Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-37

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

361.
ఎచ్చటో విధి రహస్యపు కర్మాగారంబునన్
అచ్చెరువుగ, నిల్వక తిరుగుచున్నవి యంత్రపు కీళ్లు
అచ్చట చక్రగతి వలె దొరలుచున్నవి మన వ్యవహారంబులున్; దాని
మెచ్చక తల్లడిల్లిన ఫలమేమి? – మంకుతిమ్మ!

362.
కాల ప్రవాహాన జీవననౌకలో హాయిగా
తేలుచు, భయమన్నది లేక సాగుచున్న తరి
గాలి యదెచ్చట నుండియో భయంకరముగ వీచి నౌకను
తలక్రిందు సేయు – మంకుతిమ్మ!

363.
ఆతురత లేదు విధి యంత్ర చలనమందు
భీతియు, ఏమరుపాటును లేదెందు, విడువక
గతి దప్పక, నిలువక యన్నియును సాగిపోవు
కాతురత చెందనేల – మంకుతిమ్మ!

364.
విధి నొక్కొకచో మన యెడ ప్రీతి నటించు
వ్యాధుడు పక్షుల కొరకై నూకలు జల్లినట్లు
పెదవి కాలిన తరి, నాలుక పాయసంపు రుచినేమెరుగు!
విధి కృప యన్నది మోసమే గద – మంకుతిమ్మ!

365.
అది కీడిది మేలొనరించు నను వాదమేల?
విధి తా గప్పి యుంచిన దన్నింటికి నో ముసుగు
సుధ సౌరభమది విష పాత్ర యందుండ నోపు
విధి తలంపులేమో తెలియరాదు – మంకుతిమ్మ!

366.
గ్రహగతుల మార్చ శక్తుడే జ్యోతిష్కుడు!
విహితమై యున్నవవి ధాత రాత యందు
అహితమైనను, ఏ దశ వచ్చినన్ సహించవలె
సహనమది వజ్రకవచము – మంకుతిమ్మ!

367.
ధరణి వసించు వారలకు కలదో సువార్త
ఆర్తులకగు హితము, అత్యార్తుల కుయ్యినాలింప
రౌరవ వాసులకగు హితము మహారౌర వార్తుల కుయ్యినాలింప
నరకవాసుల కియ్యదియే యుపాయము – మంకుతిమ్మ!

368.
ముక్కోటి దేవతల యాధిపత్యమున్న ఈ లోకాన
దిక్కు మొక్కు లేక దీనత నున్నార మీ తీరున
ఐకమత్యమే నేర్వని నాయకులున్న తరి, జనుల
కిక్కట్లు తప్పవు గదా – మంకుతిమ్మ!

369.
దైవ, మానవ చిత్తము లవి రెండును యొకటి కానోపవే
దైవమీ రెంటిని సంధించి నా మనంబు నటు మరల్పడే
దైవమింకొక్కటి తలంచనేల, నేనొక్కటి తలంచిన –
చేవ గలిగిన మందేదియన్ లేదే దీని మాన్ప – మంకుతిమ్మ!

370.
స్వాతి చినుకు, తెరచిన ముత్తెపు చిప్పబడిన తరి
స్వాతిముత్యమై రూపొందు కౌతుక సంయోగ యోగాన
ప్రీతి, సుఖ సత్యదర్శన శాంతియు నంతె జనించు, నీ
రీతి సంయోగ యోగాన – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

 

Exit mobile version