[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
621.
ధర్మమన్న యన్నింటినిన్ ధరియించునది కాదె; నీవును నంతియె
ధర్మపు కార్యంబు మోయ బూనుము, యందరి హితమున్ గోరి
మర్మమెరిగి, లోక యుపకార్యాచరణంబు గావించుము
ధర్మరక్షణకు నడుము బిగించుము – మంకుతిమ్మ!
622.
ధర్మ నిర్ణయమది నీకు జన్మ జన్మాంతరముల నుండియు
కర్మ సంబంధముల కట్టుబడి నుండునని దెలిసి
నిర్మమత, నిర్మలోత్సాహంబు చేత నీవాచరించ
బ్రహ్మ సామీప్యము నీకగు – మంకుతిమ్మ!
623.
అంతటను, ఇంటిన్ బయట, సంఘంబున, దేశంబున
సంతస కార్యంబు సలుప విహిత తానంబిది; సర్వ
హితార్థమై, సుస్థితికి కారణంబై యొనరించు కార్య మరయ
యుత్తమ ధర్మము – మంకుతిమ్మ!
624.
అంతమొందించుటయో, అంతమొందుటయో; విజయమో, యపజయమో
నంతియ కాని, వేరుదలంచునే క్షత్రియుడు రణంబున,
కృత నిశ్చయుడై పోరు సల్పు, లాభనష్టముల దలంపు లేక, యది
యాతని యాత్మ ఋణంబు లోకమునకు – మంకుతిమ్మ!
625.
పాడు ప్రపంచ మిది; కాలి మసి బొగ్గైనది నరుని మనసు,
విడువ నసాధ్యము, వీడకున్న రోతయగు కాయము
కడు నుపాయంబున, అంటీ అంటనటుల సాగించవలె జీవనము
గడుసైనదేమీ కాదీ జీవనము – మంకుతిమ్మ!
626.
కుసుమ హితుడవె నీవు? నలుపక దాని నాఘ్రాణింపుము;
పిసికినన్ యది కంపు గొట్టు; లోకపు తీరును నింతియె,
కాసారపు తేట నీటినిన్ త్రావి కదలుము, కెలికి రొచ్చు సేయక,
పస చెడనీయకు జీవనంబును – మంకుతిమ్మ!
627.
విషయ సంగమము కన్న శ్మశాన సంగమము మిన్న
విషోగిరమారగించుట కన్న యుపవసించుట మిన్న
తృషోల్బణము, కాగిన పెనుపై బడిన పతంగముల పగిది
పిశాచి చేతికి చిక్కిన శిశువు వోలె – మంకుతిమ్మ!
628.
తీర్చవలె లోకంపు ఋణము, తప్పక తీర్చవలె; ఋణము
తీర్చినంత నెమ్మదించు యంతరాత్మ; ఋణవిముక్తడైన
తరి లోకులందరిలోని పరమాత్మను గాంచి, తనివి చెందెదవు
వేరు పాఠశాల ఏల? గేహమే నీ పాఠశాల – మంకుతిమ్మ!
629.
ఎదురు వచ్చు ఎగుడు దిగుడల్ యొక వరంబె తలంచిచూడ
అందరను యొకే సమయంబున యావహింపవవి,
బాధలనున్నవారిని, సంతృప్తులు అనునయింప
బ్రతుకు సాగించుట కష్టతరంబుగాదు – మంకుతిమ్మ!
630.
స్థూల సూక్ష్మ వివేక రహిత హితశత్రువులైన బంధుజనులు
కాలుని కోరలకును జిక్కించు యమభటులరయ, ఏ
కాలంబున జేసిన ఋణంబును వసూలు చేయవచ్చినవారు
తాలిమియె సాధనంబు మనకు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084