[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
721.
అలరారుచున్నవి వేనవేలీ సృష్టిని;
ఇల, గగన, మనుజ ప్రయత్నములవెన్నో!
అల వాటిన్ శ్రేష్ఠంబైన దేదియని వచింపగ; ధర్మ
పాలితంబులై యత్నంబులే శ్రేష్ఠంబులు – మంకుతిమ్మ!
722.
చెలువంబైన వాటిన్గనినంత వికసించు వాని కనులు;
పలువురి దుఃఖంబుల గనినంత తడియగు వాని కనులు;
ఇలలోని సంకటంబుల విని, ఎక్కుడగు వాని ఎద సవ్వడి;
శిల కాదు యోగి ఎడద – మంకుతిమ్మ!
723.
శాంతియుత తత్త్వంబును చెడపకుండుటొక సుగుణము,
అతియాసక్తి నడ్డగించక తాటస్థ్యంబుగ నుండుటొక సుగుణము,
అతిగ లాభనష్టముల చింతింపక, వాటిన్ హాస్యంబుగ దీసికొనుటయు,
అత్యంత క్షేమకరంబులివి – మంకుతిమ్మ!
724.
స్మితంబది మితంబై యు౦డనోపు, చెవికింపుగాను
హితంబుగ నుండవలె మాట, సత్యధర్మ పరిధి లోన
మితంబుగ నుండవలె మనోద్వేగ, భోగంబులందు
‘అతి సర్వత్ర వర్జయేత్’ యని వినగ లేదే – మంకుతిమ్మ!
725.
జలనిధులన్నియు యేకంబగు గాక, వేడికిన్ పుడమి పోడమి చెడుగాక,
కలతన్ జెందక, డెందము నెమ్మదిన్ చెడక, బెదరకుండుము;
జలనిధి హోరు శాంతించు, పుడమి వేడి సెగలు, పొగలును తగ్గు
కాల పరిమితి గలదంతటికిని – మంకుతిమ్మ!
726.
కొందర నవ్వించి, కొందర నేడ్పించి, కెరలించి, నొప్పించి
కొందరిని, రోషావేశంబుల రగిలించి కొందరిని,
అందరికిన్ పంచి రమ్మని పంపె నిన్ను విధి;
అందందు తపాలా బంట్రోతు పగిది – మంకుతిమ్మ!
727.
లేఖలలోని సుద్ది తపాలా బంట్రోతుకేల?
లేఖలందించుటే యతని పని; ఋణంపు
లెక్కలో, కష్టనిష్ఠురంబులో, సంతోషకరంబులో;
అక్కర ఏల? పిక్కబలంబె యాతని యాకలి దీర్చు – మంకుతిమ్మ!
728.
లోకుల మనోవికారంబులన్ గని నవ్వుకొనుము లోలోన,
వ్యాకులపడు వేళ పెదవి బిగించి సహించుము,
లోకుల జత గూడి సహజీవనంబు గడిపి, నగునగుచు
మక్కువతో చరించి తరలుము – మంకుతిమ్మ!
729.
అడ్డులు, ఆటంకంబులని సొడ్డులు చెప్పనేల? వీలైనంత
అడ్డుల నెదురొడ్డు నీ బుద్ధి బలంబు చేత; కాదన్న
యెడల ననుభవించి, తక్కినదాని విడుము ఆ విధిరాయుడికి
విడుదల కదియే శాంతి మార్గము – మంకుతిమ్మ!
730.
తన పయనంపు దారిన్ తాను మున్నెరుగునే విహంగంబు!
తనను బిలిచి మన్నన భిక్షయిడు వారెవారు దానికి!
తన పక్షంబులు గొనిపోయిన దిక్కునకున్ మళ్లి, తిను చిక్కినదాని;
మనకున్ నియ్యదియె వ్రతమాచరింప – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
