Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-42

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

411.
విరామ మెఱుగక ప్రవహించెడి కాలప్రవాహంబున
పురుష నిర్మితము లవెన్నొ తేలిపోయినవి,
పురంబులు, రాష్ట్రంబులు, దుర్గంబులు నీతి వర్తనలు:
పురషతనమొకటె నిల్చియున్నది – మంకుతిమ్మ!

412.
ఈ నది, యది ఎక్కడో జనించి, కడలిని చేరువరకెన్నో నేలల
గుణంబుల సంతరించుకొని, మార్పులు జెంది సాగు ముందుకు,
మనుజ సంతానంబును, ఎన్నో గుణంబుల మేళవించి
గుణ సంపన్నమగు – మంకుతిమ్మ!

413.
పురుష, స్త్రీ జాతులవి కేవలము సంకేతంబులే గాని
అరయ గుణములవి కలగాపులగమైయున్నవి అర్ధ
నారీశ్వరుని వోలె నిర్వుర యందును – అందరి లోన
పురుష స్త్రీ గుణములవి సహజము – మంకుతిమ్మ!

414.
కొలమానమేది, స్త్రీ పురుష యన్యోన్యతాకర్షణలకు!
మూల మన్వేషింప నయ్యది దొడ్డ పొడుపు కథే యగు
తలపగ నియ్యది ఋణానుబంధమే యనదగు
తెలియని నిగూఢత ఆ విధాతది – మంకుతిమ్మ!

415.
పురుష స్త్రీ జతల గూర్చు వారెవరొ! ఎటులొ!
మరి ఎచట నుండియో! ఔగాదన్నను వీడక ముడి వేసి
సరియగు తీపి వంటకంబున ఇసుమును గల్పి తిన్పించు, ఉప
కారి ఈ విధి – మంకుతిమ్మ!

416.
కుసుమ కోమల రూపము దాల్చె శూర్పనఖ, ఐనవేమి?
విషపూరిత పూతన దాల్చె రూపవతి వేషంబు, ఐననేమి?
ముసి ముసి నవ్వుల వెన్క పిశాచత్వ మడగి యుండలేదె!
వేషములవి మోసగించు – మంకుతిమ్మ!

417.
హేమ కుంభమున కల్మష నీరంబు నింపి
రమణీయ వస్తుచయములో దుర్గంధము నింపి
ప్రేమ పుష్పంపు దరిని ఱంపపు ముళ్ళనమర్చి
ఏమని సృష్టించెనో విధాత! – మంకుతిమ్మ!

418.
కైకేయి, సత్యభామ గుణంబులు లేని మగువ లేరీ
లోకమందున! మరి మమతాను రాగంబులు కురిపింపక
సాకి పెంపుసేయగలరే బిడ్డల! సృష్టి సహజత్వ మిదియె
ఒక విస్మయమిది – మంకుతిమ్మ!

419.
దినదినము చిగురించి నూతనత్వమును బొందు తరువు వోలె
అనవరతము తేటనీరు చెలమల నుబికి వచ్చు రీతి, పసి
కూనల తెల్వితేటలును చిగురించు దినదినము
గుణంబియ్యది ప్రకృతి సహజము – మంకుతిమ్మ!

420.
కాతర జెందనేల పిల్లల భవిత గూర్చి: ఎవరెవరి
రాత లెటులున్నవో ఎవరికెఱుక! దక్కెనా రాజ్యాధి
పత్యము కురు, పాండునందనులకు! దిక్కు ఎవరికి వారె
సత్యమిదియ – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version