[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
661.
తప్పెట వాయించి ప్రకటించదు మొక్క తా మొలకత్తు వేళ,
గొప్పగ ముఖవీణాపన సేయదు కాయ తా ఫలమగు వేళ,
డప్పు సద్దు జేసి యుదయించరు సూర్యచంద్రులును; నీ
గొప్ప జెప్పక కుట్లు వేయుము నీ మోవికి – మంకుతిమ్మ!
662.
చరింపుము నీ ధర్మంబును విరామమెరుగని దినకరుని వోలె
విరజల్లుము నీ తేజంబును యంతటన్ విద్యుల్లత వోలె
కార్యము శక్తికి మించిన దైనను, ఫలితంబుల నెంచక
చరింపుము తలయొగ్గి సద్దు సేయక – మంకుతిమ్మ!
663.
లోకవ్యవహారంబు లరయ రెండు రకంబు లీ యవని;
యొకటి పరమార్థంబునకు, వ్యావహారంబున కింకొట
యొకపరి రెంటినిన్ పరికించి, పరమార్ధమున్ మరచి
లోక వ్యవహారంబున కెక్కుడు తానమీయక మెలగుము – మంకుతిమ్మ!
664.
మనుజుని వ్యవహారంబునకు ఆదాయ వ్యయంబులవి రెండు
అనుభవ భోగభాగ్యంబుల కొకటి, లో మనసులోని నీతి కొకటి,
తన సంపాదన దేహసుఖంబునకైన, మనఃసుఖంబున కయ్యది
అనువగునే పరికింపుము – మంకుతిమ్మ!
665.
తనువును తనివి జెందించు కవళంబొకపరి విషమగు
ఎనలేని మోహపాశంబు గాలంబగు జీవనంబునకు
మనః శరీరంబులపై దెలియని పరిణామంబు లేర్పడు
గణించుము ఆత్మలాభంబును – మంకుతిమ్మ!
666.
నూరారు సరుకుల బహు దొడ్డ సంత ఈ జీవితము
ఊరిలోనివి, గేరిలోనివి, గేహంబులోనివి సరకులవెన్నో
వేరు వేరు సరుకులకు వేర్వేరు నెలవులు, వెలలు వేరువేరు
తారతమ్య మెఱుగ తత్త్వంబుల – మంకుతిమ్మ!
667.
ఇల్లు తగలబడి పోవుచుండ, నురుకుము దాని నార్ప; మనసును
జ్వలించు జ్వాలల నార్పగరాదు – దవ్వుల నుండుటే మేలరయ
అల్ల దేహంబున కుపకారంబు సేయబోవు ఆతురత తోడి
అల్లకల్లోలంబు సేయబోకు ఆత్మను – మంకుతిమ్మ!
668.
వడ్రంగి, కృషీవలుడు, కార్మికుడును యోగిపుంగవులే గదా!
ముడుపుగా బెట్టుదురు తమ మనస్సులన్, కరములన్;
ఎడతెరపి లేక కష్టించు వీరికి క్షుద్ర తలంపులకు తావే లేదు
వడయ రెవరి దాక్షిణ్యమును, కర్మయోగులు వీరు – మంకుతిమ్మ!
669.
ఈలాగునో, ఏలాగునో, ఏ తీరునో గడచిపోవు నీ జన్మ; సాగి
కాలంబు ముగిసిపోవు, ముగిసి మరచుటే సుకృతము; ఈ
వేళనో, ఆ వేళనో ఎప్పుడో ముగిసిపోవునని దలచి, యదియ
వలసిన భాగ్యమని ఎంచి, సంతసించు – మంకుతిమ్మ!
670.
ఏరికేని సాధ్యమే మరి మరి పుట్టు రోగంబుల కోషధుల గూర్చ
పరిహారంబేది: నరుని నీచపు యాలోచనా పరంపరలకు
ధర, భరించి యుండదే అత్యుష్ణమును తాల్మి తోడ
మారు పల్కక పల్బిగబెట్టి నోర్చుకోవలె – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084