[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
501.
భక్తి మార్గమున గాక, యుక్తిని భగవంతు వడయ సాధ్యమే!
యుక్తి యున్నచోట భక్తికి తావెక్కడ? యుక్తులన్నియు
రిక్తమై, ప్రాణోత్కరణంబున దైవమును స్మరింపనేమి ఫలము?
రక్తగతమై యుండవలె భక్తి – మంకుతిమ్మ!
502.
సృష్టికర్త, యద్భుత శక్తి సమన్వితు తానొకడు లేడే, మా
ఇష్టార్థంబులు నెరవేర్చ! అసాధ్యంబె యాతనికి సమకూర్చ
ఇష్టంబుగ నాతని మెప్పించవలె గాని, యయ్యదియే
కష్టంబు మనకు – మంకుతిమ్మ!
503.
తరగని యపార భాండాగార మొకటున్నది: మన
మెఱుగని షావుకారొకండద్దాని యేలుచున్నాడరయ
వరంబు లీయ సిద్ధంబుగ నున్నాడతడు, మరి తెలియ
నేరము గద వాడి నెట్లు మెప్పింప – మంకుతిమ్మ!
504.
అంబరంబొక వేడి మేల్ముసుగున్ గప్పికొన, కుమ్మరి యావంబై
అంబుధులు కాగ, ఊపిరులు ధగ ధగ మండి యుక్కిరిబిక్కిరి చేయ,
అందెచట నుండియో గాలి వీచి వర్షించి తాపము శ
మింప జేయు రీతి, దైవకృపయు మనల గాచు మంకుతిమ్మ!
505.
దైవకృప యనగ నేమి? యది నిత్యనూతనంబైన యాతని
జీవకరుణ గాదె! జీవుల కర్మంబులు పక్వంబయినంత
వేవేగ దైవకృపయు తోడగు, జీవియు సద్విచారంబుల
వివేకశీలుడై మసలు వేళ – మంకుతిమ్మ!
506.
దొరకు విన్నవింతువు నీదు నూరారు కోర్కెల దీర్చుమని
సరియైన వాటినే నాతడు దీర్చిన, నాతని కాదందువే;
కోరిన కోర్కెల దీర్చలేదని భగవంతుని యునికియే లేదందువే!
కరుణ జూపవలెనని నిర్బంధ మేమున్నది, – మంకుతిమ్మ!
507.
దండన మొసగువేళ, క్షమింప న్యాయమూర్తిని వేడినంత
ముందటి నీ సత్ప్రవర్తన, ననుభవించిన శిక్షల లెక్కగట్టి,
తండ్రి తనయుని తప్పుల మన్నించి క్షమించినట్టు
మందుల మము క్షమింపడే గోవిందుడు – మంకుతిమ్మ!
508.
తక్కెడ చేతబట్టి, నొకట పాపరాశి, నింకొకట పుణ్యరాశిని
చక్కగ బెట్టి తూచ, పాపరాశి వైపు తూగగ, సరితూగగ
నెక్కుడు పుణ్యకార్యముల పెంచిన సమతౌల్యమగు
మిక్కిలి భక్తి పశ్చత్తాపముల – మంకుతిమ్మ!
509.
గతజన్మపు పుణ్యంబులకున్ తోడుగ, పశ్చాత్తాప
మది ఇంచుక తోడైన దారుణ కర్మ నియమంబులు
శిధిలంబు జేయు దైవము; యాతని కరుణ తోడ
పాతకంబులవి కొంత సడలు – మంకుతిమ్మ!
510.
నీదు సుఖదుఃఖంబులు, నీదు ఎదుగు దిగుడులు
నీదు కొఱకే ఏర్పడిన కార్యంబులని భావించబోకు
విధిహితంబు లయ్యవి, ఎందరెందరి జీవన పక్వంబులో! ని
య్యది ఋణంపు రహస్యము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084