[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
351.
అడగి యున్నాడెచటనో పరమాత్మడీ తనువు నందో
ఎడద యందో, మరి మన మెదడు నందో, కనుబొమల నడిమి యందో
ఏడ యడగి యున్నాడో యను తర్కమేల? నే నుడివెద వినుడు
వాడడగి యున్నాడు మన యుదరంబులోన – మంకుతిమ్మ!
352.
ఇడుము లెన్నో నిత్యము జానెడు పొట్టకై
ఊడిగము సేయ నొడలు కడు వడలి పోవు,
పిడికెడన్నమునకు, కట్టుబట్టకై నిత్య మంగలాపులు
కడు దైన్యము మన బదుకు లివి – మంకుతిమ్మ!
353.
ఏమైన నేమి? నీవెక్కడి కేగిన నేమి? మాన ప్రాణా
భిమానముల కాపాడగ జేయు యతన మదేదైన నేమి?
అమ్మానవాతీత శక్తియది మనల నడిపించు చుండు
అమ్మెయి దెలిసి చరియించుము – మంకుతిమ్మ!
354.
లోకపు వర్తన మెల్ల దైవలీలయే యనిన, ఈ లీలలన్
శోక, కష్ట, కార్పణ్యాది సంకటము లేల? ఇయ్యవి
లేకున్న నీరసంబగునా జీవనము – మూకకు కల్ద్రావించి, తేల్గరిపించు
ఏక పక్షపు లీలగాదె – మంకుతిమ్మ!
355.
గణించి, గుణించి, వెంపరలాడిన ఫలమదేమి? మన
గణనకు చిక్కని లెక్కయది యా విధి గణాంకములు
అణగి యుండి, నీ లెక్కలన్నింటిని తారుమారు జేయు
కనరాని యా విధి లీల – మంకుతిమ్మ!
356.
ఆశల వల విసిరి, తన వైపునకున్ నిను లాగి
వెస నీవు కొట్టుమిట్టాడుచు నోరు దెరవం
జూసి మైనిమిరి, మరి అడ్డకాల్వెట్టి, గుట్టుగ నవ్వుకొను
మోసంపు యాటగాడు యా విధి – మంకుతిమ్మ!
357.
విధాత నూనె గానుగలోన చిక్కిన నూగింజవు నీవు
ఆత డందరినిన్ గుజ్జు సేయు – వీడడెవ్వరిని
ఆతురత లేక, మరి ఏమరక నుపేక్ష సేయక
అందర శిక్షించు సమముగ – మంకుతిమ్మ!
358.
ఇది కాలేదది నిలచి పోయెనంచు
ఎదగుంది చిందులు వేయనేల
అధికార పట్టమును గట్టిన వారెవరు నీకు?
విధి నియమించినా మేస్త్రీగా నిన్ను – మంకుతిమ్మ!
359.
వంకరల సరిచేయ యతన మది
ఏ కాలము నుండియో సాగుచునే యున్నది; ఫలమేమి?
ఒకటి సరిజేయ నింకొకటి పుట్టుకొను
ఒక చోట పూడ్వ, నింకొక చోట క్రుంగు నీ ధర – మంకుతిమ్మ!
360.
బెదరకు, ఇంకేమి? మరేమి నా గతి యేమని
విధి వ్రాసిన వ్రాతల చెరుపగలవే నీ కరమున?
విధి లీలలు మన కవగతము లగునే! మది
నిది తెలిసి నెమ్మది వహించు – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084