Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-80

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

801.
గిరి శిఖరంబు జేరి కలయ జూచిన, ఎగుడు దిగుడులున్
అరయ అడ్డుగోడలును యొక్కటై పొడసూపు; నీవును
పరమోన్నత సాధన మధివసించి యవలోకించు మందరన్
పరమోదార బుద్ధిన్ – మంకుతిమ్మ!

802.
హర్మ్యాగ్రంబును జేరిన వానికి సోపానంబు లతీతంబులు,
నిర్మమతానురాగ వర్జితుడును కర్మాతీతుడు గాడె,
బ్రహ్మ పదానువర్తియు, ధర్మాధర్మ నియమాతీతుడే
నిర్మాల్యములే యాతని నియమములు – మంకుతిమ్మ!

803.
అందరిలోన తాను, తనలోన యందరినిన్ గని ఎంచు
ఎందెందు జూచిన తానయై, నవ్వుచు వగచుచు,
అందరకున్ అందిన తేనె యగుచు, సుఖంబు నొందెదనని
చందంబుగ తెల్సిన వాడె ముక్తుడు – మంకుతిమ్మ!

804.
శుభమెయ్యది? యశుభ మెయ్యది లోకంబున నెంచిచూడ
విభజింప నసాధ్యము – అన్యోన్య సంబంధంబు లయ్యవి
ఉభయంబును యధిగమించిన ‘సామాన్య నీతి’ గల దదియె
అభయ పథంబు – మంకుతిమ్మ!

805.
సార్వభౌముడు, సృష్టిలో గలవాడు ఒక్కడే సుమా!
సర్వంబును తన యాత్మయె యని భావించు
నిర్వికారాంతరంగమున జగంబున్ భరించు
సర్వమంగళు డాతడు – మంకుతిమ్మ!

806.
గర్వంబు జెందని యుపకారి, దర్పంబు జూపని యధికారి
నిర్వికారంపు భావంబున తన బాటన్ నడచుచు పోవుచుండు
సర్వధర్మములు కాటపట్టై, ముక్తి పథమున సాగుచుండు
సర్వులకు గురువతడు – మంకుతిమ్మ!

807.
లోకపు కళ్యాణమె తన కళ్యాణమని తలచు వాడు
లోకపు వ్యవహారంబులన్నియ తన వ్యవహారంబులనియు
లోకంపు జీవన రీతులు తన జీవిత రీతులని పూర్ణంబుగ
ఆకళింపు జేసుకొన్నవాడె సుఖి – మంకుతిమ్మ!

808.
చిరకాల సుశిక్షితాభ్యాస దీక్ష వలయు ఎల్లెడెన్
పరమాత్మ దర్శింప; సరళ యుచ్ఛ్వాస నిశ్వాసంబుల వోలె,
పరగ నయ్యది స్వతః సిద్ధంబు గావలె గాని పరుల వలన గాక
మరకలేని మనస్తత్వంబు గావలె – మంకుతిమ్మ!

809.
ఆత్మసాక్షాత్కారమైన వానికి ద్వైతమేమి?, అద్వైతమేమి?
శ్రౌత్యాది విధులేమి? తపనియమము లవేమి,
ప్రీతియే యతనికి సర్వాత్మలందు గోచరించు
భీతి లేని వాడతడు – మంకుతిమ్మ!

810.
కర్మ, తర్క, భక్తి వైరాగ్యము లున్నంత మాత్రమున
దొరకదు పరమాత్మ దర్శనము; కావలె దానికి తపసు
పరిపూర్ణ జీవనానుభవ తాపంబులు, మది పరిపక్వతయు
పరమాత్మ తత్వమప్డు దర్శనమగు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version