Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మరుగునపడ్డ మాణిక్యాలు – 117: ద ఎక్సర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్

[‘ద ఎక్సర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

మామూలుగా హారర్ చిత్రాలు కేవలం భయపెట్టటానికే ఉంటాయి. కానీ ఆలోచింపజేసే హారర్ చిత్రాలు కూడా కొన్ని వచ్చాయి. ఒక చిత్రంలో వస్తువు ఏమిటి అనేది ముఖ్యం కాదు. ఆ వస్తువుని ఎలా దర్శింపజేశారన్నదే ముఖ్యం. హారర్ చిత్రం ‘ద ఎక్సర్సిస్ట్’ ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. అలాంటి చిత్రమే ‘ద ఎక్సర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్’ (2005). ఎక్సర్సిజం అంటే ఆవహించిన దుష్టశక్తిని పారద్రోలే ప్రక్రియ. తేలిక పదాల్లో చెప్పాలంటే భూతవైద్యం. ఎమిలీ రోజ్ అనే యువతిని ఒక దుష్టశక్తి ఆవహించిందని ఆమె కుటుంబం భావిస్తుంది. మొదట ఆమెకి ఆరోగ్యం బాగాలేదని మందులు వాడతారు. అవి పని చేయకపోవటంతో దుష్టశక్తి అని నిర్ధారించుకుని దాన్ని పారద్రోలటానికి ఒక క్రైస్తవ ఫాదర్‌ని పిలిపిస్తారు. ఆ ప్రక్రియ ఫలించకపోగా ఆమె చనిపోతుంది. ఫాదర్ మీద హత్యానేరం మోపి పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ తర్వాత జరిగే కోర్టు కేసే చిత్రకథ. ఇలాంటి కేసులు కోర్టులో తేలుతాయా? నిజానికి ఇలాంటి కేసు ఒకటి జర్మనీలో విచారణ చేశారు. ఆ కేసు స్ఫూర్తితోనే ఈ చిత్రం రూపొందించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. హిందీ శబ్దానువాదం కూడా అందుబాటులో ఉంది.

కేసులో ప్రాసిక్యూషన్ తరఫు లాయరు ఈథన్ కూడా ఒక దైవభక్తి ఉన్న క్రిస్టియనే. మతవిశ్వాసాలు ఉన్న వ్యక్తిని పెడితే ఫాదర్‌కి వ్యతిరేకంగా వాదించగలడా? మతవిశ్వాసాలుంటే ఎక్సర్సిజం లాంటి ప్రక్రియలని నమ్మాలని లేదు కదా? నమ్మినా ఈ కేసులో అది సరిగా చేయలేదని వాదించవచ్చు. ఫాదర్‌కి వ్యతిరేకంగా ఒక దైవభక్తి ఉన్న లాయరుని పెడితేనే నిష్పాక్షిక విచారణ జరిగిందని ప్రజలు నమ్ముతారని ప్రభుత్వం ఆలోచన. నేరం ఒప్పుకుంటే ఫాదర్‌కి శిక్ష తగ్గిస్తామని చెబుతారు. కానీ ఫాదర్ ఎమిలీ కథ అందరికీ తెలియాలి అంటాడు. తాను జైలుకి వెళ్ళినా పర్వాలేదంటాడు. నేరం ఒప్పుకోకపోవటం వల్ల ఆయనకి బెయిల్ కూడా మంజూరు కాదు. చర్చివారు ఆయన కోసం డిఫెన్సు లాయరుని నియమిస్తారు. వారే ఆమెకి ఫీజు కూడా ఇస్తారు. ఆమె పేరు ఎరిన్. ఆమె ఇటీవలే ఒక హంతకుడిని విడిపించింది. అలాంటి వారికి చర్చివారు కేసు ఎందుకు ఇచ్చారు? వారికి తమ ప్రతిష్ఠ ముఖ్యం. దానికి తెలివైన లాయరు కావాలి. ఫాదర్‌ని నేరం తనదే అని ముందే ఒప్పుకునే లాగైనా చేయాలి లేక విచారణ జరిగితే ఫాదర్‌ని సాక్ష్యం చెప్పకుండా చేయాలి. ఇదీ ఎరిన్ పని. ఫాదర్ సాక్ష్యం ఎందుకు చెప్పకూడదు? ఆయన ఏం చెబితే ఏం జరుగుతుందో అని చర్చి వారి భయం. దేవుడిని నమ్మటం వల్లే ఎమిలీ మరణించిందని ప్రజలు అనుకుంటే పరువు నష్టం. మతగురువులకి కూడా స్వార్థం ఉంటుంది మరి. ఎరిన్‌కి కూడా స్వార్థం ఉంది. ఈ కేసు చర్చివారి ప్రతిష్ఠకి భంగం కలగకుండా ముగిస్తే ఆమె పని చేసే ఫర్మ్‌లో ఆమెని భాగస్వామిని చేస్తారు. అయితే ఆమె నాస్తికురాలు.

