Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-71

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

711.
ధర కోసల, పరబ్రహ్మయే రఘువరుండు,
భరతుని వోలె అనువర్తనా పరులమే మనము;
దొరకొనరించు సేవయే మన సంసారపు నిర్వహణము;
హర్షమొదవ సాగింపుము సంసారము – మంకుతిమ్మ!

712.
నాసికా యుచ్ఛ్వాస నిశ్వాసంబులవి సహజముగ జరుగునట్లు
వాసిగ నీ మంగళ కార్యము మవగతముగాగ,
ఆశించక, నిస్వార్థంబుగ సంకల్పించిన పుణ్యకార్యములన్నియున్
వసివాడక సహజంబుగ జరిగిపోనిమ్ము – మంకుతిమ్మ!

713.
చేయదగిన కార్యంబుల చక్కగ జేయుము జుగుప్సకు లోనుగాక;
చేయుము లోకహిత దృష్టి మనమున నింపి, లోకధర్మమును పాలించి,
చేయుము ప్రతిఫల మాపేక్షించక, గతమున్ గూర్చి చింతించక
ధ్యేయంబు విడనాడక – మంకుతిమ్మ!

714.
పరిమితంబైన ఆశయు, మైమరపించు సుఖంబులందు
విరక్తియు, లోకవ్యవహరంబులయందు మితానురక్తత, సత్యాసత్య
పరీక్షణానుమతి తత్త్వంబరయ నీ నాలుగు
పరమ శ్రేష్ఠంబులు – మంకుతిమ్మ!

715.
తెగడక, అపరాధిన్ క్షమించెడి గుణంబును;
తెగువన్ విధి నెదురించు ధీర గుణంబును; గెలుపున
పొంగకుండు గుణంబు; ఓటమిన్ క్రుంగకుండుటయు నను నీ
నాల్గు తపంబులరయ తక్కినవేల – మంకుతిమ్మ!

716.
మృతుడి సంసారపు గోల శవవాహకులకేల? వాడి
సతి కన్నీరు మున్నీరై ఏడ్చుగాక; అప్పిచ్చిన వాడు నోటికి
చేతికి పని కల్పించుకొనుగాక; స్థిరచిత్తంబున చితిగట్టి
మోతురు వల్లకాటికి; చిత్తంబు స్థిరంబుగ నుంచు – మంకుతిమ్మ!

717.
అన్నా రారా! తమ్ముడా రారా! యని గోడుగోడున ఏడ్వనేల?
ఎన్నగ నీ శవంబును నీవే తీసుకుపోవలె రుద్రభూమికి;
అన్నా! నీ ఒడలే చితి; నీ జగడంబులే సమిధ లరయ,
మన్నే తర్పణము నీకు – మంకుతిమ్మ!

718.
తన శిలువను తానే మోసెగద ప్రభువు ఏసు! తెలియవే,
అన్నా! నీ కర్మంపు భారమును నీవే మోయవలె; తప్పదు
ఖిన్నుడవు గాక, పెదవి బిగించి, మోయుము శవభారంబును
వెన్నున మోసి నడువుము – మంకుతిమ్మ!

719.
తలపాగలోని మురికి, నీ పంచె ముడుతలలోని చిరుగుల
ఇలలోని యందరికి తెలియజేతువే! రజకునకు గాక;
పలు విధంబులగు నీ ఇక్కట్లు, చింతల నీయందే ఇముడ్చుకొనక
పలువురకేల వాటిని విస్తరింప – మంకుతిమ్మ!

720.
నిత్యనూతన మీ జీవనము; గతం గతః; అహితమది;
నిత్యము నూతన రసముల విరజిమ్ముచును, మాటల
చేతల, నడతల, చూపుల నూతనత్వము బెంచిన
అత్యంత శ్రేష్ఠమై బరగు నీ జీవనము – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version