[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
681.
ముందేమగునో, ఇంకెటులో యను భయంపు మాట లిపుడేల?
సందర్భము రానిమ్ము, అప్పుడ చింతించిన సరియగున్
పొందుగ సరి జేయువాడు గాడు నీ సేవకుడు, వేరొండుగలడు
ముందున్న నీ బ్రతుకు కొనసాగింపుము – మంకుతిమ్మ!
682.
దిన దినంబునకు నిమిష నిమిషంబునకు భవితవ్యంబున్ గూర్చి
అనుదినంబును చింతజేయనేల? ఎటులో నీడ్చుకొని బొమ్ము
మన వ్యవహరంబుల సక్కజేయ యజమాను డొకడు గలడు
వానినిన్ మది దలంచి ముందుకు సాగము – మంకుతిమ్మ!
683.
చింతించ నేల? వగవనేల? దినకరుడు గతిదప్పక యుద
యించుచు తిరుగుచుండు, వృద్ధి క్షయంబుల నన్నింటి వాడె సమర్థుండు;
మ్రింగి వేయు మృత్యువన్నింటిని, పూర్వవాసనల మరిపింపజేయ,
అంబికాపతి మనకిచ్చిన వరంబు గాదె యది – మంకుతిమ్మ!
684.
దినమనెడి కొలపాత్రతో మన ఆయురాశిని రవి కొలచిన
ఘను డాతని కొమరుడు జముడు దాని లెక్కల వ్రాసి యుంచు
మాన్యులీ దివిజు లిర్వురున్ యుపకారులు మన లెక్కల జూచి
తనువునకొక గతి కల్గింతురు – మంకుతిమ్మ!
685.
అప్పుడో, ఇప్పుడో, ఎప్పుడో మన జీవన కథ ముగిసిపోవు
తప్పదు, అంతో ఎంతో కొంత జన్మంబు కరగిపోవు
ఎప్పట్టుననో మరుపనెడి ముసుగు మమ్ముల నావరించు
ఒప్పుగ సంతసం బొసుగునది – మంకుతిమ్మ!
686.
లేదు మనకొక సరైన యూతకర్ర, లేదు తేట తెలివియు,
వదలని అరకొఱ తెలివితేటలే మనకు
తుద కెటులో సాగిపోవు జీవన యాత్ర
యద్దాని కేల నీ యార్భాటము – మంకుతిమ్మ!
687.
హిమగిరి విస్తారంపు సొబగు ప్రత్యక్ష దర్శనంబుననే
కమనీయంబగు గాని, చిత్ర దర్శనంబున
నేమయినన్ కాననగానే! అత్యద్భుత దర్శనంబుల
నీ మనసార ప్రత్యక్షంబుగ గాంచవలె – మంకుతిమ్మ!
688.
ఆర్ణవపు గంభీరత కనుల గాంచినంత గాక, కవి
వర్ణనముల తోడ తనివి జెంద వీలగునే!
పూర్ణవస్తు గ్రహణము పరోక్షంబున జేయ వీలగునే,
నిర్ణయము ప్రత్యక్షంబుగ జేయవలయు – మంకుతిమ్మ!
689.
నీ యుత్కట క్షణంబులందున, ధర్మసంకటంబుల,
నీ యంత కాలమందున, నీ నిర్వాణ సమయమందున,
నీ యత్యంత జీవన పోరాటంబున, నీ ఒక్కడవె నిల్వవలె
నీ యంత నీవే నిర్మిత్రుడై యుండుట నేర్వుము – మంకుతిమ్మ!
690.
ఏది వెంబడించి వచ్చె ధర్మజుని స్వర్గారోహణంబున? వచ్చె
నది ధర్మంబు శునక రూపంబున్, ఎవ్వరున్ రారు
ముందున, వెనుకను బుట్టిన వార లెవ్వరున్, వెంట వచ్చు మన ధర్మంబొక్కటె;
యదియ మన మనస్సాక్షి; మనల హెచ్చరించునది – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084