ఫాదర్ ముందు ఎరిన్‌ని లాయరుగా అంగీకరించడు. ఆమె నాస్తికురాలు కాబట్టి. ఆమె తెలివైనది. “మీకు ఏం కావాలి?” అని అడుగుతుంది. “ఎమిలీ కథ అందరికీ తెలియాలి. ఆమె ఎందుకు చనిపోయిందో తెలియాలి. నేను చెబుతాను” అంటాడు ఫాదర్. “ఎక్సర్సిజం వల్లే ఆమె చనిపోయిందని చెబుతారా? మీ తప్పేనని చెబుతారా?” అంటుందామె. “కాదు” అంటాడు ఫాదర్. “అలాగైతే సరే. మీరు సాక్ష్యం చెప్పవచ్చు. కానీ మిగతా విషయాల్లో నాకు పూర్తి స్వతంత్రం ఇవ్వండి” అంటుందామె. ఫాదర్ ఒప్పుకుంటాడు. ఎరిన్ ఎమిలీ ఇంటికి వెళుతుంది. ఎమిలీ తల్లితో మాట్లాడుతుంది. ఇంట్లో చాలా పిల్లులు ఉంటాయి. ఎమిలీ వీధిలో అనాథలుగా ఉన్న పిల్లులను ఇంటికి తెచ్చేది. ఆమె చిన్నప్పుడు ఆనందంగా ఉండేది. దూరంగా ఉన్న కాలేజీకి వెళ్ళాక ఆమె కష్టాలు మొదలయ్యాయి.

విచారణ మొదలవుతుంది. ప్రాసిక్యూషన్ లాయరు ఈథన్ జ్యూరీ సభ్యులతో “ఫాదర్ వైద్యం మానిపించి ఎక్సర్సిజం చేయటం వల్లే ఎమిలీ మరణించింది. దీన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం” అంటాడు. సాక్షుల కథనాలలో ఎమిలీ కాలేజీకి వెళ్ళిన కొన్ని రోజులకి ఏం జరిగిందో తెలుస్తుంది. ఆమె హాస్టల్‌లో ఉండేది. ఆమె ఒక రాత్రి ఏదో కాలుతున్న వాసన రావటంతో మేల్కొంది. ఆమె దుప్పటి ఆమెపై నుంచి కిందకి దానంతట అదే కదిలినట్టు, ఆమె మీద ఎవరో ఎక్కినట్టు, గొంతు ఎవరో నులిమినట్టు అనిపించింది. కదలలేకుండా ఉండిపోయింది. కాసేపటి తర్వాత కదలగలిగింది. డాక్టరు ఆమెకి ఫిట్స్ వచ్చాయని తేల్చాడు. ఫిట్స్ వల్ల ఆమెకి ఎవరో ఏదో చేసినట్టు అనిపించి ఉండవచ్చని డాక్టరు అంటాడు. ఆమె మెదడు స్కాన్ చేసి చూస్తే మూర్ఛరోగం ఉండే అవకాశాలు కనిపించటంతో గాంబుట్రాల్ అనే మందు ఇచ్చాడు. కొన్నాళ్ళకి ఫాదర్ సలహా మేరకు ఆమె మందు తీసుకోవటం మానేసింది. దాని వల్లే ఆమె మరణించిందని డాక్టరు అంటాడు.

