[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా కేశవ గుహ రాసిన ‘ది టైగర్స్ షేర్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
కేశవ గుహ రాసిన ‘ది టైగర్స్ షేర్’ సమకాలీన ఢిల్లీ నగరం నేపథ్యంగా రూపొందిన పలు-పొరల నవల. కుటుంబపు ఆస్తులు, వారసత్వం హక్కులు, పర్యావరణ స్పృహ వంటి అంశాలను స్పృశిస్తుందీ నవల. ఈ నవల, విజయవంతమైన లాయర్ అయిన తార, ఆమె తండి బ్రహ్మ సక్సేనా రిటైర్డ్ ఛార్టర్డ్ ఎకౌంటెంట్ ప్రధాన పాత్రలుగా సాగుతుంది. నగరంలో తీవ్రంగా ఉన్న పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో తను వంతు కృషి చేసే క్రమంలో బ్రహ్మ – తన ఆస్తులను వారసులకి ఇవ్వకుండా, సమాజానికే అందివ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ అసాధారణ ప్రతిపాదన ఆధునిక సమాజపు ప్రాధాన్యతలపై, పర్యావరణ సంక్షోభంపై విమర్శనాత్మకంగా ఉండటంతో పాటు కుటుంబ గాథగా కూడా ఉండి – నవలను ముందుకు నడుపుతుంది.
కథనంలో ప్రతీకాత్మకత సమృద్ధిగా ఉంది, ముఖచిత్రంపై పులి బొమ్మ – వారు నివసించే సమాజంలో మనుగడని, వేటాడటం అనే ప్రాథమిక ప్రవృత్తులను సూచిస్తుంది. రచయిత ఢిల్లీ నగరాన్ని స్పష్టంగా, కథలో లీనమయ్యేలా చిత్రించారు. నవల ఇతివృత్తం – సంపద, క్షీణత, అధికారం, ఇంకా దుర్బలత్వపు వైరుధ్యాలను ప్రస్తావిస్తుంది. వారసత్వం చుట్టూ ఉన్న కుటుంబ సంఘర్షణలు ఈ జనారణ్యం మధ్య జరుగుతాయి, ఇక్కడ పాత్రలు, పులిలాగే, ఊపిరాడకుండా చేసే సామాజిక సోపానక్రమంలో మనుగడ కోసం పోరాడటం నేర్చుకోవాలి.
కేశవ గుహ
గుహ సృజించే పాత్రలు సంక్లిష్టంగా, నైతికంగా అస్పష్టంగా ఉంటాయి, సులభంగా సానుభూతిని నిరాకరిస్తాయి. తార పాత్రను దృఢ నిశ్చయపు స్త్రీగా చూపుతూనే, లోపభూయిష్టమైన పాత్రగా చిత్రీకరించారు, పితృస్వామ్య సమాజంలో స్త్రీగా ఉండటం వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కొంటారు. ఆమె సోదరుడు రోహిత్, ఇంకా ఇతర మగవాళ్ళు నవలలో ఉద్రిక్తతకు కారణమైన హక్కులు, అభద్రతా భావాల మిశ్రమాన్ని ప్రదర్శిస్తారు. కుటుంబ పెద్ద అయిన బ్రహ్మ, పర్యావరణం పట్ల ఆందోళన, మానవ బలహీనతలు, వైరుధ్యాలని ప్రతిబింబించే ఓ రహస్యంలా ఉంటాడు. ఈ నవల వ్యక్తిగత లోపాలను మాత్రమే కాకుండా వ్యవస్థాగత సమస్యల పట్ల విస్తృత సామాజిక, రాజకీయ ఉదాసీనతను కూడా విమర్శిస్తుంది.
పుస్తకంలో ఉపయోగించిన వచనం సొగసైనది, నియంత్రితమైనది, ఇంకా ఉత్తేజకరమైనది, పాఠకులను కథలో లీనం చేసే ఉద్రిక్తతతో నిండి ఉంటుంది. గుహ కథనం సర్వజ్ఞ దృక్పథాన్ని సన్నిహిత మానసిక అంతర్దృష్టితో సమతుల్యం చేస్తుంది దాంతో, కుటుంబంలోనూ, సమాజంలోను ఆగ్రహం, ఆశయం, నైతిక విలువల అంతర్వాహినిని దర్శించే వీలుని పాఠకుడికి కల్పిస్తుంది. సంభాషణలు పదునైనవి, అప్రయత్నంగా కుదిరినట్టు ఉంటాయి. భారతదేశంలోని పట్టణాలలోని ఉన్నతవర్గాల జీవిత వాస్తవాలలో కథను స్థిరంగా నిలుపుతుంది, అయితే సూక్ష్మ పర్యావరణ మరియు రాజకీయ ఇతివృత్తాలు విస్తృత సందర్భాన్ని అందిస్తాయి.
