Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బ్రహ్మచర్యంతో ప్రయోగం ‘ది డ్రై సీజన్’

[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా మెలిస్సా ఫెబోస్ రాసిన ‘ది డ్రై సీజన్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]

మెలిస్సా ఫెబోస్ రాసిన ‘ది డ్రై సీజన్’ ప్రశంసలు పొందిన ఆమె స్వీయగాథకు ఒక అద్భుతమైన అదనపు కూర్పు. బ్రహ్మచర్యంలో గడిపిన సంవత్సరం కాలంలో జరిపిన నిష్కపటమైన, మేధోపరంగా కఠినమైన అన్వేషణను వెల్లడిస్తుంది ఈ రచన. ఈ పుస్తకంలో రచయిత్రి తన దృష్టిని సెక్స్, రొమాన్స్ డ్రామాల నుండి తప్పించి, నిశ్శబ్దమైన, తక్కువ అల్లకల్లోలమైన ఏకాంతం, ఇంకా స్వీయ-పరిశీలన వైపు మళ్ళిస్తారు. రెండు సంవత్సరాల వినాశకరమైన సంబంధాన్ని తెంచుకున్న తరువాత ఈ కథనం అల్లుకున్నారు రచయిత్రి, ఆ తర్వాత ఆమె – డేటింగ్, సెక్స్ నుండి తనంతట తాను విధించుకున్న విరామంలోకి వెళ్ళారు – ‘విచ్చలవిడి’ శృంగారానికి అలవాటుపడిన వ్యక్తి విషయంలో, ఈ నిర్ణయం తీవ్రమైనది; పరివర్తన కలిగించేదిగా నిరూపించబడుతుంది. ఈ ఆధారాంశం, స్పష్టంగా సరళంగా ఉన్నప్పటికీ, వాంఛ, గుర్తింపు, ఇంకా మన అత్యంత సన్నిహిత ఎంపికలను రూపొందించే సోషల్ స్క్రిప్ట్‌ల సూక్ష్మ విచారణకు ఆధారతలం అవుతుంది.

మెలిస్సా ఫెబోస్

వ్యక్తిగత కథనాన్ని సాంస్కృతిక విమర్శతో మిళితం చేయగల రచయిత్రి సామర్థ్యం ఈ పుస్తకపు గొప్ప బలాలలో ఒకటి. ఆమె తన ప్రయాణాన్ని రచయితలు, ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు అయిన మహిళల విస్తృత క్రమంలో కొనసాగిస్తారు – వారు కర్తృత్వాన్ని, సృజనాత్మక దృష్టిని తిరిగి పొందే మార్గంగా – ఏకాంతాన్ని లేదా సంయమనాన్ని ఎంచుకున్నారు. రచయిత్రి – వర్జీనియా వూల్ఫ్, సప్ఫో, బెగ్యూన్స్ వంటి వ్యక్తులపై దృష్టి సారించి వారి కథలను తన కథలుగా అల్లుకున్నారు, తద్వారా ఆమె వ్యక్తిగత అనుభవాన్ని స్త్రీవాద స్వయంప్రతిపత్తిపై మననంగా మారుస్తారు. ఈ మేదోవిధానం జ్ఞాపకాలను సుసంపన్నం చేస్తుంది, పాఠకులకు చారిత్రక కొనసాగింపుని, సంఘీభావాన్ని అందిస్తుంది, అయినప్పటికీ ఫెబోస్ స్వరం స్పష్టంగా సమకాలీనంగా, వ్యక్తిగతంగా ఉంటుంది.

నిర్మాణాత్మకంగా, ‘ది డ్రై సీజన్’ లో రచయిత్రి లక్షణాలైన ఖచ్చితత్వం, ఆత్మాశ్రయ పద్ధతి ప్రస్ఫుటమవుతాయి. ఒకప్పుడు ‘విప్ స్మార్ట్’, ‘అబాండన్ మీ’ వంటి మునుపటి రచనలలో లైంగిక కార్యకలాపాల, వ్యసనాల అన్వేషణని ప్రదర్శించినట్లుగా కాకుండా, అంతే తీవ్రతతో ఈ పుస్తకం కోసం తన అంతరంగాన్ని అదుపు చేస్తారామె. ఈ రచన విశ్లేషణాత్మకమైన పశ్చాత్తాప కథనం. దుర్బలత్వపు క్షణాలు, తాత్విక ప్రతిప్రతిఫలనం మధ్య ఊగిసలాడుతుంది. ఫెబోస్ తన స్వంత ఉద్దేశాలను ప్రశ్నించడానికి ఇష్టపడటం – ప్రేమ చిక్కుల్లో పడటం లోని ఒత్తిడి, తన స్వీయ-విధ్వంసక విధానాలు – పుస్తకానికి అరుదైన నిజాయితీని కల్పించాయి. ఆమె ఎంచుకున్న ఏకాంతం లోని బాధని, అసౌకర్యాన్ని, అలాగే అదిచ్చే ఊహించని ఆనందాలని, స్వేచ్ఛలను కూడా ఆమె అంగీకరిస్తారు.

