Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెనాలి రామకృష్ణ-1

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘తెనాలి రామకృష్ణ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది 1వ భాగము.]

భువన విజయంలో అష్టదిగ్గజాలు అనే ఎనిమిది మంది తెలుగు కవులు ఉండేవారని, వారు తన యావత్సామ్రాజ్యంలో ప్రసిద్ధులైన వారని, వారికి మించిన వారు ఏ భాషలోనూ లేరని రాయలవారు ఏ సందర్భంలోనైనా ప్రకటించారా?

ఒకవేళ అష్టదిగ్గజాలనేది ప్రభుత్వ గుర్తింపు కాదనీ, ప్రజా గుర్తింపేననీ అనుకునేట్లయితే ఆ గుర్తింపును ఈ ఎనిమిది మందిలో ఏ ఒక్కరైనా తమ రచనల్లో కనీసం ఒక్కరయినా ప్రస్తావించిన వారున్నారా?

అష్టదిగ్గజాలతో సంబంధం లేకుండా తెనాలి రామకృష్ణుడి జీవిత చరిత్రను తేల్చటం సాధ్యంకాదు! భువన విజయం కథలన్నీ తెనాలి రామకృష్ణుడి చుట్టూ ముడిపడి సాగినవే! అష్టదిగ్గజాలలోని వాడు కాకపోతే తెనాలి రామకృష్ణుడి కథలన్నీ కల్పితాలే అవుతాయి!

అష్టదిగ్గజాలు-తెనాలి రామకృష్ణ

అష్టదిగ్గజాలలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన ఇద్దరూ నిస్సందేహంగా రాయలవారి సమకాలికులు. వయసులో ఆయనకన్నా కొద్దిగా పెద్దవాళ్లు కావచ్చు కూడా! ఆ ఇద్దరూ రాయల పాలనా వైదుష్యాన్ని ఘనంగా ప్రస్తావించారు కూడా! కానీ వారిద్దరూ కూడా.. మనుచరిత్రలోనో పారిజాతాపహరణంలోనో తాము అష్టదిగ్గజాల్లో ఉన్నామని చెప్పుకోలేదు.

ఆ రెండు రచనలూ వెలువడే నాటికి ఇంకా అష్ట దిగ్గజాలను ఏర్పరచలేదేమో.. అని సమాధానం చెప్పుకున్నప్పటికీ, ఇతర దిగ్గజ కవులు కూడా తాము దిగ్గజాలమని తమ రచనల్లో ప్రస్తావించలేదు. అష్టదిగ్గజాల్లో చేరాక వీళ్లెవరూ ఏ రచనా చెయ్యలేదని భావించాల్సి వస్తుంది! అది వారి వ్యక్తిత్వాన్ని కించపరచటమే అవుతుంది. కాబట్టి, అష్టదిగ్గజాలనేవారు ప్రజల్లో ఏర్పడిన ఒక భావనే గానీ భువనవిజయ సభా భవనంలో ఏర్పడ్డవారు కాదని స్పష్టం అవుతోంది!

ఈ అష్టదిగ్గజాలనేవారు తెలుగు కవులనీ, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, మాదయగారి మల్లన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వీళ్లే అష్టదిగ్గజాలని 1938లో పురావస్తుశాఖవారు ‘సౌతిండియా యాన్యువల్ రిపోర్టు’లో ఉంది. ప్రజల్లో వ్యాప్తిన ఉన్న కథనాన్నే ఎలాంటి ఆధారాలూ చూపకుండా ప్రచురించారు.

“అష్టదిగ్గజాలంటే కేవలం కవులేనా? ఇతర రంగాల్లో దిగ్గజాలు ఉండరా?” అని పింగళి లక్ష్మీకాంతంగారూ ప్రశ్నించారు. ఈ దిగ్గజాలంతా తెలుగు కవులే ననటాన్ని ఆమోదించలేదు. ఆరుద్రగారు ఈ 8మంది కవులెవరో వారి పేర్లేవో నికరంగా చెప్పలేమనీ, సంకుసాల నరసయ్య కూడా ఉండవచ్చనీ అన్నారు. వేటూరివారు అష్టదిగ్గజాల్లో అయ్యలరాజు రామభద్రకవి లేడన్నారు.

క్రీ.శ. 1520లో రాయలు కడప మండలం తిప్పలూరు అను గ్రామాన్ని సర్వాగ్రహారంగా అష్టదిగ్గజ కవీశ్వరులకు దానం చేసినట్లు శాసనం ఉంది. కానీ అందులో ఆ దిగ్గజాలు ఎవరో పేర్లు లేవు. వీరి వివరాలతో రాయలు వేయించిన శాసనం వేరే ఏదీ దొరక లేదు.

మైసూరు దగ్గర నందిదుర్గలో సోమేశ్వరాలయంలో కృష్ణదేవరాయల సంస్కృత శాసనాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రచురించారు. అందులో “అష్టౌకవిదిగ్గజాః” అని ఉంది. కానీ, ఏ ఒక్కరి పేరూ లేదు.

రాయల సమకాలీన ప్రముఖుల్లో తెలుగు తమిళ కన్నడ మళయాళ కవులు దిగ్గజాలనదగిన వారు అనేకమంది ఉన్నారు. అందరినీ వదిలేసి ఎనిమిది మంది తెలుగు కవుల్నే తన రాజ్యానికి దిగ్గజాలని ప్రకటించవలసిన అవసరం ఎంత తెలుగు అభిమాని అయినప్పటికీ రాయలవారికి లేనే లేదు. అఘోరశివాచార్యులు, ఆచార్య దీక్షితుల్లాంటి హేమాహేమీలనదగిన సంస్కృత పండితులు, అంతే దీటైన తమిళ కన్నడ కవులూ ఆనాడు ఉన్నారు. తెలుగు కవుల కోసం అష్టదిగ్గజాలనే ఏర్పాటు చేశాడనుకుంటే అటువంటి ఏర్పాట్లు తమిళ మళయాళ కన్నడ సంస్కృత భాషలకు కూడా చేసి ఉండాలి. చేయకపోతే రాయలవారి నిష్పక్షపాత పాలనకు మచ్చ అవుతుంది. కాబట్టి, తెనాలి రామకృష్ణుడి కల్పిత కథల లాగానే అష్టదిగ్గజాల కల్పన కూడా జరిగిందని నమ్మి తీరాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే అష్టదిగ్గజాల కల్పన జరిగాకే తెనాలి రామకృష్ణుడి కల్పితగాథల సృష్టి కూడా జరిగి ఉండాలి!

