Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-70

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

701.
నిర్మి౦పుము నీ మనోయాలయంబున గదులు రెండు;
చర్చింపుము లోక వ్యవహారంబుల బాహ్యమందిరమున,
విశ్రమింపుము ఏకాంతంబున మౌనంబున అంతఃపురంబున,
పరగ యోగసూత్రంబది – మంకుతిమ్మ!

702.
గృహ తాపత్రయంబులన్ మున్గి; అపుడపుడు గురుతు రాగ
ఇహంబు మరచి దేవళంబున కేగి వచ్చురీతి; దేవళంబున
అహరహంబు దైవ సన్నిధిన్ గడిపి, గృహమునకరుదెంచిన
ఇహపరంబులు రెండును సాధ్యమగు – మంకుతిమ్మ!

703.
కావలె నొక బహు సూక్ష్మమైన యుపాయంబు జీవన యోగంబునకు
కావలె జాగరూకతయును బుద్ధి సమత్వంబును,
కావలెనని యనడు, కూడదనియు యనడు యోగి
కావలె నాతనికి ఏకాకి సహవాసము – మంకుతిమ్మ!

704.
సతత, సంయమ, శమముల చేత సంసారంబు నడప
ఆత్మానుభవంబున కయ్యది యనుకూలంబగు, మమతామోహము
గతంబు గావలె వివేకము చేత; పాండిత్యమున గాదు
యత్రంబునన్ బడి నుజ్జయిన గాని దొరకదు జ్ఞానము – మంకుతిమ్మ!

705.
సంతత శిక్షావంతమై, దీర్ఘాభ్యాసమైన తరి
అంతరంగపు క్లేశో పాశంబులు శాంతిం బొందు;
సంతృప్త ప్రవృత్తి చేతన, ఏకాంతాభ్యాసము చేత
సంతసింప జేయుము చిత్తమును – మంకుతిమ్మ!

706
రాముడడవి కేగినన్, ఆతడిచ్చిన పాదుకలకున్ విన్నవించి
రాముని తమ్ముడు భరతుడు రాజ్యభారంబు మోసె గాని
రాముని నిర్లక్షించి కాలేదతడు రాజు, సేవకుడై పరిరక్షించె: ఆ
రాముని తమ్ముని వోలె నీవును వహింపుము – మంకుతిమ్మ!

707.
తిరిగివచ్చు రాముడేనాడైన, నాడాతడు ప్రశ్నించగ
సరియగు యుత్తర మీయవలె నాతనికి, ఋజుమార్గమున, నని
భరతుడు నీతిమార్గము దప్పక శారీరక మానసిక శక్తుల
ధారవోసె ముడుపుగా – మంకుతిమ్మ!

708.
నిర్వహించె నన్నింటినిన్, యవేవియు తనవి గాదని భావించి
నిర్వహణా భారంబు నాకేల? యది నాదు కాదనెడి తలంపు లేక;
నిర్వహించె విధేయుడై, స్వతంత్రుడై సత్పరిపాలన
భరతుడరయ మహాయోగి గాదె దలప – మంకుతిమ్మ!

709.
దొరతనము జటిలంబు, కుటిలత్వంబు, కఠినం బైనను
భరతుడు దానిని దాటవేసెనె రాముని తీర్పు కొఱకు!
భరమున కర్తవ్య భారంబును దానరసి మోసె కాడిని
ధీరుడు ధీమంతుడు భరతుడు – మంకుతిమ్మ!

710.
ప్రత్యక్షంబుగ లేని ఆ స్వామినిన్ మది దలచి, దలచి
సత్యభక్తిన్ సేవలొనర్చె భరతుడు స్వామి సేవాపరాయణుడై;
నిత్య జీవనంబున నీవు నాతని యడుగుజాడల నడువుము
స్వంత మన్నది మానుక – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version