ఎరిన్ డాక్టరుని ప్రశ్నలు వేస్తుంది. “మూర్ఛరోగం ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అంటే అది మూర్ఛరోగం కాకపోయి ఉండొచ్చుగా” అంటుంది. “అవును” అంటాడు డాక్టరు. “ఆమెకి వస్తువులు వాటంతట అవే కదిలినట్టు, తన మీద ఎవరో ఎక్కినట్టు అనిపించిందంటే అది సైకోసిస్ అయి ఉండవచ్చా?” అంటుందామె. “అయి ఉండవచ్చు” అంటాడు డాక్టరు. “మరి మూర్ఛరోగానికి ఇచ్చే గాంబుట్రాల్ వేరే రోగానికి ఇవ్వటం కరెక్టు కాదుగా? ఫాదర్ ఆ మందు ఆపమనటం తప్పు కాదుగా” అంటుందామె. డాక్టరు అవాక్కయి ఉండిపోతాడు. లాయర్లు ఎంత సునిశితమైన బుద్ధి కలిగి ఉంటారో అర్థమవుతుంది. విషాదమేమిటంటే చాలా వరకు లాయర్లు ఈ బుద్ధిని దుర్వినియోగం చేస్తారు. ఎరిన్ కూడా తన తెలివితో గతంలో ఒక హంతకుడిని విడిపించింది. ఒక సందర్భంలో ఎరిన్ స్వయంగా “ఆ హంతకుడిని సాక్ష్యం చెప్పమని బోనులో నిలబెట్టి ఉంటే అతనికి మరణశిక్ష పడేది” అంటుంది. డిఫెన్సు లాయరు ముద్దాయిని బోనులో నిలబెట్టకపోతే ప్రాసిక్యూషన్ లాయరు అతన్ని ఏమీ అడగకూడదని నియమం. అందుకే చర్చి వారు ఫాదర్‌ని బోనులో నిలబెట్టవద్దని కోరారు. ఇది వింత నియమంలా అనిపించవచ్చు. కానీ ముద్దాయిని విచారించకుండా కేవలం సాక్షులని విచారించి కేసుని తేల్చటానికి కూడా అమెరికాలో న్యాయవ్యవస్థ అనుమతిస్తుంది.

ఎమిలీకి తన మీద అదృశ్యంగా దాడి జరిగినట్టు అనిపించినది రాత్రి మూడు గంటలకి. కేసు మొదలయ్యే ముందురోజు ఎరిన్ చేతి వాచీ రాత్రి మూడుగంటలకి ఆగిపోతుంది. కేసు మొదటి రోజు ముగిశాక ఫాదర్ ఎరిన్‌ని హెచ్చరిస్తాడు. “ఈ కేసు చుట్టూ దుష్టశక్తులు తిరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండు” అంటాడు. ఆమె తేలికగా తీసిపారేస్తుంది. చిత్రం ద్వితీయార్థంలో ఫాదర్ ఒక విషయం చెబుతాడు. రాత్రి మూడు గంటలకి దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. క్రీస్తు మరణించినది మధ్యాహ్నం మూడు గంటలకి కాబట్టి క్రైస్తవులని అవహేళన చేయటానికి దుష్టశక్తులు రాత్రి మూడు గంటలకి తమ ప్రభావం చూపిస్తాయని అంటాడు. ప్రస్తుతంలోకి వస్తే ఎరిన్ విడిపించిన హంతకుడు మళ్ళీ హత్య చేశాడని వార్త వస్తుంది. ఆ రాత్రి ఎరిన్ పడుకుని ఉండగా మూడు గంటలకి ఎరిన్‌కి ఏదో కాలుతున్న వాసన వస్తుంది. గోడ గడియారం ఆగిపోతుంది. తలుపు దానంతట అదే తెరుచుకుంటుంది. ఆమెని భయం ఆవహిస్తుంది. ఇది నిజంగా దుష్టశక్తుల పనా లేక హంతకుడిని కాపాడినందుకు ఎరిన్ కలతనిద్రలో కలగంటోందా? అదే సమయంలో జైల్లో ఉన్న ఫాదర్‌కి ఏవో నీడలు కనపడతాయి. ఆయన ప్రార్థన చేస్తాడు.

