[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
461.
రామ భరతులు ఒకరనొకరు ఆలింగించి దుఃఖింపగ
ప్రేమాశ్రువులవి యుబికి సెలయేరై ప్రవహించి
సీమల దాటె; బాంధవ్య సౌందర్య మియ్యదియ
క్షేమతరంబులు జీవంబునకు – మంకుతిమ్మ!
462.
చిత్రీకరించె ప్రేమ మహిమన్ ఘనుడా వాల్మీకి
నీతి సూత్రంబుల గణనీయంబుగ దెల్పె వ్యాస మహర్షి
గీత యుపదేశించె విశ్వ జీవన రహస్యములన్
ఖ్యాతి కెక్కిన కావ్యములవి – మంకుతిమ్మ!
463.
సతీపతుల వోలె యన్యోన్యతన్ యుండవలె హృదిని
సద్విద్యయు బుద్ధియున్; నప్పుడ జీవన సౌందర్య దర్శనంబగు
బ్రతుకు రసవత్తరమై శ్రీమంతంబై క్షేమకరంబగు
అతిసుందరమగు – మంకుతిమ్మ!
464.
హృదయాంతరాళంబున గూఢంబుగనున్న జీవరస
మది స్రవించు కావ్యగాన శ్రవణంబున, వేదగానంబున
మది ద్రవించు, భువనంపు రహస్యంబు లన్నియున్
ఎదుట సాక్షాత్కరించు – మంకుతిమ్మ!
465.
మనసున సుప్తంబైయున్న కళాభిరుచులన్ తట్టి లేపి
నానావిధ భావంబులన్ వాటి నిగూఢ భావంబులన్
మానుగ దెలియపరిచి పరమేష్ఠి తత్త్వము
మనస్సున కెఱుక పరచు స్వరాగ నాట్యాభిరీతులు – మంకుతిమ్మ!
466.
రసములు రెండవి – వ్యసన హసిత కారకంబులు; ఈ
రసముల రెంటికిన్ మీరి మాటల కందని యద్భుత
రసము, విచిత్ర గంభీర రస మదియ మౌనము, పరమేష్ఠి
ప్రసాదించిన రసము – మంకుతిమ్మ!
467.
ఆత్మగుణంబులవి లెక్కకు మీరి వర్ణణాతీతము లైనను
ఆత్మ వెన్క గల అణువులవి మనోదేహ ఇంద్రియాది సూ
క్షాత్మ యనుభవంపు దర్పణంబున ప్రతిఫలంప యయ్యది
యత్యంత సుందరమై కన్పడు – మంకుతిమ్మ!
468.
మనోహర విగ్రహంబుల గాంచినంత భగవద్దర్శనమాయె
నని భావించి జనులు తమ తమ ఇష్ట భోగంబులన్
వాని కర్పింతురు సేవా భావంబులంకురింప
అనూహ్య యాత్మ స్వభావ మిది – మంకుతిమ్మ!
469.
సౌందర్యమది దేవరహస్యము, సృష్టి రహస్యంబు వోలె
సౌందర్యమే జీవితంపుటాశ; సౌందర్యానుభవ మది
యందందు భిన్నంబుగ నుండు మనోభావంబుల రీతులు
సౌందర్య దర్శనమది యొక తపస్సు – మంకుతిమ్మ!
470.
సౌందర్యసిద్ధికి తపస్సొక మార్గము; యజ్ఞమది, వివిధ రసపాక
మది; కవి సృష్టి జగమది, శిల్పకళా కృతియది, కావ్యముల
యధ్యయనమును, కళల పరిచయంబును పరికరంబు లా
విధకార్యమునకు, విచిత్ర భావంబిది – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084