Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో మొట్టమొదటి తారావళి

తారావళి అంటే ఇరవై ఏడు పద్యాల చిన్ని రచన. “సప్తవింశతి పద్యాని నామ్నా తారావలీ మతా” అని క్రీస్తుశకం 1250 నాటి అలంకార సంగ్రహము (11-3) లో అమృతానందయోగి నిర్వచనం. దీనికి నక్షత్త్రమాల అనే పేరు కూడా ఉన్నది. “సప్తవింశతి యైన నక్షత్త్రమాల” అని అమృతానందయోగినే అనుసరించి క్రీస్తుశకం 1402 ప్రాంతాల కావ్యాలంకారచూడామణి ని రచించిన విన్నకోట పెద్దన అన్నాడు. అమృతానందయోగికి ఒక అర్ధశతాబ్ది తర్వాత జీవించిన మహాలాక్షణికుడు విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణము లోని కావ్యప్రకరణం చివర, “తారాణాం సంఖ్యయా పదై ర్యుక్తా తారావలీ మతా” అన్నాడు. తారలు ఇరవైయేడు కనుక తారావళి అంటే ఇరవైయేడు పద్యాల కూర్పు అన్నమాట. విద్యానాథుడు ఇంకొక మాట కూడా అన్నాడు. కవిప్రౌఢోక్తిసిద్ధంగా ఇటువంటి కావ్యరూపాల ప్రయోగాలు ఎన్ని పోకడలైనా పోవచ్చునన్నాడు. ఏకావళి మొదలుకొని తారావళి దాకా, ఇంకా శతకము, ఆ పైని సహస్రము, ఇంకా ఆలోచిస్తే ఎన్ని వేల పద్యాలనైనా తన గర్భంలో ఇముడ్చుకోగలిగిన కల్పిత కల్పలత వంటివి ఉన్నాయి కదా. వాటిని మీరు యథాసంభవంగా ఊహించుకోండి, అన్నాడు.

తెలుగులో తారావళిని మనకు తెలిసినంత వరకు తొలిసారి రచించినవాడు రావిపాటి త్రిపురాంతకుడు. తారావళిని తొలిసారి పేర్కొన్న లాక్షణికులిద్దరూ కూడా తెలుగువాళ్ళే అన్నది మనము గుర్తుంచుకోవలసిన విషయం. ఇది తెలుగుదేశంలోనే వెలసిందేమో. లక్షణగ్రంథాలలో ఇది క్షుద్రప్రబంధసాంగ్రహికాలలో పఠితమైనందువల్ల కాబోలు – ఇందులో ప్రతీతములుగా రచన లెక్కువ కనుపించవు. కవిత్వయోగసాధకులకు అభ్యాసమాత్రపర్యవసాయిగా ఉండినదేమో. అందువల్ల రావిపాటి త్రిపురాంతకుని వంటి మహాకవి ఇటువంటి లఘుకృతిని వెలయించాలని అనుకోవటం విశేషమే. ఆయన రచన పేరు చంద్ర తారావళి. ఇదొక విశిష్టమైన ప్రయోగాతిశయం. క్రీస్తుశకం 1315-1320 ప్రాంతాలలో రచితమైంది.

చంద్ర తారావళి

పరిశీలింపగా – త్రిపురాంతకుని రచన కేవలం దేవతా స్తుత్యాత్మకమైన సామాన్యగ్రథనగా పరిణమింపక ఉజ్జ్వలమైన శృంగార రసభావసంపదకు ఆలవాలమై మనోరమంగా ఉన్నది. ముక్తకాలలో వలె ముక్తసరిగా దేనికి దానినిగా ముగింపక, శతకాలలో వలె ఆయన దీనికి “చంద్రా! రోహిణీవల్లభా!” అన్న మకుటాన్ని ఎన్నుకొన్నాడు. ఈ మకుటం చంద్రుని ఇరవై ఏడుగురు తారల వల్లభత్వానికి సూచకమై, ఇరవై ఏడు పద్యాల కూర్పు అయిన తారావళీ ప్రక్రియకు ఎంతైనా తగి ఉన్నది. కవిత్వం అంటే సరస్వతి యొక్క సగుణారాధనం అని నమ్మినవాడు కనుక ఎక్కడికక్కడ సరిక్రొత్త కల్పనలలో చమత్కారాలను ప్రోదిచేస్తూ పద్యరచన చేయటం ఆయన స్వభావం. “అమరుక కవేః ఏకః శ్లోకః ప్రబంధశతాయతే” అన్నట్లు త్రిపురాంతకుని ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ప్రబంధశతాయితం అయితే, చంద్ర తారావళి ఇరవైయేడు పద్యాల కూర్పు కాబట్టి రెండువేల ఏడువందల ప్రబంధాల సాటివస్తుందన్నమాట.

