[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
441.
అంతర్బాహ్య రంగంబులు, కావవి వేర్వేరు లోకముల్;
అంతరంగంబునన్ గల్గు సవ్వడులవి; బహిర్గతంబులగు
అంతర్గతంబైన బాహ్య సవ్వడులున్; పరస్పర ప్రక్రియ లవి
అంతరంగ పక్షంబులు – మంకుతిమ్మ!
442.
సొగసు వలదను నరప్రాణి యది యేడ యున్నదయ్య ఈ
జగంబున! బాల వృద్ధులు, పురాణ పురుషులున్ వదలరు; ఇ
జ్జగపు సొగసు కన్గొనని వారలందరు, అద్దంపు ముందు తమ
మొగంబుల దిద్దుకొనరే – మంకుతిమ్మ!
443.
తను సృజించిన రూపములవి సౌందర్యంబు ప్రకటింప
తాను లోభితనమును జూపునే కర్త; నెలల పాటు
అనునయంబుగ చెంచిన చెన్గులాబి వికసింప దానిన్
గని పరమానందము జెందని వార్గలరే – మంకుతిమ్మ!
444.
నింగి నేలను తాకెడు వంపు; రవికిరణ వర్ణరంజితపు రంగు,
నింగిన్వెలుగు చంద్రకాంతి నునుపు, తారల తళ్కుల బెడగు
అంగాంగ సౌందర్య విభవ సంపదానందమున్ పంచెడి
భంగిన్ గురువుగాదె ప్రకృతి – మంకుతిమ్మ!
445.
సౌందర్య దర్శనము క్షణికమైన; నిల్చిపోవునది శాశ్వతంబుగ
హృదయాంతరాళంబున నిల్చి సత్య శివ సుందర రూపములగు
హృదయము పరవశించి, యమృతమయమగు తలచినంత
యది యక్షయము – మంకుతిమ్మ!
446.
సుందరత యన్న యదేమి? జనుల సమ్మోహితుల జేయు
నందలి మర్మమదేమి? విశ్వచేతనానందపు యాకర్షణా
స్పందనమే సౌందర్య సృష్టికి మూల కారణంబు గాదె
సుందరత ఈశ్వర రూపంబుగాదె – మంకుతిమ్మ!
447.
తన సంపూర్ణ సందర్య సృష్టిన్ కన్పడనీక దృష్టిచుక్కల
నునిచె నా పరమేష్ఠి, శశికొక మసిచుక్క- గుట్టదేమో!
మనగ యది రక్షయో! సింగరపు బొట్టో, యవహేళంబొ
ఎన్నగ సృష్టికి దృష్టిచుక్క – మంకుతిమ్మ!
448.
పొంది యున్నది సృష్టి పరస్పర విరుర్థ గుణంయిల చేత
ద్వంద్వ యుక్తమై; స్థిర చలనములు, ఋజు వక్రంబులు,
సౌందర్యానంద వైవిధ్య వర్ణంబులు, శీఘ్ర ఆలస్య చలనంబులు
పొందుగ క్షార ఆమ్లములు పొందియున్నవి – మంకుతిమ్మ!
449.
సౌందర్యాలయ మది కాదు కేవలము ద్వంద్వము; కాననగు
ద్వంద్వంబుల అమరికల పొందు; ఉచిత పరిమాణంబులు
సంధానరీతులు, సహకారపు నీతి రీతులును
సౌందర్య వర్ధకములవి – మంకుతిమ్మ!
450.
సౌందర్యంబున, బాంధవ్యంబునను కాననగు
ద్వంద్వమే; కాననగు నయ్యది లోక సహవాసంబునన్
ముందు నీ యుభయంబుల దాటి సాగిన యగు నీకు
బంధ విమోచనము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084