Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-79

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

791.
సతత నిర్మాణ యవస్థకు లోనగుచున్నదీ విశ్వదేవళము;
అతని యాలయ నిర్మాణపు కూలీలమే మనము; అయ్యది
అతిథి గృహమో, స్వగృహమో, దేశమో, కులమో, మఠమో! నెంచక
మతి నిలువరించి పని చేయవలె – మంకుతిమ్మ!

792.
“ఆశల రేకెత్తించబోకు, పాశంబుల చిక్కుబడగ నీకు,
క్లేశయుత పరీక్షలకున్ నన్ను గురి చేయగబోకు,
వేసటించు పాపపు గుఱుతులన్ గుర్తు నకున్ రానీకు” ననుచు
ఈశుని వేడుము నిత్యము – మంకుతిమ్మ!

793.
నాటక రంగమీ జగము; నేను, నీవు ఈ జగము వేరని ‘మాయ’
నాటకామాడించు; బ్రహ్మవస్తువులే యన్నియుంయని దెల్సినంత
యాట ముగిసి మాయ కనుమరుగై, మోహవిభ్రాంతి వదల
నాటకము ముగిసిపోవు – మంకుతిమ్మ!

794.
నూరారు యనుభవంబులన్ వడసి మనసు ఎదుగుగాక,
నూరారు ఝురులవి యురికి జలనిధి జేరినట్టు – మనసు
వేర్పడవలె దేహసంబంధమున్ విడనాడి – పరబ్రహ్మ
స్వరూపంబైన చైతన్యముతో కూడి – మంకుతిమ్మ!

795.
మొలకెత్తుతున్న చిరు మొలకను; ఉదయంపు లేత
వెలుగును; ఎదుగుచున్న లేబ్రాయంపు శిశువును
చెలికాండ్ర చెంత చల్లని చెలిమిని, ఎల్లెడల కళ
కళలాడెడి చైతన్య మూర్తిని నేనని చరింపుము – మంకుతిమ్మ!

796.
మేలు రకపు విత్తనమునన్ మట్టిని నాట, మొలకెత్తునది; కాక
మేలుగ దాని వేయించిన జిహ్వకు రుచికరమగు
మొలకెత్తు కర్మఫలంబులు మరిమరి సంగయుక్తుండైన
మొలకెత్తవవి సంగత్యక్తుండైన తరి – మంకుతిమ్మ!

797.
అగ్ని స్పర్శ కీడైన రజ్జువది బూదియైనను రజ్జువుగ గన్నట్టు,
జ్ఞానవంతుని తత్త్వంబును నంతయె; లోకంబున్ నటులె గన్పట్టు; తత్త్వ
జ్ఞానికి లోకపు రీతులన్నియున్ బహ్మతత్త్వంబుగనె గన్పట్టు
జ్ఞాని లోక బంధనములకున్ కట్టువడడు – మంకుతిమ్మ!

798.
అమరులతో పనియేమి వానికి ఆశలేని యతనికి?
కామరాగ వివర్జితు వైరాగికి కష్టనష్టముల భయమేమి?
శమదమాది విషయంబుల పారంగతునకు దూరంబదేమి?
విమల చరితుడతడు స్వేచ్ఛాజీవి – మంకుతిమ్మ!

799.
తమదయిన హవిస్సాది పూజ నిల్పక లభ్యమగుగాక యని
అమరులు, భీరువులైన నరులకు తమ ఘోరరూపంబుల చూపెదరట!
ఏమరక పరమాత్మంబున్ దెలియ నుంకించువారికి, బెదరింపులేమి జేయు?
ఏమయినన్ నెదురించ సిద్ధుడగు – మంకుతిమ్మ!

800.
కడుపు నిండిన వాడికి కాయేమి? పండేమి?
కడు దార్శికునకు (తత్వజ్ఞానికి) పాప పుణ్యంబు లేవి?
ఏడు కొండల నెక్కిన వాడి చూపునకు మిట్టతగ్గులవేవి?
చెడని పూర్ణతలో వక్రత ఏది? – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version