Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-64

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

641.
వినువీధిన్ విహరించు విహంగమున కేది దారి? నీట చరించు
మీనంబులకు నిర్దేశిత మార్గంబదేది? శక్తి యదేదో
నిను ముందుకు నెట్టుకు పోవు కడవరకున్ వీడక,
వినుము; నీవునున్ యొక గాలిపటంబె – మంకుతిమ్మ!

642.
కాకుల కేడవయ్య నిర్దేశిత దారులు! ఎవరింట
జిక్కన వడియంబులో, ఉడికించిన గింజలో, పులుగులో
దక్కిన శ్రాద్ధ పిండంబో, ఏదో యొకటి జిక్కు; వాటికన్న
ఎక్కుడుగ లేదీ మానవ జీవనంబు – మంకుతిమ్మ!

643.
నూరారు అడ్డంకులు, ఆయాసంబు లీ జీవనంబన వచ్చు
కొరత లేక నీకవి ఇంపైనను గాక పోయినన్;
అరచి గీ పెట్టిన, పోరాడినన్, నిష్ప్రయోజనములే యగు
ఊరక పెదవి బిగబట్టి సహింపుము -మంకుతిమ్మ!

644.
పుండును బ్రహ్మండము జేసికొను గోకి గోకి కోతి; ఊరక
నుండక మనుజుడున్ మరి మరి తన సమస్యలన్ గోకి గోకి
మండిపోయి, అందరిన్ శపించి, బ్రతుకు నరకంబు జేసికొను,
పండంటి జీవనంబును పుండుగ జేసికొననేల – మంకుతిమ్మ!

645.
చింతలు, సంతాపంబులవి మనః కల్మషంబుల విసర్జించు ఓషధులు
సతత, సంతోత్సాహంబులే పథ్యోపచారంబులు యవ్వాటికిన్
ఎంతయో కొంత చికిత్స యాత్మకు జరుగుచుండ
కొంతైన యుపశమనంబు కలుగు నాత్మకు – మంకుతిమ్మ!

646.
శీత వాతములకున్ గురైన తరి, గలవు ఔషథ పథ్యంబులు;
అంతరంగంబును రోగ పీడితమగు వ్యాకులత చెందిన వేళ,
ప్రీతి పూర్వక ప్రేమౌషధంబుల చేత దాని యనునయింపవచ్చు,
ఆత్మతృప్తి కదియ దారి – మంకుతిమ్మ!

647.
ముక్తి యనగ వేమి? సుస్థిర మనోస్థితియె కాని, వేరగునే!
రక్తి, విపరీతంబు గానప్పుడే యదియె ముక్తి
యుక్తి చేత ఇంద్రియముల నిగ్రహించు సత్త్వగణోన్నత
శక్తియుతుడే ముక్తుడు – మంకుతిమ్మ!

648.
చెఱపి వేయుము మనసున కలుగు సంకటపు వేర్ల; పెకలించి
నరికి నావలకు నెట్టివేయుము నీ తలంపుల నుండి; నీ మెడకున్
ఉరి కాగలవవి; సంకటపు ముడుల నుత్తరించి
దూరమగుము వాటి నుండి – మంకుతిమ్మ!

649.
నన్నీ లోకము ముద్దు సేయదని వ్యథ జెందవలదు,
కన్నవారికి నీవు ముద్దుబిడ్డవు; ప్రత్యర్థి నీవీ లోకమునకు
నిను ముద్దుసేయ నెవరికేని తీరికి యేది, వారి వారికి
ఎన్నగ మోయలేని భారంబులుండ, నీ మొఱ ఎవరాలకింతురు – మంకుతిమ్మ!

650.
రాగి సంగటి మ్రింగి రాగంబున నుండు వాడు, కాకి
దొంగిలించి తినుచున్న భక్ష్యంబున కసూయ జెందునే!
ఓగిరమేదైన నేమి, యాకలి దీర్చుగాదె, దీని కొఱకై
క్రుంగింపనేల ఆత్మను – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version