[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘తెనాలి రామకృష్ణ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 2వ భాగము.]
ఉద్భటారాధ్య చరిత్రము
ఇది తెనాలి రామలింగ కవి పేరుతో వెలువడిన తొలి గ్రంథం. దీని గద్యలో “ఇది శ్రీమదేలేశ్వరగురువరేణ్య చరణారవింద షట్చరణ సకలకళా భరణ రామనార్యసుపుత్ర, సుకవిజనమిత్ర కుమారభారతి బిరుదాభిరామ రామలింగయ ప్రణీతంబైన” అని ఉంది. పాండురంగమహాత్మ్యంలో రామకృష్ణకవి తనకు కుమార భారతి అనే బిరుదు ఉన్నట్టు చెప్పుకోలేదు. దానికి బదులుగా “శారద నీ రూపము” అనే సంబోధన కనిపిస్తుంది.
రామలింగ కవి గురువు ఏలేశ్వరుడు కాగా, రామకృష్ణకవి గురువు భట్టరు చిక్కాచార్యులు.
ఈ వైరుధ్యాలు రామకృష్ణకవి, రామలింగకవి వేర్వేరు వ్యక్తులు కావచ్చుననే భావింపచేస్తున్నాయి. కానీ, అలా ప్రకటించటానికి కవిపండితులకు మనసొప్పడం లేదు. అందుకని మతం మార్పు కథను ఊహించారు. శైవుడుగా ఉన్నప్పటి గురువు ఏలేశ్వరుడని, వైష్ణవుడైనాక రామకృష్ణుడని పేరు మార్చుకున్నాక భట్టరు చిక్కాచార్యులను గురువుగా స్వీకరించి ఉంటాడని భావించారు.
మతం మార్పిడి కథ కూడా రామకృష్ణుడంటే భక్తితో చేసిన కల్పనే! కానీ, అది ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తోంది!
ఉద్భటారాధ్యుడు కన్నడ రాజ్యంలో ప్రసిద్ధుడు. బహుశా కన్నడిగుడు కావచ్చు. ఉడ్భటయ్యానీ ఉద్భటారాధ్యుడని పిలుస్తారాయన్ని.
“హరలీలాస్తవరచనా
స్థిరనిరుపమకీర్తి తనదు దేహము తోడన్
సురుచిరవిమానమున నీ
పురమున కుద్భటుఁడు ప్రీతిఁ బోవఁడే రుద్రా”
మల్లికార్జున పండితారాద్యుడి శివతత్త్వసారంలోని ఈ పద్యంలో ఉద్భటుడు అనే మహా శివభక్తకవి హరలీలాస్తవం వ్రాసి ప్రసిద్ధుడయ్యాడని, దేవతలు విమానం పంపగా దేహంతో కైలాసానికి చేరాడనీ ఉంది. వెయ్యి వృత్తాల్లో ఈ కావ్యాన్ని వ్రాశాడని సమయపరీక్ష అనే గ్రంథంలో బ్రహ్మశివనకవి పేర్కొన్నాడు.
పాల్కురికి సోమనాథుడు- “హరలీలఁదేలుచు హరలీల దనర/హరలీల యను కృతి హరలీలఁ బొగడు”తాడని మల్లికార్జున పండితారాధ్యుడు గురించి వ్రాశాడు. వీరశైవుల్ని అమితంగా ప్రభావితం చేసిన ఉద్భటుని రచన అది! బసవపురాణంలోని పరమ శివభక్తుల కథల్లో ఉద్భటుని కథ ఉంది. దాని ఆధారంగా రామకృష్ణుడు ఉద్భటారాధ్యచరిత్రము వ్రాశాడు. 38 ద్విపదల్లో పాల్కురికి వ్రాసిన ఉద్భటుని కథని తెనాలి రామలింగయ్య 686 పద్యగద్యాల్లో పెంచి వ్రాశాడు. ఆరాధ్య శైవసిద్ధాంతాలు, స్వయంకల్పితం. లింగధారణ ప్రకార వివరాలు ఈ గ్రంథంలో అదనపు విషయాలు. శ్రీనాథుడి ప్రభావంతో వ్రాసినదిగా కనిపిస్తుంది. శ్రీనాథుని కాశీఖండంలో గుణనిథి కథ లాంటిదే ఇందులో ఉపాఖ్యానంలా వచ్చిన మదాలసుడి కథ
మదాలసుడు కూడా గుణనిధిలా కానక కన్న సంతానం. వేదవిద్యాపారంగతుడే. భార్య చంద్రకళ. నాలుగంచుల నవయౌవనంలో వేశ్యాలోలత్వం అలవడింది.
స్మరవాత్స్యాయనకూచిమారకృతశాస్త్రగ్రంథసాంగుడు.. ట.. అందరూ పరిత్యజించటంతో దేశాంతరాలకు పోయేందుకోసం శివాలయంలో దేవధనాన్ని అపహరించి కుంతల దేశంనుండి కాన్యకుభ్జానికి పోతాడు. అక్కడ కనకలత అనే వేశ్యతో సహజీవనం చేశాడు. చేతిలో ఉన్నదంతా అయిపోయాక వేశ్యమాత అతన్ని వెళ్లగొట్టింది. వింధ్యాచలం దగ్గర ఒక ప్రాంతంలో కన్నం వేయటానికి బయల్దేరి అడవిలో సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని విద్యాపాలుడనే పెద్దమనిషి కాపాడాడు. తోటి విప్రులతో వాదంలో ఓడిపోయి శాస్త్రపాఠాలు నేర్చుకోవటానికి పోతున్నానని ఆయనతో బొంకుతాడు. ఆయనతో సాన్నిహిత్యం పెంచుకుని అదను చూసుకుని ఆయన్ని చంపి, ఆయన దగ్గరున్న ధనం తీసుకుని తిరిగి కనకలత దగ్గరకు బయల్దేరతాడు. దారి తప్పి కాశీ చేరతాడు. అక్కడ పాము కరిచి చచ్చిపోతాడు. కాశీలో మరణించిన కారణంగా విశ్వనాథుడి తారకోపదేశంతో కైలాసం చేరతాడు. యముడు వచ్చి ఇంత పాపాత్ముడికి కైలాసవాసం ఏమిటని నిలదీస్తే శివుడు “..మానవుడు మల్లీలానివాసార్హమౌ/నీ కాశీనగరంబునం దెగినచో హెచ్చున్ ననుంబోలుచున్” అని సమాధానం చెప్తాడు. కాశీలో మరణిస్తే ఎలాంటి వాడికైనా కైలాస అర్హత ఉంటుందని!