పెదపాటి జగన్నాథకవి ప్రబంధ రత్నాకరము లో ఈ చంద్ర తారావళి లోని ఇరవై ఏడు పద్యాలలో నుంచి తనకు నచ్చిన నాలుగు పద్యాలను ఉదాహరించాడు. కాలానుగతిలో చివరికి అవే మిగిలాయి.

1912 లో త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణము అచ్చయినప్పుడు పీఠికలో మానవల్లి రామకృష్ణకవి గారు –

ఈ కవి రచించిన చంద్ర తారావళి 27 పద్యముల నూత్నభావములు గలది.

అని వ్రాశారు కాని, ఉపలబ్ధాలైన పద్యాలను బట్టి చూస్తే ఇది సంస్కృత సంకలనగ్రంథాలలో నుంచి, కావ్యాలలో నుంచి కవి తనకు మెచ్చుగొలిపిన అందమైన కల్పనలను స్వీకరించి, వాటికి చేసిన స్వేచ్ఛానువాదమని అనిపిస్తున్నది. ప్రతిపాదితవిషయవైవిధ్యాన్ని బట్టి చూస్తే జగన్నాథకవి స్వీకరించిన నాలుగు పద్యాలకూ వాటి మూలశ్లోకాలలో వరుసగా

  1. చంద్రకళానువర్ణనం,
  2. చంద్రోదయం,
  3. పూర్ణచంద్రబింబం,
  4. సకళంక చంద్రరేఖ

అన్నవి ఇతివృత్తాలుగా స్వీకరింపబడినట్లుంది. ఒక్క ఉదాహరణను మాత్రం చూపుతున్నాను:

పొలకయ్యంబులఁ గల్గు ముద్దుటలుకన్

బుష్పాయుధారాతి మ్రొ

క్కులఁ దీర్పన్ దలమీఁదఁ గాననగు నీ

క్రొమ్మేను పుణ్యాంగనా

తిలకం బైన భవాని పాదనఖపం

క్తిం జెంద డెందంబులోఁ

దలఁతా చుక్కలతోడి మక్కువలు చం

ద్రా! రోహిణీవల్లభా!

అని. పద్యంలో ప్రతిపాదితమైన అర్థం ఇది:

పార్వతీపరమేశ్వరులకు ప్రణయకలహం కలిగింది. పార్వతీదేవి అలిగింది. శృంగారసర్వజ్ఞుడైన పరమేశ్వరుడు కారణవశాన ఒకప్పుడు మన్మథునికి శత్రువే (“పుష్పాయుధారాతి”) కాని, అంత మాత్రాన ఆయన తన మనస్సులోని ప్రేమభావానికి అతీతుడు కాడు కదా. ఆమె ముచ్చటను చెల్లించి, ముద్దుటలుకను ఉపశమింపజేయగోరి ఆయన ఆమె పాదాల ముందు మోకరిల్లాడు. ఆ ప్రకారం ముందుకు వంగినప్పుడు పరమేశ్వరుని జటాజూటంపై అలంకరింపబడి ఉన్న చంద్రుడు పార్వతీదేవి పాదాల చెంతకు వచ్చాడు.

ఆ విధంగా శివుని సాగిలింతతోడి వెన్నెలకోలు చంద్రునికి అవమానాన్ని కలిగింపలేదు సరికదా, ఆనందాతిశయాన్ని కూర్చింది. ఏమంటే, పరమశివుని ప్రణామం మూలాన అప్రయత్నంగా తనకు పార్వతీదేవి పాదాలకు ప్రణామం చేయటం జరిగిందని కాదు సుమండీ – ఆ పార్వతీదేవి పాదనఖాలు తారకల వంటివి కదా, నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగానన్నట్లు – ఆ నఖపంక్తిని చూడగానే రోహిణీవల్లభుడైన చంద్రునికి తారకలతో తన మునుపటి సంగమాలన్నీ గుర్తుకు వచ్చాయి.

ప్రణామం పరమేశ్వర ప్రణయసూచకం కాగా పాదనఖదర్శనం చంద్రునికి చుక్కలతోడి మక్కువలకు జ్ఞాపకంగా పరిణమించింది.

