు.
***
Author: Kristin Hannah
Published By: MacMillan
No.of pages: 476
Price: ₹ 599.00
Link to buy:
Paperback:
https://www.amazon.in/Women-Instant-Sunday-Bestseller-Nightingale/dp/1035005697/
eBook:
https://www.amazon.in/Women-Bestselling-Author-Four-Winds-ebook/dp/B0C43C6QVT/
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తక సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.