[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
751.
చిత్ర విచిత్రంబైన ఇంద్రజాలపు లోకమిది; ఈ
చిత్రంబైన చమత్కారంబును వలదనక కావలెననక; ఈ వి
చిత్రంబైన నాటకంబున నీ యంతరాత్మను పాత్రధారిగ జేయక
చిత్రంబుగ వేషంబు ధరించి నటించుము – మంకుతిమ్మ!
752.
భోజనముల కెల్ల పరమ భోజ్యమా పరబ్రహ్మ రసంబు
భుజించిన పిమ్మట వేరేది రుచింపదు, వేరేది వేడడు,
త్యాజక, త్యాగ, సంతాజ్యమనెడి భేదంబు లరయ శూన్యమై
రాజిల్లు నతడు రారాజుగ – మంకుతిమ్మ!
753.
అనుసంధించవలె బ్రాహ్మతత్త్వమును లోకవ్యవహారములందును,
అనుగుణంబుగ జీవనంపు రీతుల యందును, దేహేంద్రి
యానుభవంబుల యందునున్; బ్రహ్మతత్త్వము గోచరింపవలె, ఈ
యనుసంధానమే మోక్షసాధనా మర్మము – మంకుతిమ్మ!
754.
ఒకపరి పూదోట యందున, నింకొకపరి మిత్రకూటమి యందున,
ఒకపరి సంగీత సభలను, నింకొకపరి శాస్త్ర చర్చ యందున
ఒకపరి సంసార వ్యవహారంబుల, నింకొకపరి మౌనంబున, ఏ
రకంబున నైన బ్రహ్మానందంబును పొందుము – మంకుతిమ్మ!
755.
బుద్ధి శక్తికా బ్రహత్రత్త్వంబర్థంబైననేమి? స్మృతి పథంబున నయ్యది
ఒద్దికగ సతతంబు నెలసి యుండవలె గాదె! నిరతము
పద్దులు వ్రాయు కోశాధికారెన్ని లక్షల ధనంబుల నుచ్చరించినన్
పెద్దగ నాతనికి వచ్చు భృతి ఎంత? మంకుతిమ్మ!
756.
గుణములయ్యవి నాలుగు బ్రహ్మానందంబు వడయ; ధైర్య
గుణమది ప్రథమంబు, రెండవది బుద్ధిబలంబు; భూతదయా
గుణమది తృతీయంబు; నిర్మమతా గుణంబది నాల్గవది
గుణములలో మేల్బంతి – మంకుతిమ్మ!
757.
వలదు వ్యామోహంబునకున్ గురిసేయు ప్రేమాతిశయము,
వలదు ద్వేషంబునకున్ దారితీయు భీమసాహసంబు,
వలయు ధాంబింకంబులు లేని నియమ నిష్టతలు, పరిఢవిల్ల
వలె ఎల్లెడెల్ల సౌమ్యమనోభావంబు – మంకుతిమ్మ!
758.
నీతి నియమంబులకున్ ఔదార్యమే తల్లి ధైర్యమే తండ్రి;
నీతి నియమంబుల స్వాధిపత్యంబున నుండ నెంచితివేని,
గతించిన దానిన్ గణుతింపక, భవితంబునకున్ సిద్ధుడగుము
మితంబె సంతోషదాయకము – మంకుతిమ్మ!
759.
అందనిదాని పొందుటాతురతతో యందిన దాని మరవనేల!
అందందు కీడుల నడుమన గలుగు మంచిని గుర్తుంచుక
అందిన భాగ్యంబును గుర్తెరింగి అందనిదాని విస్మరించి నడువుము;
పొందిక నిదియె సంతోషంబునకు సోపానము – మంకుతిమ్మ!
760.
చింతించి ఫలమదేమి? మార్చ వీలు లేని గతజన్మంబు గూర్చి,
చింతించుము ఇక్కాలంబు గూర్చి; గతంబు గుర్తురాకు౦డుటకే యో
చించి పరమేష్ఠి వీపున నుంచక నీ యాననమున
ఎంచి నునిచె కనుల – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084