[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘తేనెటీగ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
“ధనము కూడబెట్టి ధర్మంబు సేయక, తాను తినక లెస్స దాచుగాక. తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా” అని పద్యం అప్పజెప్పి లక్షమ్మ వంక చూశాడు పిల్లాడు.
“బాగా చెప్పావ్ నాన్నా, పద్యం వచ్చేసింది. ఇక ఇంటికెళ్లు” అని పంపేసింది ఎదురింటి పిల్లాడ్ని.
తర్వాత, శేఖరానికి, ముక్కుతూ, మూలుగుతూ టీ అందించి, “ఏవండీ, నిన్నటి నుండి కాస్త జ్వరంగా ఉంది. కొంచెం ఆసుపత్రికి వెళ్ళొద్దామా! సూది మందు లాంటివి వద్దు. ఏవైనా టాబ్లెట్స్ రాయమందాం. పైగా తలనొప్పి కూడా ఎక్కువగా ఉంది, ఏమిటో తెలియట్లేదు”. చెప్పిందామె చీరకొంగుతో ముక్కు తుడుచుకుంటూ.
“మామూలు జ్వరవే అయుంటుందిలే, వైరల్ ఫీవర్ ఏమో, పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకో, అలా ఆరు గంటలకు ఒకసారి వేసుకో. రెండు మూడు రోజులు ఉండి అదే తగ్గుతుంది”. అంటూ తేలిగ్గా చెప్పి టీ కప్పు అందుకున్నాడు.
“అబ్బా ఏమిటండీ మీ పినాసితనం. ఇప్పటికే ఇంత నీరసంగా ఉంది, ప్రాణం లబలబమంటోంది. కుదుట పడట్లేదు” చెప్పిందామె.
“ఇది పీనాసితనం కాదు, జాగ్రత్త. వృధాగా డబ్బు, డాక్టర్లకు ఎందుకు ఖర్చు చేయడం” అన్నాడు టీ తాగుతూ.
తర్వాత, పనిమనిషి అంట్లు తోమేసి వచ్చి, శేఖరానికి ఎదురుగా నిలబడి, తల గోక్కుంటూ “అయ్యగారు” అంది.
“ఏవిటీ” అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ.
“అబ్బే ఏమీ లేదు. ఈ నెల జీతం” అంటూ ఆగిపోయింది.
“అమ్మగారికి ఇచ్చాను, నీకు ఇవ్వలేదా” అన్నాడు శేఖరం.
“ఇచ్చారు కానీ, మూడు రోజుల జీతం కత్తిరించి ఇచ్చారు. అదే, మా ఆయనికి ఒంట్లో బాగాలేదని అలా మూడు రోజులు సెలవు పెట్టాను. అమ్మగారే, ‘పర్లేదు ఎల్లవే, నేను అయ్యగారికి చెప్తానూ’ అంటే సెలవు పెట్టుకున్నాను. మరి ఇలా మూడు రోజులకి మూడొందలు రూపాయలు కోసేసారు” అంది నీరసంగా.
“మరి కోసేయకపోతే, ఇంకో మూడొందలు కలిపి వేయమంటావా. నెలకి మూడు వేలు అంటే మాటలనుకున్నావా. అయినా ఏవంత పని చేస్తున్నావని” అడిగాడు కాస్త చిరాకు పడుతూ
“అదేటయ్యగారూ, అంట్లుతోమడం, ఇల్లు, వాకిళ్లు ఊడవడం, బయట ముగ్గు వేయడం, మున్సిపల్ ట్యాప్ వస్తే కొళాయి నీళ్లు బిందెలలో పట్టడం. బట్టలు వేయడం, మిషన్‌లో వేసిన బట్టలు పిండి డాబా పైన ఆరబెట్టడం. పైగా పచారి సామాన్లు తేవడం, ఇలా ఎన్ని ఉన్నాయి? వీటికి మూడు వేలు తక్కువ” అంది.
“ఏది ఏవైనా సరే, తెగ్గోసిన జీతం తిరిగి అతికించడం జరగదు. నచ్చకపోతే వేరే వాళ్ళ ఇల్లు చూసుకో” కరాఖండిగా అన్నాడు. మరొక సారి టీ తాగుతూ,
తర్వాత, కొడుకు మొత్తం ఇల్లంతా వెతుకుతూ “నాన్నా ఒకసారి అటు జరుగు” అన్నాడు.
“ఏమైందిరా” అడిగాడు.
“ఏమీ లేదు, నా రూమ్‌లో ఏసీ రిమోట్ కనిపించడం లేదు, ఇక్కడ ఎక్కడికైనా ఉందేమోనని చూస్తున్నాను” అన్నాడు.
