[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
371.
కావలెనిది, నదికావలె, కావలె నింకొకటియున్
కావలె నన్నియునని యత్యాశ నరుడు నినదించు
కావలెననెడీ జపము నెందులకు రచించెనో విధాత
కావలెననెడీ జపమునకు ముగింపెన్నడో – మంకుతిమ్మ!
372.
మౌనమున, కాననమున తపమొనరించెడు వాని
మనంబున నుదయింపవే గతానుభవములవి
కనుల విందైన, రసనకింపైనవి, కినుక నసూయలు
కన్నుల గట్టి, కలవరపరచవే మనమును – మంకుతిమ్మ!
373.
వనగుహాల నాశ్రయించిననేమి, సంసారంబు త్యజించి
తనువును దండించనేమి, యుగ్ర వ్రతంబుల నాచరించి
వినోదంబుల వెంటబడి నూరూర తిరుగనేమి
మనోనిగ్రహంబును పాటింప వలను కాదు – మంకుతిమ్మ!
374.
ఆహారం బీయక దేహదండన మొనరించి
అహరహంబు శ్రమించిన వశంబగు మనస్సందురు హఠయోగులు
ఆహారంబు లేక మనసూరకుండునే, సహజ ధర్మముల చంపు
ఆ హఠయోగంబు కన్న రాజయోగమే మిన్న – మంకుతిమ్మ!
375.
మనసు నూరడించుట, మారాము చేయు పసివాడి బుజ్జగించినట్టె
మనసు దెలసి, గారాము చేసి, లాలించి నూరడించ వలయు –
అనుకూలింపవు కోపతాప, దండింపులు; మరలించవలె వాని
మనసు; తీపి ఇచ్చియో, కథల్వినిపించియో – మంకుతిమ్మ!
376.
ఎంతో కొంత నీకయినంత శాంతినే కోరు
ఎంత జేసినన్ మనసు కోపించు, గొందలపడు
సాంత్వనము జేసి కొంత, శిశువని శిక్షించి కొంత
స్వంతంబుగ నీవె సంతసింప జేయవలయు – మంకుతిమ్మ!
377.
ఉదర పూజ ముందు దైవ పూజ పూజ్యమీ ధరణి
ఉదర పూజ మొదట, తక్కిన వటు తర్వాతనే
ఆదరించిన మదించు, నిరాకరించిన నిందించు
ఇద్దాని దారికి తెచ్చుటెట్లో – మంకుతిమ్మ!
378.
జ్వాల హెచ్చిన కమరు, తగ్గిన పచ్చివాసన నిచ్చు
చిలికిన విరిగిపోవు యతి సున్నితమీ పాల తంతు
తరచి చూడ మనసు కతయు నింతియె, అదను తప్పు
తెలివి తోడ మెలగ వలయు – మంకుతిమ్మ!
379.
తృప్తి నెరుగని వాంఛలు, జీర్ణించని భుక్తి వోలె
గుప్తంబుగ విష బీజములై కుళ్లి
ప్రాపింప జేయు యున్మాదముల
తృప్తింబొందునే వాంఛలు – మంకుతిమ్మ!
380.
పులిని కెరలించు పులి, కపి యదలించు కపిని,
పులి-కపి, ఈ రెంటి స్వభావ స్వరూపమే నరజన్మ
అల్లన, పరుండిన మృగముల పగిది నుండుటే జాణతనము
అల్లాడించకు వాలము – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)

శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084