ఈ అష్టదిగ్గజాలనేది 8 మందితో కూడిన ఒక కమిటీ గానీ, ఒక తెలుగు సాహిత్య అకాడెమీ గానీ కానేకాదు.

తెలుగువారిలో మాత్రమే ప్రచారం ఉన్న ఈ అష్టదిగ్గజాలు అనే వ్యవస్థ ఇతర భాషా సాహిత్యాల్లో కనిపించదు. విక్రమాదిత్యుడి నవరత్నాలు, అక్బర్ అస్థానంలో నవరత్నాల మాదిరిగా తెలుగు వారు ఊహాత్మకంగా ఏర్పరచుకున్న వ్యవస్థ ఇది. ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న కథల ఆధారంగా ముఖ్యంగా చంద్రగిరి పాలకులు బహుశా ఈ అష్టదిగజ భావనను అధికారికంగా కొనసాగించి ఉండొచ్చు. ఆంధ్రరాజులైన తంజావూరు నాయకరాజులు, తరువాతి కాలంలో పెద్దాపురం, కార్వేటినగరం, గద్వాల లాంటి సంస్థానాలు ఈ సాహితీ సాంప్రదాయాన్ని కొనసాగించాయి. గోల్కొండ నవాబుల యేలుబడిలో ఉన్నసంస్థానాల్లో స్థానికంగా ప్రముఖులైన అష్టదిగ్గజ కవులుండే వారని నిడుదవోలు వేంకటరావుగారు వ్రాశారు.

రాయవాచకంలో “రాయలవారుంన్ను చాలా సంతోషబడి ముక్కు తింమ్మయ్య అల్లసాని పెద్దయ్య మాదనగారి మల్లన మొదలైన కవీశ్వరులతో కృతు లంద్దుకోవలెనని పారిజాతాపహరణమున్ను మను చరిత్రాను చెప్పుమని ఆనతిచ్చినారు.” అని ఉంది. ఇందులో ‘మొదలైన కవీశ్వరులతో..’ అనటం వలన మనం మిగిలిన వారిని ఊహించుకోవటమే గాని వారెవరో తెలీదు!

రాయవాచకాన్ని అనుసరించి కుమార ధూర్జటి కృష్ణరాయ విజయం అనే కృతి వ్రాశాడు. అందులో:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో
యతులితమాధురీమహిమ నా మును మీ పెదతాత చాల స
న్నుతిం గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్‌ విను మీవునట్లు మ
కృత్కృతబహుమానవైఖరుల గీర్తి వహీంపుము ధాత్రిలోపలన్”

అనే పద్యం కనిపిస్తుంది. ఇది చదివితే తెనాలి రామకృష్ణ సినిమాలో పెట్టిన చాటు పద్యం “స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గె నీ యతులిత మాధురీ మహిమ?” అని రాయలవారు పాడగానే రామకృష్ణకవి అందుకుని “హా తెలిసెన్” అంటూ పద్యాన్ని పూర్తి చేసిన ఘట్టం ఎవరికైనా గుర్తుకొస్తుంది.

కుమార ధూర్జటి పుత్రుడు లింగరాజు కూడా శ్రీకాళహస్తిమాహాత్మ్యం అనే మరో కావ్యం వ్రాశాడు. అందులో “కృష్ణరాయ కిరీట కీలిత మణిగణార్చిత పదాబ్జద్వయ శ్రీ వహించి” అంటాడు. రాయలవారితో అంతగా ధూర్జటికి అనుబంధం ఉన్నదనటానికి ఇది సాక్ష్యం. రాయల వారికి సన్నిహిత ప్రసిద్ధ దిగ్గజాలనదగిన పెద్దన, తిమ్మన, మల్లన, ధూర్జటి ఈ నలుగురికీ అష్టదిగ్గజకవులుగా ఉన్నంత అవకాశం తక్కిన కవులకు కనిపించటం లేదు.

తెనాలి కవి అసలు పేరేమిటీ?

తెనాలిరామలింగయ పేరుతో ఉద్భటారాధ్య చరితము, తెనాలిరామకృష్ణ కవి పేరుతో పాండురంగ మహాత్మ్యము, తెన్నలి రామకృష్ణుడు పేరుతో ఘటికాచల మహత్మ్యము అనే మూడు కావ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ముగ్గూరూ ఒకరేనా లేక వేర్వేరా.. అనే మీమాంసకు సంతృప్తికర సమాధానం లేదు. సమాధానం రాబట్టటానికి పండితులు చేసిన సర్కసు కసరత్తుల్లో ముఖ్యమైంది తెనాలి రామలింగయ్యే మతం మార్చుకుని తెనాలి రామకృష్ణుడయ్యాడని!

ఈ ప్రయత్నంలో తెనాలి రామకృష్ణుణ్ణి ఎవరి ముఖప్రీతికోసమో మతమూ, పేరు కూడా మార్చుకునే ఊసరవెల్లిలా చిత్రిస్తున్నా మనే వెరపు ఎవరికీ కలిగినట్టు లేదు. స్వంత లాభాల కోసం కులాల్ని మతాల్ని మార్చుకునే ఈ నాటి పరిస్థితుల కోణం లోంచి చేసిన ఆలోచనలివి! ఒక దశలో మన పెద్దలు వారికి తోచిన ఆలోచనలు చేశారు. కానీ పునర్మ్యూల్యాంకనం చేసుకుని వాస్తవికతను నిర్థారించాలని ఇప్పటి మనం ప్రయత్నించటం వారిని యద్దేవా చేయటానికి కాదు, తెనాలి రామకృష్ణుని పరువు నిలపటానికే!

