Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-65

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

651.
మౌనంబున, దొరకిన యంబలి ద్రావి తనివి జెందు
మాననీయుడు; శునకపు ఎంగిలి ఓగిరంబున కాశపడునే!
జ్ఞాని, తారతమ్య వివేకముతో చరించు, కలత జెందడు
మానుము నీవును కలతలన్ – మంకుతిమ్మ!

652.
బోనంపు ఆతురత కంటె, కనకంపు ఆతురత తీక్షణము
కనకంపు ఆతురత కంటె కనకాంగిని పొందెడి ఆతురత మిన్న
కనకాంగి పొందు కంటె, పేరు ప్రతిష్ఠల దాహంబె తీక్షణము
ఎన్నగ నీ దాహము ఆత్మను కలుషితంబు జేయు – మంకుతిమ్మ!

653.
ఇంటనో, మఠంబునందునో, సభలోనో, సంతయందునో
అటుగాక యడవి యందునో, శ్మశానమందునో, ఇంకెచటనో
పటుతరంబుగ పేరు ప్రతిష్ఠల కాశపడు, ఆత్మకు
చేటయినను లెక్కింపడు నరుడు – మంకుతిమ్మ!

654.
పేరు రావలె, పేరు రావలెనని గసపోసుకొనుటేలనయ్య!
ఎరుగవే నీవు, నీ కాలము చెల్లిన తరి కసవులో కసువై పోదువు; నీ
పేరు నెవరుచ్చరించెదరు? తాపత్రయమేల పేరు కొఱకు
మరచిపోవగ వేడుమీ ధరను – మంకుతిమ్మ!

655.
బియ్యపు గింజను అన్నంబుగ వండనేర్చిన ఆద్యుడెవరు?
వాక్యంబు వ్రాయ యక్షరంబుల కనిపెట్టిన ఆద్యుడెవడు
విద్యలెన్నియో నేర్పిన వారి లెక్కలు లేవు నియ్యిలను; నీ
కార్యంబల్పము, దక్కునే యశస్సు – మంకుతిమ్మ!

656.
పేరొందుట యన్న యదేమి? ఇతరులు నిన్నుబ్బించు మాటలే గాదె!
వేరొండు అధిష్టాన పీఠంబు నీకేల నీ బ్రహ్మపురిని,
అరయన్ నీ వింకను శిశువవు, పశువవు, లేత యాకువి; వేరు
దలపక కశ్మలంబుల నూడ్చుము చీపురువై – మంకుతిమ్మ!

657.
సిరిని వడయుటకున్, స్త్రీని వడయుటకున్ ఎన్నెన్నో
పరమ నీచపు దారుల నన్వేషించి సాగుదురు జనులు,
బిరుదులన్ వడయుటకును, పేర్గాంచుటకున్, వలసినన్ని
దురిత గుణంబులవెన్నో – మంకుతిమ్మ!

658.
పడి లేచుచు, జగడమాడి ఓటమి పాలైనను మరి మరి
పడి ఓడినన్, కలహంబుల రేపి, తానె ప్రసిద్ధుడనియు
కడు సంరంభంబున, ఉద్ధరించెద నేనని ప్రగల్భముల బల్కు
వాడు; ఎంత పట్టున యుద్ధరించునో – మంకుతిమ్మ!

659.
శృంగభంగము తథ్యము దురభిమాని కొకదినంబున, దేవ
సంఘంబూరక యుండునే మట్టి గరిపింపక గర్వోన్నతుల
భంగంబు జేయు సందర్భంబును జోడించు విధిరాయడు
భంగపాటు తప్పదు – మంకుతిమ్మ!

660.
గర్వభంగంబు గావింపడే గరుడ వాహనుడు గరుడునకు
పార్థుని యహంకార మడగింపడే పార్థసారథి నాడు
దర్పంబు జూపు వారి గర్వంబు నణచివేయు విధిరాయడు;
శిరసు వంచి నమ్రత జూపుటే యుత్తమము – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version