Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెర మరుగైన మన సామెతలు

[భట్టు వెంకటరావు గారు రచించిన ‘తెర మరుగైన మన సామెతలు’ అనే రచనని అందిస్తున్నాము.]

‘సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు’ అని మనకు ఒక సామెత ఉంది. సందర్భోచితంగా సామెతలను జత చేసి చేయని సంభాషణ, ఇల్లాలు లేని ఇల్లులా, నిస్తేజంగా ఉంటుందని ఆ సామెత భావం. ఆ మాటకు తగినట్లుగానే వేల కొలదిగా సామెతలు/నానుడులు తెలుగు భాషకు అలంకారాలుగా ఉండి ఇప్పటికి ఒకటి రెండు తరాల క్రితం దాకా పండిత, పామరుల సంభాషణలలో వినబడి ఆహ్లాదపరుస్తూ ఉండేవి. ఆ స్థితి ఇప్పుడు లేదనడం సత్యదూరం కాదు. నిత్య వ్యవహారంలో పౌరుల సంభాషణలలో ఉపయోగించబడని కారణంగా ఎన్నో అర్థవంతమైన సామెతలు తెరమరుగైపోయి సంకలనాలకు పరిమితమైపోయాయి. పూర్వ కవుల కావ్యాలలోని పద్యాలలో ప్రయోగించబడి కనబడే సామెతలలో కొన్ని ఎంతగానో అర్థవంతమైనవిగా ఉండి, ‘ఇంత మంచి సామెతలను పోగొట్టుకుని – నిత్య వ్యవహారంలో దూరం చేసుకుని – భాషకు, భావ వ్యక్తీరణకు తీరని నష్టం కలిగించాము కదా!’ అన్న భావాన్ని ఇప్పటి తరం భాషాభిమానులకు కలిగిస్తాయి.

ఈ నేపథ్యంలో, పూర్వ కవుల కావ్యాలలో  ప్రయుక్తాలైన అలాంటి సామెతలు/నానుడులలోంచి కొన్ని ఉత్తమమైన, అర్థవంతమైన సామెతలను గుర్తించి ఒకసారి మననం చేసుకోవడం ఈ శీర్షిక ఉద్దేశం. ఇందులో మొదటిదిగా..

కప్ప అరుపు పాము

చం.
నిను నవలీల దాటి ప్రజ నేలకుఁ గోలకుఁ దెచ్చుచున్న య
ర్జునుఁ దలయెత్తి యైన నటు సూడవు పాండవ పక్షపాతి నీ
మన మటు గాన నెప్పుడును మాదెసఁ గప్ప యెలుంగుఁ బామ వై
యునికి యెఱుంగ వచ్చె; నటు లూఱట గా వర మిచ్చినాఁడవో?

తిక్కన మహాకవి రచించిన ఆంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, తృతీయాశ్వాసంలోని, 107 పద్యం పైది. సూర్యాస్తమయం లోపల సైంధవుడిని యమపురికి పంపుతానని శపథం చేసిన అర్జునుడు శ్రీకృష్ణుని తోడుతో కదనరంగంలో వీరవిహారం చేస్తుంటాడు. ద్రోణుడి వలన కూడా కావడం లేదు అర్జునుడు ముందుకు పోవడాన్ని నిలవరించడం. అది చూసిన దుర్యోధనుడు అసహనంతో ద్రోణుడిని నిందిస్తూ అన్న మాటలు పై పద్యం. ‘నిన్ను సులభంగా దాటుకుని, మిగతా సైన్యాన్ని కిందా మీదా పడేలా చేస్తూ ముందుకు సాగిపోతూన్న అర్జునుని వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు నీవు. పాండవ పక్షపాతివి. నీ మనస్సంతా వారి సుఖాన్నే కాంక్షస్తూ ఉంటుంది. కప్ప గొంతుతో అరిచే పాములాగా వుంది నీ వైఖరి చూస్తుంటే. చూసీ చూడనట్లు వుంటాను, ఏ విధమైన హానీ తలపెట్టనని మాటగాని ఇచ్చావా వాళ్ళకు?’ అని ద్రోణుడిని ఉద్దేశించి దుర్యోధనుని మాటలు పై పద్యం భావం.