ఉద్భటారాధ్యచరిత్రము ఆరాధ్యశైవాన్ని ఉద్భోధిస్తుంది. అది బ్రాహ్మణుల వీరశైవం! శివాధిక్యం, శివభక్తి ప్రాధాన్యం, పురాతన శివభక్తుల స్మరణం, ఇవి ఆరాధ్య శైవధర్మాలు. ఉద్భటారాధ్య చరిత్రలో ఇవి ప్రధానంగా కనిపిస్తాయి.
పాండురంగ మాహాత్మ్యము
తెనాలి రామకృష్ణుడి రచనల్లో పాండురంగమాహాత్మ్యమే మహాకావ్యం. అది విరూరిపట్టణపతి వేదాద్రి మంత్రికి అంకితం. బహుశా, 1575 ప్రాంతంలో దీని రచన జరిగి ఉండాలి! ఇందులో నిగమశర్మోపాఖ్యనం, రాధాదేవి చరిత్రం, సుశీల చరిత్రం. నుశర్మోపాఖ్యానం, అయితనియుతోపాఖ్యానం లాంటివి రామకృష్ణుని కల్పితాలు. వీటిలో నిగమశర్మోపాఖ్యానం శ్రీనాథుడి గుణనిథి పాత్రను అనుసరించి సాగినదే అయినప్పటికీ అంతకన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందిందనే చెప్పాలి! నిగమశర్మోపాభ్యానము కాశీఖండంలోని గుణనిధి కథనీ,. శివరాత్రిమాహాత్మ్యంలోని నుకుమారచరిత్రనీ, ఉద్భటారాధ్యచరిత్రంలోని మదాలస వృత్తాంతాన్ని కలిపి తయారు చేసిన కథ ఇది. ఇందులో ‘నిగమశర్మ అక్క’ పాత్ర అతి సహజనుందర సజీవపాత్ర. “రామకృష్ణ డమృతములో లేఖిని నద్ది దిద్ది తీర్చి యాడించిన పుత్తడిబొమ్మ” అని పండితులు కీర్తించిన గొప్ప పాత్ర- నిగమశర్మ అక్క! ఒక పాత్రకు పేరు పెట్టకుండా అంత ప్రసిద్ధి తెచ్చిన ఘనత తెనాలి కవిదే!
అన్నివిధాలా భ్రష్టుడైన నిగమశర్మ చివరికి పౌండరీక క్షేత్రంలోని సంగమతీర్థమునందలి నృసింహస్వామి ఉన్న పుణ్యవ్రదేశంలో మరణించటం వలన, పరమధామంలో పరమపదనాథుడికి పార్శ్వచరుడు కాగలుగుతాడు. ఇలా నిగమశర్మోపాఖ్యానం పౌండరీక క్షేత్ర మాహాత్మ్యాన్ని చాటుతుంది.
పాండురంగ మహాత్మ్యంలో గాని, హరిలీలాసంలో గానీ సామాజికాంశాలు చాలా ఉన్నాయి. ఒక్కో పద్యాన్ని ప్రత్యేకంగా విశ్లేషిస్తే మన సాంఘికచరిత్ర వెలుగులోకి వస్తుంది. కొన్ని పద్యాలను పరిశీలిద్దాం:
మొలబట్ట-బట్టతల
‘ప్రతిదిన కేశలుం చనపురాయిడి నెట్టన బట్టగట్టి పైఁ
బుఠపుఠమంఛునున్న కుఱుబోడతలకు ధరియింవ నోడియున్
సతతమగు సొమ్ము గాన విడఁజాలవుగా శిఖిపింఛవల్లి సౌ
గతమతధుర్య! దానిఁ గటిఁ గట్టుము; పుట్టము మిన్న కేటికిన్.”
నెమిలిపించెం శ్రీకృష్ణుడి అలంకారము, పించెం లేని కృష్ణుడి బొమ్మను ఊహించలేము. బుద్ధావతార సమయంలో బట్టకట్టి బోడిగుండు తలపైన ధరించటానికి ఎలాగూ వీల్లేదు కాబట్టి, తన కిష్టమైన పించాన్ని వదులుకోలేడు కాబట్టి, తను ధరించాల్సిన ఆ పించాన్ని కట్టుకున్న బట్టలకు బదులుగా మొలకు ధరిస్తే బట్టకట్టుకున్నట్టు అవుతుంది, మొలకు కట్టే బట్టని తలకు కడితే బట్టతల కనిపించకుండా ఉంటుందని భావం.
కొంచెం క్రూరంగా అనిపించినా తన హాస్యప్రియత్వాన్ని వికటకవి తత్త్వాన్నీ ఈ పద్యంలో చాటుకున్నాడనిపిస్తుంది. తెనాలి రామకృష్ణుడు వికటకవి అనటానికి ఇలాంటి ఒకటీ అరా పద్యాలు ఉదాహరణప్రాయంగా కనిపిస్తాయి. తకు మించిన దాఖలాలు లేవు.
కలలో వార్తలు విప్పి చెప్పే కవులు
వరసారస్వత వట్టభ్యదులు కవుల్ వర్ధించి వర్థించియున్
సరసావంతయు గానలేరు తుది యోషావిభ్రమాంబోధికిన్
విరసాంతఃకరణుండవై యెటులుగా నిందించెదో యయ్య! త
తృరసాకార ముదారమన్భథకలాసర్వస్వళ్ళంగారమున్! (పాండురంగమాహాత్మ్యము)
చాలామంది కవులకు ఉత్తుత్తి నోటిమాటలే గానీ అనుభవించిన దాఖాలాలు లేవని ఈ పద్యంలో కవుల్ని ఎకసెక్కెం ఆడ్తున్నాడు కవి! ఏదైనా రుచి చూసి, ఆనందించాక మాత్రమే అందంగా వర్ణించటం తన అలవాటని చాటుకోవటం ఇందులో ప్రధానాంశం!
