Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-46

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

451.
నీలి గగనంపు విస్తరణము తారల కొసగు గాదె
తళుకుల సొబగు; అచల శైలంబది నొసగు నదికి
అల వేగంపు సొగసు; జననంబు సేయనగునే బట్టబయల
వైలక్షణంపు రీతి యిది సుందరము – మంకుతిమ్మ!

452.
అలల పాటుకు నాట్యమాడు వయ్యారంబుగ కడలి తీరము;
తాళలయములు జేరగ వివిధ రాగ నాట్య భంగిమ లుద్భవించు;
గోళంబుల జ్వాలలవి గగనంబును సింగారంబు సేయు
వైలక్షణపు రీతి యిది – మంకుతిమ్మ!

453.
సౌమ్యంబై, శుచియై బరుగు సౌందర్యంబు తల్లి, తోబుట్టువు పట్ల,
రమ్యమై నిను యాతురపరచు ప్రేయసి సౌందర్యంబు,
సమరస సౌందర్య భావనలీ రెండును నిన్నిరుకున బెట్టు
ఏమారక ఎన్నుకొనుము, ఔచిత్యము నీయది – మంకుతిమ్మ!

454.
విధవిధ విశ్వప్రకృతి శక్తి తేజము లుద్రిక్త పర్చు వేళ
హృదయంబు కలవర పడు, పరిణామంబులున్ గల్గు
యధీరతకు లోనుగాక గంభీరంబుగ నుండుటే
యది సరసతమము సుందరము – మంకుతిమ్మ!

455.
సౌందర్యపు రసములవి వేనవేలైనను, సారవంత
సుందరమైనవి మూడవి – మోహ, కరుణ, శాంతములు
పొందుగ ఒకటి నొకటి యల్లుకొని యుండిన గాదె
సుందరము జీవనము – మంకుతిమ్మ!

456.
గడించు, యనుభవించు, దొరయగు మనును మోహము;
వేడినవారికిచ్చి పంచుకొని, సేవయొనర్పు మనును కరుణ
వీడు ‘నేను’ ‘నాదను’ భావంబుల, విశ్వాత్మ పథంబున
నడువుమను శాంతి – మంకుతిమ్మ!

457.
చారుతర దృశ్యంబుల ప్రీతిన్ హృదయ వికసితమగు
క్రూరతర దృశ్యంబుల హృదయంబు క్రౌర్యంబగు
భైరవాద్భుత దృశ్యంబుల హృదయంబు మౌనంబగు – మనల
ధీరుల జేయు దారులివి – మంకుతిమ్మ!

458.
పూర్వ పర సౌందర్య రసానుభూతియది మనసునన్ య
పూర్వంబుగ పదిలంబై తన్వయత్వంబగు
అర క్షణ దర్శన మాత్రాన యది సమ్మోహపరచు హృదయంబు
అరయ సుందరతర లోకమది – మంకుతిమ్మ!

459.
హృదయ మొక విరి; సుందరతర రస కిరణంబు సోక
యందు యుద్భవంబగు సుందరతర నిజానంద రసము,
బ్రదుకున, కవితన, కళలందున, ప్రకృతి యందున
యుదయించు శాంతి – మంకుతిమ్మ!

460.
బంధించి యుంచినది విధి నిన్నీ జగపు బందీఖాన యందు
బంధ విముక్త గవాక్షములవి – నిగమ, సత్కళా కావ్యంబులు
పొందుగ వాటి సహవాసంబు జేసి ముక్తి నొంది, మహదా
నందంబు నొంది హసన్ముఖుడ వగుము – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version