కోర్టులో మెడికల్ ఎగ్జామినర్ సాక్ష్యం చెబుతాడు. ఎమిలీకి ఫిట్స్ వల్ల కొన్ని తీవ్ర గాయాలయ్యాయని, స్వయంగా కూడా గాయాలు చేసుకుందని, ఆ పైన సరిగా ఆహారం తీసుకోకపోవటం వల్ల పరిస్థితి విషమించి మరణించిందని చెబుతాడు. ఎమిలీకి మూర్ఛరోగం వల్ల సైకోసిస్ వచ్చిందని, గాంబుట్రాల్ వాడితే పరిస్థితి విషమించేది కాదని అంటాడు. తానైతే ఆమెకి షాక్ ట్రీట్‌మెంట్ కూడా ఇచ్చేవాడినని అంటాడు. “ఆమెకి ఇష్టం లేకపోయినా షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చేవారా?” అని ఎరిన్ అడిగితే “ఆమె ప్రాణం కాపాడటానికి నిస్సందేహంగా ఇచ్చేవాడిని” అంటాడు. ఎరిన్ ఏమీ మాట్లాడలేక ఉండిపోతుంది. ఆమెకి ఇప్పుడు ఒక డాక్టరు సాక్ష్యం అవసరం. ఎమిలీకి ఏ జబ్బూ లేదని చెప్పే డాక్టరు కావాలి. అలాంటి డాక్టరుని వెతికి పట్టుకోమని తన అసిస్టెంటుని తొందరపెడుతుంది.

తర్వాత ఎమిలీ బాయ్‌ఫ్రెండ్ సాక్ష్యం చెబుతాడు. ఎమిలీ హాస్పిటల్లో ఉండగా ఆమెకి తనని దుష్టశక్తులు ఆవహించినట్టు అనుభూతి కలిగిందని చెబుతాడు. ఆమెకి క్లాసులో ఇతర విద్యార్థుల ముఖాలు, దారిన పోయేవారి ముఖాలు భయంకరంగా కనపడటం మొదలయింది. ఆమెకి చర్చిలో కూడా కొందరి ముఖాలు అలా కనపడ్డాయి. ఆమె శరీరం వంకర్లు తిరగటం ఆమె బాయ్‌ఫ్రెండ్ పలుసార్లు చూశాడు. దుష్టశక్తులు ఆమెని ఆహారం తినకుండా అడ్డుకునేవని చెబుతాడు. ఆమె తండ్రి సాక్ష్యం చెబుతూ ఎమిలీని ఇంటికి తీసుకువచ్చాక ఆమె మిడతల లాంటి పురుగుల్ని తినటం తన చిన్న కూతురు చూసిందని చెబుతాడు. ఫాదర్‌ని తొలిసారి చూసినపుడు ఆమె ల్యాటిన్ భాషలో “నేను మనిషి అంతరాంతరాలో నివసిస్తాను. నన్ను పారద్రోలటం నీ తరం కాదు” అందని చెబుతాడు. ఎట్టకేలకు ఎరిన్‌కి దుష్టశక్తుల ఆవాహన మీద పరిశోధన చేసిన ఒక ప్రొఫెసర్ దొరుకుతుంది. ఆమె తన పరిశోధనలో బయటపడిన విషయాలు చెప్పటానికి వస్తుంది.

ఈ కేసులో ముఖ్యమైన ప్రశ్న దుష్టశక్తులు ఉన్నాయా లేదా అని కాదు. ఫాదర్ దుష్టశక్తులు ఉన్నాయని నమ్మాడు. తనకి తెలిసిన రీతిలో ఎమిలీని కాపాడటానికి ప్రయత్నించాడు. అలా చేసినపుడు ఆమె చనిపోతే ఆయన హంతకుడవుతాడా? దుష్టశక్తులను నమ్మనివారు కూడా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. ముద్దాయి ఉద్దేశం ముఖ్యం. ఆయన హత్య చేసే ఉద్దేశంతో ఎక్సర్సిజం చేయలేదు. మరి ఆయనది తప్పా? చట్టం దృష్టిలో తప్పే అవుతుంది. చట్టం వైద్యశాస్త్రాన్ని నమ్ముతుంది. దుష్టశక్తులని, ఎక్సర్సిజాన్ని నమ్మదు. నమ్మకపోతే దుష్టశక్తులు నిజం కాకుండా పోతాయా? అలాగైతే దేవుడిని కూడా చాలామంది నమ్మరు. దేవుడు లేడని అనగలమా? దుష్టశక్తులని నమ్మని కోర్టులు బైబిలు మీద, భగవద్గీత మీద ప్రమాణం ఎందుకు చేయిస్తాయి? ఇవి చాలా క్లిష్టమైన ప్రశ్నలు.