“వర సారస్వత పట్టభద్రులైన కవులు వర్ణించీ వర్ణించీ ఊదరగొడుతుంటారు. యోషావిభ్రమాంబోధి అంటే స్త్రీల శృంగార చేష్టలనే సముద్రం. సరసు అంటే దగ్గర అని! “సారెకు చుక్కల సరసకు బోవు” లాంటి ప్రయోగాల్లో దగ్గరగా పోవటం అనే అర్ధం కనిపిస్తుంది. ఈ కవులు శృంగార మనే సముద్రం సరసకు కూడా పోయిన వాళ్ళు కాదు అంటూన్నాడు, “సరసావంతయు గానలేరు” అని! వీళ్ళ వర్ణనల్లో వఠ్ఠివాచాలత్వమే తప్ప క్రియ శూన్యం అనీ, “వట్టి మాటలు” కట్టి పెట్టమంటున్నాడు.
కవులు వ్రాసినవన్నీ స్వయంగా వాళ్లు చేసినవై ఉండాలంటే ఒక్కోసారి ప్రమాదమే కావచ్చు. ప్రతిదీ చేసి, రుచిచూసి వ్రాయటానికి కవిత్యం వంటల పుస్తకం కాదు కదా! అయినా ఈ మధ్య వంటల పుస్తకాల్ని ఏనాడూ గరిట పుచ్చుకు ఎరగని వారుకూడా వ్రాస్తున్నారు.
రుచి అనే మహాసముద్రం సరసకు కూడా చేరని వ్యక్తి, రుచుల మీద పుస్తకం వ్రాస్తే ఎలా రుచిలేక చప్పగా ఉంటుందో, తనకు అనుభవంలేని విషయాలను కవులు వ్రాస్తే అంతే రసహీనంగా ఉంటుంది!
ఈ రహస్యాన్ని తెనాలి కవి శృంగారానికి వర్తింప చేశాడు. విరసాన్ని పెంచుకుని, సరసాన్ని నిందించకు, మన్మథ కళా సర్వస్వం మన ఊహలకు అందనిది. దాన్ని తక్కువ చేయవద్దనేది ఈ పద్యంలో హితవు!
రసమంటే తెలీని వెర్రికుర్రకి శృంగార వర్ణన దేనికనేది ఆయన ప్రశ్న ఒక ప్రాంతంతోనూ, ప్రాంతీయ ఆచారాలతోనూ, స్థానిక సంస్కృతితోనూ, జన జీవనంతోనూ, భాషతోనూ, అక్కడి మాండలికాలతోనూ, వ్యక్తులతోనూ ఏ మాత్రం పరిచయం లేకుండా, అధ్యయనం లేకుండా ఎవరైనా ఆ ప్రాంతం గురించి వ్రాస్తే అది చప్పగా ఉంటుంది.
కవి స్వీయానుభవం లోంచి కావ్యం పుట్టినప్పుడే రసపుష్టి కలుగుతుంది. రచన లో రసరమ్యత కవి సాధికారికతను బట్టే వస్తుంది. అంతటి సాధికారికతను కలిగి ఉండటమే రసికత.
పాండురంగ మహాత్యం కావ్యంలో అయుతుడు అనే ఒక పాత్ర ఉంది. చదువంటే అయుతుడికున్న శ్రద్ధకి మెచ్చి అతని గురువు అగస్తుల వారు బ్రహ్మనడిగి అందమైన అమ్మాయిని తెచ్చి పెళ్ళి చేసుకోమంటాడు. అతను గురువు మాట కాదని హిమాలయాలకు తపస్సుకు పోతాడు. అతని ఉగ్ర తపస్సు ఘాటుకు ఇంద్రుడికి ‘ఆవరసం” తాగినంత పనౌతుంది. దాంతో ఇంద్రుడు ముసలి వేషంలో దిగివస్తాడు. ఎలాగైనా అయుతుడి చేత తపస్సు మాన్ఫించి పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు. ఇది ఈ పద్యానికి సందర్భం.
“సంసారం వద్దనీ, మోక్షం కోసం పాకులాడాలనీ రోజూ డబ్బాల్లో రాళ్ళు పోసి గిలకొట్టినట్టు టీవీల్లో ఎడాపెడా వాయిస్తూ వేదాంతులు చేసే వ్యాఖ్యానాలూ, ప్రవచనాలూ, ప్రసంగాలూ ఇవన్నీ నిజం అనుకుంటున్నావా..? అదంతా ‘కలలో వార్తలు విప్పిచెప్పడం’ లాంటిది” అని సాక్షాత్తూ ఇంద్రుడే చెప్పినట్టు నిర్మాహమాటంగా వ్రాశాడు తెనాలి రామకృష్ణ.
కలలో వార్తలు విప్పి చెప్పే అలవాటు హానికరం కూడా! స్వర్గ నరకాల గురించీ, మరణాంతర జీవనం గురించి, మోక్షాల గురించీ పదే పదే చెప్పిందే చెప్పి, అదేపనిగా విసిగించే వ్యక్తులు తమ అనుభవంలో లేని, తాము ఎరగని, తాము చూడని విషయాల గురించి ఇంత ఊదర గొడుతుంటే నోళ్ళు తెరుచుకుని మనం వినటం కూడా పొరబాటే!
సమాజనీతి గురించి, లోకరీతి గురించి, సమజీవనం, సహజీవనాల గురించీ కనీస ప్రస్తావన కూడా చెయ్యకుండా సమకాలంలో తాము జీవిస్తున్న సమాజం గురించి పూర్తిగా వదిలేసి, ఊరకే కలలో వార్తలు విప్పి చెప్తుంటారని 500 యేళ్ళ క్రితమే తెనాలి రామకృష్ణుడు ఈసడించుకున్నాడు. అప్పటి పరిస్థితి నేటి పరిస్థితికి నకలుగానే ఉన్నదని కూడా అర్ధం చేసుకోవచ్చు.
