Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-52

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

511.
నరకము దప్పె ధర్మజునకు, నిజము: అయిననేమి?
నరకదర్శన దుఃఖము తప్పదాయె, దురిత
తరువుల నెవరు నాటినన్ ఫలము ననుభవించవలె
దీర్ఘకాలంపు ఋణంపు లెక్కయది – మంకుతిమ్మ!

512.
ఎవరి హితంబు కొఱకొ, ఏ ఋణ విముక్తి కొఱకొ
ఎవరి కారణంబు కొఱకో, ఏ ఏర్పాటు కొఱకో, బాధల
నీవనుభవింప వలయు, దైవ నిర్ణయమిది, ఆ
దైవంబును దూరవలదు – మంకుతిమ్మ!

513.
దైవకృప మనల నెపుడు వరించునొ తెలియగలమె?
ఏ వేళ పూర్వజన్మ ఋణంబులవి విముక్త మగునొ,
పూర్వకృత పుణ్యకార్యంబులవి, దురితంబుల కంటె మిక్కుట మగునొ!
దైవ మెరిగిన రహస్యమిది – మంకుతిమ్మ!

514.
నేను సుఖిని కానని, దేవుడే లేడని నీవనిన,
నేను సుఖియని యను వాడే మన వలె దేవుని గురించి,
తనువు, బాహ్య ఇంద్రియాది యనుభవముల కంటె
మనోభావంబుల నన్వేషింప దొరుకు శాంతి – మంకుతిమ్మ!

515.
దైవంబున్న యెడ, నా కోర్కెలు తీర్చడేల?
దేవుడే లేడు; అన్యాయమీ జగమంతయు నని
నీ వొకడవు నీ యనుభవంబుల నెఱుక పరచినన్
కావవి సత్యము: మరుగు పరచ వీలగునే సత్యమున్ – మంకుతిమ్మ!

516.
పరిపరి విధములు నూర్వురకు తమ యనుభవంబులు
నూరారు యనుభవంబు లొక్కనికే యొక్క దినంబున
మరి ఈ యనుభవంబుల లెక్కగట్టు వారెందరో! ఏ రీతియో!
సరిలేని ఇసుక గోపురములివి – మంకుతిమ్మ!

517.
మానవ సాకల్యపు యనుభవంబులకున్ మితి గలదె?
దినదినమవి పడి లేచుచుండు కడలి తరంగాల పగిది
అనుమానపు నిర్ధారమది నిరాధారంబగు
ధ్వనులవి నూరారు విన్పించు నరుని ఎడద – మంకుతిమ్మ!

518.
అర్థంబది గలదు యనుభవంబునకును: కానది మితము
స్వార్థంబది మితంబైన అర్థంబది విస్తరించు
సార్థకత కార్షేయార్థంబు తోడైన సార్థకముగు
పార్థున కనుభమైనట్లు – మంకుతిమ్మ!

519.
ప్రాలేయాచల గుహలన్ జనించు గంగ, ఇంకదది ఎన్నటికిన్;
కాళింది, శోణలవి సంగమించు నందు: వేదపురాణములవి
మూలంబులు, స్వతస్సిద్ధంబులు; పౌరుష బుద్ధియుక్తు లన్నియు
కలసి పోవునవి యుపవదుల వోలె – మంకుతిమ్మ!

520.
యుగ యుగంబులకున్, వెలుగునిచ్చిన వేదపురాణంబులవి
యోగ్యము కావవియని పోద్రోలిన, మూర్ఖుడవే నీవు; ఎ
న్నగ నవవిజ్ఞాన విశేషంబుల కవియె పునాదులు
తగ లోతుగ వేరు నాటుకొన్న గాదె, చిగుర్చునాకులు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version