ఈ చిత్రానికి స్కాట్ డెరిక్‌సన్ దర్శకత్వం వహించాడు. ఎరిన్‌గా లారా లిన్నీ, ఫాదర్‌గా టామ్ విల్కిన్‌సన్, ఎమిలీగా జెన్నిఫర్ కార్పెంటర్ నటించారు. స్థితప్రజ్ఞుడైన ఫాదర్‌గా టామ్ నటన మనసుకి హత్తుకుంటుంది. అతన్ని ఏ కష్టమూ క్రుంగదీయలేదు. ఒక పాత్ర చనిపోయిందని తెలిసినపుడే అతను దుఃఖిస్తాడు. ఎమిలీగా జెన్నిఫర్ నటన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అలా నటించాలంటే ఎంతో కష్టం.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

సాక్ష్యం చెప్పటానికి వచ్చిన ప్రొఫెసర్ పేరు సారా. ఆమె ఎమిలీ కేసు వివరాలు పరిశీలించింది. “ఎమిలీ అతి సున్నితమైన మనస్సు గల అమ్మాయి. అలాంటి వారికి సాధారణ వ్యక్తులకి కనిపించనివి కనిపిస్తాయి. భవిష్యద్దర్శనాలు కలగవచ్చు. ఆత్మలు కనిపించవచ్చు. శిష్టాత్మలైనా, దుష్టాత్మలైనా వారిని ఆవహించటం తేలిక. ఎమిలీని చేసిన ఎక్సర్సిజం విఫలమవటానికి ఆమెకిచ్చిన గాంబుట్రాల్ మందు కారణం. ఆ మందు వల్ల ఆమె మెదడు ఎక్సర్సిజం ద్వారా అందే అతీంద్రియమైన షాక్‌ని అందుకోలేకపోయింది. ఆ మందు వల్లే మరణించింది” అంటుందామె. డాక్టర్లు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలనుకున్నారు. గాంబుట్రాల్ కొనసాగించకపోవటం వల్ల ఎమిలీ మరణించిందని అన్నారు. ఎక్సర్సిజం కూడా ఒక విధమైన షాకే అని ప్రొఫెసర్ అంది. గాంబుట్రాల్ ఇచ్చినందువల్ల ఎమిలీ మరణించిందని అంది. ఆవాహనల మీద పరిశోధన చేసిన ప్రొఫెసర్ మాటలని ఎవరూ తోసివేయలేరు. ఇదే విషయాన్ని జడ్జి కూడా అంటుంది. ప్రాసిక్యూషన్ లాయరు ప్రొఫెసర్ సాక్ష్యాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే జడ్జి “వైద్యులు చెప్పిన సాక్ష్యం విన్నాం కదా. ఆవాహనల గురించి జీవితాంతం పరిశోధించిన ప్రొఫెసర్ సాక్ష్యం కూడా వినటం మన ధర్మం” అంటుంది. జడ్జీలు నిష్పాక్షికంగా ఉంటేనే ఏ న్యాయవ్యవస్థయినా పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు జ్యూరీ సభ్యులు ఎవరు చెప్పినది నిజమో తేల్చాలి. అమెరికా న్యాయవ్యవస్థలో జడ్జీలు కేవలం పర్యవేక్షణ చేస్తారు. తీర్పు జ్యూరీ సభ్యులే ఇవ్వాలి. వారేం చెబితే అదే తీర్పు.

ఎరిన్ అసిస్టెంటు ఒక విషయం కనుగొంటాడు. ఎమిలీకి ఎక్సర్సిజం జరిగినపుడు ఒక డాక్టరు కూడా ఉన్నాడు. ఫాదర్ కోరిక మీద అతను వచ్చాడు. అతను ఫాదర్ గతంలో పని చేసిన చర్చిలో సభ్యుడిగా ఉండేవాడు. ఎరిన్ అతన్ని కలుసుకుంటుంది. “ఎమిలీది మూర్ఛరోగమూ కాదు, సైకోసిస్సూ కాదు. ఆ వ్యాధుల పేషెంట్లని చాలామందిని చూశాను. ఎప్పుడూ భయపడలేదు. ఎమిలీని చూసి భయం వేసింది. ఆమెకి తనని దుష్టశక్తులు ఆవహించాయని స్పష్టంగా తెలుసు. మానసికవ్యాధి ఉన్నవారికి తమకి మానసికవ్యాధి ఉందని తెలియదు. ఎమిలీ పరిస్థితి చూశాక నేను మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. సాక్ష్యం చెప్పటానికి వస్తాను” అంటాడు. ఈ డాక్టరు సంగతి ఫాదర్ ఎరిన్‌కి ఎందుకు చెప్పలేదు? అతను ఫాదర్‌ని తన సంగతి ఎవరికీ చెప్పొద్దని కోరాడు. ఇప్పుడు కేసు ఎటూ తేలని స్థితిలో ఉంది. అతని సాక్ష్యం ఫాదర్‌కి ఉపయోగపడుతుంది. అయితే దుష్టశక్తులు అతన్ని వదిలిపెడతాయా?

