[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
తేనెతుట్టె నిర్బేధ్యమయిన కోట వంటిదని మనందరికి తెలుసు. దాని ద్వారాల దగ్గర ఎప్పుడూ గూర్ఖాలవలె తేనెటీగలు రెప్పవేయకుండా కాపలా కాస్తుంటాయి. వాటిని దాటి లోపలకు వెళ్ళడం కష్టం అసాధ్యం కూడా! కానీ వీటిని దాటుకుని తేనెతుట్టెలో ప్రవేశించి – తేనెను తాగే జీవి ఒకటి వుంది. అది ఒక సీతాకోకచిలుక.
ఈ సీతాకోకచిలుక రెక్కలు నల్లగాను, పొట్ట పసుపు రంగులో వుంటుంది. వీపు మీద పసుపు, తెలుపు రంగులలో చుక్కల ముగ్గు లాంటి డిజైన్ వుంటుంది. ఈ డిజైన్‌ను చూస్తుంటే పుర్రె మీద ఇంటు (X) గుర్తుతో వున్న ఎముకలు గుర్తుకు వస్తాయి. అందువలననే దీనిని ‘మృత శిరస్సు’ అని అంటారు. ఇది తేనె తుట్టెలోకి దూరి చాలా ఎక్కువ పరిమాణంలో తేనెను జుర్రుకుంటుంది. కడుపు నిండిపోయి, దాదాపు ఎగరలేని స్థితికి చేరి (అంత ఎక్కువ తేనెను తాగుతుందన్న మాట) బయటకు సురక్షితంగా వస్తుంది.
అదేంటబ్బా! తేనెటీగలు ఈ సీతాకోకచిలుకని కుట్టవా? అది బయటకు క్షేమంగా ఎలా వస్తుంది? అని అనుకుంటున్నారా! రాణి తేనెటీగకి ఆనందం కలిగినపుడు తేనెతుట్టె అరల వెంట పరుగెడుతూ ఒక రకమయిన ధ్వనిని చేస్తూ పాట పాడుతుంది. ఆ (పాటను) గానాన్ని విన్న తేనెటీగలు మైమరచిపోతాయి. ఆ సమయంలో ఈ సీతాకోకచిలుక రాణి తేనెటీగ గొంతును అనుకరిస్తూ పాట పాడుతుంది. కాపలా ఈగలు ఈ పాట విని మైమరచిపోగానే-సీతాకోకచిలుక తేనెతుట్టెలో దూది తేనెను తాగుతుంది. తన మాయలో పడిన తేనెటీగలు స్పృహలోకి రాకముందే – వీలయినంత త్వరగా తనకు హాని కలగకుండానే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది.
ఇంతకీ సీతాకోకచిలుకపేరేమిటో తెలుసా? తేనెను దొంగతనంగా త్రాగు దొంగ ‘స్ఫింక్స్’ అంటారు. మన ఇళ్ళలో దూరి దొంగతనాలు చేసే దొంగలు కొందరుంటారు. అయితే కొంతమంది దొంగలు దొంగతనంగా పెరటి గుమ్మంలో నుంచి వంటింటిలో దూరి తిండి తిని వెళ్ళిపోతుంటారు. వీరిని తిండిదొంగలు అంటాము.
అటువంటి దొంగే ఈ స్ఫింక్స్ అన్నమాట. దీని తెలివితేటలు గమనించారా? రాణి ఈగగారిలా పాడుతూ దొంగవేషాలు వేస్తూ అందరినీ బుట్టలో పడేసి తన ఆకలి తీర్చుకుంటుంది.
కొంతమంది దొంగలు, తిండి దొంగలు యజమానులను బుట్టలో పడేసి దొంగతనం చేసి పారిపోతారు. ఇటువంటి దొంగలు, స్ఫింక్స్ లాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పహరా హుషార్!