[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
521.
వేద, లోకానుభవ స్వానుభవ జ్ఞానంబుల మూటినిన్
శోధించి సమన్వయించుము, ఈ రీతి
సాధించిన జ్ఞానమది ప్రమాణంబగు,
అది నీకగు దారి దీపము – మంకుతిమ్మ!
522.
కొంగ్రొత్త చిగురు, పాత వేరు యుండిననే తరువునకు
సొంపు; నవయుక్తికి, సనాతన తత్త్వ మొడగూడ,
ఇంపైన ఋషి వాక్యముల తోడ నూతన విజ్ఞానము మేళవించు, యా
పొందికయే జీవనంబునకు యశస్సు – మంకుతిమ్మ!
523.
వేద, పురాణ, శాస్త్ర లోక నీతులన్నియు
పాదచారికి రాతిరివేళ దారి చూపించు దివిటీలట్లు గాదె;
సౌధంబు నెక్కిన వానికి, నభము చేరినవానికి
వీధి దీపంబుతో పని యేమి – మంకుతిమ్మ!
524.
మత నీతి రీతుల కంటె విలువైనదీ జీవనము; వరద
యతి రభసంబైన తరి, దరుల నధిగమించదే నది;
అతి సూక్ష్మతరమీ ధర్మంపు విషయంబులు, వాటినిన్
హితంబుగ దెలిసి నడువుము – మంకుతిమ్మ!
525.
జగము వృద్ధి జెంద శాస్త్ర మదియు వృద్ధి జెందకుండునే
నిగమ సంతతియు వృద్ధి చెందుచునే యుండు
తగ జీవ సత్వమది వికసిత మగుచు నుండ, వే
వేగ బహురీతుల విజ్ఞానంబు విస్తరించు – మంకుతిమ్మ!
526.
ధర్మ పాదపమది చెఱవడదు మతతత్త్వంబుల;
జరా పీడితమై, ఎండి మోడై పోవునది మఠంబుల నీడలోన –
పరసత్త్వ మనెడి గుజ్జు జీవంపు వేర్ల నిల్చి పదిలంబుగ
పెరుగు నా ధర్మతరువు సొగసు గాను – మంకుతిమ్మ!
527.
జీవుల సృష్టి కారణం బది నిగూఢమై యున్ననేమి?
ధీ వికాసపు వెలుగులన్ వడిసి ముందుకు సాగుచు
కైవల్య పథంబునన్ వడి కొనసాగించవలె యాత్ర;
దివిటీ నీ బుద్ధి యొక్కటె – మంకుతిమ్మ!
528.
సులభతరములవి భక్తి, నమ్మక భజన వందనములు,
దుర్లభములవి తత్త్వ శోధనామతి కార్యంబులు,
సులభంబులవి జనులకు గిరి ప్రదిక్షణములు సేయ
అల తాపసి యొక్కడే దర్శించు నీశుని – మంకుతిమ్మ!
529.
వేరు గతి లేదు నరునకు దైవంబు దప్ప, నిజమిది;
నరుడు లేకున్న మరి యా దైంబును తలచు వారెవరు?
పురుషత్వమే సేతు వరయ మృగ దైవత్వమనుసంధింప,
మరి యా సేతువును ఛిద్రంబు సేయకు – మంకుతిమ్మ!
530.
పరిమిత మీ జగము, నీ దృష్టి, శ్రవణ మనోబలంపు
మేరకు; నీ సుఖదుఃఖంబులు నీ వశంబులరయ
సరియగు యున్నతి నీవు బడిసినన్, నీ అల్పత్వము
కరగిపోవు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084