ఇందులో ముఖ్యమైనది ‘కప్ప యెలుంగు పాము వైఖరి’ అనే సామెత. అంతరంగంలో హానిని తలపెడుతూ, బయటకు అమాయకంగా కనబడడం అనే మోసపు వైఖరిని ఈ సామెత సూచిస్తుంది. అయితే ఈ సామెత ఇప్పుడు జనసామాన్యంలో అసలు వినపడదు. కొంత దగ్గర పోలిక ఉన్నటువంటివైన ‘గోముఖ వ్యాఘ్రం’ ‘మేక వన్నె పులి’ అనే సామెతలను సాధారణంగా వింటాం. ‘కప్ప యెలుంగు చిల్వ’ అని ముద్దుపళని రచించిన ‘రాధికా సాంత్వనము’ లో కూడా ఈ సామెత తిక్కన ఉద్దేశించిన అర్ధంలోనే ప్రయోగించబడింది. వచ్చే శబ్దాన్ని బట్టి ఒక ప్రదేశంలో ఉన్నది కప్పగా భావించి అడుగు వేస్తే అక్కడ నిజానికి ఉన్నది పాము అని తెలుసుకున్నప్పుడు కలిగే సంభ్రమం, నిరుత్సాహం ఈ సందర్భంలో ఉద్దేశించబడిన భావం అని స్పష్టమౌతుంది.

ఏఁటఁబెంచుదానిఁ బూటఁ బెంచెనటంచు

గీ.
ఏఁటఁబెంచుదానిఁ బూటఁ బెంచెనటంచు
జనులు పల్కు పలుకు సత్యముగను
గన్నతల్లి మిగుల గారాబమునఁ బెంపఁ
బెరిఁగెఁ జైత్రలతిక పెంపు మీఱ.

ధరణిదేవుల రామయమంత్రి, దశావతారచరిత్రము, అష్టమాశ్వాసం, బలరామావతారకథలోని 84 పద్యం పైది. ఈ పద్యంలో మొదటి పాదంలో ఉన్న సామెత, జైత్రలతిక అనే పేరున్న బాలికను ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంతో ముద్దుగా, అనగా అల్లారు ముద్దుగా,  పెంచారని చెప్పడానికి ప్రయోగించినది. ఇక్కడ ఈ ‘అల్లారు ముద్దుగా’ అనే పదబంధంలో ‘అల్లారు’ అనే మాటను ‘అల్ల+ఆరు’ అని విడదీసి ‘అల్లారుముద్దు’ అనే మాటకు  ‘మిక్కిలి మనోజ్ఞము’ అనే అర్ధాన్ని చూపెట్టింది శబ్దరత్నాకరం. అయితే, ఆలోచించగా, ఈ మాట అసలు రూపం ‘అల్లరే ముద్దుగా’ అయివుండి, అది పోను పోను జనం వాడుకలో ‘అల్లారు ముద్దు’ అయివుంటుందని అనిపిస్తుంది. తమ పిల్ల లేదా పిల్లవాడు చేసే అల్లరినంతటినీ ముద్దుగా భావించే తల్లిదండ్రులు ఎంతో మంది లోకంలో ఉంటారు. వారందరికీ ఈ మాట వర్తిస్తుంది.

ఇక పై పద్యంలో విషయానికి వస్తే, జైత్రలతిక అనే బాలికపై ఆమె తల్లి, మామూలుగానైతే ఒక సంవత్సరంలో కనబరిచ గలిగే ముద్దును, అమె పెంపకంలో ఆ పిల్ల మీద ఒక్క పూటలోనే కనబరుస్తూ పెంచింది అనే అతిశయోక్తి ఈ సామెతకు అర్ధంగా చెప్పకనే తెలిసిపోతుంది. ‘పదబంధ పారిజాతము’ ఈ పదబంధానికి రెండు అర్ధాలను సూచించింది. ఒకటి – అత్యాదరముతో పెంచు. రెండు – ఏడాదిలో పెరగవలసినంత ఒక పూటలోనే పెరుగునట్లు చేయు అని. ఈ రెండింటిలో మొదటి అర్ధమే సరైనదిగా కనబడుతుంది. రెండవది అంతగా పొసగేట్లు కనపడదు. ఒక బాలుడిని గాని, బాలికను గాని ఎడాదిలో పెరగవలసినంత ఒక పూటలోనే పెరిగేట్లు చేయడం అనే అర్ధంలో శరీర పరిమాణం సూచితమవుతూండడం వలన అసంబద్ధంగా తోచక మానదు కదా! – అని ఇందులో కలిగే సందేహం.

ముల్లుతీసి దబ్బనం పెట్టిన చందంగా

చం.
ఉడిగి మడింగి మైమఱచి యున్న తఱిం గలలోనఁ జేరె నె
క్కడి మగవాఁడొకో! యనుచుఁ గందఁగ మేల్కొనుచో నతండ యి
ప్పుడు మగఁడంచుఁ గోరుటకుఁ బొందుగఁ జెప్పితి ముల్లు పుచ్చి కొ
ఱ్ఱడిచిన చంద మయ్యెఁ గమలానన! యీ విరహానలంబునన్!