చంద్రుని ఉద్దేశించి కవి “డెందంబులో ఆ చుక్కలతోడి మక్కువలు తలఁతువు” అనటంలోని కొంటెతనం హృదయంగమం.

కవిసమయాలను సార్థకంగా పరికరింపజేసికొన్న పద్యాలలో ఇదొకటి.

త్రిపురాంతకుని ఈ అందమైన భావానికి మూలమైన శ్లోకం ఇది:

లసల్లీలాచన్ద్ర శ్చరణగతమౌలేః స్మరజితః

కిరద్భిః సుజ్యోత్స్నాం నఖమణిభి రాపూరితకలః

వ్యలీకే పార్వత్యాః పరిలఘులవై రఞ్జనజుషః

పతద్భి ర్బాష్పస్య కమలమిలితలక్ష్మా విజయతే.  

అని. విమర్శకులు ఇంతకు మునుపు గుర్తింపని విషయం కాబట్టి కొంత వివరణ అవసర మవుతున్నది.

శ్లోకతాత్పర్యం ఇది: పార్వతీదేవికి ప్రణయవేళ కోపంవచ్చింది. పరమేశ్వరుడు ఆమె పాదాలకు మోకరిల్లాడు. పార్వతీదేవి పాదనఖదివ్యమణికాంతులు సోకి  పరమేశ్వరుని జటాజూటంపై వెలుగొందుతున్న చంద్రబింబం మరింత దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ సమయంలో దేవి కాటుక కంటినీరు చంద్రునిపై చింది, ఆ చోటు చంద్రునిలోని మచ్చ రూపుగొని అందగించింది. ఆ విధంగా స్మరవిజయుడైన పరమశివుని శిరసుపైని సకళంక చంద్రరేఖకు జయమగు గాక! అని.

త్రిపురాంతకుడు ఈ శ్లోకభావానికి తన అనువాదంలో లెక్కలేనన్ని మెరుగులు దిద్దాడు. కవిసమయాన్ని శృంగారప్రకాశంగా రూపొందించాడు. పదప్రయోజనం ప్రకాశమానం అయింది. “స్మరజిత్” అన్న కర్తృవ్యపదేశం తెలుగులో “పుష్పాయుధారాతి” కావటం మరింత సొగసుగా ఉన్నది. పరమేశ్వరుడు పార్వతీదేవికి ప్రణమిల్లటం, చంద్రరేఖ ఆమె పాదనఖపంక్తికి సోకటం ఉభయకల్పనలలోనూ సమానమే. ఇక అక్కడినుంచి అందుకొన్నాడు. పాదనఖాలు చంద్రునికి తారకలను స్మరింపజేయటం శృంగారభావదీపకం అయింది. అది సాదృశ్యజ్ఞానం వల్ల ఉద్బుద్ధమైన సంస్కారం. నఖములతోడి సాదృశ్యదర్శనం వల్ల ఉద్దీపితమైన సంస్కారం తారకాస్మరణకృతోద్దీపితమైన సంస్కారం నుంచి కలిగినది కాబట్టి ఆ సాదృశ్యమూలత్వం అలంకారయోగ్యతను సంతరించికొన్నది. నఖదర్శనజన్యమైన తారకల స్మృతిలో వ్యతిరేక నిమిత్తత్వం లేక వర్ణపురస్కృతమైన పోలికను చూడటం జరిగింది కాబట్టి ఇది ప్రేయస్సుకు గాక స్మరణాలంకారానికి ఉదాహరణీయం అయింది.

అంతే కాదు. పార్వతీదేవి పుణ్యాంగనాతిలకం. పవిత్రమైన ఆమె పాదస్పర్శ వెనుకటి తారాశశాంకుల సమాగమాన్ని గాక చంద్రునికి ప్రియపత్నీసంగమాన్నే స్మరింపజేయటం ఇక్కడి భావవిలాసం.

చంద్ర తారావళిలోని తక్కిన పద్యాలూ సంస్కృతంలోని వివిధకల్పనలకు ప్రతిచ్ఛాయాపన్నాలు గానే ఉన్నాయి.  కావ్యం పరిపూర్ణంగా లభింపకపోవటం మన దురదృష్టం.