కొర్లపాటి శ్రీరామమూర్తిగారి ప్రకారం క్రీ.శ. 1530లో ఉద్భటారాధ్య చరితము, క్రీ.శ. 1575లో పాండురంగమాహాత్మ్యము, క్రీ.శ. 1580లో ఘటికాచలమాహాత్మ్యము వెలువడ్డాయి! ఘటికాచల మహాత్మ్యం తెనాలి రామకృష్ణుడి చివరి రోజుల్లో చేసిన రచన. క్రీ.శ. 1500-10 మొదటి దశకంలో ఆయన జనించాడని,. 1580 ప్రాంతాల్లో మరణించి ఉంటాడని భావిస్తున్నారు. 1529 అక్టోబరు 17న రాయలవారు కాలం చేసే నాటికి ఈ తెనాలి కవి ఇంకా తొలికావ్యమే వ్రాయలేదు. 20-25 యేళ్ల ప్రాయం వాడు. అడపాదడపా ఎంతో కొంత వ్రాసినా ఆ వయసుకు అష్టదిగ్గజాలలో ఒక్కడయ్యే అవకాశమే లేదు! అసలు అష్టదిగ్గజాలనే భావనే ఒక కల్పిత భావన.

రామలింగయ్య- రామకృష్ణుల కథ

ఏ కవి జీవిత చరిత్ర నిర్ధారించాలన్నా కావ్యావతారికల్లో ప్రస్తావించిన అంశాలు, కృతి స్వీకర్త చరిత్ర, కావ్యంలో పేర్కొన్న అంశాలు ప్రధాన ఆకరాలౌతాయి. తన జన్మదినాన్ని స్వయంగా కవి చెప్పుకున్నా అది ప్రక్షిప్తమో నిజమో తేల్చాలసిన అవసరం కూడా ఉంటుంది!

తెనాలి రామలింగడు పేరుతో వ్రాసిన ఉద్భటారాధ్యచరిత్రము, తెనాలి రామకృష్ణుడు పేరుతో వ్రాసిన పాండురంగమాహాత్మ్యము రెండింటిలోనూ కవి గోత్రము, శాఖ, జననీజనకులు ఒకళ్ళే కావటం ఈ తికమకకు కారణం అయింది. చివరికి మతమార్పిడి కథ పుట్టటానికి, ఇంకా మరికొన్ని కొంటె ఊహలు కలగటానికి కారణం అయ్యింది.

ఈ తెనాలి కవి కౌండిన్యసగోత్రికుడు, శుక్షయజుర్వేదశాఖ. తండ్రి రామయ. ఇంతవరకూ ఉద్భటారాధ్య చరితము, పాండురంగ మాహాత్మ్యము కావ్యాలలో సమానంగానే ఉంది. తల్లి లక్ష్మమ అని పాండురంగమాహాత్మ్యంలోనూ, లక్కమాంబ అని ‘ఉద్భటారాధ్య చరితం’ లోనూ ఉంది. దీన్ని బట్టి మన విశ్లేషకులు తండ్రి రామయ గారికి ఇద్దరు పెళ్లాలని, పెద్దావిడ లక్ష్మమ్మ కొడుకు రామలింగడని రెండో ఆవిడ లక్కమాంబ కొడుకు రామకృష్ణుడని అవలీలగా ఈ చిక్కుముడిని విడదీసేశారు. లక్ష్మమ్మ, లక్కమాంబ ప్రకృతి వికృతి పదాలని మరిచారు. ఇవన్నీ పరాకాష్టకు చేరిన కల్పనా గాథలు. వీటికి ఆవగింజంత ప్రామాణికత లేదు. వినటానిక్కూడా ఇబ్బందిగా ఉంది.

తెనాలి రామభద్రకవి అని ఇంకో కవి ఉన్నాడు. ఆయన మన తెనాలికవి వంశీకుడే! ఇందుమతీ పరిణయం అనే కావ్యం వ్రాశాడు. అందులో మన తెనాలి కవి పూర్వీకుల గురించిన వివరాలున్నాయి: తెనాలి రామచంద్ర సుకవి అనే కవిగారికి అన్నగారు వీరరాఘవకవి అనీ, అతని తండ్రి ఇమ్మడి రామకృష్ణుడు, తాత శ్రీగిరి, పినతాత అన్నయకవి. పెదతాత పాండురంగాది సత్కృతికర్త రామకృష్ణకవి అనీ పేర్కొన్నాడు. దీన్నిబట్టి మన తెనాలిరామకృష్ణకవిగారికి తెనాలి అన్నయకవి అనే సోదరుడు గానీ తెనాలి రామలింగకవి అనే సోదరుడు లేడని స్పష్టం అవుతోంది. రామలింగయ్య రామకృష్ణుడూ అన్నదమ్ములనటమూ, లేదా రామలింగడే మతమార్పిడికి పాల్పడి రామకృష్ణుడయ్యాడనటమూ రెండూ అసత్య కల్పనలే నని కూడా ఈ పద్యం ద్వారా అర్థం అవుతోంది. సుదక్షిణా పరిణయం వ్రాసిన తెనాలి అన్నయ కవే ఈ అన్నయ కావచ్చు!

“నవ్యసుగుణాభిరామ తెనాలి రామ, పండితాగ్రణి సత్ఫుత్రు భవ్యమిత్రు/హరపదాంబోజ సౌముఖ్యు, నన్నపాఖ్యునన్న బిలిపించి యాదరోన్నతి వహించి” అనే వాక్యాలు తెనాలి రామపండితుడి పుత్రుడుగా ఈ అన్నయ కవి కనిపిస్తాడు.

“ఇది శ్రీమత్తెనాలి రామేశ్వర శాశ్వత కృపాకటాక్ష లక్షితకవితాభిరామ రామయిపండిత కుమార సహజ శైవాచార సంపన్న ధీమ దన్నయ నామధేయ ప్రణీతంబైన సుదక్షిణా పరిణయము నందు” అనే వాక్యాన్నిబట్టి రామపండిత కుమారుడు తెనాలి రామకృష్ణుడని తేలింది. ఈ రామపండితుడే తెనాలి విగ్రహ శాసనంలో రామధీమణిగా కనిపిస్తాడు. “పాలగుమి భీమగురుని సద్భక్తి గొలుతు” అని చెప్పటం వలన ఈ రామధీమణి కుటుంబం శివభక్తులే! కానీ, వీరశైవులు కాకపోవచ్చు. రామలింగయ్యది, రామకృష్ణయ్యది కూడా తెనాలి అగ్రహారమే! కాబట్టి, ఇద్దరూ ఒకరేనన్నదానికే పండితులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

ఉద్భటారాధ్య చరిత్రము ముక్త్యాలలోని సరస్వతీ పత్రికలో అచ్చయ్యింది. ఘటికాచల మాహాత్మ్యం 1892లో కళావతీ ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. పాండురంగ మహాత్మ్యం శ్రీమాన్ తెన్మఠం శ్రీరంగాచార్యులు గారి లఘు టీకతో ముద్రించబడింది తక్కిన కృతుల పూర్తి పాఠాలు ప్రస్తుతం అలభ్యం. ప్రబంధరత్నావళిలో కందర్పకేతు విలాసం, హరిలీలావిలాసం గ్రంథాల్లోంచి కొన్ని పద్యాలు ఉటంకించారు అవే ప్రస్తుతానికి ఆ గ్రంథాలకు ఆధారం. ఆ గ్రంథాలు అలభ్యం!

