Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-35

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

341.
క్షీరాన్నంబు నరునకు పుష్టినొసగు, మరి యా
క్షీరంబు నొసగు గోవునకు పుష్టి నొసంగు పచ్చనిగడ్డి; యా
పైరునకు పుష్టి నొసంగు యూరి మురికి కాల్వనీరు, ఇటుల
పరస్పరానుకూలత యందు శుచి యేది – మంకుతిమ్మ!

342.
పూవది కాంతి సౌరభాల వెదజల్లు తొలి ఘంట,
తావు మృగ్యమైన తరి దుర్గంధమును వ్యాప్తి జేయు
చవి మాసి వాడి నలిగి నశించు – మలి ఘంట,
తలచి చూడ సంసారపు కతయు నింతె – మంకుతిమ్మ!

343
చాలు చాలనిపించు నీలోక సంపర్క సుఖము
సులువు గాదిది, మై సోకిన చోట తీట పుట్టించు తీటయాకు,
అలవిగాని తీట; గోకకున్న; గోకిన పుండగు-
పలుకరాని మూగవాని నపహాస్యంబు జేసినట్లు – మంకుతిమ్మ!

344.
కసుగాయల నేరి తడబడక తినుటయు; తిని
వెస నరగించు కొనగ లేక యాముదంబు సేవించుటయు,
వేసట సన్నగిల్లిన తరి సుఖంబు ననుభవించుటయు
అసహజమది కాదు పుడమి – మంకుతిమ్మ!

345
ఆడి, జారి బడుట, మైదడలికొని లేచుట,
కడు తీపి కుడుముల నారగించుట, చేదు మందు సేవించుట,
దుడుకు దనంబున మతి తప్పిన కార్యంబు సేయుట, తప్పును ఒప్పనుట
పుడమిని బదుకన్న నింతియ కాదె – మంకుతిమ్మ!

346.
భారవాహకు డొకండు, ‘నే మోయగలాడ నీ భారంబు’నని
భారంబును భుజంబుపై నిడుకొని, కొంత దవ్వు చనిన వెన్క
‘భారంబిది, ఇంకెంత దవ్వో! నే మోయలే’నని దింపు రీతి,
భరమైనదీ సంసార భారము నింతియే – మంకుతిమ్మ!

347.
జిహ్వకు హితమైనది, యుదరంబున కహితమగు,
దేహమున కింపైన, తంపైన గాలి కీడొనరించు శ్వాసాంగములకు
ఒహటికి నింకొకటి కీడు మేలొనరించినట్లు సృజించె విధాత
బహుళంబుగ, ఇందుచితమైనదేదో నీకు – మంకుతిమ్మ!

348.
లోలోని ఈతి బాధల చిచ్చు చాచుచున్నది నాల్కల నల్దిశల
కాలుడనెడి మతి దప్పిన వాడెద జల్లుచున్నాడు దుమ్ము, ధూళి,
ధూళి పొగల సెగలే ఎల్లెడల, నిద్ధర నేమున్నది
తెలియ, పైనున్న నేమి? క్రిందపడిన నేమి – మంకుతిమ్మ!

349.
పరిమితములు నీ గుణ శక్తియుక్తులు, కర్తవ్యములు
పరిమిత, యపరిమిత యంతరములు దెలియనేర
మరయ, హితమైన దాని నొనరించి, తక్కినది వదలు
దైవముకు యూరక ముండనేల యతడు – మంకుతిమ్మ!

350.
కొనితెచ్చుకొన్న అలవిగాని ఆకలియున్, తపనలు, చెప్పు
కొనగ సిగ్గగు, చింతల చెలమలు, చాల
వన్నట్లు ఎచటెచట నుండియో వచ్చి చేరు ఇడుము
లన్నియు, అయ్యవి మన బ్రదుకు సామగ్రులు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version