“అదా, అది నేనే తీసేసానురా. పోయిన్నెల కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, ఈ నెల కొంత తక్కువ రావాలి కదా, అందుకనే ఏసీ రిమోట్ తీసి దాచేసాను. ఫ్యాన్ తో సరిపెట్టుకో” అన్నాడు.
“అమ్మో అంత చల్లదనం లేదు నాన్న, ఉక్క పోస్తోంది”.
“అలవాటయితే అదే చల్లగా ఉంటుంది, మా రోజుల్లో బయట నులక మంచాల మీద పడుకునే వాళ్ళం, ఇప్పుడు మీకు ఫ్యాన్లు తిరిగినా చల్లదనం సరిపోవటం లేదు” అన్నాడు టీ మరొక గుక్క తాగి కప్పు టీపాయి మీద పెడుతూ.
“ఏమండీ ఇదేమైనా బాగుందా చెప్పండి.”
“బాలేదు, చీరకి జాకెట్ మ్యాచ్ కాలేదు. పైగా బొట్టు కొంచెం పెద్దదైపోయింది” అని ఇంకేదో చెప్పేంతలో
నెత్తి కొట్టుకుని “అది కాదండీ, మా నాన్న ఏదో ఆరోగ్యం బాగాలేక ఇక్కడ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. సరే వచ్చాడు కదా ఈ ఊళ్లో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని, మన ఇంట్లో ఒక రెండు రోజులు ఉంటానని మీకు చెబితే, అసలు మనం ఊళ్లోనే లేవని చెప్పి ఫోన్ పెట్టేసారట, ఇదేమైనా బాగుందా చెప్పండి” అంది చీరతో కళ్ళు ఒత్తుకుంటూ.
“వారికి ఇక్కడ సౌకర్యంగా ఉండదని అలా చెప్పాను, వేరే ఏ కారణం లేదు. కావాలంటే మనింటికి రేపు రమ్మను” అన్నాడు
“ఇంకెక్కడ వస్తారు, రేపు బయలుదేరి ఊరికి పోతున్నారు. వాళ్ళక్కడ లాడ్జి తీసేసుకున్నారట. ఇదంతా నా ఖర్మ, మీలో మార్పు ఎపుడొస్తుందో” తల కొట్టుకుందామె .
తర్వాత ఏదో గుర్తొచ్చినట్టు ఫోన్ అందుకుని, ‘ఏమిటి ఇంకా లిఫ్టు చేయదు, ఇవాళ ఆరో తారీకు వచ్చేసింది. వేయాల్సిన డబ్బులు వేయాలని ప్రతినెలా గుర్తు చేయాల ఈమెకి’ అనుకుంటూ ఫోన్ ఎత్తిన వెంటనే “ఆ.. అమ్మా ఎలా ఉన్నావ్” అడిగాడు.
“ఆ బాగానే ఉన్నాను రా”.
“అదేనమ్మ, నీ పెన్షన్ డబ్బులు నాకు ఇంకా వేయలేదు. ఆల్రెడీ ఆరో తారీఖు వచ్చేసింది కదా. పెన్షన్ వేయకపోతే ఎలాగా” అన్నాడు.
“అదేరా ఈమధ్య ఒంట్లో బాలేదు, తమ్ముడు ఆసుపత్రికి తీసుకెళ్లి తీసుకొచ్చాడు. నిన్ను కూడా చూడాలని ఉంది, ఒక వారం వద్దామని” చెబుతూ చెబుతూ ఆగింది.
“ఎందుకమ్మా ఇక్కడికి, ఈ పట్నం గాలి నీకు పడదు. పైగా, నేనా ఇంట్లో ఉండను, మా ఆవిడకి అంత ఆరోగ్యం కూడా బాలేదు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే, నీ ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది. కనుక నేనే వీలు చూసుకుని వస్తానులే. అంతేగాని నువ్వు శ్రమపడి రావద్దు. తమ్ముడు దగ్గరే ఉండు, ఏవైనా కావాలంటే పెన్షన్ డబ్బులు ఉన్నాయి కదా, కొంత వాడుకో, తమ్ముడికి కొంత ఇస్తున్నావు కదా, పర్వాలేదులే. అంతా బాగానే ఉంది కదా, సరే మర్చిపోకుండా మధ్యాహ్నం లోపు వేసేయ్” అంటూ ఫోన్ పెట్టేసాడు.
ఇంతలో ఏదో ఫోన్ రావడంతో చూసి, ‘అమ్మో పక్కింటి సుబ్బారావు, వాళ్ళ ఆవిడకి బాలేదన్నాడు. ఇప్పుడు గాని ఫోన్ ఎత్తితే డబ్బులు, డబ్బులు అని పీక్కుతింటాడు’ అని ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేసాడు.