వల్లూరి నరసింహకవి “నాగ్నజిత్తీపరిణయము” కావ్యంలోని ఈ పద్యం చూడండి:

“రంగుగం బాండురంగని తెఱం గలరంగ రచించి వేడ్క మీ
ఱంగ ఛలోక్తులన్‌ నృపుఁ గరంగ నొనర్చు హొరంగు నింగి ము
ట్ఞంగ మెలంగు నేరుపుఁ గడంగి చెలంగు నభంగసద్యశో
లింగని రామలింగశశిలింగకళానిధినిన్‌ గణించెదస్‌.”

రామలింగయ అనే కవి పాండురంగమాహాత్మ్యము రచించాడని, వేడుక మీర ఛలోక్తులు చేసేవాడని, వికటకవిత్వపు నేర్పు కలిగినవాడని ఇందులో పేర్కొన్నాడు. వల్లూరి నరసింహకవి 17వ శతాబ్ది నాటి వాడు కావచ్చని పండితాభిప్రాయం. మన తెనాలి కవికి వందేళ్ల తరువాతి వాడీయన! పూర్వకవి ప్రశంస చేస్తూ చెప్పిన పద్యం ఇది. దీన్ని బట్టి రామలింగడూ రామకృష్ణుడు ఒకరే అనేది స్పష్టమే! శివ కేశవ భక్తి సమానత కలిగినవాడన్నది కూడా స్పష్టం.

తండ్రి రామయ్య, తల్లి లక్ష్మమ్మ అనే వైష్ణవ నామాల్ని బట్టి రామలింగయ /రామకృష్ణ కుటుంబం స్మార్తులే అయి ఉండాలి. స్మార్త శబ్దానికి స్మృతులను అనుసరిస్తారు గానీ ఒక్క శైవాన్నో ఒక్క వైష్ణవాన్నో అనుసరించే వారు కాదని భావం! స్మార్తులకు రామలింగయ్య అయినా ఒకటే రామకృష్ణయ్య అయినా ఒకటే! శివకేశవ అభేదం వారిది. ఎంత శివభక్తి ఉంటుందో అంత విష్ణుభక్తి కూడా ఉంటుంది. ఆయన విష్ణుభక్తికి ప్రజలూ ప్రభువులు కూడా రామకృష్ణ అని ప్రేమగా పిలిచిచి ఉండవచ్చు. క్రమేణా ఆ పేరుతో ప్రసిద్ధుడై ఉండొచ్చు! అంతమాత్రాన మతం మార్చుకున్నాడు అనటం సరికాదు.

తెనాలి కవి పరమ శైవదృష్టితో రామలింగడిగా ‘ఉద్భటారాధ్య చరితము’, పరమ వైష్ణవ దృష్టితో రామకృష్ణుడిగా ‘పాండురంగ మహాత్మ్యం’ వ్రాశాడన్నది వాస్తవం. అందుకోసం అతను మతం మార్చుకోవలసిన అవసరం లేదు. స్మార్తులు శైవ వైష్ణవ భేదం పాటించరు. స్మార్తుడే అలా శివపరంగా విష్ణుపరంగా కూడా రచన చేయగలడు. ఆమాటకొస్తే పరమ మాహేశ్వరుడనదగిన అప్పయ్య దీక్షితులవారు హరిస్తుతి చేసిన సందర్భాలు, హరిని హరుణ్ణీ ఒకే శ్లోకంలో స్తుతించిన సందర్భాలూ కూడా ఉన్నాయి. స్వయంగా శ్రీకృష్ణదేవరాయలవారు తాను పరమ వైష్ణవుడైనప్పటికీ అనేక శివాలయాలను పునరుద్ధరించాడు. అందుకు శ్రీకాళహస్తి, అమరావతి దానశాసనాలే తార్కాణాలు.

రాయలవారి ఆస్థానకవుల్లో నందితిమ్మన శైవుడు, మాదయగారి మల్లన శైవుడు. ధూర్జటి కవి శైవుడు. వాళ్లందరినీ రాయల వారు సమాదరించారు కదా.. ఏ రాయలుకు భయపడి రామలింగ పేరుని రామకృష్ణగా మార్చుకున్నాడు? ఏ లాభం పొందాడు?

“శైవవైష్ణవపురాణావళీ నానార్థరచనాపటిష్టైకమతివి” (శైవవైష్టవపురాణావళీనానార్థములు నీకు గరతలామలకములు) అని పాండురంగమాహాత్మ్యంలోని వాక్యం రామకృష్ణుని హరిహరభక్తినే చాటుతున్నాయి. ప్రసిద్ధుడైన ఒక కవి వ్యక్తిత్వాన్ని 500 యేళ్ల తరువాత ఇప్పటి మనం మతం మార్చాడు, రంగులు మారుస్తాడు, ఏ ఎండకా గొడుగు పడతాడు అనటం అన్యాయమే!

