[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా షారీ ఫ్రాంక్ రాసిన ‘ది హౌస్ ఆఫ్ మై మదర్: ఎ డాటర్స్ క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
షారీ ఫ్రాంక్ రచన, ‘ది హౌస్ ఆఫ్ మై మదర్: ఎ డాటర్స్ క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్’ – ఫ్రాంక్ కుటుంబంలో పెద్ద కుమార్తెగా ఆమె పెంపకం గురించి వెల్లడించిన వాస్తవ, నిష్కపటమైన కథనం. ఆహ్లాదకరమైనదిగా రంగుపూసిన ఆమె జీవితాన్ని ‘8 ప్యాసింజర్స్’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా లక్షలాది మందికి ప్రసారం చేశారు. బయటి ప్రపంచానికి, ఫ్రాంక్ కుటుంబం ఆరోగ్యకరమైన కుటుంబ విలువలను, ఆరుగురు పిల్లలను పెంచడంలోని విజయాలను, కష్టాలను ప్రదర్శిస్తుంది. అయినప్పటికీ, షారీ వెల్లడించినట్లుగా, ప్రపంచానికి అందంగా ప్రదర్శించిన వారి కుటుంబ కథా చిత్రం, అనేక చేదు వాస్తవాలను కప్పిబుచ్చింది. ఈ పుస్తకంలో షారీ అనుభవించిన మానసిక శారీరక వేధింపులు, వంచన, ఇంకా స్వయంప్రతిపత్తి కోసం జరిపిన అవిశ్రాంత పోరాటపు వివరాలు ఉన్నాయి.
ఆన్‌లైన్‌లో ఆదర్శవంతమైన తల్లిగా ప్రసిద్ధి చెందిన రూబీ ఫ్రాంక్ బాహ్య వ్యక్తిత్వానికి – ఆమె అసలు ప్రవర్తనకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం ఈ రచనలో ప్రధానమైనది, దీనిని షారీ నిరంకుశత్వం, అతి నియంత్రణగా అభివర్ణిస్తుంది. మతపరమైన విలువలు నైతిక ధర్మం ముసుగులో పిల్లలకి తరచుగా కఠిన శిక్షలు విధించడం; వాళ్ళకి లోటు చేయడాన్ని సమర్థించుకునేలా రూబీ కఠినమైన నైతిక నియమావళిని అమలు చేసింది. తమ ఛానెల్‌లో సభ్యత్వం ఉన్న 2.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ల కోసం జాగ్రత్తగా ప్రసారం చేయబడిన ఆ కుటుంబపు రోజువారీ జీవితం – అంతా కేవలం ప్రదర్శన కోసమే అన్నట్టుగా మారింది, పిల్లలు అసమ్మతి వ్యక్తం చేస్తే కఠినమైన పరిణామాలను ఎదుర్కొకోవాల్సి వచ్చేది.
రిలేషన్‌షిప్ కోచ్‍నంటూ సొంతడబ్బా కొట్టుకునే జోడి హిల్డెబ్రాండ్ట్ పరిచయంతో పరిస్థితి మరింత తీవ్రమైంది, అతని ప్రభావంతో రూబీ మరింత కఠినమైన క్రమశిక్షణా చర్యలను అమలు చేస్తుంది. రూబీ, జోడి కలిసి – షారీ వెల్లడించినట్టుగా – ఒక అమానవీయ పాలనను అమలు చేశారు, పిల్లలను ఒంటరిగా ఉంచారు. భయపెట్టి, మానసికంగా వేధించడం ద్వారా తమ పద్ధతులను పిల్లలు అంగీకరించేలా చేశారు. ఒక కల్ట్ లాంటిదని షార్ పేర్కొన్న – హిల్డెబ్రాండ్ట్ యొక్క ‘కనెక్షన్స్’ కార్యక్రమం, తమ ఇంటి విషయాలలో జోక్యం చేసుకోవడం, ఇంట్లో నియంత్రణ, దాపరికపు వాతావరణాన్ని తీవ్రతరం చేసింది.
