Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-63

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

631.
మైగప్ప జలతారు చేలాంచలమో, కుచేలమో;
భోగంపు టన్నమో, తిరిపెంపు యంబలమో, ధనిక పేద
వర్గంబులు కొకటియే మానసంరక్షణకు, కుక్షింభరత్వమునకు
పగనసూయ లేలనో ఈ విషయంబున – మంకుతిమ్మ!

632.
బధిరత్వంబు దప్పునే కర్ణకుండలములు ధరించినంత!
వ్యాధిగ్రస్తమై శుష్కంచకుండునే చర్మము మృష్టాన్నంబు తినినంత
పేద ధనిక వర్గ విచక్షణ శూన్యమీ భువికి, రెండునున్ సమములే
ఆ ధర్మనిర్ణయము సమవర్తిది – మంకుతిమ్మ!

633.
నుదుటి వ్రాతల చెఱపన్ సాధ్యమే యెవ్వరికేని? పరి
శుద్ధులుగ జేయనసాధ్యము; పూర్వంపు కర్మశేషంబులు
ఛిద్రంబు గావలె, కర్మశేషంపు పొరలన్నియున్ తొలగిపోవలె,
పెద్దలు జెప్పిన మాటలివి – మంకుతిమ్మ!

634.
అరివీరుల తుడిచివేయవచ్చు రణంబున, ప్రతిపక్షముల
నరికట్ట వీలగు రాజకీయ తంత్రబున క్షుద్ర
కార్పణ్య దన్యాయపు వ్రాతలటులే మిగిలియుండు, వాటి
చెఱుప వీలుగాదెవరికైన – మంకుతిమ్మ!

635.
గుద్దలి చేతబట్టి కొండగుట్టల కనుమల చదును జేయ
సాధ్యమే! దొంగచాటుగ వచ్చు ముప్పును నివారించునే ఓషది!
యుద్ధ తాపముపశమింప వీలగునే శాంతి వచనముల చేత
సిద్ధముగ నుండుము సహనము వహించి – మంకుతిమ్మ!

636.
వేనవేల యుక్తుల సాహసంబుల నీ వొనర్చిన కార్యంబుల
కెనలేని ఫలితంబులు నీ పౌరుషంబునకు దక్కినన్,
కానరాని ఇడుములవి పొంచి నిన్ ఇరుకున బెట్టు,
పునః మిగిలి పోవునవి; తాల్మి వలయు – మంకుతిమ్మ!

637.
కలిమి లేముల యంతరమది స్వల్పము; ఒప్పుతప్పులకున్
తెలివికిన్, తెలివి లేమికిన్ యంతరమది స్వల్పమే,
ఏలనీ యంతరముల చర్చ? మరణమన్నింటిని
కలిపివేయు, చింతించనేల – మంకుతిమ్మ!

638.
నమ్మక ముంచుము దేవుడిపై, నమ్మి చెడినవారు లేరందురు,
నమ్మరేలనో మరి దుఃఃఖభాజనులు; కోర్కెలు లేనివారికేల
నమ్మకంపు బెడద, దాక్షిణ్యమేల, విరక్తుడవై
నెమ్మది నుండుము – మంకుతిమ్మ!

639.
అనుభమింపుము నీదైనదాని మోహవశుండు గాక
అనుభవించు తరి జాగరూకుడవై గర్వంబు వీడుము
కానగరానివి, కనుల గన్పడు నవెన్నియో గలవు, అనుభవించము
అన్నింటినిన్ మోహంబు విడనాడి – మంకుతిమ్మ!

640.
మరువ వలదు, ఈ బ్రహ్మపురిని నీవొక బిచ్చగాడివని
సిరి ఎంత కల్గిననేమి, పరిజనము లెందరున్న నేమి; తోడె
వ్వరున్ రారు, దాంభికంబు విడనాడి, నీకు నీవే సేవకుడివై
చరించుము పరదేశి వోలె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version