Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-48

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

471.
సౌందర్య రసపోషకులే భువిని యనేకు లెన్నగా
మందిర శిల్పులు, యాంత్రిక నిపుణులున్, రాజనీతిజ్ఞులు
ఉద్యోగులు, విజ్ఞానులు, జన బాంధవ్య పోషకులు, వీ
రందురున్ సౌందర్య స్రష్టలు – మంకుతిమ్మ!

472.
సుందరతర కవితలల్లు కవులు, పరతత్త్వ బోధకులు
విధ విధ గీత వాద్య నృత్య గీతకళావిదులు, నవ్య
విధుల మనసున కుల్లాసపరచు లలితా కళాపోషకు
లందరున్ సౌందర్యము నాస్వాదింప జేయు వారలె – మంకుతిమ్మ!

473.
పారిజాతంబున్ జూచి నిట్టూర్చి తన పదలాలిత్యలన్
పారిజాతాపహరణ కావ్యంబు రచించి తృప్తి జెందె నొక కవి:
పారిజాత వృక్షంబున్ పెకలించి తెచ్చి నాటె యుద్యాన వనంబున
శౌరి, ధీరులకే సాధ్యమిది – మంకుతిమ్మ!

474.
పతనంబైన దాని పునః ప్రతిష్ఠ సేయుటే మృత్యుంజయత్వము
శుద్ధి సేయుగాదె ధరను నభము మరి మరి వర్షించి
కోతలైన తరి పంట ఫలము మరి మరి ఫలంబు నీయదే
పతనమైన గృహంబును పుననిర్మింపుము – మంకుతిమ్మ!

475.
గౌరవించు జీవనమును, నీ యాత్మ సామర్థ్యంబును
వేరెవరిదో ఈ జగమని నిర్లక్ష్యత వలదు, ఖేదంబును వలదు
గురి సాధించు తరి విఘ్నంబుల తోడి పోరాడి జయించు
దారి యది యాత్మోన్నతకి – మంకుతిమ్మ!

476.
పరమేష్ఠి నందనోద్యానమీ జగము, భావ బుద్ధి బలంబుల
మరవక సేయుము కృషి, పరమేశు సేవ యది యని భావించి
దొరకు ఫలంబుల జనుల హృదయంబులు సంతసించు
అరయ నదియ భగవత్సేవ – మంకుతిమ్మ!

477.
భావమదేది యంకురించునో విరిసిన గులాబిని జూచినంత
ఆవేదనయో? సంతసమో? కంటక యుతమైన యా మొక్కకు
పూవది కిరీటమై వెలుగొందు – మబ్బులలోన కాంతిరేఖ వోలె
జీవనంపు సారమింతియె – మంకుతిమ్మ!

478.
నేలను చదును చేసి, ఎరువు నీరమందించి తోటమాలి
పలు కంటకముల సంకటములన్ సైరించి పెంపు జేసిన గులాబి
మేలుగ హసించి, నశించు మరు నిముషంబున; దాని చిరునవ్వు
చాలు తోటమాలికి తృప్తి నిచ్చు – మంకుతిమ్మ!

479.
సత్యమన్న నేమి సైనికుని జీవనంబున?
కత్తి పట్టుటయే యాతని వృత్తి ధర్మ మరయ,
భుక్తి, సుప్తి, విభవంబు లాతని కవి మిథ్య
సార్థకత తోటి చేయు కార్యమే సత్యము – మంకుతిమ్మ!

480.
క్లేశంబులు వేనవేలున్నను యాశ యది మరిమరి యంకురించు
వేసడపు మాటలెన్ని వినినన్ మేలైన మాటలవి గురుతుండిపోవు
ఆశ నశించినన్, చెలువైనదాని వీక్షింప అక్షి నషేక్షించు
మాసిపోదు ఎన్నటికిని ఈ జీవన స్వభావము – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version