Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-61

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

611.
గృహామొక పాఠశాల: బంధువు లరయ గురువులు;
అహరహంబు వారి పరిచర్యయే, వారు నేర్పు పాఠంబులు
ఇహపరంబులు సాధింప వారధి వారు; వారి
సహచర్యంబు మనల సంస్కరించు – మంకుతిమ్మ!

612.
కాషాయధారియే తాపసియా? గృహనిర్వాహకత్వమది
కాషాయంబు ధరింపని తపస్సు; కఠినతర తపస్సది,
అసిధారావ్రతమది, శమదమంబుల సమానత గలిగి
వసివాడక సాగించవలె దాని – మంకుతిమ్మ!

613.
తన యక్షి ద్వయంబున జగంబును రక్షించు నీశుడే
తన మూడవ కంట జగంబుల లయంబుసేయు; మద
నుని జయించి, ఉమకు తన మేని యర్ధభాగం బిచ్చె
ఎన్నగ శివలీల యిది – మంకుతిమ్మ!

614.
మదనుని దండించి, యభయంబున గౌరికి, స
హృదయత, చారుశీలవతికిచ్చె దేహంబున సగభాగము శివుడు,
మోదంబుగ, మోహంబును విడనాడ సంసార భయమేది?
అదియ దారిదీపము, తోడును నీకు – మంకుతిమ్మ!

615.
పాలను గాచి, తోడువెట్టి, చిలుకంగ, కానరాని యా
మేలగు వెన్న పైకి తేలివచ్చు రీతి, ఈ జగపు కవ్వము చేత
చిలికినన్ బయల్పడు నిగూఢ యాత్మశక్తి
మేలిమి గాను – మంకుతిమ్మ!

616.
భుక్తి మార్గము, ముక్తి మార్గమును కాదరయ వేరు వేరు
యుక్తంబుగ నాలోచింపగనవి, దారికిన్ గల రెండు వైపులు;
సత్యశోధనకు లోక సంస్కారమునకున్ వలసిన పక్షములు
శక్తి వంతంబైన ఆధ్యాత్మిక శక్తి ప్రబలు వాటివలన – మంకుతిమ్మ!

617.
అనురాగంబునకున్ యనురాగము, పరితాపంబునకు
కనికరంబును, పోరాటంబునకు పోటమియును, ఘర్జనకు
దీనత్వము ప్రకటించు జీవుడు, ప్రకృతి క్రియలకున్
తన ప్రతిక్రియగ వంతపాడు – జీవనమిది – మంకుతిమ్మ!

618.
లోకపు సంతాప, సంతస, సంభ్రమంబుల రొదలు
ఏకంబున జీవుల ఎదల జొచ్చి తల్లడిల్లజేయు: కవి
యొకండు కావ్యంబున విశదపరచ నూరట గల్గు మదిని
లోక విషయంబులు సూర్యుని వలె హృదయ కమలంబుల వికసింపజేయు – మంకుతిమ్మ!

619.
ఏమి నీ విశేషత? సుఖసంపదలన్నియు నీకే దక్కవలెనా!
ఏమి నీ యత్యాశ! మిగిలిన వారి నావలకు నెట్టి
ఏమి కుడువంగలవు స్వార్థపరుడవై; నష్టపోదువు నీవు
పామరుడా! శుష్కించు నీ యాత్మ – మంకుతిమ్మ!

620.
పరిపక్వంబగు మనంబు జీవయాత్ర కొనసాగించినన్; మది
పరిశుద్ధి నొంది నిర్మలత్వంబు నొందు; అంతః మథనంబునకున్
నెరవకు, సాకల్యపు ఆత్మ సందర్శనమునకున్ సాధనమగు
అరయ, ఇహము నుండియె పరము సాధించవలె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version