Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తేనెలూరు తెలుగు! విశ్వ వ్యాప్తి వెలుగు!!

[శ్రీ పి. నిర్మల రాజు రచించిన ‘తేనెలూరు తెలుగు! విశ్వ వ్యాప్తి వెలుగు!!’ అనే కవితని అందిస్తున్నాము.]


బది ఆరు అక్షరముల సాక్షిగా
అక్షయ సాహితీ గంగా ప్రవాహమే నా తెలుగు.

శాతవాహనులు నాటిన అక్షరవిత్తుల
కల్పతరువు నేటి మేటి తెలుగు.

దేశ భాషలందు తెలుగు లెస్సంచు
కన్నడ రాజ్యమేలిన శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు.

అష్టదిగ్గజముల సాహితీ సద్గోష్ఠి అందించిన
ఆటల, పాటల, మాటల మూటలకావ్యాల
పసందైన తేట తెలుగు విందు.

పద్య గద్య అవధాన సాహిత్య సంగీత సంగమ
ప్రక్రియలతో విలక్షణముగా వేనోళ్ల కొనియాడదగిన భాష.

బ్రహ్మరచనలకు పునాదివేసిన బాల వ్యాకరణ
భాగ్య విధాత చిన్నయ్య సూరి తెలుగు.

ఆర్ద్రత నిండిన ‘గాలివాన’తో విపణిలో
కథనకేతన మెగురవేసిన పాలగుమ్మి తెలుగు.

సంస్కృత మూలాలతో, సద్గ్రంథ రచనలతో, సద్భావన
పరంపరలతో, వసుధైక కుటుంబ భావనకు స్ఫూర్తి ప్రధాత నా తెలుగు.

ఎద జల్లున ఉప్పొంగి,గలగల పారే తల్లి గోదారి,
అంతరంగ తరంగమై, నాట్యమాడే కృష్ణమ్మ గజ్జల సవ్వడి నా తెలుగు.

అజంతా శిల్ప సోయగముల అక్షర సుమమాల,
అచ్చులతో, అచ్చు గుద్దిన పద పొందికతో, హాయినిచ్చే
ముద్దుల ‘ఇటాలియన్‌ అఫ్‌ ది ఈస్ట్‌’ నా తెలుగు.

పదసిరితో, వెన్నెల కాంతులతో,
విధాత తలపులనే తెరచిన ‘సిరివెన్నెల’ నా తెలుగు.

నీవు నేను మనమని, భాషతో అందరూ బసచేయాలని,
గొడుగు పట్టిన వ్యవహారిక భాష ఉద్యమ కర్త గిడుగు భాష.

ముత్యాల సరాలతో, గేయ రచనకు
ఆకార ప్రాకారమిచ్చిన గురజాడ అడుగుజాడ నా తెలుగు భాష.

అనువాదమునకు మింగుడు పడని
ప్రాస యాసల త్రిలింగ దేశపు భాష.

విశ్వనాథుని ‘వేయి పడగలు’,
సినారే ‘విశ్వంభర’, రావూరి పాకుడురాళ్లతో
జ్ఞానపీఠమధిరోహించిన భాష

ప్రియ మహాభారత గాథను తెనుగున
సాక్షాత్కరింపజేసిన కవిత్రయము పండించిన తెలుగు భాష.

రామాయణ, మహాభారత ఇతిహాసాల చరితను,
ధరణి పుత్రులకు నిరతము అందిస్తున్న
నేటి మేధావులు చాగంటి, గరికపాటి ఆచార్యుల సూక్తిముక్తావళి నా తెలుగు భాష.

ఈ శతాబ్ది నాదంటూ, కవిత్వ పద్మవ్యూహాన్ని చేదించి,
మహా ప్రస్థానంతో దాహార్తిని తీర్చి, మరో ప్రపంచానికి
పదండి పదండి ముందుకు అంటూ పిలుపునిచ్చిన శ్రీశ్రీ భాష.

జాతీయ భాష ప్రథమమైతే, భారతావనిలో నేల నాలుగు చెరగులా
కోట్ల మంది ప్రజల నాల్కలపై నాట్యమాడే ద్వితీయ భాష నా తెలుగు భాష.

ధరణిలో తెలుగు కిరీటం ధరించిన
నటసార్వభౌముని భాష.

జానపదులతో హరి నామాన్ని కీర్తించిన
అన్నమాచార్యుని యెద పద సంపద తెలుగు భాష.

హరికథ పితామహుడు
ఆదిభట్ల పండించిన భాష.

క్రీస్తు చరిత్రతో విశ్వనరుడై వర్ధిల్లిన నవయుగ కవి చక్రవర్తి
జాషువా కలం దిద్దిన కవితా భాష నా తెలుగు.

ఉగ్గుపాలతో నా తల్లిరంగరించిన
సజీవ భాష నా మాతృభాష.

బ్రౌన్‌ దొర మెచ్చి సమకూర్చిన నిఘంటువు భాష
నా తెలుగు భాష.

నండూరి ఎంకి పాటై,
బాపు అందాల బొమ్మై,
రవి వర్మ కుంచె గీసిన అపురూప చిత్రమై,
గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమై,
ఘంటసాల, బాలుల సుందర గళమై,
అల్లూరి విప్లవ జ్యోతై,
తెలుగు రాష్ట్రాల ఆకాంక్షల స్వర గంగగా
నిలవాలి తెలుగు భాష!
నిండుగ వెలగాలి మన తెలుగు జాతి.
జై తెలుగు తల్లి! జై జై తెలుగు తల్లి!!

Exit mobile version