అయితే, ఈ తెనాలి కవి తన పూర్వుడైన తిక్కనగారి పద్ధతిలో హరిహరనాథ తత్వాన్ని ప్రబోధించటం ఆయన లక్ష్యంగా పెట్టుకోలేదు. తాతాచార్యులవారు వైష్ణవాన్ని, అప్పయ్య దీక్షితులవారు శైవాన్ని రెండు ధృవాలుగా నిలబడి కొమ్ముకాసిన ఆనాటి కాలంలో హరిహరనాథ భావనకు తావే లేదు. మౌలికంగా తమిళ ప్రాంతాల్లో వైష్ణవమూ, కన్నడ ప్రాంతాల్లో శైవమూ, అధిక ప్రాచుర్యంలో ఉండగా తెలుగువారిలో అత్యధికులు స్మార్తులుగా నిలబడి మత యుద్ధాలను అధిగమించిన కాలం అది! ఆ పరిస్థితుల్లో శివపరమైన కావ్యాన్ని శైవ సిద్ధాంతానుసారం, విష్ణుపరమైన అంశాన్ని వైష్ణవ సిద్ధాంతానుసారం ప్రతిభావంతంగా వ్రాశాడు ఈ తెనాలి కవి!

ఏ కాలం వాడు?

త్రిసముద్రాధీశు డనిపించుకున్న రాయలవారు సువ్యవస్థాపించిన విజయ నగర సామ్రాజ్యం రాయల వారి తరువాత, అళియరామరాజు మరణానంతరం కుంచించుకుపోయి మైసూరు, తంజావూరు మధుర, రాయలసీమ ప్రాంతాలకు పరిమితమై పోయింది.

చంద్రగిరి రాజధానిగా వేంకటపతిరాయలు పాలిస్తోన్న కాలంలో తెనాలి రామకృష్ణ ప్రసిద్ధి పొందాడు.

రాజధాని పెనుగొండ నుండి చంద్రగిరికి తరలి రావటానికి ఒక నేపథ్యం ఉంది. తళ్లికోట యుద్ధం తరువాత అళియరామరాజు మరణానంతరం అతని తమ్ముడు తిరుమలరాయలు రాజధానిని, అనంతమైన నిధి నిక్షేపాలు, సమస్త హంపీ ప్రజానీకం, నామమాత్రపు రాజు సదాశివరాయలుతో సహా హంపీ నుండి పెనుగొండకు తరలి వచ్చాడు. హంపీని విధ్వంసం చేసి సుల్తానులు దొరికినదంతా దోచుకుని వెళ్లిపోయాక ఆ నగరాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశాడు కానీ, సాధ్యపడలేదు. పెనుగొండనే రాజధానిగా ప్రకటించాడు.

ఆ సమయంలో ఆరవీటి (అళియ=అల్లుడు) రామరాజు కొడుకు పెదతిరుమలయ్య తన బాబాయి మీద విఫల తిరుగుబాటు చేశాడు. అందుకోసం ఆదిల్షా సహాయాన్ని పొందే ప్రయత్నం చేశాడు. కానీ, తిరుమలరాయలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 1576లో నామమాత్రపు రాజుగా ఉన్న రాయలవారి తమ్ముడు సదాశివరాయలు మరణించాక తిరుమలరాయలు తానే ప్రభువయ్యాడు. ఆ విధంగా ఆరవీటి వంశ పాలన ప్రారంభం అయ్యింది! అతనికి ముగ్గురు కొడుకులు. వాళ్లలో రామరాయల్ని శ్రీరంగపట్టణం రాజధానిగా కన్నడ ప్రాంతాలకు, శ్రీరంగరాయల్ని పెనుగొండ రాజధానిగా తెలుగు ప్రాంతాలకు, మూడవ కొడుకు వెంకటాద్రిని చంద్రగిరి రాజధానిగా తమిళప్రాంతాలకు ప్రభువులుగా నియమించాడు.

అళియ రామరాజు కృష్ణదేవరాయలవారి మొదటి భార్య తిరుమలదేవి కుమార్తె మోహనాంగినీ, అతని తమ్ముడైన ఈ తిరుమరాయలు రాయలవారి రెండో భార్య చిన్నమదేవి కుమార్తె వెంగళాంబను వివాహమాడారు. ఇద్దరూ రాయలవారి అల్లుళ్ళే! రాయల వంశీకులకన్నా ఈ అల్లుళ్ళే రాజ్యాన్ని నిలబెట్టేందుకు ఎక్కువ కృషి చేశారు.

రాకాసితంగడి యుద్ధంలో తిరుమలనాయకుడు ఒక కన్ను పోగొట్టుకున్నాడు. “అన్నాతి కూడ హరుడవు/అన్నాతినిఁగూడకున్న నసుర గురుడవౌ/దన్నా! తిరుమల రాయా!/కన్నొక్కటి లేదు గాని కాంతుడవేరా!” అనే రామరాజభూషణుడి చాటువు ఈ తిరుమల రాయల గురించి చెప్పిందే! కన్ను లేకున్నా అందగాడైన తిరుమలరాయలికే రామరాజభూషణుడు తన వసుచరిత్ర అంకితంచేశాడు.

తన తండ్రి చేసిన విభజన కారణంగా చంద్రగిరి పాలకుడుగా వచ్చిన వెంకటాద్రి అనే వెంకటపతి దేవరాయలు1585-1614 మధ్య కాలంలో పాలిస్తుండగా తిరుమలరాయలు మరణించటంతో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే పగ్గాల్ని అతని కుమారుడు, పెనుగొండ పాలకుడైన శ్రీరంగరాయలు చేపట్టాడు. దాంతో చంద్రగిరి పాలకుడైన వెంకటపతిరాయలు పెనుగొండ పాలనా బాధ్యత కూడా చేపట్టవలసి వచ్చింది! ఆ విధంగా వెంకటపతి రాయలు తెలుగు తమిళప్రాంతాలను ఒకేసారి పాలకుడయ్యాడు. పాలనా సౌలభ్యంకోసం పెనుగొండ రాజధానిని చంద్రగిరి రాజధానిని కలిపి చంద్రగిరి రాజధానిగా తెలుగు తమిళ ప్రాంతాలను 1585-1614 మధ్యకాలంలో మూడు దశాబ్దాలపాటు పాలించాడు. సర్వసత్తాక ప్రభువుగా శ్రీరంగరాయలు కొనసాగాడు.

ఈ సమయంలో చంద్రగిరిలో తెనాలి రామకృష్ణ చంద్రగిరిలో వెంకటపతి రాయల ఆస్థానంలో ఉన్నాడు. చంద్రగిరిలో తెనాలి రామకృష్ణ నివాసం ఉన్న ఆనాటి ఇల్లు గత శతాబ్ది వరకూ ఉండేదని, భ్రిటిష్ అధికారి ఆ ఇంట్లో నివసించే వాడని స్థానికులు చెప్తారు.