ఫాదర్ తనని సాక్ష్యం చెప్పటానికి ఎప్పుడు బోనులోకి పిలుస్తావని ఎరిన్‌ని అడుగుతాడు. “చర్చివారు మిమ్మల్ని సాక్ష్యం చెప్పనివ్వద్దని అన్నారు. వారి ప్రతిష్ఠకి భంగం కలుగుతుందని వారి భయం. కానీ మిమ్మల్ని విడిపించటమే వారి ప్రతిష్ఠకి భంగం కలగకుండా చూసే ఏకైక మార్గం కాబట్టి నేను వారి మాటలు వినదలుచుకోలేదు” అంటుంది ఎరిన్. ఫాదర్ సాక్ష్యం చెబుతాడు. ఎక్సర్సిజం జరిగిన రోజు ఏం జరిగిందనేది టేపులో రికార్డయి ఉంటుంది. ఆ టేపు ఇన్నాళ్ళూ ఫాదర్ స్నేహితుడైన డాక్టరు దగ్గర ఉంది. అతను ఎరిన్‌కి ఇచ్చాడు. ఆరోజు ఎమిలీ అనేక భాషలు మాట్లాడింది. ఉన్మాదిలా ప్రవర్తించింది. తనకి కట్టిన బంధనాలకి తెంచుకుంది. తండ్రిని కొట్టింది. తాను సైతానునని అంది. ఒకేసారి రెండు స్వరాలలో మాట్లాడింది. ఇదంతా ఫ్లాష్‌బ్యాక్ లాగా మనకి చూపిస్తాడు చిత్రదర్శకుడు. ఎమిలీగా నటించిన జెన్నిఫర్ కార్పెంటర్ నటన ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. దుష్టశక్తుల ప్రభావం బలంగా ఉండటంతో ఎక్సర్సిజం విఫలమయిందని ఫాదర్ అంటాడు.

ఆ తర్వాత ఎమిలీ తనని తాను గాయపరుచుకోవటం మొదలయింది. ఇదంతా దుష్టశక్తుల ప్రభావమే అని ఫాదర్ అభిప్రాయం. ఫాదర్ రోజూ ఎమిలీని చూడటానికి వెళ్ళేవాడు. మరోసారి ఎక్సర్సిజం చేస్తానని ఫాదర్ అంటే ఎమిలీ నిరాకరించింది. ఆహారం తీసుకుంటే వాంతి అయిపోయేది. ఎక్సర్సిజం జరిగినపుడు కూడా ఆమె గాంబుట్రాల్ వాడుతోంది. అయినా ఆమెలో మొదలయిన విపరీత లక్షణాలు ఆరోజే ఎక్కువ కనిపించాయి. కాబట్టి గాంబుట్రాల్ వల్ల తనకి ఏం ప్రయోజనం లేదని ఎమిలీ ఫాదర్‌కి చెప్పింది. ఫాదర్ గాంబుట్రాల్ వాడవద్దని చెప్పాడు. “ఆమెకి దేవుడి మీద ఉన్న నమ్మకం సాయంతోనే దీన్ని తట్టుకోవాలని నిర్ణయించాం” అంటాడు ఫాదర్. తర్వాత ప్రాసిక్యూషన్ లాయరు ఫాదర్‌ని ప్రశ్నిస్తాడు. ఎమిలీకి చర్చిలో ప్రత్యేక శిక్షణ సమయంలో అనేక ప్రాచీన భాషలు నేర్పించారని, ఆమెకి స్కూల్లో జర్మన్ నేర్పించారని అంటాడు. కాబట్టి ఆమె ఎక్సర్సిజం సమయంలో అనేక భాషలు మాట్లాడటం వింత కాదని అంటాడు. ఏ మనిషికైనా రెండు స్వరతంతువులు ఉంటాయని, ఒకేసారి రెండు స్వరాలలో మాట్లాడటం అసాధ్యమేమీ కాదని అంటాడు. ఫాదర్ నిజాయితీగా తనకి వాటి గురించి తెలియదని అంటాడు.

