Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-39

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

381.
జితేంద్రియుడెవడొ వాడె యదృష్టవంతుడు
ఇతరు డెవ్వడు వాని సరి పరీక్షకు నిలువగలిగినవాడు
మిత భుక్తి, మిత కుక్షి యున్నవాడె జితేంద్రియుడు
అతి చర్చ యనవసరమీ విషయమున – మంకుతిమ్మ!

382.
ఇంద్రియములు జయించినాడవే! అట్లయిన మందుడవే నీవు:
సౌందర్య దేవత తొలగిపోయెనా నిను శాశ్వతముగ,
అంధుడే విరక్తుడు? అప్సరసను కాననివాడే యతి?
సౌందర్యోపాసనకు దాసుడు కాని వాడెవ్వడు! – మంకుతిమ్మ!

383.
చపలచిత్తులె జానకియు రావణుండును
చపల చిత్తయయ్యె కాంచనమృగమున్ జూచి జానకి,
చపలుడాయె రావణుండు జానకిని జూచి, ఇద్దరున్
చపలులైనను, నిందించిరి రావణుని, వందించిరి జానకిన్
చపల మీ చిత్తము దీని తీరు దెలియ నెవ్వరు – మంకుతిమ్మ!

384.
జంట మరలై యున్నవి యాకలియు, మమతయు – నీ
సృష్టి యంత్రంబున పటిష్టంబుగ
కట్టించునవి కోటానుకోట్ల వ్యామోహంబుల; తారల
బట్టి క్రిందికీడ్చు, నిన సొట్టగ జేయు – మంకుతిమ్మ!

385.
దిక్కు దిక్కున నున్న వాసనలకు దాసులైనారము
కుక్కవోలె తిరుగుచున్నారము వాసనల వెంబడించి,
చిక్కుబడిపోయినారము వాసన కొక్కీలకు,
చిక్కునే మోక్షము! వాసనాక్షయము కానిది – మంకుతిమ్మ!

386.
ఆకలైన వేళ పొట్ట నుండి తాళంబు విన్పించు రీతి: సుఖ
దుఃఖంబుల, నవ్వుల, పొగడ్తల తెగడ్తల హృదయంబు స్పందించు
వ్యాకులత సమయింప మనసు స్వస్థత పొందవలె; శాంతి
యొక్కటె సాధనము – మంకుతిమ్మ!

387.
దంతముదయించు వేళ జ్వరపీడితుడు గాని శిశువు౦డునే! విధి
వాతబడని నరుడు గలడె నియ్యిలన్? చంద్రు
దంతటి వాడు రాహు కోరల చిక్కుబడి, చిక్కి మరల రాణింపడే
బాధల ననుభవించిననే వ్యథలు దూరమగు – మంకుతిమ్మ!

388.
అంగంబులు రెండవి దేహాత్మలు – జీవమునకు
అంగంబులు రెండైనను పొందియున్నవి యొకటనొకటి
అంగంబది దప్పిగొన్న సుఖ మెక్కడిది రెండవ దానికి
అంగంబులు రెంటిని సమాదరింపు ద్రోహమెసగక – మంకుతిమ్మ!

389.
కాయమిది మృద్భాండము, మాంసపు ముద్ద
హేయమిది యన్న యాత్మకు కీడేమి జరుగు –
కాయమిది నయాత్మకు నిలయము, కాన
న్యాయం బొనరింపుము కాయమునకు – మంకుతిమ్మ!

390.
కల్ల గాదా కథ: తిరిపెగాడొకడు కాంచిన కల
చెల్లాచదరయ్యె పిండి, వాడు ఘటంబున్ దన్న
చెల్లా చెదరగు మనము గాంచిన కలలన్నియును
ముళ్ళై యవి తమ మొనల మనల నొప్పించు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version