కవిసమయాలను ఎంతో అందంగా వినియోగించుకొన్న మరొక రమ్యకల్పనను చూడండి:

చరమక్ష్మాధరచారుసింహముఖదం

ష్ట్రాకోటియో నాఁగ నం

బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరే

భప్రస్ఫురద్గర్వసం

హరణక్రూరతరాంకుశం బనఁగ ను

ద్యల్లీల మీ రేఖ ని

త్యరుచిన్ బోల్పఁగఁ బెంపగున్ విదియ చం

ద్రా! రోహిణీవల్లభా!

శుక్లపక్ష విదియ నాటి చంద్రుని కాంతియొక్క ఉపమానయోగ్యత చిత్రకర్మశబలితంగా అభివర్ణింపబడుతున్నది. విదియ ద్వితీయా శబ్దభవం కదా. వృద్ధిచంద్రుని యొక్క రెండవనాటి కళ పద్యంలో ప్రతిపాదింపబడుతున్నది.

ద్వితీయ అంటే భార్య అనే అర్థం కూడా ఉన్నది – “యజ్ఞాధికారఫలభాగినో ర్జాయాపత్యో రన్యతరత్వేన ద్వితీయా” – యజ్ఞాధికారంలో ఫలాన్ని పొందేటప్పుడు పతితోపాటు తాను రెండవది అని అర్థమన్నమాట. చంద్రుని భార్య కనుక రోహిణియే ద్వితీయ. “విదియ చంద్రా! రోహిణీవల్లభా!” అన్నప్పుడు 1) ద్వితీయా తిథి, 2) రోహిణి – అన్న ఉభయద్వితీయల సమావేశం హృద్యంగా సమకూడింది. ఇదొక చమత్కారం.

త్రిపురాంతకుని పద్యానికి పెదపాటి ఎఱ్ఱాప్రెగడ కుమార నైషధము లో ఒక అమోఘమైన ప్రతికృతి ఉన్నది:

మన్మథదివ్యాగమంబున కోంకారంబు

        భూతేశు నౌదల పువ్వుదండ

యల్పశృంగారరేఖార్గళకుంచిక

        యధికతమోదంతి కంకుశంబు

విరహిణీజనమర్మవిచ్ఛేదకర్తరి

        యంబరక్రోడదంష్ట్రాంకురంబు

తారకామౌక్తికతతికి నంచితశుక్తి

        దగు నంబునిధికి ముత్యాలజోగు

మారు పట్టాభిషేకార్థవారికుంభి

చిత్తజుని కోట లగ్గ దంచనపు గుండు

నాఁగ నానాఁటి కభివృద్ధి నారుకొనిన

చంద్రుఁ డుదయించె గాంతినిస్తంద్రుఁ డగుచు.        

త్రిపురాంతకునికి, పెదపాటి ఎఱ్ఱాప్రెగడకు మూలమైన శ్లోకం ఇది:

ఓఙ్కారో మదనద్విజస్య గగనక్రోడైకదంష్ట్రాఙ్కుర

స్తారామౌక్తికశుక్తి రన్ధతమస స్తమ్బేరమస్యాఙ్కుశః  

శృఙ్గారార్గలకుఞ్చికా విరహిణీమర్మచ్ఛిదా కర్తరీ

సన్ధ్యావారవధూనఖక్షతి రియం చాన్ద్రీ కలా రాజతే.

అని. యాథాయథ్యానువాదం, పదపదానుసరణం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి.

చంద్ర తారావళిలో లభించిన తక్కిన రెండు పద్యాలూ ఇవి:

అమితధ్వాంతతమాలవల్లిలవన

వ్యాపారపారీణదా

త్రమొ సౌగంధికషండకుట్మలకుటీ

రాజీసముద్ఘాటన

క్రమనిర్వాహధురీణకుంచికయొ నాఁ

గం బెంపునన్ నీ కళా

రమణీయత్వము చూడ నొప్పెసఁగుఁ జం

ద్రా! రోహిణీవల్లభా!  

రతినాథుండను మాయజోగి చదలం

ద్రైలోక్యవశ్యాంజనం

బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయం

బై యున్న పాత్రంబునన్

మతకం బేర్పడఁ బెట్టి దాఁచె నన నీ

మధ్యంబునన్ మచ్చ సం

తతమున్ గన్నులపండువై వెలయుఁ జం

ద్రా! రోహిణీవల్లభా!

ఇవీ సంస్కృతంలో నుంచి అనువదింపబడినవే. మహాకవి రచనను పూర్తిగా అధ్యయనింపగలిగే అదృష్టానికి మనము నోచుకోలేదు.

Exit mobile version