[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా అలిసన్ ఎస్పాచ్ రచించిన ‘ది వెడ్డింగ్ పీపుల్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
అలిసన్ ఎస్పాచ్ రాసిన ‘ది వెడ్డింగ్ పీపుల్’ నవల – డార్క్ కామెడీ నిండిన, నిజ జీవిత సవాళ్ళతో కూడిన ఒక ప్రత్యేకమైన, భావోద్వేగపు కథను చెబుతుంది. ఈ నవల న్యూపోర్ట్‌లోని రోడ్ ఐలాండ్‌లోని విలాసవంతమైన కార్న్‌వాల్ ఇన్‌లో జరుగుతుంది. నవల భగ్న హృదయురాలు, ఇటీవలే విడాకులు పొందిన ఫోబ్ స్టోన్ అనే కాలేజ్ టీచర్ కథతో మొదలవుతుంది. తన వివాహ బంధం ముగియడం, తనకి పిల్లలు పుట్టరని తెలుసుకోడం వల్ల ఆమె తీవ్ర విచారం కూరుకుపోతుంది. ఆమె తన జీవితాన్ని ముగించాలని అనుకుని కార్న్‌వాల్ ఇన్‌కి వెళుతుంది, కానీ అక్కడ అట్టహాసంగా జరుగుతున్న ఓ వివాహ వేడుకల గందరగోళంలో చిక్కుకుపోయి, ఆమె అనుకున్నది చేయలేకపోతుంది. కాబోయే వధువు లీలతో ఆశ్చర్యకరంగా కలిసిన స్నేహం, ఆ ఇద్దరు స్త్రీలు తమ భావోద్వేగాలను ఎదుర్కోవడానికి; తమ ఎంపికలను పునరాలోచించుకోవడానికి దారితీస్తుంది.
హాస్య, గంభీర సన్నివేశాల మధ్య సజావుగా సాగిపోతుందీ పుస్తకం. ఫోబ్ ఆత్మహత్య ప్రణాళికలు, తన వివాహాన్ని పరిపూర్ణంగా జరుపుకోవాలనే లీల పట్టింపుల మధ్య ఘర్షణ రేగుతుంది. తన జీవితంలో ముఖ్యమైన రోజుని ఫోబ్ పాడు చేయకూడదని లీల పట్టుబడుతుంది. దాంతో ఫోబ్, ఏదో ఒకవిధంగా, ఆ వివాహ కార్యక్రమాలలో భాగం అవుతుంది. ఇది ఇబ్బందికరమైన, భావోద్వేగపు, అసంబద్ధమైన అనుభవాల మేళవింపుకి దారితీస్తుంది, ప్రజలు తరచుగా తమ అసలైన భావాలను – సంతోషంగా ఉన్న వధువు లేదా బాధలో ఉన్న మాజీ భార్య వంటి సామాజిక హోదాల వెనుక ఎలా దాచుకుంటారో ఈ నవల ప్రదర్శిస్తుంది.
నవలలోని పాత్రలు విచిత్రంగా ఉంటాయి కానీ వాస్తవికంగా అనిపిస్తాయి, పోల్చుకోదగ్గవిగా ఉంటాయి. ఫోబ్ వ్యంగ్యంగా, నిజాయితీగా ఉంటుంది, కానీ లీల ధైర్యపు వ్యక్తిత్వం వెనుక తన అభద్రతాభావాలను దాచిపెడుతుంది. మొదటి భార్య మరణించాక, మరో పెళ్ళికి సిద్ధమైన వరుడు గ్యారీ, అతని చిన్న కుమార్తె మెల్ వంటి ఇతర పాత్రలు నవలకు మరింత భావోద్వేగాన్ని, గాఢతని జోడిస్తాయి. రచయిత్రి హాస్యాన్ని తెలివైన పద్ధతుల్లో ఉపయోగించారు – వేదన, సాంత్వన భావాల హృద్యమైన క్షణాలతో పాటు సర్ఫింగ్ పాఠాలు, ఇబ్బందికరమైన ప్రసంగాలు, సరదా సంభాషణలు చోటుచేసుకున్నాయి నవలలో.


అలిసన్ ఎస్పాచ్
ఎస్పాచ్ రచనలు పదునైనవి, హృదయాన్ని తాకేలా ఉంటాయి. పెళ్ళి, కుటుంబం, వ్యక్తిగత ఆనందాలని సమాజం ఎలా చూస్తుందో ఆమె ప్రదర్శిస్తారు. ఫోబ్ కళ్ళ ద్వారా, పెళ్ళిళ్ళ లోని వింతైన, కొన్నిసార్లు విచారకరమైన ఘటనలను మనం చూస్తాం. జీవితంలోని ముఖ్యమైన సంఘటనల సమయంలో ప్రజలు తమ అసలైన స్వభావాలని విడిచి, వేరే వారిలా ఎలా నటిస్తారో ఈ నవల చెబుతుంది. అసలైన బంధం వారి ఎదుగుదలకు ఎలా సహాయపడుతుందో ఈ పుస్తకం తెలుపుతుంది.
అయితే, పుస్తకం పరిపూర్ణంగా లేదు. కొంతమంది పాఠకులు కథలోని కొన్ని భాగాలు చాలా నెమ్మదిగా సాగాయని లేదా హాస్యం అన్నిసార్లు సరిగ్గా పండలేదని భావిస్తారు. నవలలోని కొన్ని సహాయక పాత్రలు కొంచెం వింతగా ప్రవరిస్తున్నట్లు, లేదా ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తాయి. అయితే ఈ చిన్న లోపాలు నవల ఆకర్షణని, సందేశాన్ని తక్కువ చేయవు.
ఓ అట్టహాసపు వివాహం సృష్టించిన గందరగోళం నుండి – ఈ నవల – ప్రేమ, సామాజిక అంచనాలు, వ్యక్తిగత ఎదుగుదలని అన్వేషిస్తుంది. కుటుంబపు ఒత్తిళ్లు, సాంఘిక నిబంధనల వల్ల అనుబంధాలు తరచుగా – సహజంగా ఉండక, ఎదుటివారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవిగా ఎలా మారుతాయో ఈ నవల వెల్లడిస్తుంది. వేదన, స్వీయ-అన్వేషణల గుండా ఫోబ్ ప్రస్థానం సాగుతున్నప్పుడు – వివాహ సంస్కృతి లోని అసంబద్ధతలను; గతం వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించడానికి ఈ నవల హాస్యాన్ని, భావోద్వేగపు లోతులను ఉపయోగిస్తుంది.
చివరగా, ‘ది వెడ్డింగ్ పీపుల్’ అనేది బంధాలు, స్వీయ-ఆవిష్కరణ, రెండవ అవకాశాల గురించిన ఆధునిక, ఆలోచనాత్మక నవల అని చెప్పవచ్చు. హాస్యాన్ని గంభీరమైన ఇతివృత్తాలతో మేళవించి పాఠకులను అలరిస్తుంది, ఆలోచింపజేస్తుంది.
అలిసన్ ఎస్పాచ్ హృదయాన్ని తాకే, చిరస్మరణీయ నవలను రాశారు. చదవడం పూర్తి చేశాకా, చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది.
***


Author: Alison Espach
Published By: THE KITAAB STORE
No. of pages: 357
Price: ₹ 599
Link to buy:
https://www.amazon.in/Wedding-People-PAPERBACK-Alison-Espach/dp/0022412182

స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తస సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.