“అప్పయ్యదీక్షితా త్పూర్వం తాతః పూజ్యో న సంశయః” అని వైష్ణవులు తాతాచార్యులను కీర్తిస్తే, రామకృష్ణుడు “ముఖప్రక్షాళనాత్పూర్వం గుదప్రక్షాళనం యథా” అని పరిహసించాడని ఒక చాటు కథనం ఉంది. ‘అపశబ్ద భయం నాస్తి! అప్పలాచార్య సన్నిధి’ అని చెప్పగా రామకృష్ణుడు ‘అనాచారభయం నాస్తి| తిష్టన్మూత్రస్య సన్నిధి’ – నిలబడి మూత్ర విసర్జన చేసే వాడికి అనాచార భయమే లేదని ఆక్షేపించాడట. శైవ పండితుడైన అప్పయ్యదీక్షితులను కించపరిచటాన్ని వైష్ణవ పండితుడైన అప్పలాచారులవారిని అత్యిగ అశ్లాఘించటాన్ని యద్దేవా చేసిన ఈ రెండు చాటువులు రామకృష్ణకవి శైవ పక్షపాతాన్ని సూచిస్తాయని కొందరు భావిస్తారు. ఎడాపెడా చెంపలు వాయించే తత్త్వం ఉన్నవాడు కాబట్టి ఎవరికైనా తాటాకులు కట్టే అలవాటుకొద్దీ పుత్తిన చాటువులే ఇవి! మాటైది. దాన్ని ఖండించాడి రామకృష్ణకవి! నిస్సందేహంగా రామకృష్ణుడు శివకేశవ భేదం లేని వాడే! కానీ, ఇవి ఆయన కాల నిర్ణయానికి తగిన ఆధారాలు కావని కొర్లపాటివారు అభిప్రాయపడ్డారు.

‘తెనాలి’ వాడేనా?

తెనాలి పట్టణం లోని రామలింగేశ్వరస్వామి గుడిలో ఒక ఇత్తడి విగ్రహం క్రింద ఇలా ఉంది:

“తెనాలి నగరే వ్యరాజయ। ద్గార్ల పాడిపురరామపండితః

శక్ల మాఘనిత పంచనీ గురౌ రామలింగ ముమయోత్సవాకృతీం!”

ఇందులో గార్లపాటికి గార్లపాడనీ, శుక్లకు శక్ల అనీ, అచ్చుతప్పులున్నాయి. కాగా, ఈ శాసనపాఠం ప్రకారం రామపండిత అంటే మన రామకృష్ణకవి తండ్రి రామధీమణేనని ఒక అభిప్రాయం ఉంది. తెనాలి కవి ఇంటిపేరు గార్లపాటి అని, తెనాలి అగ్రహార నిర్ణయము వలన తెనాలి ఇంటిపేరుగా పరిణమించిందనీ విశ్లేషికులు భావించారు. కొర్లపాటి వారు ఒక చిన్న ప్రశ్న లేవనెత్తారిక్కడ:

“గార్లపాడిపుర రామపండితుడంటే, గార్లపాటిపురానికి చెందిన రామపండితుడని అర్థమే వస్తోంది. దాన్ని బట్టి ఆయన ఇంటిపేరు గార్లపాడు అని ఎలా నిర్ధారిస్తాం” అని! అంతేకాదు, “శుక్లనామ నంవత్సర మాఘశుద్ధ పంచమీ గురువారం పదునారవ శతాబ్దిని లేదు. అది మార్గశిర పంచమీ గురువారమని 14.1.1510 వ తేదీ అని ఒక సవరణ కలదు. కాని, శాసనలిపి అప్పటిది కాదు. పదునారవ శతాబ్ది కంటే పరమార్వాచీనమైనది.” అని వ్రాశారాయన. కాబట్టి, ఈ తెనాలి విగ్రహ శాసనాన్ని తెనాలి రామకృష్ణకవికి ముడిపెట్టడం తగదు!

ఉద్భటారాధ్యచరిత్రంలో తెనాలి రామలింగయ, తండ్రి ‘రామధీమణి’ అని ఉంది. పాండురంగమాహాత్మ్యంలో రామకృష్ణుడు “తెనాల్యగ్రహారనిర్ణేత” తండ్రి రామయ అని ఉంది. ఘటికాచలమాహాత్మ్యంలో తెన్నలి రామకృష్ణుడు వ్రాసిందని ఉంది. తెనాలి అగ్రహారంలో ఉన్నవాడే కాని, ఆయనే అగ్రహారం పొందాడని అర్థం కాదు. ఒకవేళ ఆయనే పొంది ఉంటే ఈ అగ్రహారాన్ని రామయ లేదా రామధీమణి గారికి ఎవరిచ్చారు? ఎప్పుడిచ్చారు? తద్వారా గార్లపాటి రామన్న మంత్రి, తెనాలి రామయ్య ఎప్పుడయ్యాడు? ఇవి తేలని ప్రశ్నలు.

తెనాలి రామకృష్ణ సినిమాలో “నియోగి బిడ్డను, ఎందుకు నియోగించినా వినియోగపడతాను” అనటం సినిమాలో గొప్పగా ఉంది. “ఈ విగ్రహశాసనము తెనాలి రామ(లింగ)కృష్ణుని కాలము నిర్ణయించుటకు నిరుపయోగము.” అన్నారు కొర్లపాటివారు!

కృతి సమర్పణలు

1. ఉద్భటారాధ్య చరితము

తెనాలి రామలింగయ తన “ఉద్భటారాధ్యచరిత్రము” గ్రంథాన్ని ఊరదేచమంత్రికి అంకితం ఇచ్చాడు. తిమ్మరుసు చిన్న అల్లుడు కొండవీటి పాలకుడు నాదిండ్ల గోపమంత్రికి రాజకార్య నిర్వాహకుడు ఇతను. “శాశ్వతైశ్వర్యపురశాసనుండు” నాడిండ్ల గోపమంత్రి కొండవీటి దుర్గాధిపతి మహామంత్రి తిమ్మరుసు మేనల్లుడు. మాదిండ్ల అప్పమంత్రి అనుజుడు. రాయలవారు 1515లో కొండవీడు దుర్గాన్ని జయించిన కాలం. తరువాత నాదిండ్ల గోపమంత్రి కొండవీటి దుర్గాధిపతి అయ్యాడు. ఇది 1515-1530 మధ్య కాలం! కాబట్టి షుమారుగా 1520-25లలో ఉద్భటారాధ్యచరిత్రం రచన జరిగి ఉండాలి.

