Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-76

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

761.
గోచరింప సాధ్యమగుచు నున్నవి దృశ్యంబులు కట్టెదుట;
లోచనంబు లవి వీపున నుండెనేని సాధ్యంబయ్యెడిదే!
ప్రాచీనంబున్ మరచి స్వతంత్రించి నిర్వహింపుము; సా
రించుము నీ దృష్టి ముందునకు – మంకుతిమ్మ!

762.
పుడమిపై నడయాడిననేమి, దృష్టి మేరునగంబు జేరనుండవలె,
చెడక; దృష్టి చెదరెనా, నడక యది దారితీయు నరకంబునకు,
కడు దూరంబైన నేమి? కాళ్లు తొట్రిలి కుంటువడిన నేమి?
వడిగ జేరుదువు నీ యూరువాని నాత్మ దలచి – మంకుతిమ్మ!

763.
మేరు నగంబునకు గలవు నూరారు శిఖరంబులు;
దారులును నుండనోపు నూరారు; మజిలీలును నూరారు;
చేరుము నీవును తోటి యాత్రికులతోడి స్నేహమరసి
మేరువే నీకిచ్చు బలము – మంకుతిమ్మ!

764.
ధన్యుడా మాలవాడ నందుడు; గాంచెనొక నాడాతడు కల,
స్వర్ణ సభ యందున శివుని తాండవ నృత్యంపు కల
అన్యచింతలన్ పోద్రోలి, ఆ నృత్యంబుపై నిలిచెనా కల
చిన్మయంబు జేరె యాతని యాత్మ – మంకుతిమ్మ!

765.
తనకు రుచించినదే రామునకు రుచియని తలచె,
తను తృప్తి చెందె తన రాముడు సంతృప్తి జెందగ,
తనదగు దైవాత్మ భావంబున పరవశించె
ధన్యురాలు శబరి – మంకుతిమ్మ!

766.
ఘనమది రామసేవయె యని యెంచి యా ఘన తత్త్వంబునకై
మనంబున దివారాత్రంబుల నెంచి యెంచి, వేరొక చింత లేక
తన జీవితంబును ముడుపుగ బెట్టి కృతకృత్యడాయె; ఆ
హనుమంతు నుపదేశమిది – మంకుతిమ్మ!

767.
క్షణ క్షణమునకు, దినదినంబునకు, శునకమది ఎటులో
తన జీవనంబు సాగించు, ఆనాడు లభించిన దానితోటి;
మనుజుడు ప్రాప్తంబైన లేశంబుతోడ తనివి జెందవలె;
శునకోపదేశమిది – మంకుతిమ్మ!

768.
గతి ఏది నాకని యంగలార్చు వారె యందరున్
హితమేది జగమునకని చింతించు వారెవరు? హిత
మతి తోడుత విశ్వంపు హితమరసి, స్వార్థంబున్ మరచు
పథమది మోక్షమునకు – మంకుతిమ్మ!

769.
విందు భోజన మొక రోజు, ఉపవాసమింకొక రోజు
ఎందులేని పనిభారమొకరోజు, పూర్తి విశ్రాంతి యొకరోజు
పొందుగ రెండునున్ నుండిననే సుఖకరంబగు జీవనము
అందమగునే ఒంటి కాల్నడక – మంకుతిమ్మ!

770.
నేత్రములవి రెండైనను గాంచెడి దృశ్యమొక్కటె;
కరములు రెండైనను నెరవేర్చు కార్యమొకటే;
అరయ ద్వైతంబునం దద్వైతంబు; అద్వైతంబున ద్వైతంబు
బెరసిన పరమాత్ముని లీల ఇది – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version