[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
771.
నీరధి పరబ్రహ్మము, తేలియాడు హిమఖండము జీవాత్మ;
క్షీరము పరబ్రహ్మము, అందలి ఘృతము జీవాత్మ;
కీరు, పరమాన్నములు పరబ్రహ్మము, అందలి ద్రాక్ష జీవాత్మ;
నేరగ త్రిమతంబుల, ఆత్మభోదలివి – మంకుతిమ్మ!
772.
మతవాదంబులవి మూడు గాక మున్నూరుండు గాక, అన్ని
మతంబులున్ మూలంబైన సారవస్తు వొకటేయని సమ్మతించు
హితంబైన పారమార్థక చింతయే మతంబు వ్యవహరించిన, జగత్
హితమగు గాని భారంబు గావవి – మంకుతిమ్మ!
773.
బయట, వ్యవహారములందనురక్తి; లోన విరక్తి
బయట, కర్తవ్యాచరణానురక్తి; లోన ఉదాసీనత
బయట, సంసారభార నిర్వహణానురక్తి, లోన తిరస్కారత,
ఇయ్యవి వర యోగమార్గములు – మంకుతిమ్మ!
174.
సూర్యదర్శనము కన్న సూర్యకిరణ దర్శనము సులువు,
పరమ శాస్త్ర పరిచయము కన్న సరైన యుదాహరణ సులువు,
పరమ తత్త్వంబున్ వడసిన గురువు దొరక సులువే!
దొరకినన్, కడు ధన్యుడవు నీవు – మంకుతిమ్మ!
775.
కాకి, కోకిలల రూపంబు లొకటై తోచు పైపైకి – యోగియున్
పైకి కాన్పించు సంసార సుఖ దుఃఖంబుల ననుభవించు
యొక సామాన్య సంసారివోలె చూపరులకు, అంతరంగంబున
యొక త్యాగి యాతడు – మంకుతిమ్మ!
776.
పరమాత్మ విధ విధ రూపంబులు కనులముందె గో
చరించుచు నుండ, నరుండాతని గురుతింపక
ధరలో తన్ను బోలిన ప్రాణియే యని దలంచి
కరతలామలకంబైన దాని పోద్రోలు – మంకుతిమ్మ!
777.
సామాన్య వేషంబున, సంసారి వేషంబున
స్వామి నీకడ కేతెంచగ వచ్చు వరంబు నిడ;
స్వామి మహిమన్ గనెడి సంస్కారముండవలె నీయందు;
తామసికుల కబ్బునే యా వరము! – మంకుతిమ్మ!
778.
విషయ భోగములందు విరక్తి, విశ్వలీలా విషయాసక్తి,
కృషి విషయమందున దీక్ష, వైఫల్యమందున్ తితిక్ష
విషమ పరిస్థితుల సమైక్య దృష్టి, సకల భూతములందనురక్తి
విశేష సాధనంబులివి కైవల్యంబునకు – మంకుతిమ్మ!
779.
పడిన కష్టమునకున్ సరి కూలి దొరకుటయు, రేపెటుల
గడచునోయను చింతలేమియు; సంసార భారంబు
నడగించు జతగాండ్ర చెలిమియు, సంతృప్తి, పరమాత్మపై నిలి
పెడి చిత్తంబు గలుగ నదియ యుత్తమము – మంకుతిమ్మ!
780.
వర్షంబున కొక ఋతువు, పంటకొకటి, పంట కోత కొక ఋతువు;
అరయ నీ జీవిత వృక్షంబునకున్ గలదు కాల నియమంబు;
విరక్తియు, ముక్తియు, విచక్షణా జ్ఞానము, మంచితనమున్
సంక్రమించు కాలక్రమంబుగాన్ – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