ఇలాంటి ఉత్తుత్తి ప్రవచన కారుల్ని ‘ముండధారులు’ అన్నాడు తెనాలి రామకృష్ణ. అంటే బోడి తలలవాళ్ళని! బుర్ర పైనే కాదు, బుర్రలోపల కూడా ఏమీ లేనివాళ్లనేది ఇందులో వ్యంగ్యం.
వీళ్ళు చెప్పే మోక్షం ‘చింతకాయ కజ్జెం’ లాంటిదని కూడా అన్నాడు. కజ్టెం అంటే కజ్జికాయ అనే స్వీటు. చింతకాయతో చేసిన కజ్జెం ఎలాంటిదో సరుకులేని ప్రవచనకారుల వచనాలు కూడా అలాంటివే నన్నాడు. స్వీయానుభవం లోకానుభవం లేని ఊహాత్మకాంశాల మీద అంత ఎక్కువ ప్రచారం మంచిది కాదని, దేవుడి గురించి చెప్పేవన్నీ ఈ జన్మలో నరోత్తముడిగా, దేవుడిలాంటి మనిషిగా ప్రతి ఒక్కరూ మారాలనే లక్ష్యంతో సాగితే, సామాజిక ప్రయోజనం నెరవేరినట్టౌతుందనీ దీని భావం.
పత్రికాకారులైనా, ప్రవచనకారులైనా, వచనకారులైనా, వచనకవులైనా, కవులైనా కలలో వార్తలు విప్పిచెప్పటం వలన ఈ లోకానికి ఒరిగేదేమీ ఉండదు. వార్తల్లో వ్యక్తిగా రాణించటం మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది ఇందులో హితవు.
పద్యంలో కరకరలు
నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభి ద్గిరిభి
త్కరి కరిభి ద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై (తెనాలి రామకృష్ణ – చాటువు)
మొదట దెబ్బ కొట్టే అవకాశం శత్రువుకు ఇవ్వకూడదని శాస్త్రం. మన సినిమాల్లో హీరోలు రెండు మూడు దెబ్బలు తిని, పెదవి చిట్లి ఆ నెత్తురు చూసుకున్నాక అప్పుడు పౌరుషం తన్నుకొచ్చి ఎగిరెగిరి తంతారు. నాటకీయత కోసమే ఈ పెదవి చిట్లే సీను!
తెనాలి రామలింగ కవి మామూలు కవి కాడు. కవివీరుడు. అంటే తిక్కనకవిగారిలాగా కత్తిపట్టి యుద్దాలకెళ్ళే వాడని కాదు! అవతలివాడు కళ్ళు తిరిగి కిందపడి గెంతేలా పదప్రయోగాలు చేసి, భయపెట్టటం ఒక్కటే ఆయనకు తెలిసిన విద్య. నోరున్నవాడిదే రాజ్యం అని నిరూపించిన కవి తెనాలి రామలింగడు.
ఇందులో ఆయన కరినీ గిరినీ ఎంచుకున్నాడు. రెండో అక్షరం ‘ర’ ఉండేలాగా పదాలు పేర్చుకున్నాడు. కృష్ణరాయలుతో పద్యం మొదలు పెట్టాలి. ‘రికారం రెండో అక్షరం కావాలంటే, కృష్ణరాయలి బంధుమిత్రువుల పేరు చెప్పి వారికి బంధువైన కృష్ణరాయా.. అని రాయాలి. లేదా శత్రువుల పేర్లు వెదికి వారికి శత్రువా అని సంబోధించాలి. బాగా వెదికాడు.
కృష్ణరాయలు తండ్రిపేరు నరసరాయలు. తమిళులకు తండ్రి పేరు ముందు చెప్పుకునే సాంప్రదాయంలాగే, గౌతమీ పుత్ర శాతకర్ణి, మాదయగారి మల్లన.. ఇలా తండ్రుల పేర్లో తల్లుల పేర్లో ముందు చెప్పుకునే సాంప్రదాయాన్ని తెలుగువాళ్ళూ పాటించారు. తెనాలి రామకృష్ణకవి “నరసింహ కృష్ణరాయా!” అంటూ ఈ పద్యాన్ని మొదలుపెట్టాడు. ఆయన చేతికి అరుదైన కీర్తి దక్కిందంటాడు. ఇంక అక్కణ్ణించీ ఈ పద్యంలో కేవలం పదాల కరకరలే తప్ప భావాల ఘుమాయింపు లేవీ ఉండవు. తను వండదల్చిన ఆ లడ్డూ పదార్థం తినడానిక్కాదు, ఎదుటివాడి పళ్ళూడగొట్టటానికి కదా..! వర్ణించేది కృష్ణరాయలి కీర్తిని! అది అరుదైంది. ఆ కీర్తి తెల్లగా ఉందని చెప్పాలి. అందుకని తెల్లని అరుదైన విషయాల్ని ఎంచుకున్నాడు.
కరిభిత్- గజాసురుణ్ణి చంపినవాడు శివుడు. ఆయన తెల్లగా ఉంటాడు.
గిరిభిత్కరి- పర్వతాల రెక్కల్ని తన వజ్రాయుధంతో నరికిన ఇంద్రుడి ఏనుగు ‘ఐరావతం’ తెల్లనిది.
కరిభిద్కరి- గజాసురుణ్ణి చంపిన శివుడి కొండ ‘కైలాసం’. అది తెల్లగా ఉంటుంది.
కరిభిద్గిరి భిత్తురంగ కమనీయం- ఇలా కరిభిత్తు, గిరిభిత్మరిభిత్తు అయిన శివుడి తురంగం అంటే వాహనం నంది. అది తెల్లగా ఉంటుంది. అది కమనీయం. కమనీయమైనవి ఉత్సవ శోభని కలిగి తెల్లగా ఉంటాయి.