తిమ్మరుసును పదవి నుంచి తొలగించారు కాబట్టి, గోపన్నమంత్రిని కూడా తొలగించి ఉంటారనేది ఒక ఊహ. నిజానికి తిమ్మరుసును శిక్షగా తొలగించలేదు. రాయలవారే తన కుమారుణ్ణి రాజుగా ప్రకటించి, తాను ప్రధానమంత్రిగా ఉండి, తిమ్మరుసును హంపీ పాలకుడిగా నియమించినట్టు మరో కథనం ఉంది. రాయలవారికి కొడుకు పుట్టటం, అతన్ని రాజును చేయటం, తాను ప్రధానిగా ఉండటం, ఆ కొడుకుని తిమ్మరుసే చంపించటం, శిక్షగా తిమ్మరుసు కళ్ళు పెకిలించటం ఇవన్నీ నమ్మకం చాలని నిరాధార కథనాలు. తిమ్మరుసును తీసేశారు కాబట్టి అతని అల్లుళ్ళని కూడా తీసేసే ఉంటారనే భావించారు మన పరిశోధకులు. అన్నీ ఊహాగానాలే!

అదీ గాక, నాదిండ్ల గోపన్న మంత్రి స్థానంలో మరో పాలకుడి పేరు ఎక్కడా కనిపించ లేదు. కాబట్టి 1525 -30 మధ్య కాలంలో యువకుడైన తెనాలి రామకృష్ణుడు నాదిళ్ళ గోపమంత్రి ఆశ్రయం పొంది, మెప్పు పొంది తన కృతిని అంకితం చేయగలిగాడు! అప్పటికి ఆయన వయసు నిస్సందేహంగా పాతికేళ్లుంటాయి. రాయలవారి జీవిత చరమాంక సమయం అది!

2. పాండురంగ మహాత్మ్యం:

పాండురంగ మహాత్మ్యం కావ్యాన్ని విరూరి వేదాద్రి మంత్రికి అంకితం ఇచ్చాడు తెనాలి రామకృష్ణకవి! విరూరు కరణంగారు ఈయన! పెదసంగభూపాలుడికి ‘వ్రాయసంగారు’గా కూడా ఉన్నాడు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ లాంటి పదవి అది! కందాళప్పయ్యగారి శిష్యుడు. అనేక ఇతర పరిశీలనల అనంతరం ఇతని పాలనాకాలం 1570 తరువాత ప్రారంభం అయివుండవచ్చు.

రామకృష్ణుడి గురువు భట్టరు చిక్కాచార్యులు. ఈయన రామకృషుడి అల్లుడు లింగమగుంట రామకవికి, అతని తమ్ముడు తిమ్మకవికి, కామందకం వ్రాసిన వేంకట రామకృష్ణకవులకు, భాస్కరకవి రెట్టమతశాస్త్రం అంకితం పొందిన కొండ్రాజు వెంకట్రాజుకీ గురువు. ఈయన కాలం 1520-90 కావచ్చునని తేల్చారు. 1575 తరువాత తెనాలి రామకృష్ణుడి పాండురంగ మాహాత్మ్య రచన జరిగి ఉండాలి.

కొర్లపాటి వారు పాండురంగ మహత్మ్యంలో ఒక పద్యం వసుచరిత్ర ప్రభావంతోనూ, రెండవ పద్యం ఆముక్తమాల్యద ప్రభావంతోనూ వ్రాసినవిగా ఉదహరించారు, దీన్నిబట్టి, ఆ రెండు కావ్యాల తరువాతే పాండురంగ మాహాత్మ్యం వెలువడిందని ఆయన భావించారు.

భట్టుమూర్తి వసుచరిత్రం కావ్యాన్ని “జీర్ణకర్ణాటలక్ష్మీపునస్సృష్టి” కావించిన తిరుమలదేవరాయలుకు అంకితం చేశాడు. 1570-72 మధ్య కాలంలో రెండేళ్లు మాత్రమే తిరుమల దేవరాయలు ప్రభువుగా ఏలాడు కాబట్టి, వసుచరిత్రని ఈ రెండేళ్లకాలంలో కృతి సమర్పణ చేసి ఉండాలి! వసుచరిత్రను ప్రతిఫలించింది కాబట్టి 1575 తరువాతే పాండురంగ మహాత్మ్యం రచన జరిగి ఉండాలి.

తెనాలి రామలింగయ గా 1525 (లేదా 1530)లో ఉద్భటారాధ్య చరిత్రని. తెనాలి రామకృష్ణుడిగా 50 యేళ్ల తరువాత 1575లో పాండురంగ మాహాత్మ్యము వ్రాశాడనేది కొర్లపాటి వారి తీర్పు. శైవుడుగా ఉన్నప్పుడు కందర్ప కేలీ విలాసము, వైష్ణవుడుగా మారాక హరిలీలా విలాసం వ్రాసి ఉంటాడని కూడా భావించారు.

3. ఘటికాచల మహాత్మ్యము

రామకృష్ణకవి జీవిత చరమాంకంలో, 1580 ప్రాంతాల్లో ఘటికాచల మహాత్మ్యము వ్రాశాడని, అతని మనుమడు ఈ కృతిని పుచ్చుకుని, తన తాతగారి రచనగా అంకితం ఇవ్వటాన్ని బట్టి బహుశా మరణానంతర పురస్కారం లాంటిది ఇది కావచ్చు.

4. కందర్పకేళీ విలాసం:

తంజావూరు ప్రతిలో కందర్ప కేతు విలాసం అని ఉంది. రచయిత తెనాలి రామలింగన/రామలింగయ అని ఉంది. ఇది రామలింగయ వ్రాసిన రెండో గ్రంథం కావచ్చు. దాన్ని గురించిన విశ్లేషణ పెద్దగా జరగలేదు. తెనాలి రామలింగయ కందర్ప కేళీ (తు) విలాసమునుండి హరిలీలావిలానమునుండి పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరంలో సంకలనం చేసిన పద్యాలున్నాయి. ఈ గ్రంథానికి అవి కొంత ఆధారం.

