Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-69

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

691.
యథేచ్ఛగా విహరించు విహంగమునకు గుర్తు చేయు దాని గూడు
యథేచ్ఛగా తిరుగనీయక పశువును కట్టియుంచు పలుపుతాడు
బద్ధుడై యుండవలె నరుడొక తత్త్వమున కెల్లప్పుడున్
కాదేని తెగిన గాలిపటమే నరుని స్థితియు – మంకుతిమ్మ!

692.
పుస్తక పఠనంబున, వాదంబున, కుశలత్వంబున యలవడదు పర
తత్త్వము; కావలె దానికొక యంతః చక్షువు చిరకాలపు మమతా
తత్వపు పొర ఛిద్రమయినపుడు గాని కన్నులవి తెరవబడవు; పరతత్త్వ
సత్యమపుడు గోచరమగు – మంకుతిమ్మ!

693.
ఇంద్రియాతీత విషయములు పట్టువడునే ఇంద్రియముల చేత!
ఇంద్రధనుసును చేదోటి తోటి దింప సాధ్యమే దలప!
సందృశ్యమాన యాత్మ తోటి యాత్మ పెనవేయవలె గాని, సతత
ఇంద్రియముల నిగ్రహించి, అలసత్వము వీడుము – మంకుతిమ్మ!

694.
బంధనములనెల్ల త్రెంచుకొని దాటి వరద నీరమది
సంద్రము జేరి సంభ్రమించు; జీవనమును యంతియే
ఇంద్రియ బంధనముల నుంచి ముక్తుడైన తరి
సందర్శనమగు ఈశ్వరానుభూతి – మంకుతిమ్మ!

695.
ద్వంద్వమయంబైన ఈ లోకంబును, త్రినేత్రుండు, ని
ర్ద్వంద్వంబుగ, తన అక్షి ద్వయంబున గాపాడు;
ఇంద్రియాతీత దర్శనమునకు గావెలె వేరొక యక్షి, యా
సంధానమును నేర్వుము – మంకుతిమ్మ!

696.
సమరమున పోరు యోధుడును, సంద్రమును ఈదు ఈతగాడును
తమ తమ గురి ముట్ట నెంచుదురె గాని వేరొండు దలంతురే?
తమను తాము మరచి సాగుదురు ఆవేశంబున, ఆ
తమకమే మోక్షసాధనము – మంకుతిమ్మ!

697.
ఉత్తమ మైనదని తోచినంత మాత్రమున నేమి ప్రయోజనంబు!
ఉత్తమ ప్రవృత్తిగ యయ్యది భావంబున తిరంబున నుండకున్న;
ఎత్తరి నైన మరల మరల నద్దాని యనుష్టించవలె, భంగంబయినన్
యత్నంబు జేయవలె మరల మరల – మంకుతిమ్మ!

698.
తడబడక, తొట్రిలక, పడుచు గాయంబు జేసికొనక
నడక నేర్చుకొను శిశువుంగలదే? నీతి మార్గమున
నడచు నపుడును తొట్రిలి, క్రిందబడి, మైదడవికొనుచు
పడు పాట్లు పడువారె నందరును – మంకుతిమ్మ!

699.
ఎన్ని మార్లు తపమొనరించి, భంగపాట్లు పడియెనో!
బన్నము లవెన్ని వడసి బ్రహ్మ ఋషి యాయెనో కౌశికుండు
ఎన్ని క్లేశములు, సంకటము లెన్ని మరి మరి యనుభవించినను
యత్నము వీడక నుత్తమగతి నొందవలయు – మంకుతిమ్మ!

700.
పూర్వ జన్మపు వాసనల తోడ మన వివేచన పోటి పడగ
పూర్వజన్మ కర్మంబులవి మన వివేచనాశక్తికి మీరియుండు,
సర్వ కర్మ ఫలంబు లధిగమించగ, ధీశక్తి చేత,
ఈశ్వరానుగ్రహంబు చేత మీర వీలగు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version