షారీ ప్రస్థానం – మనుగడకై జరిపిన పోరాటపు చరిత్ర మాత్రమే కాదు, స్వీయ-ఆవిష్కరణ, ఇంకా విముక్తి దిశగా చేసిన ప్రయాణం కూడా. తోబుట్టువులలో పెద్దక్కగా, కుటుంబంలో ఎదురవుతున్న వేధింపులకు బాధితురాలూ, సాక్షీ – రెండూ తానే అయింది షారీ. చివరికి తెగతెంపులు చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది షారీ. ప్రజలకు తెలియని తమ కుటుంబపు అసలు జీవితాన్ని బహిర్గతం చేయడానికి, తల్లి అరెస్టును బహిరంగంగా వెల్లడి చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. షారీ రచించిన ఈ పుస్తకం – విడిపోవడంలోని బాధ, బాధ్యతల భారం, ఇంకా నెమ్మదిగా, కష్టపడి గెలిచిన స్వస్థత ప్రక్రియతో నిండి ఉంది.
కుటుంబ వీడియోలను ప్రసారం చేయడం వల్ల కలిగే నైతిక సందిగ్ధత ఈ రచనలో ముఖ్యమైన అంశం. ప్రజల/ప్రేక్షకుల నిరంతర పరిశీలనలో పెరగడం వల్ల కలిగే నష్టాన్ని, ఆన్‌లైన్‌లో పేరుప్రతిష్ఠల కోసం పిల్లల జీవితాలను సరుకుగా మార్చినప్పుడు తలెత్తే దోపిడీని షారీ ప్రశ్నిస్తుంది. వ్యక్తిగత జీవితం – డిజిటల్ కంటెంట్ మధ్య సరిహద్దుల గురించి; సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ యుగంలో పిల్లల హక్కులను, శ్రేయస్సుని కాపాడవలసిన తక్షణ అవసరం గురించి ఆమె ఆలోచనలు ఒక హెచ్చరికగా పనిచేస్తాయి.
షారీ పుస్తకంలోని – నిష్కాపట్యత, దృఢసంకల్పం పట్ల పాఠకులు, విమర్శకులు ప్రశంసలతో స్పందించారు. అటువంటి బాధాకరమైన నిజాలను ఎదుర్కోవడానికి; కుటుంబం, విశ్వాసం రెండింటి ద్వారా నిర్మించబడిన శక్తివంతమైన కథనాలను సవాలు చేయడానికి అవసరమైన బలాన్ని చాలామంది గుర్తించారు. డిజిటల్ యుగంలో తల్లిదండ్రులు, ఇంకా క్రియేటర్ల బాధ్యతలు; యువ జీవితాల వేదన, గోప్యతలపై ఉండే దీర్ఘకాలిక ప్రభావం గురించి ఈ రచన విస్తృత చర్చకు దారితీసింది.
చివరగా, ‘ది హౌస్ ఆఫ్ మై మదర్’ అనేది సాహసోపేతమైన వెల్లడింపుగా, సత్యాన్ని చెప్పే శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. షారీ ఫ్రాంక్ కథ – బాహ్య రూపాలకు మించి చూడమని, సోషల్ మీడియా అందించే కథనాలను ప్రశ్నించమని, కెమెరా వెనుక తరచుగా దాగి ఉండే జటిలమైన వాస్తవాలను గుర్తించమని పాఠకులకు నొక్కి చెబుతుంది. అణచివేత నుండి స్వేచ్ఛకు ఆమె ప్రయాణం – పూర్తిగా వ్యక్తిగతమైనదే అయినా విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. అది సానుభూతికి, అప్రమత్తతకి పిలుపు, మానవ స్ఫూర్తి యొక్క శాశ్వత శక్తికి ఋజువు.
***
Author: Shari Franke
Published By: Gallery UK
No. of pages: 319
Price: Paperback ₹ 1,999
Link to buy:
https://www.amazon.in/House-My-Mother-bestselling-daughters/dp/1398547867/
https://www.amazon.in/House-My-Mother-bestselling-daughters-ebook/dp/B0DLX3ZMTC/
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తక సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.