కృష్ణరాయల కీర్తిని అరుదైన తెల్లని విశేషాలతో పోల్చి అంతటిది అని చెప్పటమే కవి ఆశించిన ప్రయోజనం. ఈ కరకరల కవిత్వానికి ఇంతకు మించి ప్రయోజనం లేదు. డబ్బాలో రాళ్ళు పోసినట్టు గడగడలాడిస్తే నోరు తెరుచుకు వింటారు జనం. కొన్ని పద్యాలను ఇలా ప్రయోగించి, సభారంజకత్వాన్ని సాధించవచ్చు.
ఆపాతమధురం అని ఒక చక్కని ప్రయోగం ఉంది. అంటే వినంగానే గొప్పగా ఉందనిపించటం! వినగానే బావుందనిపించింది అంటే, వినగా వినగా గొప్పగా లేదనిపిస్తుందనే వ్యంగ్యం కూడా ఈ మాటలో ఉంది. ఈ పద్యం కూడా ఆపాతమధురమే. ఆపాతం అంటే, ముంచు కొచ్చినట్టు వెల్లువలా వచ్చి మధురంగా ఉన్నదనిపించటం. పకోడీలు కరకరమంటూ ఆపాతమధురంగా ఉంటాయి. ఆ తరువాత కదా కడుపులో గడబిడ పుట్టి వాటి అసలు సంగతి తెలిసేది! కరిభిత్, గిరిభిత్మరిభిత్ పద్యం అర్థం తెలిసే వరకూ అది మధురమే! ఆ తరువాత తెల్లబోవటమే మనవంతు అవుతుంది!
కనిపించనివే గొప్ప
“వరబింబాధరమున్,పయోధరములున్ వక్రాకంబుల్ మనో
హర లోలాక్షులు చూప కవ్వలి మొగంబైనంత యేమాయె, నీ
గురు భాస్వజ్ఞఘనంబు క్రొమ్ముడియు మాకుంజాలదె గంగ క
ద్దరిమే లిద్దరి కీడునున్ గలదె యుద్య ద్రాజబింబాననా!” (తెనాలి రామకృష్ణ చాటువు)
తెనాలి రామకృష్ణుడి పాత్రని అక్కినేని నాగేశ్వరరావు, చంద్రమోహను లాంటి అందగాళ్ళు వేశారు కాబట్టి రామకృష్ణ కూడా అలాగే అందమైన వాడని ఊహించుకుంటాం. కానీ, పరిశీలకులు ఆయన అందంగా రాసే కవే గానీ, “అందమైన బావా.. ఆవుపాలకోవా..” లాంటి వాడేమీ కాదనే భావిస్తారు.
ఆయన ఓ రోజు ఏ కూరగాయలు కొనుక్కోవటానికో మార్కెట్టుకు బయల్దేరాడు. కొంటెవాడు కాబట్టి అక్కలవాడగా పిలువబడే రెడ్‌లైట్ ఏరియా మీదుగా నడిచి వెడ్తున్నాడు. ఏ అమ్మాయి కళ్లలోనైనా పడక పోతానా.. అని అటూ ఇటూ వెదకులాడుతో నడుస్తున్నాడు. ఓ ఇంటి ముందు తనకు తగ్గ ఓ సుందరి కనిపించింది. ఆమె అతన్ని చూసింది. అతని భయంకరమైన పళ్ళు చూసి భయపడిందో లేక అతని ముగ్ధ మోహన రూపానికి అచ్చెరువొందిందో గాని.. ఠక్కున తలుపు చాటుకు ముఖం దూర్చేసింది. నడుముకు పైభాగం అంతా తలుపు వెనకాల ఉండగా, నడుముకు కింది భాగం అంతా తలుపుకు ఇవతలవైపున ఉంచి గుమ్మంలో వయ్యారంగా నిలబడింది. అతను మాత్రం ఆమె తనను చూసి సిగ్గుతోనే అలా చేస్తోందని అనుకున్నాడు.
ఉదయిస్తున్న నిండు పున్నమి చంద్రుడు మబ్బు చాటున నక్కి చూస్తున్నట్టు, సగం శరీరాన్ని మాత్రమే చూపిస్తూ నిల్చున్నదానా.. అని ఆమెను ‘ఉద్వద్రాజబింబాననా’ అని పిలిచాడు.
కనిపించిన వాటికన్నా కనిపించని వేవో గొప్పవనేది మానవ సహజమైన ఆశ. చాలా పెద్దదైన ఆ నడుముని చూసి ఆమె వక్షోజాల పరిమాణాన్ని ఊహించుకున్నాడు. నీ జఘనమే ఇంత ఘనంగా ఉంటే. నీ క్రొమ్ముడి అంతకంటే సౌకర్యవంతంగా ఉంటే, అటువైపు దాక్కున్న సోయగాలు కూడా ఘనంగానే ఉంటాయీ.. అని ఊహించాడు. మొత్తం మీద ఆమె అందగత్తేనని నిర్ధారించుకున్నాడు.
“మబ్బుచాటున సగం దాగిన చంద్రబింబమా! నీ ఎర్రని పెదాల్ని చీకట్లోకి చాన ముఖంలో శృంగార చిహ్నాలైన అలకల వంటివి కనిపించకుండా దాచేశావు. చూడగానే ఐసైపోయే నీ కళ్ళని ఆ వైపే ఉంచేశావు! ఇంక నీ వక్షోజాల గొప్పతనం చెప్పనవసరంలేదు. వాటిని కూడా ఆ వైపే అట్టేపెట్టేశావు” అన్నాడు. ఇది ఒక విధమైన నిందాస్తుతి! బావున్నవంటూ పొగుడుతూనే సరిగా చూడనివ్వలేదని ఎత్తిపొడుస్తున్నాడు. ఆమాటలకు ఆమె నవ్వుకునే ఉంటుందని భావించాడు. ఆ అక్కలవాడ చిన్నదానికి ఈ మహాకవి మాటలు అర్థం అయి అది నిజంగానే నవ్వుకుందా లాంటి ప్రశ్నలు అప్రస్తుతం. రసపట్టులో తర్కం కూడదు.