“ఇదిగో, మళ్లీ ఆ పక్కింటోడు ఫోన్ చేస్తే, ఎత్తి ఆయన లేరు, పక్క ఊరికి వెళ్లారు, ఫోన్ మర్చిపోయారు అని చెప్పు.”
అని చెప్తుండగానే, ఎవరు ఫోన్ చేయడంతో ఉత్సాహంగా మొహం పెట్టి మరీ లిఫ్టు చేసి “ఎంత ఇప్పుడు” అని అడిగాడు.
“ఐదు తులాలు” చెప్పాడు అవతలి వ్యక్తి.
“సరే వస్తున్నాను. అక్కడికే వస్తున్నాను. మా కంసాలి ఉన్నాడుగా, అతని దగ్గర ఉండండి, వచ్చేస్తాను.” అని ఫోన్ పెట్టేసాడు.
భార్య, “ఎవరండీ, బంగారం అంటున్నారు. కొంపతీసి నాకు ఏమైనా బంగారం కొనాలనుకుంటున్నారా” అడిగింది
“కాదు, ఎవరో ఒకతను దుబాయ్ రిటర్న్ అట. కష్టాల్లో ఉండి కొంచెం, కొంచెం బంగారం అమ్మేస్తున్నాడు. ఇప్పటికీ ఐదు తులాలు బంగారం కొన్నాను. అది నాలుగు లక్షలు విలువైన బంగారం, మూడున్నర లక్షలకే ఇచ్చాడు. ఇంకా నాలుగు తులాలు అమ్మేసి వాళ్ళ ఆవిడకి స్టంట్ వేయిస్తాడట” చెప్పాడు.
“ఏంటండీ మీరు? డబ్బు పై అతి మొహంతో అడ్డంగా మోసపోగలరు” హెచ్చరిస్తున్నట్టుగా అంది.
“చాల్లే, నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా, నీకంటే నేను నాలుగు ఆకులు ఎక్కువ చదివాను. మన కంసాలితోనే కరిగించి, పరీక్షించిన తర్వాతే కొంటున్నాను బంగారం. ఎటువంటి డోకా లేదు. ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అట, పైగా షాపులో అమ్ముకుంటే ఇంకా వాడికి యాభై వేలు ఎక్కువ వస్తుంది. మనకు తక్కువకి అమ్ముతున్నాడు. ఎందుకు బంగారం పోనివ్వడం అని కొంటున్నాను. సరే ఉండు, నేను అలా వెళ్లి వస్తాను” చెప్పి బయటకు వెళ్ళాడు.
బంగారం కొన్న రెండు రోజులకి, ఆ ఊరి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లి ఎస్.ఐ.ని కలిశాడు శేఖరం.
“మీరు కొన్న బంగారం దొంగ బంగారం. ఒకడు దొంగతనం చేసి, దాన్ని మీకు అంటగట్టాడు. దానిని బాధితులకు అందజేయాల్సిన బాధ్యత మా పై ఉంది. అయినా ఇలాంటి ఇల్లీగల్ బంగారం కొనడం కూడా నేరమే అని మీకు తెలియదా” అనగానే శేఖరం తెల్ల మొహం వేసి, అటు ఇటు చూసి గొర్రెపోతులా అడ్డంగా తలాడించాడు.
“సరే, ఆ దొంగ బంగారం మాకు అప్పగించండి”.
“అది మరీ నేను అతనికి” నసిగాడు శేఖరం.
“అతనికీ, మీకూ ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే అతనితో మీకు స్నేహం ఉందా, మిమ్మల్ని విచారించాల్సి ఉంటుంది” చెప్పాడు.
“వాడేదో బంగారం ఇచ్చాడు, నేనేదో తెలియక కొనుక్కున్నాను. అంతవరకే. అది కూడా ఒక్కసారే, ఆ బంగారు మొత్తం మీకు తెచ్చి ఇస్తానులేండి” ఏడుపు మొహంతో చెప్పాడు.
“సరే, సరే, ఇదిగో మా కానిస్టేబుల్ వచ్చి తీసుకుంటాడు. అతనికి ఇచ్చి పంపండి. ఇక్కడ సంతకం పెట్టండి, అవసరమైతే పిలుస్తాము రండి” అన్నాడు.
తనతో పాటే ఇంటికి వచ్చిన ఆ కానిస్టేబుల్‌కి బంగారం ఇచ్చేశాడు
విషయం గ్రహించిన అతని భార్య “అంతమందిని బాధ పెట్టి, ఇంత కూడబెట్టింది ఇందుకా, అనుభవించండి. మీరు కూడా తేనెటీగ సంతతే. ఛ ఛ” చీర కొంగు దులిపి, చీదరంగా మొహం పెట్టి అవతలికి వెళ్లిపోయింది.