Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-54

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

531.
శాశ్వత వికసిత క్రమంబులు కొన్ని, ముకుళితంబులు కొన్ని, ఈ
విశ్వంబున నర్తించు చున్నవి పౌరుషోన్నతి కొఱకు
స్వస్వరూపంబులన్ ప్రతిబింబించు పరమాత్మ యాట, యాతని
హృష్యద్విలాసపు యాట – మంకుతిమ్మ!

532.
కట్టడపు క్రమమున్ తెలియగలదే ఇటుక
గట్టిగ నిల్వదేని కూలిపోవు గోడ
సృష్టి కోటిలో నీవొక ఇటుక, సొట్టగ నిల్చినన్
పెట్టు తిందువు నీవు – మంకుతిమ్మ!

533.
పురుషుడు స్వతంత్రుడో, దైవవిధి పరవశుడో?
బరగ రెండింటిని గలిగి, బాహువుల పగది నున్నాడో?
దిర్పుచు, మడచు బాహువులు శరీర మందున;
నరుడు మిత శక్తియుతుడు – మంకుతిమ్మ!

534.
వీచు గుణము సాజము గాలికి, సహింపదు అడ్డగించ
వీచు ధాటికి నెదురైన వాటిన్ పొరలాడించు అడ్డగింపకున్న,
ఎంచగ నరుని స్వాతంత్ర్యమునకున్ నుండవలె హితము మితము
హెచ్చుకారాదది – మంకుతిమ్మ!

535.
కట్టెదుట నున్న ఆనకట్టను ఢీకొట్టు వరద నీరు
కట్ట లేకున్న ఊరిని ముంచి వేయదే!
కట్టడి సేయవలయు నరుని పౌరుష నదిని
ఎట్టయిన; హానిని అడ్డగించ – మంకుతిమ్మ!

536.
కుసుమ మది యుండు పదిలంబుగ, దానిన్ వృక్షంబు బిగిబట్టగ,
కుసుమ వాసనల గొనిపోవు అనిలంబు నల్దిక్కులకున్; నరుని
కుశలతా సౌరభము లిట్లు యప్రయత్నంబునన్ పరిఢవిల్లవలె
యశస్సు వడయ – మంకుతిమ్మ!

537.
సూర్యచంద్రులకొక పథమును, భూ వరుణుల కొక గతియు
మరుదగ్నులకును మితి నిర్దేశించిన యా దక్షుడు
నరుడు తన దారిని తానే నిర్దేశించుకొనగ నేల
నూరుకొనెనొ తెలియరాదు – మంకుతిమ్మ!

538.
నా చెమట నీటనే మునిగి తేలుచు స్వతంత్రుడనై, నా
ఇచ్ఛ మేరకు నేనుండెదనని యొకడు; పుణ్యతీర్ధంబుల, నా
ఇచ్ఛ మేరకు మునిగి తేలెదనని మరి యొకడు; ఎవడి
ఇచ్ఛ వాడిది – మంకుతిమ్మ!

539.
జీవన తత్త్వము పట్టువడదు కేవల బుద్ధి తర్కమునకు;
ఎవరు పరిశోధింతురో బుద్ధి ఋజుత్వంబును? స్ఫురించు
నేవేళనో విద్యుల్లత వోలె తనకు తానే మనంబున,
అవ్వేళకు వేచియుండవలె – మంకుతిమ్మ!

540.
నరుని వివేక మది కేవలము వర్షపు నీరము కాదు;
చెరువు నీరమది ఊరు నీటి కలుషిత మిశ్రణమే,
ధరపు రసవాసనలా యాకసపు నిర్మల నీరంబుల
చెరుపు గాదె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version