ఆ తలుపుని గంగా ప్రవాహంతో పోల్చాడు. ఆ తలుపుకు ఇటు వైపున ఉన్న ‘శరీర దిగువ భాగం’ నదికి ఈవలిగట్టు అయితే, తలుపుకు అవతలి భాగాన దాగున్న చంద్రబింబం లాంటి ముఖమూ, వక్షోజాలు వగైరా ఆవలి గట్టు. ‘గంగకద్దరి మేలిద్దరి కీడునున్ గలదె..’ గంగానదికి అటు గట్టు మేలు, ఇటు గట్టుకీడు అనేది ఉంటుందా..? అని ప్రశ్నించుకున్నాడు. ఇటు వైపు కనిపించే జఘనాదులు తనకు చక్కగా సరిపోయేవే కాబట్టి, నడుము పైభాగాన ఉండే వక్షోజాదులు కూడా చాలినవే అయి ఉంటాయని ఆశించాడు.
ఈ పద్యంలో అసలు గమ్మత్తంతా ‘గురు భాస్వజ్జఘనంబు’ అనటంలో ఉంది. సాధారణంగా అందమైన ఆడపిల్ల నడుముని సన్నగా నాజూకుగా ఉండే వాటితో పోలుస్తారు ఎవరైనా! కానీ తెనాలి రామకృష్ణ కవి గురు భాస్వజ్జఘనంబు-ఆమె చాలా లావైన నడుము కలదనీ, ఆ నడుము తనకు చాలినదేననీ ఘనంగా చెప్పుకున్నాడు. దాన్ని బట్టి తెనాలి కవి వరేణ్యుడి ఆకారాన్ని ఎవరైనా ఊహించుకోవచ్చు! ఆమె లావైన నడుము ఈయన లావైన పొట్ట బరాబరు అన్నమాట.
నిజానికి తెనాలి కవి భీకరమైన ఎత్తుపళ్ళ వాడనీ, కృష్ణదేవరాయలు పొట్టిగా పీలగా ఉంటాడనీ, ముఖం స్ఫోటకం మచ్చలతో వికారంగా ఉంటుందనీ కొందరు పరిశోధకులంటారు. కానీ, జాతి హీరోలుగా మన భావాల్లో నిలిచిపోయిన వాళ్ళని అలా అందమైన రూపాల్లో ఊహించుకోగలగటమే శ్రేయస్కరం. రామకృష్ణుడు అందగాడేనని మనం నమ్మితే వచ్చే అపకారం ఏమీ లేదు. కాదని నిరూపించేందుకు కసరత్తు చేయటం వృథా ప్రయాస. ఈ చాటు పద్యానికి వేరెవరో ఊబకాయుడే కర్త!
పట్టుబట్టిన వాడిదే గెలుపు
నిలువున నొలిపించె విలువంగడమునెల్ల
శరముల యాయంబు బొరయుటుడిపెఁ
దగ శబ్ద మాత్రపాత్రముచేసె గుణలత
మ్రాఁకునఁ గట్టించె మౌలబలముఁ
గంచుకివశము గావించె సేనానాథుఁ
గట్టించె సహచరుఁ గటికి యెండఁ
బ్రతిపక్షభావ సంగతుఁడని హితుఁజూచె
వర కేతనము కీర్తి భరము డులిపె
ధర్మనిర్మల బుద్ధి సుశర్మఁగదిసి
గెలువఁగాలేక చని కోపగించి మదనుఁ
డురక తనవారలతనికి నోడుమని రె
పతికిఁగీడౌత బంట్ల పాపంబుగాదె?
తెనాలి రామకృష్ణుడు పాండురంగమహాత్యంలో సుశర్మోపాఖ్యానంలో చెప్పిన పద్యం ఇది. పట్టు పట్టకూడదు. పడితే విడవకూడదని వేమనగారు చెప్పినట్టు సుశర్మ, మంచికో చెడుకో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంక అంతే! దానికి తిరుగు ఉండకూడదని భావించాడు. ధర్మనిర్మల బుద్ధి సుశర్మ! అది అతని స్వభావం అన్నమాట. అతన్ని కదిసి అంటే గెలవలేక చేసేది లేక పరువు పోయిందని బాధపడి ఆ కోపంతో మన్మథుడు ఏం చేశాడో ఈ పద్యంలో వర్ణన! సుశర్మ అనేవాడు నిండు యవ్వనంలోనే సన్యసించాడు. అతన్ని సంసారపు దారుల్లోకి తేవాలని మన్మథుడు ఎంతో ప్రయత్నించి చివరికి ఓడిపోయాడు. ఆ ఓటమిని ఇలా చూపిస్తున్నాడు తెనాలి కవి!
- మన్మథుడి విల్లు చెరకుగడ (విలువంగడం). తన విల్లు తనకు ఎందుకూ పనికి రాకుండా పోయిందని కోపంగా ఆ చెరకుగడని నిలువునా వలిపించేశాడు. ధనస్సు వంశాన్ని అంటే మొత్తం చెరకు తోటనే నరికించి ఆకులు వలిపించి చెరకుగడల్ని వేరు చేశాడు.
- మన్మథుడి పుష్పబాణాలు ఇన్నాళ్ళూ మన్మథుడికి ఊడిగం చేశాయి. ఇప్పుడు అవి సరిగా పని చేయలేకపోయాయి కాబట్టి వాటి జీతాన్ని ఆపేశాడట. శరాలు ఆయం (రాబడి) పొరయుట (పొందటం) ఉడిపెన్.. నిలుపు చేశాడట.
- కొందరు ముఖ్యమంత్రులో. ప్రథానమంత్రులో అపనమ్మకం ఉన్న వ్యక్తుల్ని మినిష్టర్ వితౌట్ పోర్ట్ ఫోలియో -ఏ శాఖనూ అప్పగించకుండా ఉట్టి మంత్రి పదవి నిచ్చి కూర్చోపెడతారు. అదొకరకం గౌరవపూర్వక శిక్ష. ఒక ధనస్సుని వాడకుండా నిలువునా కొరత వేయించి నప్పుడు, ఇంక వింటినారి నామమాత్రం అయిపోతుంది కదా! గట్టిగా లాగితే రుంకారం చేస్తుంది. అంతే! కొందరు మనుషులు “లేచానంటే మనిషిని కాను” అనీ, “నేనే గనక తలుచుకుంటే..” అనీ ఉత్తినే వాగాడంబరంతో కాలక్షేపం చేస్తుంటారు చూశారా.. అలా, “దగ శబ్ద మాత్రపాత్రముచేసె గుణలతన్” ఈ వింటినారిని కూడా పేరుకు తప్ప దేనికీ పనికిరాని దాన్ని తెంచేశాడట మన్మథుడు.