నాచన సోమునాథుడి రచనయైన  ‘ఉత్తర హరివంశం’ పంచమాశ్వాసంలో 103వ పద్యం పైది. బాణాసురుని కుమార్తెయైన ఉషకు కలలో కనిపించి మైమరపించెడివాడే ఆ తరువాత మగడౌతాడని చెబుతుంది అతని మంత్రి కుంభాడుండనేవాని కుమార్తెయైన చిత్రరేఖ. ఆమె చెప్పినట్లుగానే, ఈమె కలలోకి అతడు (శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడు) రావడం జరుగుతుంది. కలలో అతడు కనుపించి చేసిన పనులకు ఈమె మేల్కాంచి విరహతాపంలో మునిగి సతమతమౌతున్న తరుణంలో, అతడు ఫలానా అని చెప్పి, కోరుకుంటే అతడే మగడౌతాడన్న సంగతిని మరోసారి గుర్తుచేస్తుంది చిత్రరేఖ. ఆ సందర్భంలో ఉష మాటలు పై పద్యం.

‘ఉడిగి మడింగి మైమఱచి’ అనగా ఏ చీకూ చింతా లేకుండా జీవితాన్ని ప్రసన్నంగా గడుపుతున్న తరుణంలో ‘కలలో చేరి తీరగారాని ఇబ్బందిని పెడుతున్నాడు ఇతడెవడో దేవుడా!’ అని నేను ఒకవైపు నిద్రపట్టక తంటాలుపడుతూ, చివరికి ఏదో కాస్త కునుకు తీసి కళ్ళు తెరిస్తే, ఎదురుగా నిలబడి ‘అదుగో అతడినే మగడుగా కోరుకొమ్మ’ ని చెబుతున్నావే! ఉన్న బాధ తీరే ఉపాయం చెప్పవే తల్లీ అంటే, ఓ అదెంత పని గనకా, ఆ బాధలోనే నిండా మునిగిచూడు, అప్పుడంతా సుఖమే అన్నట్లుగా, ఉన్న ముల్లుకే వొళ్ళంతా మండుతూవుంటే అది తీసి దబ్బనం పెడతావేం చిత్రరేఖా! ఇది నీకు న్యాయమేనా?’ అని చెలికత్తెతో ఉష అంటున్న మాటలు పై పద్యం భావం. ‘ముల్లు పుచ్చి కొఱ్ఱడిచిన చందం’ అనే మాటలకు ‘ముల్లు తీసి దబ్బనం పెట్టిన చందంగా’ అని భావం.

నేలామంచము బట్టక

కం.
నేలామంచముఁ బట్టక
చాలా జాలిం దపించె శతమఖుడు నిజ
త్రైలోక్యరాజ్యలక్ష్మీ
పాలనమును వదలి, మరుఁడు పాతకుఁడు సుమీ!

ధరణిదేవుల రామయమంత్రి రచించిన ‘దశావతార చరిత్రము’ కావ్యం సప్తమాశ్వాసం, 61వ పద్యం పైది. శ్రీ రామావతారానికి సంబంధించిన కథలో, అహల్య వృత్తాతంలోని పద్యం. అనన్యమైన సౌందర్యము కలిగిన స్త్రీగా అహల్యను సృష్టించాడు బ్రహ్మదేవుడు. అహల్యను చూసి, తాళలేనంత మోహంలో పడ్డాడు ఇంద్రుడు. తనకు అప్పగించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. ఇంద్రుడి కోరికను పక్కన పెట్టి, అడవిలో తపస్సు చేసుకుంటూ జీవనం సాగించే గౌతమునికి పరిచర్యలు చేసేందుకు నియమిస్తాడు అహల్యను బ్రహ్మదేవుడు. ఆయన మాటకు మరి తిరుగు లేదు కదా! అవడానికి దేవతల రాజైనప్పటికీ ఇంద్రుడికి తన కోరిక తీరే మార్గం కనుచూపు మేరలో కనపడదు. ఆ బాధలో తిండీతిప్పలు మాని, అన్నమూనిద్రా మరిచి అవస్థపడసాగాడు ఇంద్రుడు.

ఈ సందర్భంలో ఇంద్రుడి అవస్థను అనాటి మాటలలో వర్ణిస్తూ ధరణిదేవుల రామయమంత్రి చెప్పిన మాట ‘నేలామంచము బట్టక’ తపించసాగాడు ఇంద్రుడు అని. అంటే అటు నేల మీద కాని, ఇటు మంచము మీద కాని నిద్ర అనేది పట్టక, రాత్రులు నిర్నిద్రంగానూ, పగళ్ళలో తాను బాధ్యతగా నిర్వహించాల్సిన ముల్లోకాల పాలనకు సంబంధించిన సంగతులన్నింటిని కూడా గాలికి వదిలేసి, కాలం అహల్య ధ్యానంలో వెళ్ళబుచ్చేట్లుగా చేసిన మరుడు, అనగా మన్మథుడు, మహాపాతకుడు సూమా! అని పద్యంలో భావం.

Exit mobile version