ఫాదర్ తాను జైలుకి వెళ్ళినా పర్వాలేదని అంటాడు. మరి ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? ఆయన చెప్పదలచుకున్నది చెప్పేయవచ్చు కదా. అది తర్వాత చెబుతాడు. చిత్రంలో ఇది ఒక చిన్న లోపమని నాకు అనిపించింది. ఆయన చెప్పాలనుకున్నది, ఎమిలీకి అనుభవమైనది నేరమూ శిక్షకి సంబంధించినది కాదు. దేవుడికీ, దుష్టశక్తులకి సంబంధించినది. మరి దేవుడు ఎమిలీకి ఇంత కష్టం ఎందుకు కలిగించాడు? దానికి కూడా సమాధానం చిత్రం చివర్లో ఉంటుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

ఫాదర్ స్నేహితుడైన డాక్టర్ సమయానికి కోర్టుకి రాకపోవటంతో జడ్జిని అనుమతి అడిగి ఎరిన్ అతన్ని కలుసుకోవటానికి వెళుతుంది. డాక్టర్ తాను రాలేనని అంటాడు. “ఆ దుష్టశక్తులు ఏం చేయగలవో నాకు తెలుసు” అంటాడు. మాట్లాడుతుండగానే ఎవరినో చూసి భయపడినట్టు అతని ముఖం పాలిపోతుంది. భయంతో వెనక్కి అడుగులేస్తాడు. అటుగా వచ్చిన కారు గుద్దటంతో మరణిస్తాడు. మరోపక్క ఎమిలీ బాస్ ఆమెని చీవాట్లేస్తాడు. “ఫాదర్‌ని బోనులో నిలబెట్టొద్దని చెప్పినా నువ్వు వినలేదు. అయినా నిన్ను మార్చటం చర్చివారికి ఇష్టం లేదు. భయపడుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఫాదర్‌ని బోనులో నిలబెడితే నీ ఉద్యోగం ఊడిపోతుంది” అంటాడు. ఎరిన్‌కి దెబ్బ మీద దెబ్బ. ఇదంతా దుష్టశక్తుల ప్రభావమేనా?

ఫాదర్ తాను ఎమిలీ చెప్పదలచుకున్నది కోర్టులో చెబుతానని అంటాడు. ఎమిలీ తన అనుభవాలని రాసుకుంది. ఆ కాగితాలు ఫాదర్‌కి ఇచ్చింది. ఆమె ఎక్సర్సిజం విఫలమైన రాత్రి ఆమెకి ఒక పిలుపు వినిపించింది. ఆమె మైదానంలోకి వెళితే అక్కడ మరియ మాత కనపడింది. “ఆ దుష్టశక్తులు నిన్ను వదలవు. నీకు కావాలంటే ఇప్పుడే ఈ దేహం నుంచి విముక్తి ప్రసాదిస్తాను లేదా నువ్వు ఇలాగే ఉండవచ్చు. ఇలాగే ఉంటే నీకు అంతులేని వేదన కలుగుతుంది. కానీ నీ ద్వారా అందరికీ ఒక అలౌకిక ప్రపంచం ఉందనే నిజం తెలుస్తుంది. ఏం కావాలో నువ్వే ఎంచుకో” అంటుంది. ఎమిలీ “నేను ఇలాగే ఉంటాను” అంటుంది. ఆమె ఇంకా ఇలా రాసుకుంది. “దేవుడు మరణించాడని ప్రజలు అనుకుంటున్నారు. కానీ సైతాను ఉన్నాడని నేను నిరూపిస్తే అలా ఎలా అనుకుంటారు?” దేవుడు ఉన్నాడని నిరూపించటానికి ఆమె సైతానుని ఆహ్వానించింది. ఎంతో వేదన అనుభవించింది. అన్ని మతాలలోనూ ఇలాంటి ఉదంతాలు ఉంటాయి. హిందూ మతంలో తపస్సు గురించి చెప్పారు. శరీరాన్ని సాధనంగా వాడి తపస్సు చేస్తారు. ఎన్నో కష్టాలు భరిస్తారు. క్రైస్తవ మతంలో క్రీస్తు మరణాన్నే ఆహ్వానించాడు. అదే దారిలో ఎమిలీ మరణాన్ని ఆహ్వానించింది. శిలువ వేసినపుడు క్రీస్తుకి అయిన గాయాలు ఆమె అరచేతుల మీద, పాదాల మీద కనిపిస్తాయి. అంటే దేవుడు ఆమెని తాకాడు.

