Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-55

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

551.
నీదు భుజ భారంబును దైవభుజమున కెత్తించు నీ నేర్పు
ఆ దైవంబొప్పునే! సాగునే నీదు నీ నేర్పరితనము! నీ కోర్కె
ఆ దైవంబు మన్నించినన్, తిరస్కరించినన్
నీదైన బలంబు నిరూపింపుము – మంకుతిమ్మ!

552.
శృతి స్పష్టార్థంబుల్ విశదమగు సత్పురుష భాష్యంబుల
శృతి మతులు యన్యోన్య పరిపూరకంబులు
మతి వికసితమగు రెండింటి మేల్కలయిక వలన
కృత సమన్యయత్వము గలుగు – మంకుతిమ్మ!

553.
పదియునారు కళలు చంద్రమండలమునకున్
పది పదుల కళలు సత్య చంద్రునకున్
పదిలంబుగ నన్నిట గూర్చి బెంచిన యపుడ
వృద్ధియగు సత్య పూర్ణ చంద్రోదయము – మంకుతిమ్మ!

554.
కష్టమదేమి వివేకమున కొప్పిన మంచి నాచరించ; తగ్గు
మిట్టల యంతరమే బుద్ధికిన్ మనసునకు – ఎది
ఎట్టులైన, బుద్ధి మనసు లనెడి వత్తులన్ అంతరంగ చమురు నయద్ది
దిట్టించి వెల్గించవలె జీవనజ్యోతిని – మంకుతిమ్మ!

555.
ధర్మసంకటమున జిక్కి తల్లడిల్లు మనసు నొక్కొకపరి
నిర్ణయంబు నీయది, మమతానురాగంబుల నావలెనెట్టి
తర్కించి సద్వివేక దీపంబున గాంచుము, నీదు
నిర్ణయము సరియనిపించు – మంకుతిమ్మ!

556.
శక్తికి మీరిన పరీక్షలలోను జేయు విధి విన్ను; నీ
యుక్తికి మీరిన పరీక్షల నిను ఇరుకున బెట్టు; నీ
చిత్తంబున తరచి తరచి చూడుము; జాచిన యందు
సత్త్వంపు ఝురి కాననగు – మంకుతిమ్మ!

557.
చింతాక్రాంతుడవై అంతరంగ గవాక్షము మూసియుంచ
చింతా ధూమము నిను యాపిరి యాడకుండ జేయు
శాంతిన్ బొందగ మనోకుడ్య గవాక్షములు తెఱచియుంచుము
సంతత మపేక్షితమది – మంకుతిమ్మ!

558.
తెరచాపయు, తెడ్డును బలము ఏరుదాట పడవకు,
అరయ లోతైన వాక్కుల కర్థంబులు గలవు రెండు
అర్థమొకటి సామాన్యము, గూఢార్థమింకొకకటి, రెంటి
యర్థంబులు దెలిసి సాగింపుము జీవనము – మంకుతిమ్మ!

559.
తిలకించుము పరమ పదమును; గగన౦బున వేర్లు
తలక్రిందులై ధరకు దిగిన కొమ్మలు, రెమ్మలు ఊడలున్ –
అల పరికించి చూడు మీ చిరంబైన జీవితవృక్షంబును
మేలుగ దీని యర్థంబు దెలియు – మంకుతిమ్మ!

560.
పరమోన్నతమున నున్న జీవనంపు మూలమది
పరగ నిండియున్నది మన ఈ లోకంబున,
అరయ ఆకులలోని ఈనెలము మనము; చిగురించి వాడెదము
మరణంబు లేదు జీవన వృక్షంబునకు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version