ఈ తెనాలి రామలింగ కవి లింగపురాణం కూడా వ్రాశాడని చెప్తారు. ఆ గ్రంథం లభించలేదు. బహుశా అది కల్పిత గాథే కావచ్చు!

5. హరిలీలావిలాసము:

కృతి హరిలీలావిలాసం. కృతికర్త తెనాలి రామలింగయ్య, తెనాలి రామలింగయ. తెనాలి రామలింగకవి. తెన్నలి రామలింగయ్య ఇలా పలు ప్రతుల్లో కనిపిస్తుంది. కథంతా ఎక్కువగా నడిచింది కాశీలో! కొన్ని చోట్ల హరి లీలావిలాసం అనీ, కొన్ని చోట్ల హరివిలాసమనీ ఉంది.

వైష్ణవ గ్రంథమైనప్పటికీ తెనాలి రామలింగడి పేరునే వెలువడింది. బహుశా, ఈ గ్రంథం ద్వారా రామలింగయ్య ప్రజల్లో రామకృష్ణయ్యగా ముద్రపడి ఉంటాడు! ప్రజలే ఆయన్ని రామకృష్ణునిగా వ్యవహరించటం వలన ఆ పేరు ఆయనకు స్థిరపడి ఉంటుంది!

6. పాండురంగ విజయం

కొందరు చాటుకవులకు అబద్ధాలూ, కల్పనలు, అపోహలు కల్పించటమే పని అన్నట్టుగా ఒక చాటుపద్యం తెనాలి రామకృష్ణకవిని ఉద్దేశించి వ్యాప్తిలో ఉంది.

“..నిట్టి కవులకు నేను వాకట్టు కొఱకు

చెప్పినాఁడ మదీయవైచిత్రి మెఱయఁ

బాండురంగవిజయమును బటిమ దనర

విమ్ణవర్థిష్ణుండగు రామకృష్ణకవిని..”

అంటూ పెద్దన తిమ్మన రామరాజభూషణుడు లాంటి కవుల నోళ్లు మూయించటానికి రామకృష్ణకవినైన నేను పాండురంగ విజయం అనే కృతిని పటిమతో వ్రాస్తున్నట్టు చెప్పుకున్న చాటుపద్యం ఇది.

ఇలాంటి చాటువుల ఆధారంగా చరిత్ర నిర్మాణానికి పూనుకోవటం అన్యాయమే అవుతుంది. ఒక కవి తన పటిమను చాటుకోవటానికి కావ్యం వ్రాయటం సహజం, కానీ ఇంకో కవి నోరు మూయించటానికి వ్రాస్తున్నానటాన్ని ఔద్ధత్యం అనే అనాలి!

పాండురంగ విజయం అనే కావ్యం ఏదీ దొరకలేదు. మన సాహిత్య చరిత్రలో కొంటె కవుల పుణ్యమా అని చరిత్రవక్రీకరణలకు అంతు లేకుండా పోయింది!

నానా రాజ సందర్శనం

* 1500-1510 లలో జన్మించిన తెనాలి రామకృష్ణకవి వివిధ రాజాస్థానాల్లో కాలం గడిపాడు.

1530లలో కొండవీడు ఆస్థాన ప్రవేశం. కొండవీడులో ఒక ఉన్నతాధికారిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితం ఇచ్చి, ఆయన గురించి ఒక పద్యం వ్రాసి దుర్గ పాలకుడైన నాదిళ్ల గోపమంత్రి గురించి రెండు పద్యాలు వ్రాసి కృతి సమర్పణను ముగించాడు. బహుశా ఇదంతా గోపమంత్రిని పరిచయం చేసుకోవటానికి, తద్వారా విజయనగర సంస్థాన ప్రవేశానికి చేసిన ప్రయత్నంగా కొర్లపాటి వారు భావించారు.

పాండురంగమాహాత్మ్యము కావ్యాన్ని కృతి నొందిన విరూరి వేదమంత్రి “అఖిల భూమీపాలకాస్థాన కమలాకరోదయ తరుణ సూర్యోదయుండవు” అని అన్నట్లు పాండురంగమాహాత్మ్యంలో ఉంది. అనేకమంది రాజుల ఆస్థానంలో ఉదయించిన సూర్యుడులా ప్రకాశించాడట.

కానీ, వివిధ రాజసభలలో తనకున్న సంబంధాన్ని రామలింగయగారు ఎక్కడా చెప్పలేదు. రాయల ఆస్థానాన్ని కనీసం పేర్కొనలేదు. ఆయనకు భువనవిజయ ప్రవేశ అవకాశం దొరికిందా అనేది కూడా సందేహమే! ఎందుకంటే అప్పటికాయన పాతికేళ్లు కూడా లేని కుర్రవాడు కాబట్టి!

* 1535 వినుకొండ ఆస్థాన ప్రవేశం.
* 1540 ఉదయగిరి ఆస్థాన ప్రవేశం.
* 1545 సదాశివరాయలు పాలిస్తోన్న కాలంలో హంపీ విజయనగర ప్రవేశం. అప్పటికి రాయలవారు మరణించారు. అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, భట్టుమూర్తి ఇక్కడ అతని సమకాలికులు.

“ఓయమ్మలాల మందులు
వేయేల ‘మకారకొమ్ము విషకవి’ గానిన్
వా యెత్తకుండఁ జేసిన
వాయెత్తదు రామరాయవసుధేశునకున్”

ఈ చాటువు అళియ రామరాజుకు వాయురోగం వచ్చినప్పుడు భట్టుమూర్తితో విరోధాన్ని ప్రకటిస్తూ చెప్పిన చాటుపద్యంగా భావిస్తారు. అప్పటికి ఆయన రామలింగడనే పేరుతోనే ఉన్నాడని కొర్లపాటి వారి అభిప్రాయం.
* 1565 అందరితో పాటు ఈయనా చంద్రగిరి ఆస్థాన ప్రవేశం. వేంకటపతి రాయల పాలనాకాలం. అప్పయ్యదీక్షితులు, తాతాచార్యులతో సాన్నిహిత్యం.

(సశేషం)

Exit mobile version