- తన మూలబలాన్నే (ప్రధాన సైన్యాన్ని) మ్రాకులకు (చెట్లకు) కట్టించేశాడట.
- సాక్షాత్తూ తన సైన్యాధిపతిని అంతఃపుర రక్షకుడికి అప్పగించేశాడట.
- ఇంక తన సహచరుడు, నేస్తుడూ అయిన వసంతకుణ్ణి కటిక ఎండలో కమరించె – అంటే, నిలబెట్టాడట, వసంత బుతువు చైత్ర వైశాఖమాసాలలో వస్తుంది. చెరకు పంట చేతికొస్తుంది. ఎండలు ముదురుతుంటాయి. నాట్లయ్యాక ఖాళీగా కూర్చుని ఎంకితో కాలక్షేపం చేసిన నాయుడు బావ మళ్ళీ వ్యవసాయం పనుల్లోకివచ్చి పాపం ఎండలో అల్లాడిపోతుంటే మన్మథుడు వేసిన శిక్షలా ఉన్నదని చమత్కారం.
- స్నేహితుణ్ణి కూడా ప్రతిపక్ష భావనతో చూశాడట మన్మథుడు. ఆ హితుడు ఎవరు? చంద్రుడికి కృష్ణ, శుక్ల పక్షాలు రెండు ఉంటాయి. అలాంటి పక్షాలు గలవాణ్ని ప్రతిపక్షభావనతో చూశాడు.
- మన క్రికెట్ట్ వీరులు గెలిచినప్పుడు జెండా ఎగరేసుకుంటూ గ్రౌండంతా తిరుగుతారు. ఓడినప్పుడు తలవంచుకుని, బ్యాట్లు నేలకేసి కొట్టుకుంటూ మౌనంగా లోపలికి పోతుంటారు. అలాంటి స్థితిలో ఉన్నాడు మన్మథుడు. ఓడి పోయిన పార్టీ వాళ్ళిచ్చిన బిరుదుల్ని గెలిచిన పార్టీ వాళ్ళు రద్దు చేయటం ఒక శిక్ష!
మన్మథుడి జెండా మీద చేప గుర్తు ఉంటుంది. చేపని పట్టుకున్నప్పుడు దాని వంటికి అంటిన బురద దులిపినట్టు, మన్మథుడు తన జెండాని దులిపేశాడు.
ఓడినవాడి మనోగతాన్ని, శ్రామికుడి చైతన్యాన్ని. గెలిచినవాడి పట్టుదలనీ అన్నింటినీ కలగలిపి ఈ పద్యంలో ఒకేచోట చేర్చటం గొప్ప ప్రయోగం! చివరికి అంటాడు, తమ నాయకుడు ఓడి పోవాలని సేనలూ, సేనాథిపతులూ, సహచరులూ కోరుకున్నారా..? కానీ, సేవకుల పాపంగా శిక్షలు వాళ్లకి పడ్డాయని!
తెలుగువారి ఫ్రైడ్ రైస్ ‘ద్రబ్బెడ’
ఆల ఘృతంబు వేఁడియగునన్నము నుల్చిన ముద్దపప్పు క్రొం
దాలిపు కూర లప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్
మేలిమిపిండివంటయును మీఁగడతోడి దధిప్రకాండమున్
నాలుగు మూఁడు తోయముల నంజులు గంజదళాక్షి పెట్టఁగన్
‘హరిలీలావిలాసం’ కావ్యంలో తెనాలి రామకృష్ణ పద్యం ఇది. ఆవునెయ్యి, వేడన్నం, ఉడికించి ముద్దగా అయ్యేలా నులిచిన ముద్దపప్పు, అప్పుడే తాలింపు పెట్టిన ఇగురు కూరలు, అప్పడం, ద్రబ్బెడ, చారు (రసం) పానకం, మేలిమి పిండివంటలు, మీగడపెరుగు, నాలుగు మూడు రకాల కమ్మని రోటి పచ్చళ్లు వీటిని ఆ కంజదళాక్షి వడ్డించిందట.
తెనాలి రామకృష్ణుడు ఈ ద్రబ్బెడ వంటకాన్ని సుశీల సాక్షాత్తూ శ్రీకృష్ణుడికి వడ్డించిన వంటకాల పట్టికలో కూడా ప్రస్తావించాడు.
“ఒకికొన్నివడియంబు లొక కొన్నివరుగులు,
ఒక కొన్ని తెఱగుల యొలుపుఁబప్పు
లొక కొన్నిదబ్బెడ లొక కొన్ని తాలింపు..” లంటూ చెప్పిన వంటకాలలో కొన్ని పేర్లు అర్థంకాక మనల్ని భయపెడతాయి. అర్థం చేసుకుంటే ఇంతేనా అనిపిస్తాయి.
ద్రబ్బెడ అంటే ఏది?
‘ఆంధ్రవాచస్పత్యము’ ఇంకా ఇతర నిఘమ్తువులు ద్రబ్బెడని ‘ఒక భక్ష్యం” అని వదిలేశారు. మేలిమి పిండివంటల్ని తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి, ద్రబ్బెడ అనేది భక్ష్యం (A kind Of cake) కాకపోవచ్చు.
మరీ ముఖ్యంగా, పైన ఉదహరించిన ఒక కొన్న వడియములు పద్యంలో పేర్కొన్నవన్నీ భోజనంతో పాటుగా మనం తినే పదార్థాలే కాని, చిరుతిండికి సంబంధించినది (snacks) అందులో ఒక్కటీ లేదు. కాబట్టి, ద్రబ్బెడ అనేది కూర, పప్పు, పులుసు, పచ్చడి లాంటి వంటకం లేదా పులిహోర లాంటి చిత్రాన్నం కావాలి.