విమర్శనాత్మకంగా చూస్తే, ఈ స్వీయగాథ యొక్క అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే, బ్రహ్మచర్యంపై ఒక నిర్దేశిత గ్రంథంగా లేదా యాంటీ-సెక్స్ మానిఫెస్టోగా చదవబడే అవకాశం ఉంది. అయితే ఫెబోస్ ఈ వివరణను అంగీకరించరు, తన సంయమనం – సిగ్గు లేదా త్యజించడంలో స్థిరపడలేదని; స్పష్టత, స్వీయ-స్వాధీనత అనే కోరికలో ఉందని స్పష్టం చేస్తారామె. ఈ పుస్తకం శృంగారం లేకపోవడం గురించి తక్కువగా మాట్లాడి, స్వీయ ఉనికి గురించి ఎక్కువగా చెప్తుంది – వాంఛలను అణచివేసినప్పుడు ఏం ఉద్భవిస్తుంది, దాన్ని దాని అసలురూపంలో ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కోణంలో, ‘ది డ్రై సీజన్’ అనేది లేనివాటి గాథ కాదు, కానీ –  ఏకాంతం, స్నేహం, సృజనాత్మక కార్యకలాపాలలోని ఆనందం యొక్క కొత్త రూపాలను కనుగొనడంలో లభించే ఘనమైన సమృద్ధి యొక్క కథనమని ఫెబోస్ అంటారు.

అయితే, పుస్తకం యొక్క అంతర్ముఖ దృష్టి కొన్నిసార్లు అజ్ఞాతత్వంపై ఆధారపడి ఉంటుంది. ఫెబోస్ తన సొంత మనస్సు లోతుల్లోకి వెళ్ళడం అద్భుతంగా, క్షుణ్ణంగా ఉన్నప్పటికీ – ఈ రచన కొంతమంది పాఠకులను బాహ్య ప్రపంచంతో విస్తృత సంబంధం కోసం ఆరాటపడేలా చేస్తుంది. ఫెబోస్ తన నుంచి తాను దూరంగా జరిగి, వెల్లడించిన అనేక వ్యక్తిగత విషయాలు; పితృస్వామ్యం, భిన్న సంప్రదాయవాదం, సాంస్కృతిక లేఖనంల మధ్య సంబంధాలను ఏర్పరుచుకున్నప్పుడు – ఈ రచన యొక్క అత్యంత ఆకర్షణీయమైన క్షణాలు పాఠకులకు అవగతమవుతాయి. కొన్నిసార్లు, రచనలోని అంతర్ముఖత్వం – రచన పరిధిని తగ్గించే ప్రమాదం ఉంది, కానీ రచయిత్రి మేధో ఉత్సుకత, తాదాత్మ్యం ఈ లోటు తెలియకుండా చేస్తాయి.

సంబంధాలలో పనితీరును పుస్తకం ప్రశ్నించడం మరొక ముఖ్యమైన అంశం. తన శృంగార జీవితంలో ఎంత భాగం కోరుకోవాలనే కోరికతో రూపుదిద్దుకుందో; స్త్రీత్వం, ఇంకా కోరికల స్థిరమైన ప్రదర్శనకు కోల్పోయిన తనలోని భాగాలను తిరిగి పొందేందుకు బ్రహ్మచర్యం ఎలా ఉపకరించిందో ఫెబోస్ వెల్లడిస్తారు. చిన్నవైనపప్పటికీ ప్రతీకాత్మక మార్పులు – హై హీల్స్ బదులుగా  స్నీకర్స్ వాడడం వంటివి – మళ్ళీ స్వీయ ఆవిష్కరణను కొనసాగించే చర్యలుగా మారతాయి, ఎందుకంటే ఫెబోస్ బాహ్య అంచనాల ద్వారా ఏర్పడిన తనకీ, వాటి నుండి వేరుగా ఉన్న తనకీ మధ్య తేడాను గుర్తించడం నేర్చుకుంటారు. శృంగారం పట్ల అమితాసక్తి ఉన్న సంస్కృతిలో, ఈ థీమ్ శక్తివంతంగా ప్రతిధ్వనిస్తుంది. ఏకాంతం, సొంత నిర్ణయాల అవకాశాలపై పాఠకులకు కొత్త దృక్పథాన్ని అందిస్తుంది.

మొత్తం మీద, ‘ది డ్రై సీజన్’ అనేది సమకాలీన జ్ఞాపకాలకు సంబంధించిన ఒక సాహసోపేతమైన, అవసరమైన రచన ఇది ఫెబోస్ యొక్క మేధోపరమైన దృఢత్వం, భావోద్వేగపు నిజాయితీ, సాహిత్య నైపుణ్యంతో విభిన్నంగా ఉంటుంది. బ్రహ్మచర్యంపై చేసిన ప్రయోగం మొదట్లో సముచితంగా అనిపించవచ్చు, కానీ పుస్తకం యొక్క నిజమైన విషయం మనల్ని నిరంతరం నిర్వచించడానికి ప్రయత్నించే ప్రపంచంలో ప్రామాణికంగా జీవించడంలోని సార్వత్రిక సవాలుని ప్రస్తావిస్తుంది. ఫెబోస్ ప్రయాణం గాఢమైనది, వ్యక్తిగతమైనది, ఇంకా విస్తృతంగా ప్రతిధ్వనించేది. వాంఛ, స్వేచ్ఛ, స్వార్థంతో వారి స్వీయ సంబంధాలను పునఃపరిశీలించమని పాఠకులను ఆహ్వానిస్తుంది. డై సీజన్‍లో రచయిత్రిని అనుసరించడానికి ఇష్టపడే వారికి, బహుమతులు పుష్కలంగా ఉంటాయి – ఎందుకంటే అది బ్రహ్మచర్యం కథను మాత్రమే కాకుండా, ఏకాంతంలో ఉండే ఆనందాలు, శక్తులకు ఋజువుని అందిస్తుంది.

***

Book Title: The Dry Season
Author: Melissa Febos
Published By: Canongate Books
No. of pages: 288
Price: Hardcover ₹1,649.00
Link to buy:
https://www.amazon.in/Dry-Season-Finding-Pleasure-Without/dp/1837260095/

Exit mobile version