భగవంతుడి కరుణ లేకుంటే ఈ ప్రపంచం ఇలా ఉండదు. కానీ చాలా మంది తమ ప్రతిభ వల్లనే ఈ ప్రపంచం నడుస్తోందని అనుకుంటారు. బాధ వస్తే దేవుడు లేడు కాబట్టే ఇలా జరిగింది అంటారు. సైతాను ఉన్నాడని చూపిస్తే దేవుడు ఉన్నాడని నమ్మకం కలుగుతుందా? ఎవరికైనా మంచి జరిగితే దేవుడు ఉన్నాడని అనుకోరు. కానీ ఎవరికైనా అంతులేని వేదన కలిగితే, దానికి సహేతుకమైన వివరణ లేకపోతే సైతాను పని తెలుస్తుంది. ఎమిలీ చిత్రహింసలు పడి మరణిస్తే గానీ సైతాను శక్తి ఏమిటో తెలియదు. సైతాను ఉనికి నిజమైతే దానికి వ్యతిరేకమైన శక్తి కూడా కచ్చితంగా ఉండాలి. ఎమిలీ కోలుకుని ఉంటే ఈ సందేశం అంత ప్రభావవంతంగా ఉండేది కాదు. దేవుడున్నాడని నిరూపించటానికి దేవుడి ఆదేశం మేరకే ఎమిలీ మరణించింది. అది చెప్పాలనే ఫాదర్ కోర్టులో నిలబడ్డాడు. అతని మీద కేసు పెట్టకపోతే వేరేలా ఆ సందేశం వ్యాప్తి చేసేవాడు.

చివరికి ఏమైందనేది అంత ముఖ్యం కాదు. ఎందుకంటే ఫాదర్ తను చెప్పదలచుకున్నది చెప్పాడు. ప్రజలందరికీ ఎమిలీ ఇచ్చిన సందేశం తెలుస్తుంది. “ఎమిలీ ఒక సాధ్వి అని త్వరలోనే అందరూ గుర్తిస్తారు” అంటాడు ఫాదర్. అయితే కేసు ఏమైందనేది చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. జ్యూరీ సభ్యులు ఫాదర్‌ని దోషిగా నిర్దారిస్తారు. జ్యూరీలో సభ్యుల అభిప్రాయాలను బట్టే తీర్పు ఉంటుంది. అయితే వారు ఫాదర్ అప్పటికే అనుభవించిన జైలు శిక్ష చాలని సిఫార్సు చేస్తారు. జడ్జీ ఒప్పుకుంటుంది. “మీరు దోషి. మీరు ఇంటికి వెళ్ళవచ్చు” అంటుంది. ఫాదర్ నిర్లిప్తంగా ఉంటాడు. దేవుడి తీర్పు మాత్రమే ముఖ్యమని అతని విశ్వాసం. దేవుడిని నమ్మినవారు ఇలాగే ఉంటారు. ఎరిన్ బాస్ ఆమెని పొగుడుతాడు. చర్చివారు ఆనందంగా ఉన్నారని చెబుతాడు. “నిన్ను ఫర్మ్‌లో భాగస్వామిని చేస్తాను” అంటాడు. నిజానికి ఆమె అతని ఆదేశాలను బేఖాతరు చేసింది. అయినా శిక్ష తప్పించింది కాబట్టి అతను ఆమెని పొగుడుతున్నాడు. ఆమె వద్దంటుంది. దీనికి కారణం అతను ఆమెని అవమానించటం అనిపిస్తుంది కానీ నాకు మాత్రం ఆమెకు ఆ ఫర్మ్‌లో ఉండి బాస్ చెప్పినట్టల్లా దుర్మార్గుల తరఫున వాదించటం ఇక ఇష్టం లేదని అనిపించింది. ఆమెకి కూడా దేవుడి మీద నమ్మకం కలిగింది. ఎవరికైనా చివరికి ఆధ్యాత్మికతే శరణ్యం.

Exit mobile version