పోతనగారు ఆంధ్రమహాభాగవతంలో జడభరతుడి గురించి వివరిస్తూ, “..సమ విషమ న్యూనాధికంబుల నెఱుఁగక ప్రవర్తిల్లుచు నూఁక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాఁడు ద్రబ్బెడ యాదిగాఁ గల ద్రవ్యంబుల యందు నమృతంబు పగిది రుచిసేసి..” అని వ్రాశారు.
భాగవతంలో భరతుడనే ఒక పాత్ర ఉంది. అతన్ని జడభరతుడని కూడా పిలుస్తారు. ఈ భరతుడెప్పుడూ ఆత్మానుభూతి పొంది ఆనందంగా ఉండేవాడు. అతనికి సుఖదుఃఖాలు తెలియవు. దేహంపై ఏమాత్రం శ్రద్ధలేదు. చలి, వేడి, గాలి, వానలకు భయపడేవాడు కాదు.
ఒంటిమీద బట్ట కప్పుకునేవాడు కాదు. మట్టిలో మాణిక్యంలా బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు.
ఇదంతా చూచి సవతితల్లి కొడుకులు కొంతకాలం అతనికి పొలం పనులు అప్పజెప్పారు. అయినా ఆ పనులేవీ అతనికి తెలియవు. మంచివా, చెడ్డవా, చిన్నవా, పెద్దవా అనే ఆలోచన లేకుండా చెప్పిన పనులు చేసేవాడు. అతని సోదరులు నూకలు, తవుడు, తెలికపిండి, ఊక, పొట్టు, మాడుచెక్కలు ఏవి పెట్టినా వద్దనకుండా తినేవాడు. వాటిని అమృతంలాగా భావిస్తూ ఆప్యాయంగా భక్షిస్తూ పొలానికి కాపలా కాస్తుండేవాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి పోతన శ్రీమహాభాగవతము 3వ సంపుటిలో పోతనగారు వచనంలో రాసిన ఈ సందర్భానికి వ్యాఖ్యానం చాలావిపులంగా ఉంది. “సరి అయినవీ, సరి కానివి అనీ, తక్కువ, ఎక్కువ అనీ తెలీని ఆ అమాయకుడు నూకలు, తవుడు, గానుగపిండి, ఊక, మాడు, ద్రబ్బెడ= రొట్టె ఇలా ఎవరేది పెట్టినా అమృతంగా తినేవాడని అర్థాన్ని వివరించారు.
ఇక్కడ ద్రబ్బెడ అంటే రొట్టె అని అర్థాన్ని స్పష్టంగా వ్రాశారు. జడభరతుడికి పెట్టిన పదార్థాలు తినటానికి పనికి రానివి. అయినా ఆయన తిన్నాడన్నది ఇందులో ఇతివృత్తం. వీటిలో రొట్టెనే పెట్టి ఉంటే ఆక్షేపించ వల్సింది ఏమీ లేదు కదా..! కాబట్టి, ఈ పద్యంలో ప్రస్తావించిన ద్రబ్బెడ ఒక రొట్టే అయ్యేందుకు అవకాశం లేదు.
పోతనగారి భాగవతం ఆంధ్రానుసరణం కాబట్టి, మూలభాగవతంలో ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని వెదికితే, ఇదే సందర్భంలో “నూఁక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాఁడు ద్రబ్బెడ” అని పోతనగారు వ్రాసిన చోట “కణ పిణ్యాక పరాకరణ కుల్మాష స్థాలీపురీషాదీ” అని వ్యాసులవారు వ్రాశారు.
కణ=నూక, పిణ్యాక=తెలికపిండి, పరాకరణ=పారేసే పొట్టు, కుల్మాష= A hotchpotch of half-boiled rice and pulse ఉడికీ ఉడకని వంటకాలు, స్థాలీపురీషం=అన్నం వండిన కుండ అడుగున మాడు ఇవీ జడభరతుడికి పెట్టిన పదార్థాలని వ్యాసులవారు వ్రాశారు.
పోతనగారి అనువాదం ప్రకారం, నూక+తవుడు, తెలికపిండి, పొట్టు(ఊక) ఇవన్నీ ఉన్నాయి. కుల్మాష (కుల్మాస) ఒక్కటే మిగిలింది. కుల్మాషాన్ని పోతనగారు ప్రస్తావించలేదు. స్థాలీపురీషం అనే దాన్ని మాడుద్రబ్బెడగా అనువదించారు.
ద్రబ్బెడ అనే చిత్రాన్నం (కలగలుపు-అనేక ద్రవ్యాలు చేర్చి వండిన అన్నఫు వంటకం) కావచ్చని దీన్ని అర్థం చేసుకోవచ్చు. దాన్ని తయారు చేస్తుండగా అది మాడితే దాన్ని మాడు ద్రబ్బెడ అని పోతనగారు వ్రాసి ఉండాలి. తినటానికి పనికిరాని మాడుద్రబ్బెడ తెచ్చి ఒకావిడ జడభరతుడికి పెట్టిందని తాత్పర్యం. మాడని ద్రబ్బెడ కమ్మని ప్రైడ్ రైస్ లేదా ఖిచ్చిడీ లాంటి వంటకం అయి ఉంటుంది!
‘దబ్బడము’ అంటే, మూకుడు. దబ్బడించు అంటే మూకుటితో మూయటం, అరచేతితో చరచటం అని! దీని ఆధారంగా, పోతన భాగవతానికి తితిదే వ్యాఖ్యాతలు ద్రబ్బెడ పదానికి రొట్టె అని ఇచ్చిన అర్థాన్ని కూడా ఒకవిధంగా సమర్థించవచ్చు. అరచేతితో చరిచి చేసే రొట్టె (తప్పాలచెక్క) ద్రబ్బెడ లేదా దబ్బెడ అయి ఉండవచ్చు కూడా! కానీ, స్థాలీపురీషం అని వ్యాసులవారు చెప్పిన దాంతో సమన్వయం చేస్తే, ద్రబ్బెడ కమ్మని ప్రైడ్ రైస్ లాంటి వంటకమేనని నిర్థారణ అవుతోంది!
(సమాప్తం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.