ఈ పుస్తకం జెండర్, అధికారానికి సంబంధించిన ఇతివృత్తాలను కూడా సూక్ష్మ నైపుణ్యాలతో పరిశీలిస్తుంది. తార, ఈ నవలలో మరో బలమైన మహిళా పాత్ర అయిన లీలతో స్నేహం చేస్తుంది, పురుషాధిక్య ప్రపంచంలో ఆశావహులైన మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్ఫుటం చేస్తుంది. ఈ నవల సరళమైన తీర్మానాలను అందించదు కానీ పితృస్వామ్యం, సంప్రదాయాలను లోలోతుల్లోకి జొప్పించుకున్న కుటుంబ, సామాజిక నిర్మాణాలలో ప్రాతినిధ్యం కోసం అసౌకర్యమైన రాజీలను, పోరాటాలను అన్వేషిస్తుంది. సమకాలీన భారతదేశంలో అభివృద్ధి, స్థిరపడిన సాంస్కృతిక నిబంధనల మధ్య ఏర్పడే భారీ ఉద్రిక్తతలను జెండర్ డైనమిక్స్ నొక్కి చెబుతాయి.
పర్సనల్, ఫ్యామిలీ డ్రామాతో పాటుగా, ‘ది టైగర్స్ షేర్’ నవల ఒక శక్తివంతమైన పర్యావరణ సందేశాన్ని కలిగి ఉంది. బ్రహ్మ వారసత్వాన్ని తిరస్కరించడం – ప్రకృతిని, ఇతర జీవరాశులను దోపిడీ చేయడంలో మానవాళి యొక్క అహంకారాన్ని పునఃపరిశీలించాలనే పిలుపుకు ప్రతీక. గుహ ఢిల్లీని వర్తమాన సంక్షోభ ప్రాంతంగా చిత్రీకరించడం ద్వారా సాధారణ వాతావరణ కల్పనలో ప్రళయానికి మించి ముందుకు సాగారు రచయిత. పర్యావరణ నిర్లక్ష్యం పరిణామాలు సుదూర భవిష్యత్తులో కాకుండా ఇప్పుడే స్పష్టంగా కనిపించే ప్రదేశం ఢిల్లీ. ఈ పర్యావరణ కోణం నవల లోని నైతిక, రాజకీయ వ్యాఖ్యానంతో సజావుగా మిళితం అవుతుంది, ఇది కాలానుగుణమూ, అత్యవసర విషయంగా మారుతుంది.
మొత్తం మీద, ‘ది టైగర్స్ షేర్’ అనేది గణనీయమైన ఆశయం, నిశ్శబ్ద శక్తి కలిగిన నవల. కుటుంబ సంఘర్షణ, సామాజిక విమర్శ, పర్యావరణ ఆవశ్యకతను ప్రతిబింబిస్తూనే – తీవ్రమైన ఉద్వేగాలను,లీనమయ్యే కథనంలో నేర్పుగా అల్లుకున్న నవల. గుహ నవల – పాఠకులు వారసత్వానికి సంబంధించి భౌతికపరమైన, నైతికమైన నిజాలను ఎదుర్కునేలా చేస్తుంది, వేగంగా మారుతున్న ప్రపంచంలో మానవ ఉనికి యొక్క అనిశ్చితత్వం గురించి అసౌకర్య సత్యాలను ఎదుర్కోవడానికి సవాలు విసురుతుంది. ఈ సమకాలీన భారతీయ కాల్పనిక రచన అత్యంత చురుకైనది, దృఢమైనది, ఇంకా మానవీయమైనది.
***
Author: Keshava Guha
Published By: Hachette India
No. of pages: 256
Price: ₹ 699
Link to buy:
https://www.amazon.in/TIGERS-SHARE-Keshava-Guha/dp/935731735X/
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తక సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.